ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం! | Special story on Spirit teaching | Sakshi
Sakshi News home page

ఎన్ని అడ్డంకులొచ్చినా...సంకల్పమే మీ బలం!

Published Mon, Jan 6 2025 11:07 AM | Last Updated on Mon, Jan 6 2025 12:59 PM

Special story on Spirit teaching

నూతన సంవత్సరంలో చాలా మంది ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ ఆ లక్ష్యాలను సాధించేందుకు కావాల్సినంత సంకల్ప బలం వారిలో ఉండదు. అందుకే మధ్యలోనే ఆ లక్ష్యాలను వదిలిపెడతారు. కొన్నిసార్లు మీ మనసే ఎన్నో సాకులను వెతుకుతుంది. మీ లక్ష్యాన్ని ఓడించాలని చూస్తుంది. అందుకే మీ మనసును చెదరని సంకల్ప బలంతో నింపండి. నేను ఎన్ని అడ్డంకులు ఉన్నా విజయాన్ని సాధిస్తాను! నేను లక్ష్యాన్ని చేరతాను అని పదే పదే మనసులో అనుకోండి! అనుకుందే ఆచరణలో పెట్టండి. మీరు చేయాల్సిన కృషితో పాటు దృఢమైన సంకల్ప శక్తి కూడా ఉండాలి. 

ఎత్తైన పర్వతాల నడుమ ఒక సుందరమైన లోయ వద్ద ఒక చిన్న ప్రవాహం ఉండేది. అది మహా సముద్రాన్ని చేరాలని కలలు కంటూ ఉండేది. తన ప్రయాణాన్ని   ప్రారంభించిన ప్రతిసారీ దారిలో రాళ్లు, దట్టమైన అడవులు, ఎత్తైన కొండచరియలు ఎదురవడంతో ఆ చిన్న ప్రవాహం వెనుదిరిగి వెనకకు వెళ్లి΄ోయేది.‘‘నీకు ఇది సాధ్యం కాదు,’’ అని దారిలోని పెద్ద రాళ్లు చెప్పేవి. ‘‘నువ్వు చాలా చిన్నగా, బలహీనంగా ఉన్నావు నువ్వు చేయలేవు’’ అని ఆ చిట్టి ప్రవాహాన్ని నిరుత్సాహ పరిచేవి. 

ఒకనాడు చిట్టి ప్రవాహం చాలా దిగులుగా, ఇక ఎప్పటికీ తన కలను నెరవేర్చుకోలేనన్న బాధతో, సందేహంతో ఉండటాన్ని వృక్షమాత గమనించింది. వృక్ష మాత ప్రవాహంతో ఇలా చెప్పింది, ‘‘ఇలా బాధ పడినంత మాత్రాన నీ లక్ష్యాన్ని నీవు చేరగలవా..?? నువ్వు బాధ పడటం వల్ల ఏ ఉపయోగం లేదు! మహా సముద్రాన్ని చేరాలనే నీ తపననే నీ శక్తిగా మలుచుకో..నీ సంకల్పాన్ని బలపరుచుకో.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుదిరగననే వజ్ర సంకల్పం చేసుకో!’’ అని చిట్టి ప్రవాహానికి కొండంత ధైర్యమిచ్చి, విజయోస్తు! అని దీవించి పంపింది వృక్ష మాత. 

ఆ ధైర్యంతో, ప్రవాహం తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది ముందుకు వెళ్లాలని సంకల్పించుకుంది. పెద్ద రాళ్ళు ఎదురైనప్పుడు వాటి మధ్యనున్న చిన్న సందులనే మార్గంగా చేసుకుంది. ఎండ తీవ్రతకు ఆవిరైపోయే పరిస్థితి వచ్చినప్పుడు, మేఘాలకెగసి అక్కడి నుండి నదిగా భువికి తిరిగి వచ్చింది. ఒకప్పటి చిట్టి ప్రవాహమే ఇప్పుడు మహా ప్రవాహమై చివరికి మహాసముద్రంలో లీనమైంది. ‘‘నీ లక్ష్యాన్ని నీవు సంకల్ప శక్తితో సాధించావు’’ అని వృక్ష మాత హర్షించింది. 

ఎన్ని అడ్డంకులు వచ్చినా చెదరని సంకల్ప బలంతో ముందుకు సాగండి. లక్ష్యాన్ని సాధించడంలో ఇటువంటి మనఃస్థితి ఉంటే ఏ పనిలోనైనా నిస్సందేహంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ యావత్‌ విశ్వంలో మీరు సాధించలేనిది ఏదీ లేదు! 


– మాతా ఆత్మానందమయి
ఆధ్యాత్మిక గురువు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement