కాంగ్రెస్‌ నేతలకు వైఎస్‌ జయంతి కానుక | YS Jayanti gift to Congress leaders: telangana | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలకు వైఎస్‌ జయంతి కానుక

Published Tue, Jul 9 2024 3:18 AM | Last Updated on Tue, Jul 9 2024 3:19 AM

YS Jayanti gift to Congress leaders: telangana

34 మందిని కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ..మరొకరు వైస్‌చైర్మన్‌గా

ఒకట్రెండు పదవుల్లో మార్పులు..తొలుత ప్రకటించిన జాబితాలో రెండు పేర్లు ఔట్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ల ఉత్తర్వులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి జయంతి కానుకగా 34 మంది కాంగ్రెస్‌ నేతలను రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లుగా అధికారికంగా నియమించారు. మరొకరిని వైస్‌చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట మార్చి 15వ తేదీతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా చైర్మన్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడానికి ముందు మొత్తం 37 మంది కాంగ్రెస్‌ నేతలకు నామినేటెడ్‌ పదవులు లభించాయి. వీరిలో కొల్లాపూర్‌ నియోజకవర్గానికి చెందిన జగదీశ్వరరావు తనకు నామినేటెడ్‌ పదవి వద్దనడంతో ఆయన పేరు అధికారిక జాబితాలో లేదని తెలుస్తోంది.

ఆయన్ను ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐడీసీ) చైర్మన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించగా, తాజా జాబితాలో ఆ పోస్టును ఖమ్మం జిల్లాకు చెందిన మువ్వా విజయ్‌బాబుకు కేటాయించారు. ఆయనకు గతంలో కేటాయించిన విద్యా, సంక్షేమ మౌలిక వసతుల అభివద్ధి సంస్థ (ఈడబ్ల్యూఐడీసీ) చైర్మన్‌ పదవిని ఎవరికీ కేటాయించలేదు. ఇక కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహిళా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పేరు కూడా అధికార జాబితాలో లేదు. ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో కమిషన్ల నియామకానికి గవర్నర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంటుందని, అందుకే ఆమె పేరు పెండింగ్‌లో పెట్టారని గాం«దీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

గతంలో ప్రకటించిన జాబితాలో జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ కార్పొరేషన్‌ను మార్చారు. ఆయనకు గతంలో డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రకటించినా. ఆ పదవిని యాదవ సామాజికవర్గానికి చెందిన నేతలకు కట్టబెట్టాలన్న ఆలోచనతో జ్ఞానేశ్వర్‌ను ముదిరాజ్‌ కార్పొరేషన్‌కు మార్చారు. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) చైర్మన్‌గా గతంలో కోటా్నక్‌ నాగును నియమించగా, ఆయన స్థానంలో కోటా్నక్‌ తిరుపతిని ప్రకటించారు. ఇక, సామాజికవర్గాల వారీగా పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలకు 12, కమ్మలకు 3, వెలమలకు 1, ముస్లింలకు మూడు, ఆర్యవైశ్య, బ్రాహ్మణులకు ఒక్కోటి చొప్పున పదవులు లభించాయి.

బీసీల్లో గౌడ్‌లకు 4, ముదిరాజ్‌లకు 2, మున్నూరుకాపులకు రెండు, వడ్డెర, పద్మశాలి, లింగాయత్‌లకు ఒక్కో పదవి లభించింది. ఎస్సీలకు 1, ఎస్టీలకు 3 కార్పొరేషన్లు ప్రకటించారు. కాగా, కార్పొరేషన్‌ చైర్మన్‌లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు వచి్చన రోజే పలువురు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే చాలా కాలం వేచి ఉన్నామని, ఇక ఉత్తర్వులు వచి్చన తర్వాత ఇంకా వేచి ఉండడం ఎందుకంటూ హడావుడిగా వెళ్లి తమ తమ కార్యాలయాల్లోని సీట్లలో ఆసీనులు కావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement