సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు.
ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు.
ఫిబ్రవరి 5న వసంత పంచమి..
చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment