
మంచిరోజుల్లో పిల్లలకు జన్మనిచ్చేందుకు ఆరాటపడుతున్న తల్లులు
వారిని ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు
దీనిని సొమ్ముచేసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు
ఇది మంచిది కాదంటున్న వైద్యులు
తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్న వైద్యనిపుణులు
వీరఘట్టం: జనన, మరణాలు సహజమైనవి. మారిన సాంకేతిక యుగంలో జనన తేదీలను ముందే నిశ్చయిస్తున్నారు. ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపునకు గాటుపెట్టించి బిడ్డలను బలవంతంగా తీస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పుతలపెడుతున్నారు. ఈ జాడ్యాన్ని కొందరు తల్లులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.
కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. పుట్టుకను ముందే ఫిక్స్ చేయడం.. దీనికోసం మంచి ముహూర్తాలు చెప్పండి అంటూ పండితులు, జ్యోతిష్యుల దగ్గరకు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెలలు నిండకముందే కాన్పుచేయాలంటూ కొందరు గర్భిణులు ఒత్తిడిచేస్తున్నారని, ఇది ప్రమాదకరమని చెబితే వేరే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
సిజేరియన్లకే మొగ్గు..
ఒకప్పుడు సిజేరియన్ పేరు చెబితే గర్భిణులంతా భయపడిపోయేవారు. ఇప్పుడు అదే పదం మాటమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మనీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్ధితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడు సిజేరియన్ సాధారణ ప్రక్రియగా మారింది. సహజ కాన్పు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా సిజేరియన్‌కే ఓటు వేస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు.
ఫలితంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ సిజేరియన్లు సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమన్హారం. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లుంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈశాతం మరింత ఎక్కువగా ఉంటోంది.
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12,945 మంది గర్భిణులు వైద్య రికార్డుల్లో నమోదుకాగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంత వరకు 3,621 ప్రసవ ఆపరేషన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధికం డెలివరి సమయం ముందుగా మంచి రోజుల్లోనే సిజేరియన్లు జరగడం గమనార్హం.
సిజేరియన్ ఎప్పుడు అవసరం...
» గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు
» గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు
» గర్భాశయ ముఖద్వారాన్ని మూయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లోను..
» తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్ధితుల్లో..
» తల్లికి ఇతర ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేస్తారు.
సిజేరియన్ వల్ల కలిగే ఇబ్బందులు ఇవీ
» సహజ ప్రసవ సమయంలో ప్రోలాక్టిన్ వంటి హర్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పత్తి అవుతాయి. అదే సిజేరియన్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది.
» తల్లిపాలు పట్టకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది.
» సిజేరియన్ సమయంలో గర్భిణి మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది.
» శస్త్ర చికిత్స జరిగితే నొప్పితో బాలింతలు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది.
» కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమస్యలు వస్తాయి.
» పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకుంటాయి.
ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులు
కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు కూడా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు సుమారు రూ.40 వేలు నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటున్నాయి.
సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీబిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. సిజేరియన్లను వ్యాపారంగా మార్చేసి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం నమోదైన గర్భిణుల సంఖ్య 12,945
ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన సిజేరియన్లు 3,621
బిడ్డపైన ప్రభావం
బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి దోహద పడుతుంది. అస హజ రీతిలో చేస్తే కత్తిగాట్లు వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువ, తక్కువగా విడుదలై భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. – డాక్టర్.రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, పాలకొండ ఏరియా ఆస్పత్రి
ముహూర్తాల వెర్రి
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రసవాల కోసం చాలామంది గర్భిణులు ముహూర్తాలు చూసుకునే వస్తున్నారు. ప్రసవానికి సమయమున్నా ముహుర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధంకావడం, వైద్యులపై ఒత్తిడిచేయడం సరికాదు. బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యకరం. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేను రోజుల తేడాతో బిడ్డను బయటకుతీస్తే అనేక సమస్యలు వస్తాయి. – డాక్టర్.పి.ఉమామహేశ్వరి, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం
అది భగవంతుడి నిర్ణయం
పుట్టుక అనేది సహజసిద్ధ ప్రక్రియ. చెట్టుకు పండు పండితే రాలినట్టే... తొమ్మిదినెలలు నిండాక తల్లి గర్భం నుంచి ఆరోగ్యంగా శిశువు బయటకు వస్తుంది. డెలవరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిధి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకు వెళ్తున్నారు. ఓ పదేళ్ల కిందట ఈ పరిస్థితి అంతగా ఉండేది కాదు. ఇప్పుడు మంచిరోజు చూసుకుని సిజేరియన్ చేసుకుంటున్నారు. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ,పురోహితుడు, వీరఘట్టం
కడుపుకోత మంచిది కాదు
చాలా మంది ముహుర్తం పెట్టి సిజేరియన్ చేయా లని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీనివల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసరమైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment