ఆషాఢ, అధిక శ్రావణం కారణంగా 2 నెలల విరామం అనంతరం ఈ నెల 19 నుంచి శుభకార్యాల సందడి ప్రారంభం కానుంది. తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, ఏడడుగులు, మూడుముళ్లతో పెళ్లి సంబరాలు అంబరాన్నం టనున్నాయి.
శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభ కార్యాల నిర్వాహణకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17న నిజ శ్రావణ మాసం ప్రారంభమవుతుండగా.. 19 నుంచి ముహూర్తాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంతా శుభకార్యాలు చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే వివాహాలు నిశ్చయించుకున్న కుటుంబాలు పెళ్లి పనుల్లో బిజీ అయ్యాయి.
భీమవరం (ప్రకాశం చౌక్)/రాయవరం: ఈ ఏడాది మొదటి నెల నుంచి డిసెంబర్ వరకు పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మంచి తరుణంగా నిలుస్తోంది. ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో 104 పెళ్లి ముహూర్తాలు ఉండగా ఇప్పటికే 51 ముహూర్తాలు పూర్తయ్యాయి. ఇక ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు 53 ముహూర్తాలు ఉన్నాయి.
గడిచిన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో పెళ్లి ముహూర్తాలు లేకపోవడం విశేషం. వాస్తవానికి ఈ ఏడాది జనవరి 25 నుంచి ముహూర్తాలు ప్రారంభమవ్వగా...ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా శుభకార్యాలకు విఘ్నం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి శుభ ముహూర్తాలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. అనేక శుభకార్యాలు, గృహ ప్రవేశాలు డిసెంబర్ వరకు కొనసాగనున్నాయి.
‘అందరికీ..అన్నింటికీ’ డిమాండ్...
పెళ్లి, శుభ ముహూర్తాలు ప్రారంభమవుతుండటంతో అన్ని ప్రాంతాల్లోని కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. సాధారణ ఫంక్షన్ హాళ్ల దగ్గర నుంచి పెద్ద ఫంక్షన్ హాళ్ల వరకు గిరాకీ ఎక్కువగా ఏర్పడింది. ఈ పరిస్థితిని ముందుగానే గ్రహించిన పలువురు రెండు మూడు నెలల ముందు నుంచే కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులకు మంచి ఆదాయం అందుతోంది.
ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతోన్న నేపథ్యంలో వాటికీ డిమాండ్ విపరీతంగా ఉంది. అన్నవరం, ద్వారకా తిరుమల, సింహాచలం లాంటి ప్రముఖ దేవస్థానాల్లో పెళ్లిళ్లు జరిపించడానికి ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. వివాహాలు ప్రారంభం కానుండటంతో పలు వృత్తుల వారికి చేతినిండా పని దొరుకుతుంది. బాజాభజంత్రీలు, డెకరేటర్స్, ఫొటోగ్రాఫర్స్, టెంట్‌హౌస్ నిర్వాహకులు, వంట పనివారు, ట్రాన్స్‌పోర్టర్స్, ఎల్రక్టీషియన్స్, సౌండ్ ఇంజినీర్స్, ఈవెంట్ మేనేజర్స్, పురోహితులకు చేతినిండా పని దొరకనుంది.
ఈ ఏడాది ముహూర్తాలు ఇలా..
ఆగస్ట్ : 19, 20, 22, 24, 26, 29, 30, 31
సెప్టెంబర్ : 1, 2, 3, 6, 7, 8
అక్టోబర్ : 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31
నవంబర్ : 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29
డిసెంబర్ : 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31
ఈ ఏడాదే ఎక్కువ..
ఈ ఏడాది 12 నెలల కాలంలో కేవలం 2 నెలలు మినహా మిగిలిన 10 నెలల్లో ప్రతి నెలా ఎక్కువ పెళ్లి ముహూర్తాలున్నాయి. ముహూర్తాలు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుకూలంగా ఉన్నాయి. నవంబర్, డిసెంబర్‌లలో అయితే ఒక్కో నెలలో ఏకంగా 14 ముహూర్తాలు చొప్పున ఉన్నాయి. – మద్దిరాల మల్లిఖార్జునశర్మ, శ్రీమావుళ్లమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకుడు
Comments
Please login to add a commentAdd a comment