కలియుగ భీముడు.. కోడి రామ్మూర్తినాయుడు
ప్రపంచదేశాల్లో భారత ఖ్యాతిని చాటిచెప్పిన మల్లయోధుడు
గుండెపై ఒకటిన్నర టన్ను బరువు పెట్టించుకుని మోసిన ఇండియన్ హెర్క్యులస్
ఏనుగును ఛాతీపై ఎక్కించుకుని ఐదు నిమిషాలు నిలిపిన బలశాలి
‘తిండి కలిగితె కండకలదోయ్.. కండకలవాడేనుమనిషోయ్’ అని చెప్పిన మహాకవి గురజాడ నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే ప్రపంచం మెచ్చిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి నాయుడు కూడా తిరుగాడారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్క్యులస్‌గా, మల్లమార్తాండగా ప్రపంచదేశాల్లో భారత కీర్తిప్రతిష్టలు చాటిచెప్పారు. తన భుజ బలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు.
బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించడం, ఒకటిన్నర టన్నుల బరువును గుండెలపై పెట్టించి మోయడం, ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవడం వంటి వళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసిన రామ్మూర్తినాయుడు గురించి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటిచేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు శభాష్ అన్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం. నేడు ఈ మల్లయోధుడి 142వ జయంతి
వీరఘట్టం: కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు వీరఘట్టంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారబంతో రామ్మూర్తి నాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మాకొడుతూ వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవాడు.
కొడుకును చదివించాలనే దృష్టి ఉన్న వెంకన్న రామ్మూర్తిని విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణ స్వామి ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లినా రామ్మూర్తి చదువు కంటే వ్యాయామం వైపే మొగ్గు చూపుతుండటంతో పినతండ్రి రామ్మూర్తిని మద్రాస్ పంపి వ్యాయామ కళాశాలలో చేర్పించాడు. తర్వాత విజయనగరంలో తను చదివిన కళాశాలలోనే రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు.
వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కొన్నాళ్లకు విజయనగరంంలో రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
ఊపిరి బిగబట్టి.. ఉక్కు గొలుసులు తెంపి
రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో మరింత కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తిని ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంతవేగంగా నడిపించినా అవి కదిలేవి కాదు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది.
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామ్మూర్తినాయుడు పూణె వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రామ్మూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.1920 సంవత్సరంలో కార్లను ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతున్న రామ్మూర్తి ప్రదర్శన చూసి బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మింటో ఆశ్చర్యపోయారు. రామ్మూర్తి బృందాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లి బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి ముందుప్రదర్శన ఇప్పించారు.
రామ్మూర్తి నాయుడు ప్రదర్శనకు మెచ్చిన ఇంగ్లండ్ రాణి అతనికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుతో సత్కరించారు. యూరప్‌లో పలు ప్రదర్శనలు ఇచ్చిన రామ్మూర్తినాయుడు అనంతరం జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలో స్థిరపడ్డారు.
చేతికి ఎముకలేని దాత
కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి, ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేసారని, అప్పటినుంచి ఆయన దైవచింతనలో ఉండేవారని చెబుతారు.
ఆ సాధువు నుంచే రామ్మూర్తి జలస్తంభన, వాయుస్తంభన విద్యలు నేర్చుకున్నాడు. సర్కస్ కంపెనీ ద్వారా అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన రామ్మూర్తి భారీగా దానధర్మాలు, విరాళాలు అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సైతం తనవంతు సాయం అందించారు.
జీవిత చరమాంకంలో రామ్మూర్తినాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముట్టాయి. కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాదీశుని పోషణలో ఉండగా 1942 జనవరి 16వ తేదీన రామ్మూర్తినాయుడు కన్నుమూశారు.
‘కోడి’ బయోపిక్..
కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రెండేళ్ల కిందట కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ నటుడు దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఈ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు.
ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి
కోడి రామ్మూర్తినాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన అటువంటి మహానుభావుని చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించాలి. రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం.
– కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నార్త్ కరోలిన్, అమెరికా
పాఠ్యాంశంగా చేర్చాలి
1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది. కాలక్రమేణ సిలబస్ మారడంతో దాన్ని తొలగించారు. ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి.
– ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం
Comments
Please login to add a commentAdd a comment