Muhurtalu
-
ముహూర్తాల గండం..!
వీరఘట్టం: జనన, మరణాలు సహజమైనవి. మారిన సాంకేతిక యుగంలో జనన తేదీలను ముందే నిశ్చయిస్తున్నారు. ముహూర్తాల పిచ్చితో అమ్మ కడుపునకు గాటుపెట్టించి బిడ్డలను బలవంతంగా తీస్తున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి ముప్పుతలపెడుతున్నారు. ఈ జాడ్యాన్ని కొందరు తల్లులతో పాటు వారి కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తుండడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు మాత్రం కాసులవర్షం కురిపిస్తోంది. పుట్టుకను ముందే ఫిక్స్ చేయడం.. దీనికోసం మంచి ముహూర్తాలు చెప్పండి అంటూ పండితులు, జ్యోతిష్యుల దగ్గరకు తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నెలలు నిండకముందే కాన్పుచేయాలంటూ కొందరు గర్భిణులు ఒత్తిడిచేస్తున్నారని, ఇది ప్రమాదకరమని చెబితే వేరే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. సిజేరియన్లకే మొగ్గు.. ఒకప్పుడు సిజేరియన్ పేరు చెబితే గర్భిణులంతా భయపడిపోయేవారు. ఇప్పుడు అదే పదం మాటమాటికీ వినిపిస్తోంది. బిడ్డ అడ్డం తిరిగినప్పుడు, గర్భిణి నీరసంగా ఉన్నప్పుడు, ఉమ్మనీరు పోతున్నప్పుడు తదితర అత్యవసర పరిస్ధితుల్లోనే ఇది వరకు సిజేరియన్ చేసేవారు. ఇప్పుడు సిజేరియన్ సాధారణ ప్రక్రియగా మారింది. సహజ కాన్పు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనంపై అవగాహన లేకపోవడంతో అంతా సిజేరియన్‌కే ఓటు వేస్తున్నారు. వైద్యులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫలితంగా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ సిజేరియన్లు సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. మారుమూల పల్లె వాసులు కూడా సిజేరియన్‌కు వెళ్తుండడం గమన్హారం. జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏటా జరుగుతున్న ప్రసవాల్లో సగటున 30 నుంచి 40 శాతం వరకు సిజేరియన్లుంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈశాతం మరింత ఎక్కువగా ఉంటోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 12,945 మంది గర్భిణులు వైద్య రికార్డుల్లో నమోదుకాగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇంత వరకు 3,621 ప్రసవ ఆపరేషన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో అధికం డెలివరి సమయం ముందుగా మంచి రోజుల్లోనే సిజేరియన్లు జరగడం గమనార్హం. సిజేరియన్ ఎప్పుడు అవసరం... » గర్భిణికి రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు » గర్భంలో బిడ్డ అడ్డం తిరిగినప్పుడు » గర్భాశయ ముఖద్వారాన్ని మూయ కమ్మేయడం వంటి అత్యవసర సమయాల్లోను.. » తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న పరిస్ధితుల్లో.. » తల్లికి ఇతర ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్ వంటి అనారోగ్య ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రమే సిజేరియన్ చేస్తారు.సిజేరియన్ వల్ల కలిగే ఇబ్బందులు ఇవీ » సహజ ప్రసవ సమయంలో ప్రోలాక్టిన్ వంటి హర్మోన్లు విడుదల కావడం వల్ల బాలింతలో సహజంగానే చనుబాలు ఉత్పత్తి అవుతాయి. అదే సిజేరియన్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే పాలు ఇవ్వడం కష్టమవుతుంది. » తల్లిపాలు పట్టకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. » సిజేరియన్ సమయంలో గర్భిణి మూత్రనాళానికి, పేగులకు గాయాలయ్యే అవకాశం ఉంటుంది. » శస్త్ర చికిత్స జరిగితే నొప్పితో బాలింతలు నెలల తరబడి మంచానికి పరిమితం కావాల్సి వస్తుంది. » కదలికలు తక్కువ కావడం వల్ల హెర్నియా వంటి సమస్యలు వస్తాయి. » పీరియడ్స్ సమయంలో అధిక రక్త స్రావం వంటివి చోటు చేసుకుంటాయి.ప్రోత్సహిస్తున్న ఆస్పత్రులు కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు కూడా సిజేరియన్లను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఒక సిజేరియన్‌కు జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు సుమారు రూ.40 వేలు నుంచి రూ.80 వేలు వరకు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాల్లో 80 శాతం వరకు సిజేరియన్ కేసులే ఉంటున్నాయి. సిజేరియన్ చేస్తే ఆస్పత్రిలో ఆరు నుంచి 8 రోజుల వరకు ఉండాలి. ఖర్చు కూడా ఎక్కువే. సహజ ప్రసవానికి రూ.20 వేలు లోపు ఖర్చు అవుతోంది. తల్లీబిడ్డా రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోవచ్చు. సిజేరియన్లను వ్యాపారంగా మార్చేసి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతం నమోదైన గర్భిణుల సంఖ్య 12,945ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన సిజేరియన్లు 3,621బిడ్డపైన ప్రభావం బిడ్డ జననం సహజంగా జరిగితే అది చిన్నారి మానసిక, శారీరక వికాసానికి దోహద పడుతుంది. అస హజ రీతిలో చేస్తే కత్తిగాట్లు వల్ల తల్లి పడే బాధ బిడ్డపై ప్రభావం చూపుతుంది. కీలకమైన సమయంలో ఆ పరిస్థితి శిశువు స్పందనలపై పడుతుంది. శిశువుల జ్ఞానాత్మక అభివృద్ధిలో తేడాలు అధికంగా చూపుతాయి. బిడ్డలో ఆ సమయానికి కొన్ని రకాల హార్మోన్లు అవసరమైన దాని కంటే ఎక్కువ, తక్కువగా విడుదలై భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. – డాక్టర్.రవీంద్రకుమార్, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, పాలకొండ ఏరియా ఆస్పత్రిముహూర్తాల వెర్రి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు ప్రసవాల కోసం చాలామంది గర్భిణులు ముహూర్తాలు చూసుకునే వస్తున్నారు. ప్రసవానికి సమయమున్నా ముహుర్తాల వెర్రిలో పడి వారం, పదిరోజుల ముందే ఆపరేషన్‌కు సిద్ధంకావడం, వైద్యులపై ఒత్తిడిచేయడం సరికాదు. బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలలు నిండేవరకు ఉంటేనే ఆరోగ్యకరం. రెండు, మూడు రోజుల వ్యవధిలో చేసినా ఏం కాదుగానీ, పది, పదిహేను రోజుల తేడాతో బిడ్డను బయటకుతీస్తే అనేక సమస్యలు వస్తాయి. – డాక్టర్.పి.ఉమామహేశ్వరి, మెడికల్ ఆఫీసర్, వీరఘట్టం అది భగవంతుడి నిర్ణయం పుట్టుక అనేది సహజసిద్ధ ప్రక్రియ. చెట్టుకు పండు పండితే రాలినట్టే... తొమ్మిదినెలలు నిండాక తల్లి గర్భం నుంచి ఆరోగ్యంగా శిశువు బయటకు వస్తుంది. డెలవరీ డేట్లు ఒక రోజు అటు, ఇటు ముహూర్తం అడుగుతున్నారు. వారం, తిధి, నక్షత్రం, తారాబలం, లగ్నబలం చూసుకున్న తర్వాతనే కాన్పుకు వెళ్తున్నారు. ఓ పదేళ్ల కిందట ఈ పరిస్థితి అంతగా ఉండేది కాదు. ఇప్పుడు మంచిరోజు చూసుకుని సిజేరియన్ చేసుకుంటున్నారు. – ఎస్.వి.ఎల్.ఎన్.శర్మయాజీ,పురోహితుడు, వీరఘట్టం కడుపుకోత మంచిది కాదు చాలా మంది ముహుర్తం పెట్టి సిజేరియన్ చేయా లని చెబుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బిడ్డను ఆ సమయంలోనే ఆపరేషన్ చేసి తీయాలని చెప్పడం కరెక్ట్ కాదు. దీనివల్ల తల్లీ బిడ్డకు ప్రమాదం. సిజేరియన్ అనేది అత్యవసరమైతేనే చేయాలి. అది కూడా సమయాన్ని బట్టి సిజేరియన్ చేస్తాం. సిజేరియన్ విషయంలో వైద్యులపై ఒత్తిడి తేరాదు. – డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, పార్వతీపురం మన్యం జిల్లా -
శ్రీరస్తు.. శుభమస్తు!
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): శుభ ముహూర్తాల మాఘమాసం వచ్చేసింది. పెళ్లి కళను వెంటబెట్టుకొచ్చింది. ‘శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు’ అనుకుంటూ శుభముహూర్తాలు నిశ్చయించుకున్న కుటుంబాలన్నీ వధూవరులను పెళ్లి పీటలెక్కించి చిద్విలాసాల నడుమ వేదమంత్రాల సాక్షిగా దంపతుల్ని చేసేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మాఘ మాసం నుంచి ఛైత్రమాసం వరకు మూడు నెలల పాటు శుభకార్యాలకు మంచి ఘడియలు ఉన్నాయని పండితులు పేర్కొంటున్నారు. మాఘమాసం ప్రారంభం కావటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాహాలు జరిపించేందుకు భారీగా ముహూర్తాలు నిశ్చయిస్తున్నట్టు పురోహితులు పేర్కొంటున్నారు. శుభకార్యాలకు ఉత్తరాయణం చాలా విశిష్టమైనదిగా భావిస్తారు. ఆ క్రమంలో మాఘమాసంలో ఈ నెల 13 నుంచి మంచి ముహూర్తాలు మొదలవుతున్నాయి. రాష్ట్రంలో లక్షకుపైగా వివాహాలు రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో సుమారు లక్ష వరకూ వివాహాలు జరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొంటున్నారు. ప్రధానంగా తిరుపతి, విజయవాడ, అన్నవరం, శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాల్లో వారి వారి నమ్మకాలు, మొక్కులతో వేలాది జంటలు వివాహంతో ఒక్కటి కానున్నాయి. ఆ పుణ్యక్షేత్రాలతో పాటుగా రాష్ట్రంలోని కల్యాణ మండపాలు ఆయా ముహూర్తాల్లో అధిక శాతం ఇప్పటికే బుక్కయ్యాయి. కల్యాణ మండపాలతో పాటుగా హోటల్స్‌లోనూ వివాహాలను జరుపుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 28 నుంచి మూఢం ఏప్రిల్ 28వ తేదీ నుంచి మూఢం ప్రారంభమవుతుంది. మూఢం శుభకార్యాలకు మంచిది కాదని, అందువల్ల ఏ ముహూర్తాలూ ఉండవని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా మే, జూన్, జూలై మాసాల్లో మూఢంతో పాటు ఆషాఢ మాసం సైతం ప్రారంభం కానుంది. భాద్రపద మాసంలోనూ ముహూర్తాలు ఉండవు. తిరిగి ఆగస్టులో శ్రావణం వచ్చే వరకూ ముహూర్తాలు లేవు. ఏప్రిల్ తరువాత వివాహాలు జరుపుకోవాలనుకునే వారు శ్రావణ మాసం వరకూ ఆగాల్సిందేనని పండితులు చెబుతున్నారు. మూడు మాసాల్లో కల్యాణ ఘడియలు మాఘ మాసం (ఫిబ్రవరి)లో 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి 2, 3 తేదీలు, ఫాల్గుణ మాసం (మార్చి)లో 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30, ఏప్రిల్ 3, 4 తేదీలు, ఛైత్ర మాసం (ఏప్రిల్)లో 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆయా శుభ ఘడియల్లో వివాహాలు జరిపించేందుకు చాలా మంది తల్లిదండ్రులు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. మార్కెట్‌కు పెళ్లి కళ వివాహాలపై ఆధారపడ్డ వర్గాలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా పురోహితులు, కేటరింగ్, డెకరేషన్, మంగళ వాయిద్యాలు, ఆర్కెస్ట్రా, వస్త్ర దుకాణాలు, బంగారు నగల దుకాణాలు, కల్యాణ మండపాలు వంటి 20 రంగాలు వివాహాలపై ఆధారపడి కొనసాగుతున్నాయి. వీటిని సమన్వయం చేస్తూ ఈవెంట్ మేనేజర్లు వివాహాలను గ్రాండ్‌గా జరిపేందుకు రాష్ట్రంలో ఉన్నారు. ఈ మూడుఎ మాసాలు ఆయా రంగాల వారంతా బిజీ కానున్నారు. మాఘం నుంచి ౖఛైత్రం వరకు.. మాఘమాసం నుంచి ఛైత్ర మాసం వరకూ మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ ఏడాది ఎక్కువ మంది ఈ ముహూర్తాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఛైత్రం చివరిలో మూఢం ప్రారంభమవుతుంది. శ్రావణం వచ్చే వరకు ముహూర్తాలు లేవు. – పొన్నంగిపల్లి శ్రీరామచంద్రమూర్తి, పండితుడు, విజయవాడ -
ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. లగ్నానికి లేదిక విఘ్నం
ఆషాఢ, అధిక శ్రావణం కారణంగా 2 నెలల విరామం అనంతరం ఈ నెల 19 నుంచి శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఏడడుగులు, మూడుముళ్లతో పెళ్లి సంబరాలు అంబరాన్నం టనున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాల నిర్వాహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుండగా.. 19 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా శుభకార్యాలు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి. భీమవరం (ప్రకాశం చౌక్)/రాయవరం: ఈ ఏడాది మొదటి నెల నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మంచి తరుణంగా నిలుస్తోంది. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో 104 పెళ్లి ముహూర్తాలు ఉండగా ఇప్పటికే 51 ముహూర్తాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు 53 ముహూర్తాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు లేకపోవడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 25 నుంచి ముహూర్తాలు ప్రారంభమవ్వగా...ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి శుభ ముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అనేక శుభకార్యాలు, గృహ ప్రవేశాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి. ‘అందరికీ..అన్నింటికీ’ డిమాండ్... పెళ్లి, శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో అన్ని ప్రాంతాల్లోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణ ఫంక్షన్ హాళ్ల దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ హాళ్ల వరకు గిరాకీ ఎక్కువగా ఏర్పడింది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన పలువురు రెండు మూడు నెలల ముందు నుంచే కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు మంచి ఆదాయం అందుతోంది. ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతోన్న నేపథ్యంలో వాటికీ డిమాండ్ విపరీతంగా ఉంది. అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం లాంటి ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. వివాహాలు ప్రారంభం కానుండటంతో పలు వృత్తుల వారికి చేతినిండా పని దొరుకుతుంది. బాజాభజంత్రీలు, డెకరేటర్స్, ఫొటోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ నిర్వాహకులు, వంట పనివారు, ట్రాన్స్పోర్టర్స్, ఎల్రక్టీషియన్స్, సౌండ్ ఇంజినీర్స్, ఈవెంట్ మేనేజర్స్, పురోహితులకు చేతినిండా పని దొరకనుంది. ఈ ఏడాది ముహూర్తాలు ఇలా.. ఆగస్ట్ : 19, 20, 22, 24, 26, 29, 30, 31 సెప్టెంబర్ : 1, 2, 3, 6, 7, 8 అక్టోబర్ : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31 నవంబర్ : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29 డిసెంబర్ : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31 ఈ ఏడాదే ఎక్కువ.. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయి. ముహూర్తాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్లలో అయితే ఒక్కో నెలలో ఏకంగా 14 ముహూర్తాలు చొప్పున ఉన్నాయి. – మద్దిరాల మల్లిఖార్జునశర్మ, శ్రీమావుళ్లమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుడు -
డుండుండుం పిపిపి.. మే, జూన్ నెలల్లో 24 పెళ్లి ముహూర్తాలు.. తేదీలివే!
సాక్షి, అమరావతి: మండు వేసవిలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే, జూన్ నెలల్లో దాదాపు 24 శుభముహూర్తాలు ఉన్నట్టు పండితులు ప్రకటించారు. గత శుభకృతు నామ సంవత్సరం(2022–23)లో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత వచ్చిన శుభ ముహూర్తాలకు ఏపీ, తెలంగాణలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ తర్వాత ఆగస్టు నుంచి నవంబర్ నెలాఖరు వరకు సరైన ముహూర్తాలు లేవు. మళ్లీ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 12 వరకు పెళ్లిళ్లు జరిగాయి. డిసెంబర్ 16 నుంచి ఈ ఏడాది జనవరి 14 వరకు ధనుర్మాసం కావడంతో వివాహాలు చేయలేదు. జనవరి 19 నుంచి మార్చి 9 వరకు మొత్తం 18 శుభ ముహూర్తాలు వచ్చాయి. మళ్లీ నెల రోజుల విరామం తర్వాత తాజాగా మే నెలలో 6, 8, 9, 10, 11, 15, 16, 20, 21, 22, 27, 29, 30 తేదీలతో పాటు జూన్‌లో 1, 3, 5, 6, 7, 11, 12, 23, 24, 26, 27 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నాయని పండితులు ప్రకటించారు. ఇప్పుడు కాకుంటే మరో 2 నెలలు బ్రేక్.. మే మాసం అంతా వరుసగా మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో కూడా 18వ తేదీ వరకు అనువైన ముహూర్తాలు బాగానే ఉన్నాయి. 19వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలుకానుండటంతో మళ్లీ శుభకార్యాలకు బ్రేక్ పడనుంది. ఆషాఢ మాసం జూలై 18 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత వచ్చే శ్రావణ మాసం, అధిక శ్రావణ మాసం ఆగస్టు 17 వరకు ఉంటుంది. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడుతుందని పండితులు చెబుతున్నారు. వివాహాలకే.. గృహ ప్రవేశాలకు అనుకూలించవు ప్రస్తుత వైశాఖం, జ్యేష్ఠ మాసాల్లో దాదాపు 25 మంచి ముహూర్తాలున్నాయి. వీటిలో చాలా ముహూర్తాలు పెళ్లిళ్లు, ఉపనయనాలకు బాగా అనుకూలిస్తాయి. మే 11 నుంచి 24వ తేదీ వరకు అగ్ని కార్తె ఉండటంతో ఆ సమయంలో వచ్చే ముహూర్తాలు గృహ ప్రవేశాలకు అనుకూలించవు. జూన్ నెలాఖరు వరకు ముహూర్తాలున్నప్పటికీ ఆషాఢం వస్తుంది. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు ముహూర్తాలు ఉండవు. అందుకే మే, జూన్ నెల మొదట్లోనే వివాహాలు జరిపించేందుకు చాలా మంది ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – కొత్తపల్లి సూర్యప్రకాశరావు, పురోహితుడు, భీమవరం -
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
నాలుగు నెలల దాకా పెళ్లిళ్లు లేనట్టే!
సాక్షి, కదిరి: కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంతో యువత కేరింతలు కొడుతుంటే.. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని పండితులు చెబుతుండటంతో పెళ్లీడుకొచ్చిన వారిని నిరుత్సాహ పరుస్తున్నాయి. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. ఈ నెల 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14న బలమైన ముహూర్తం ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి ఈ ఏడాది మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చక స్వాములు అంటున్నారు. 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఈ ఏడాది ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢం ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజలు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లూ కోవిడ్–19 ప్రభావంతో పెళ్లిళ్లు బ్రేక్ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. రెండు మూఢాలు రావడం అరుదు గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. అయితే జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కాబట్టి మంచి ముహూర్తంలో చేసుకోవడం మంచిది. – ఏవీ నరసింహాచార్యులు, ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి -
సప్తపది
జిల్లాకు పెళ్లి కళ వచ్చింది. మార్గశిర మాసం ముహూర్తాలు మోసుకురావడంతో కల్యాణ వేదికలు ముస్తాబయ్యాయి. ఈనెల 6 నుంచి 18వ తేదీ వరకు ఏడు రోజుల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో పెళ్లి సందడి నెలకొంది. బాజాభజంత్రీలు, పురోహితులు, వేదిక అలంకరణ సామగ్రికి గిరాకీ పెరిగింది. ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. 13, 18 తేదీల్లో బలమైన ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. తిరుపతి గాంధీరోడ్డు: మూడు నెలల విరామం తర్వాత మార్గశిర మాసం వివాహ శుభ ఘడియలను మోసుకొచ్చింది. బుధవారం నుంచి పెళ్లిళ్లు ఆరంభమయ్యాయి. శుభకార్యం కోసం కల్యాణ మండపాలు సిద్ధమయ్యాయి. వస్త్ర దుకాణాలు, జ్యూవెలరీ షాపులు సందడిగా మారాయి. ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ముందస్తుగానే మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాల్లో వివాహ వేడుకలకు సర్వం సిద్దమైంది. వేదికల ముస్తాబు వివాహ వేడుకలు నిర్వహించే కల్యాణ మండపాలు, పంక్షన్ హాళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. ఖరీదైన పెళ్లిళ్ల కోసం నిర్వాహకులు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్ చేస్తున్నారు. కొన్నిచోట్ల సెట్టింగ్‌లు కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆర్థిక స్తోమత కు అనుగుణంగా ఫంక్షన్ హాళ్లు రెడీ అవుతున్నాయి. జీవితంలో మరుపురాని రోజు కావడంతో ఎంత వ్యయమైనా వెనుకాడకుండా పెళ్లి చేయడానికి కొన్ని కుటుం బాలు సిద్ధమవుతున్నాయి. అట్టహాసంగా ఏర్పాట్లు.. మారిన కాలంలో పెళ్లిళ్లు ఖరీదైపోయాయి. పెళ్లి చేయడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు. ముహూర్తాలు ఖరారు కావడంతో కల్యాణ మండపాల అద్దెను కూడా పెంచేశారు. ఇతర రోజులకన్నా సుమారు 20 నుంచి 25 శాతం అద్దెలు పెంచారు. పెళ్లికి రూ.15 వేలు తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో రూ.20 వేల వరకు కూడా వసూలు చేస్తున్నారు. క్యాటరింగ్, ఫోటో, వీడియోగ్రాఫర్లు కూడా తమదైన శైలిలో వసూలు చేస్తున్నారు. గతంలో కన్నా రూ.3 వేలు పెంచేశారు. పురోహితులు కూడా పరిస్థితిని బట్టి డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో పురోహితుడు ఏకకాలంలో రెండు, మూడు పెళ్లిళ్లు నిర్వహించడానికి ఒప్పం దం చేసుకున్నట్టు తెలిసింది. బంగారం ధరలు తగ్గడంతో ముందుగానే కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముహూర్తాలు ఎక్కువ కావడంతో బంగారం ధరలు కూడా పుంజుకునే అవకాశం ఉంది. శుభముహూర్తాలు ఏడు రోజులే .. వివాహానికి ముహూర్తమే కొండంత బలం. ఈ ఏడాది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మాసాల్లో మంచి ముహూర్తాలు లేకపోవడంతో మార్గశిర మాసం పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది. ఈనెల 6, 7, 10, 12, 13, 17, 18 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయి. 13, 18 తేదీల్లో బల మైన ముహూర్తాలు ఉన్నట్లు అర్చకులు చెబుతున్నారు. 18 వ తేదీ దాటితే 2015 జనవరి 22వ తేదీ వరకు, అది కూడా లేదంటే మార్చి 15వ తేదీ వరకు పెళ్లి ముహూర్తాలు లేవు. బలమైన ముహూర్తాలున్నాయి పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ సారి బలమైన ముహూర్తాలు ఉన్నాయి. డిసెంబర్ ఆరో తేదీ నుంచి 18 తేదీ వరకు ఒక దఫా, జనవరి 22 నుంచి మార్చి 15 వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ముహూర్తాలు పెట్టుకుంటున్నారు. ముహూర్తాలు తక్కువగా ఉండటంతో ఉన్న వాటికే గణనీయంగా పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. - ఎన్.శేషాచారి, అర్చకులు