సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే మొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు. మంత్రి పదవి కూడా దక్కింది. జిల్లాలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలంటూ నిత్యం ఆమె బిజీగా ఉంటారు. రాష్ట్ర మంత్రి కావడంతో కేబినెట్ హోదాలో ఎస్కార్ట్ వాహనం, కాన్వాయ్ వంటి హంగులు, భద్రత అంతా సమకూరింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆ కాన్వాయ్ అంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
వరుసగా జరుగుతున్న ప్రమాదాలే అందుకు కారణం. గత నెల 26న మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరకు మంత్రి కాన్వాయ్ వల్ల పెనుప్రమాదమే తప్పింది. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణంలోని పీఎన్ బొడ్డవలస వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు ఆయన వెళ్లారు. కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణమైన సమయంలో మంత్రి కాన్వాయ్ బొడ్డవలస వైపు వెళ్తోంది. బంగారమ్మపేట వద్దకు వచ్చేసరికి వేగంగా వచ్చిన మంత్రి కాన్వాయ్.. రాజన్నదొర ప్రయాణిస్తున్న వాహనం మీదుకు దూసుకొచ్చింది.
ఆయన డ్రైవర్ వాహనాన్ని చాకచక్యంగా వాహనాన్ని పూర్తిగా ఎడమవైపు తిప్పాడు. అప్పటికే మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం.. రాజన్నదొర వాహనం సైడ్ మిర్రర్‌ను రాసుకుంటూ వెళ్లిపోయింది. దీనిపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసంచార ప్రాంతంలో, ఇరుకు రహదారులపై అంతవేగంగా వాహన శ్రేణిని నడపాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
సెప్టెంబరులో బూశాయవలస వద్ద ప్రమాదం..
గత సెప్టెంబరు 12వ తేదీన ఉదయం రామభద్రపురం మండలంలోని బూశాయవలస–ఆరికతోట మధ్యలో జాతీయ రహదారిపై మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం–ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహన డ్రైవర్‌తోపాటు, ఆర్‌ఎస్సై, ముగ్గురుపోలీసులు, మినీ వ్యాన్‌లో ఉన్న మురో ముగ్గురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు రెండు ప్రమాదాల్లో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ప్రజల్లో ఆందోళన..
మంత్రి ప్రయాణించే కాన్వాయ్ తరచూ ప్రమాదాలకు గురవుతుండడంతో ప్రజలు కూడా దీనిపైనే చర్చించుకుంటున్నారు. రాష్ట్రమంత్రి వాహన శ్రేణి కావడంతో అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, సింగిల్ రోడ్లలో సైతం వాహన శ్రేణి అత్యంత వేగంగా వెళ్తోందని చెబుతున్నారు. మున్ముందు ఎటువంటి ప్రమాదాలూ జరగకుండా వాహన శ్రేణి చోదకులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment