
కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా శ్రీ కొండలమ్మ తల్లి భక్తుల నమ్మకాన్ని చూరగొంటున్నారు. తల్లి చెంతకు వచ్చి తమ కోర్కెలు కోరినంతనే ఆ కోర్కెలను తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధి గాంచారు ఈ అమ్మవారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరం కొండలమ్మ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచారు. కొండరాళ్లలో దొరకటం వలన ఆ తల్లిని కొండలమ్మ అనే పేరుతో భక్తులు పిలుస్తున్నారు.
వ్యాపారం, ఉద్యోగం, సంతానం, వివాహం, రాజకీయ పదవులు, పారిశ్రామికం, సినిమా అవకాశాలు ఒకటేమిటి? ఏ రంగానికి చెందిన వారైనా భక్తితో నమ్మి అమ్మ వద్ద తలచుకుంటే చాలు వారికి వరాల జల్లు కురిపిస్తుంది కొండలమ్మ తల్లి. బిడ్డ పుట్టినా, పెళ్లి జరిగినా పిల్లాపాపలు, నూతన వధూవరులు తమ కోర్కెలు తీరాక తల్లి సన్నిధిలోనే తమతమ మొక్కుబడులను చెల్లించుకోవటం పరిపాటిగా వస్తోంది. భక్తితో కొలవటంతో తృప్తి చెందక తమ ఇంటిలో ఆ తల్లి పేరును అనుకున్నదే తడవుగా స్తుతించాలనే దృక్పథంతో కొండలమ్మను ఆ భక్తులు తలచుకుంటున్నారు. ఆ ఊరిలోనే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొండా, కొండలమ్మ, కొండయ్య, కొండబాబు వంటి పేర్లతో ఆ దేవత పేరును తమ కడుపున పుట్టిన బిడ్డలకు పెట్టుకుంటున్నారు. ఆ తల్లి చల్లని సన్నిధిలో వివాహాలు, అన్నప్రాశన, ఊయలలో వేయటం వంటి శుభ కార్యక్రమాలను భక్తులు జరుపుకుని దీవెనలను ΄పొందుతున్నారు

మహిమలతో తల్లి కీర్తి చాలా తక్కువ కాలంలోనే దశదిశలకు వ్యాపించింది. అమ్మవారి ఆలయానికి ప్రతి ఆదివారం కృష్ణాజిల్లా నుంచే గాక ఇరు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. ఆది, గురువారాల్లో 25వేల మంది భక్తులు తల్లిని దర్శించుకుంటున్నారు.
అమ్మవారు కొలువైన ప్రాంతం మచిలీపట్నం–నూజివీడు–కత్తిపాడు ప్రధాన రహదారి కావటంతో ఎవరు రోడ్డు వెంబడి వెళ్లినా ఆమె దర్శనం కొరకు నిలుస్తున్నారు. వాహనాల్లోనే గాక నడిచి వెళ్లినా రాకపోకల్లో అమ్మవారిని దర్శించుకోవాల్సిందే.
కొండరాళ్లలో దొరికిన అమ్మ
ఈ దేవాలయానికి దాదాపు దశాబ్దాల చరిత్ర ఉంది. వేమవరంలో రహదారి పక్కనే దివాన్ సాహెబ్ కోడ్డు మురుగు కాలువకు రివిట్‌మెంట్ కడుతున్నారు. ఆ గోడను కొండరాళ్లతో నిర్మిస్తుండగా వాటిలో ఒకరాయి అమ్మవారిని పోలినట్లుగా పనివారికి కనబడింది. ఆ రాయిని నిర్మాణంలో కలపకుండా పక్కన పెట్టారు. కొద్ది రోజులకు ఆ రాయిని రోడ్డు పక్కన నిలబెట్టి... పసుపు, కుంకుమలు చల్లి భక్తులు పూజలు చేసేవారు. అక్కడికి బాతులు పెంచుకునేవారు వచ్చారు. ఆ రాయి పక్కనే కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. అమ్మవారి విగ్రహం పక్కనే ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టేవని పెంపకం దారులకు నమ్మకం ఏర్పడింది. ఆ బాతుల యజమానికి విపరీతమైన లాభాలు వచ్చాయి.

సీజన్ పూర్తి కావటంతో ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్లుటకు నిర్ణయించుకున్నాడు. బాతుల్ని లారీలో వేసుకునేటపుడు వాటితోపాటు అమ్మవారిని కూడా తీసుకెళ్లారు. గుంటూరు వెళ్లగానే అక్కడ బాతుల్ని దించారు. వాటితోపాటు అమ్మవారిని దించగా వెంటనే బాతులు మొత్తం హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. వెంటనే అతను మరలా అమ్మవారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేశాడు. ప్రస్తుతం అమ్మవారు పూజలందుకుంటున్న స్థానంలోనే నిలి΄పాడు. ఈ నిదర్శనం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనతికాలంలో మౌఖికంగా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విరివిగా వచ్చి పాల పొగగళ్లు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటున్నారు.
శోభాయమానంగా నవరాత్రులు...
తల్లి సన్నిధిలో ఏటా దసరా నవరాత్రి మహోత్సవాలు శోభాయమానంగా జరుçగుతాయి. దుర్గాష్టమి రోజున కనకడప్పుల వాద్యాలు, బాణాసంచా, చిత్ర విచిత్ర వేషధారణలతో చుట్టుపక్కలున్న గ్రామాల్లో అమ్మవారి భారీ ఊరేగింపు సాగుతుంది. ఆ రోజు 20 వేల మంది భక్తులకు అన్నసమారాధన ఉంటుంది. నవరాత్రుల్లో భక్తుల ఉల్లాసం కొరకు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఉంటాయి. తొలుత కొండలమ్మ మూలవిరాట్‌ను దర్శించుకునే ఆలయం చిన్నదిగా ఉండేది. ఆ తర్వాత భారీ ఆలయాన్ని దేవాదాయ శాఖ వారు నిర్మించి అభివృద్ధి చేయటం జరిగింది. అనివేటి మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహానికే దసరా ఉత్సవాలకు దేవతా స్వరూపాలను అలంకరిస్తున్నాం.
ఈ తల్లి మూలవిరాట్ నేల మీదనే తల వరకే దర్శనమిస్తుంది. మనసులో మాట అనుకున్నంతనే అవి తీరుస్తున్న అమ్మవారికి భక్తుల నుంచి తాకిడి నానాటికీ పెరిగి΄ోతుంది. సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వేత్తలు, రైతులు ఒక్క రంగమే కాదు అన్ని రంగాలకు చెందిన భక్తులు ఏం కోరుకుంటే అది తీరుస్తూ వారి నుంచి పూజలందుకుంటున్నారు అమ్మవారు. మొక్కుబడులు తీర్చుకునే భక్తులు కొండలమ్మకు పాల పొంగళ్లను సమర్పిస్తారు.
– అయికా రాంబాబు
సాక్షి, గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా
Comments
Please login to add a commentAdd a comment