నాలుగు నెలల దాకా పెళ్లిళ్లు లేనట్టే! | Wedding Season Ends In One Week | Sakshi
Sakshi News home page

వారం తర్వాత ముహూర్తాలు లేవు

Published Sun, Jan 3 2021 10:36 AM | Last Updated on Sun, Jan 3 2021 2:34 PM

Wedding Season Ends In One Week - Sakshi

సాక్షి, కదిరి: కొత్త సంవత్సరం వచ్చిందన్న ఆనందంతో యువత కేరింతలు కొడుతుంటే.. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు తక్కువేనని పండితులు చెబుతుండటంతో పెళ్లీడుకొచ్చిన వారిని నిరుత్సాహ పరుస్తున్నాయి. గురు మౌఢ్యమితో పాటు శుక్ర మౌఢ్యమి సైతం వెనువెంటనే రావడంతో పెళ్లి ముహూర్తాలకు కాస్త అడ్డంకిగా మారుతోంది. ఈ నెల 8వ తేదీ వరకే పెళ్లిళ్లకు మంచి ముహూర్తాలు ఉన్నాయని, ఇంకా చెప్పాలంటే 7వ తేదీనే చివరి మంచి ముహూర్తమంటూ సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత మే నెల వరకూ మంచి ముహూర్తాలు లేవని అంటున్నారు.

మే 14న బలమైన ముహూర్తం 
ఈ నెల 8తో పెళ్లి ముహూర్తాలకు శుభం కార్డు పడితే, తిరిగి ఈ ఏడాది మే 14న మంచి ముహూర్తం ఉంది. అప్పటి నుంచి పెళ్లిళ్ల సీజన్‌ మళ్లీ ప్రారంభం కానుంది. ఈ నెల 14న శూన్యమాసం ప్రారంభం కానుంది. ఇది ఫిబ్రవరి 12 వరకూ కొనసాగనుంది. శూన్యమాసంలో శుభముహూర్తాలు అనేవేవీ ఉండవని అర్చకులు అంటున్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 12 వరకూ అంటే సుమారు నెల రోజుల పాటు గురు మౌఢ్యమి ఉంటుందని అర్చక స్వాములు అంటున్నారు. 

80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి 
ఈ ఏడాది ఫిబ్రవరి 14 మాఘ శుద్ధ తదియ నుంచి మే 4వ తేదీ బహుళ అష్టమి వరకూ అంటే 80 రోజుల పాటు శుక్ర మాఢ్యమి ఉంటుందని సిద్ధాంతులు చెబుతున్నారు. ఆ తర్వాత శుభ దినాలు ప్రారంభమైనప్పటికీ 10 రోజులు పాటు అంత బలమైన ముహూర్తాలు లేవని అంటున్నారు. మే 14 నుంచి బలమైన ముహూర్తాలు ఉంటాయని పేర్కొంటున్నారు. 

జూలై 4 నుంచి ఆషాఢం 
ఈ ఏడాది మే 14 తర్వాత మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ అవి కొద్ది రోజలు మాత్రమేనని పండితులు అంటున్నారు. జూలై 4 నుంచి ఆషాఢమాసం ప్రారంభమై ఆగస్టు 11తో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చేసుకునేందుకు మంచి రోజులు కావని చెబుతున్నారు. 2021లో బలమైన ముహూర్తాల కొరత ఎక్కువగానే ఉంటోందని అర్చకులు అంటున్నారు. ఇన్నాళ్లూ కోవిడ్‌–19 ప్రభావంతో పెళ్లిళ్లు బ్రేక్‌ పడితే మళ్లీ నెలల తరబడి సుముహూర్తాలు లేవనే అంశం పెళ్లిపీటలు ఎక్కబోయే వారిని నిరుత్సాహపరుస్తున్నాయి.   

రెండు మూఢాలు రావడం అరుదు
గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి ఇలా రెండు వరుసగా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇవి చెడు ప్రభావాన్ని కలిగించనప్పటికీ ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేయడానికి అంత మంచి రోజులైతే కాదు. అలాగని శాస్త్రీయంగా చెడు జరుగుతుందనేందుకూ సరైన ఆధారాల్లేవు. అయితే జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. కాబట్టి మంచి ముహూర్తంలో చేసుకోవడం మంచిది.  
– ఏవీ నరసింహాచార్యులు, ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, కదిరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement