నేడు వాల్మీకి జయంతి
జగదానంద కారకుడు, శరణాగత వత్సలుడు, సకల గుణాభిరాముడు, మూర్తీభవించిన ధర్మతేజం శ్రీరాముని దివ్యచరిత్రను, శ్రీరామ నామ మాధుర్యాన్ని మన కందించిన కవికోకిల, ఆది కవి వాల్మీకి మహర్షి చిరస్మరణీయుడు. శ్రీరాముని దివ్యచరితాన్ని కావ్య రూపంలో అందించమని ఆదేశించిన బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు శ్రీరాముని కీర్తి పరిమళాలను ముల్లోకాల్లో గుబాళింప చేసిన వాల్మీకి మహర్షి శ్రీరామాయణ మహాకావ్యాన్ని అందించారు. రామాయణంలో మానవ ధర్మాలన్నిటి గురించి వాల్మీకి చక్కగా విశదపరచాడు. శిష్య ధర్మం, భ్రాతృధర్మం, రాజ ధర్మం, పుత్ర ధర్మం, భత్యు ధర్మం, ఇంకా పతివ్రతా ధర్మాలు, ప్రేమలూ, బంధాలు, శరణాగత వత్సలత, యుద్ధనీతి, రాజనీతి, ప్రజాభ్యుదయం, సత్యవాక్య పరిపాలన, ఉపాసనా రహస్యాలు, సంభాషణా చతురత, జీవితం విలువ, ధర్మాచరణ మున్నగు అనేక రకాల ఉపదేశాలున్నాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే రామాయణ కావ్యంలో మంచి చెడుల గురించి చెప్పనిదంటూ ఏదీ లేదు. ఆధునిక సమాజంలో మనం ఉపయోగించే ప్రసార కౌశలాలు, కార్యనిర్వహణ కౌశలాలు, ప్రశాసనం, నగర, గ్రామీణ నిర్మాణ యోజన, సార్థకమైన వ్యూహరచనా నిర్మాణం, ఆంతరిక రక్షణా పద్ధతి, యుద్ధ వ్యూహరచన మొదలైనవాటికి రామాయణ రచన నిధి వంటిది.
ఇంత విలువైన సత్యాలను చెప్పి, ఇంతటి మహత్తర కావ్యాన్ని అందించిన కవి వాల్మీకి మహర్షి సదావందనీయుడు. ప్రతి ఒక్కరూ రామాయణ కావ్యం చదివి అందులోని నీతిని అవలోకనం చేసుకుని, అందులో కొంతయినా ఆచరించ గలిగితే ఆ మహాకవి ఋణం తీర్చుకున్నట్లే.
Comments
Please login to add a commentAdd a comment