
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: ‘మీకు నీళ్లు కావాలంటే నీళ్లిస్తాను. బిందెలు పట్టుకుని ఎండలో నిల్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు ఎవరికి చెప్పారు. ఇప్పుడే కదా నాకు చెప్పింది.. ఎవరికో చెబితే ఎలా..’ అంటూ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
తాము ఐదు నెలలుగా ఇబ్బంది పడుతున్నామని, ఈ విషయం పంచాయతీ సెక్రటరీకి కూడా చెప్పామని మహిళలు చెబితే.. ‘సెక్రటరీకి చెప్పారా.. అయితే సెక్రటరీనే వెళ్లి అడగండి. నేను వెళ్లిపోతాను. ఆ సెక్రటరీలు పడుకుండిపోతున్నారు’ అని అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గురువినాయుడుపేట పంచాయతీ గొలుగువలస గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తాగునీటి సమస్య చెప్పుకొందామని వస్తే మంత్రి క్లాస్ పీకడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు కారణం సీపీఎం వాళ్లేనని అక్కడున్న వామపక్ష నాయకుడు కోరాడ ఈశ్వరరావుపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరించారు.