Kodi rammurthy naidu
-
తెలుగువారి బాహుబలి.. ఇనుప కండలు.. ఉక్కు నరాలు!
‘తిండి కలిగితె కండకలదోయ్.. కండకలవాడేనుమనిషోయ్’ అని చెప్పిన మహాకవి గురజాడ నడయాడిన ఉత్తరాంధ్ర నేలపైనే ప్రపంచం మెచ్చిన మల్లయోధుడు కోడిరామ్మూర్తి నాయుడు కూడా తిరుగాడారు. కలియుగ భీముడిగా, ఇండియన్ హెర్క్యులస్గా, మల్లమార్తాండగా ప్రపంచదేశాల్లో భారత కీర్తిప్రతిష్టలు చాటిచెప్పారు. తన భుజ బలంతో పాశ్చాత్యులను నోరెళ్లబెట్టేలా చేశారు. బండరాళ్లను గుండెపై పెట్టి పగలగొట్టించడం, ఒకటిన్నర టన్నుల బరువును గుండెలపై పెట్టించి మోయడం, ఏనుగును ఛాతీపై ఎక్కించుకోవడం వంటి వళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసిన రామ్మూర్తినాయుడు గురించి 20వ శతాబ్దం ఆరంభంలో ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. శరీరానికి కట్టిన ఉక్కు గొలుసులను ఒంటిచేత్తో తెంచేసిన ఆయన బలానికి ఆంగ్లేయులు శభాష్ అన్నారు. ప్రస్తుత పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం కోడి రామ్మూర్తి నాయుడు స్వస్థలం. నేడు ఈ మల్లయోధుడి 142వ జయంతివీరఘట్టం: కోడి రామ్మూర్తినాయుడు 1883 నవంబర్ 3వ తేదీన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు వీరఘట్టంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాడు. తల్లిలేని పిల్లాడు కావడంతో రామ్మూర్తిని తండ్రి వెంకన్ననాయుడు ఎంతో గారాబంగా చూసేవారు. ఈ గారబంతో రామ్మూర్తి నాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా డుమ్మాకొడుతూ వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవాడు. కొడుకును చదివించాలనే దృష్టి ఉన్న వెంకన్న రామ్మూర్తిని విజయనగరంలో ఉన్న తన తమ్ముడు నారాయణ స్వామి ఇంటికి పంపించాడు. అక్కడికి వెళ్లినా రామ్మూర్తి చదువు కంటే వ్యాయామం వైపే మొగ్గు చూపుతుండటంతో పినతండ్రి రామ్మూర్తిని మద్రాస్ పంపి వ్యాయామ కళాశాలలో చేర్పించాడు. తర్వాత విజయనగరంలో తను చదివిన కళాశాలలోనే రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయునిగా బాధ్యతలు స్వీకరించారు. వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యపై పట్టు సాధించారు. ఇలా వ్యాయామం, దేహదారుఢ్యం, యోగ విద్యలను అలవోకగా ప్రదర్శించేవారు. ఇన్ని విద్యలు తెలిసిన రామ్మూర్తి అలానే ఉంటే ఆయన చరిత్ర ఇన్ని మలుపులు తిరిగి ఉండేది కాదు. కొన్నాళ్లకు విజయనగరంంలో రామ్మూర్తి ఒక సర్కస్ కంపెనీ స్థాపించారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఊపిరి బిగబట్టి.. ఉక్కు గొలుసులు తెంపి రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండె మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో మరింత కఠినమైన విన్యాసాలు చేసేవారు. రామ్మూర్తిని ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను ఎంతవేగంగా నడిపించినా అవి కదిలేవి కాదు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆహ్వానం మేరకు రామ్మూర్తినాయుడు పూణె వెళ్లి సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రామ్మూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు.1920 సంవత్సరంలో కార్లను ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతున్న రామ్మూర్తి ప్రదర్శన చూసి బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మింటో ఆశ్చర్యపోయారు. రామ్మూర్తి బృందాన్ని ఇంగ్లండ్ తీసుకెళ్లి బకింగ్‌హాం ప్యాలెస్‌లో ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి ముందుప్రదర్శన ఇప్పించారు. రామ్మూర్తి నాయుడు ప్రదర్శనకు మెచ్చిన ఇంగ్లండ్ రాణి అతనికి ‘ఇండియన్ హెర్క్యులస్’ అనే బిరుదుతో సత్కరించారు. యూరప్‌లో పలు ప్రదర్శనలు ఇచ్చిన రామ్మూర్తినాయుడు అనంతరం జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా సర్కస్ ప్రదర్శనలు ఇచ్చారు. బర్మాలో హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలో స్థిరపడ్డారు. చేతికి ఎముకలేని దాత కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు నిత్య బ్రహ్మచారి. శాఖాహారి, ఆంజనేయస్వామికి పరమ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజచెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు రామ్మూర్తిని పిలిచి మంత్రోపదేశం చేసారని, అప్పటినుంచి ఆయన దైవచింతనలో ఉండేవారని చెబుతారు.ఆ సాధువు నుంచే రామ్మూర్తి జలస్తంభన, వాయుస్తంభన విద్యలు నేర్చుకున్నాడు. సర్కస్ కంపెనీ ద్వారా అప్పట్లోనే లక్షల రూపాయలు సంపాదించిన రామ్మూర్తి భారీగా దానధర్మాలు, విరాళాలు అందించేవారు. భారత స్వాతంత్య్రోద్యమానికి సైతం తనవంతు సాయం అందించారు. జీవిత చరమాంకంలో రామ్మూర్తినాయుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని చుట్టుముట్టాయి. కొంతమంది శిష్యులతో కలిసి ఒడిశాలోని కలహండి సంస్థానాదీశుని పోషణలో ఉండగా 1942 జనవరి 16వ తేదీన రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. ‘కోడి’ బయోపిక్.. కోడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీసేందుకు రెండేళ్ల కిందట కొంత మంది సినిమావాళ్లు వీరఘట్టం గ్రామానికి వచ్చి ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. వారం రోజులు వీరఘట్టంలో ఉండి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సినీ నటుడు దగ్గుబాటి రాణా కోడి రామ్మూర్తిగా నటించనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అనంతరం ఈ విషయంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఆయన ఖ్యాతిని ప్రభుత్వం గుర్తించాలి కోడి రామ్మూర్తినాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటి చెప్పిన అటువంటి మహానుభావుని చరిత్రను భారత ప్రభుత్వం గుర్తించాలి. రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర ఎందరికో ఆదర్శం. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి కుటుంబ సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నార్త్ కరోలిన్, అమెరికాపాఠ్యాంశంగా చేర్చాలి 1985–1995 మధ్య కాలంలో కోడి రామ్మూర్తినాయుడు జీవిత చరిత్రపై తెలుగులో ఒక పాఠ్యాంశం ఉండేది. కాలక్రమేణ సిలబస్ మారడంతో దాన్ని తొలగించారు. ఇటువంటి మహానుభావుల జీవిత చరిత్రలు విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. – ఎస్.వి.ఎల్.ఎన్ శర్మయాజీ, యజ్ఞకర్త, వీరఘట్టం -
బ్రిటన్ మెచ్చిన బలాఢ్యుడు: కోడి రామమూర్తి
‘కండగలవాడే మనిషోయ్’ అన్న గురజాడవారి భావనకి నిలువెత్తు రూపం కోడి రామమూర్తి నాయుడు. ఈ బలాఢ్యుడిని చూసి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ కూడా సంబరపడింది. రామమూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో ఆయన విన్యాసాలు మరింత కఠినమైనవి. రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతి మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆహ్వానం మేరకు రామమూర్తి పుణె వెళ్లి సర్కస్ ప్రదర్శన నిర్వహించారు. రామమూర్తి ప్రతిభను చూసి విస్తుపోయిన తిలక్ ఆయనకు ‘మల్ల మార్తాండ’ అనే బిరుదును ఇచ్చి సత్కరించారు. వైస్రాయ్ లార్డ్ మింటో కారణంగా రామమూర్తి ఖ్యాతి దేశవ్యాప్తమైందని చెబుతారు. అంటే 1919–1920 ప్రాంతమన్నమాట. కారును ముందుకు వెళ్లకుండా గొలుసులతో పట్టి ఆపుతూ రామమూర్తినాయుడు చేసే ప్రదర్శనను మింటో చూశాడు. వైస్రాయ్ స్వయంగా కితాబిస్తే ఇంకేముంది? కొన్ని వందల మంది సభ్యులు ఉన్న తన సర్కస్ బృందం రామమూర్తి యూరప్ ఖండానికి వెళ్లారు. ఇంగ్లండ్ రాణి, అప్పటి రాజు ఐదో జార్జ్ చక్రవర్తి బకింగ్‌హ్యామ్ ప్యాలెస్ ప్రాంగణంలోనే ఈ భారతీయుడి చేత ప్రదర్శన ఏర్పాటు చేయించారు. ప్యాలెస్‌లో విందు చేసి, సత్కరించి ‘ఇండియన్ హెర్క్యులిస్’ అన్న బిరుదు ఇచ్చారు. తరువాత ఆసియాలో జపాన్, చైనా, బర్మా దేశాలలో కూడా ఆయన సర్కస్ ప్రదర్శించారు. బర్మాలో ఆయన మీద హత్యాయత్నం జరగడంతో వెంటనే భారతదేశానికి వచ్చేశారు. బహుశా ఈర‡్ష్య వల్ల ఆయనను చంపాలని అక్కడి వాళ్లు అనుకుని ఉండవచ్చు. సర్కస్ ద్వారా ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు గడించారాయన. అందులో చాలా వరకు విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా భారత స్వాతంత్యోద్య్రమానికి తన వంతు ఆర్థిక సాయం చేశారు. ఒంటి నిండా శక్తి. దేశ విదేశాలలో కీర్తి. అయినా రామమూర్తినాయుడు అనే ఆ మల్లయోధుడు జీవిత చరమాంకంలో అనారోగ్యమనే సమస్యతో పోరాడాడు. బహుశా అందులో మాత్రం ఆయన అపజయం పాలయ్యారేమో! ఆయన ఒరిస్సాలోని కలహండి సంస్థానాధీశుని పోషణలో ఉన్నప్పుడు దాదాపు 1942 జనవరి 16 న అనామకంగా కన్నుమూశారు. రామమూర్తిగారు పూర్తి శాకాహారి. గురజాడ వారు తిరగాడిన ఉత్తరాంధ్రలోనే కోడి రామమూర్తి 1882 ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం. ఊరి పేరే కాదు, ఆయన ఇంటి పేరుకు కూడా ఒక ఘనత ఉంది. కోడి వంశం మల్లయోధులకు ప్రసిద్ధి. -
Kodi Rammurthy Naidu: తెరపైకి కలియుగ భీముడు
వీరఘట్టం: మల్ల మార్తాండ, కళియుగ భీముడు, ఇండియన్ హెర్క్యులస్గా ప్రపంచ దేశాల్లో భారత దేశ కీర్తిని చాటి చెప్పిన సిక్కోలు ముద్దు బిడ్డ కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర వెండితెరపై రావడానికి సిద్ధమవుతోంది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, హీరోలు, రచయితలు కోడి రామ్మూర్తినాయుడు కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. ఆయన స్వగ్రామం వీరఘట్టంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు విషయాలు వివరించారు. వీరఘట్టంకు చెందిన కోడి వెంకన్ననాయుడు, అప్పలకొండ దంపతులకు 1883 నవంబర్ 3న రామ్మూర్తినాయుడు జన్మించారు. చిన్నతనంలో తల్లిని కోల్పోయిన రామ్మూర్తిని తండ్రి ఎంతో గారాబంగా చూసేవారు. రామ్మూర్తినాయుడు బాల్యంలో బడికి వెళ్లకుండా వీరఘట్టంకు సమీపంలో ఉన్న రాజ చెరువు వద్దకు రోజూ వెళ్లి వ్యాయామం చేస్తుండేవారు. దీంతో బాల్యంలోనే కొడుకుని చదువు కోసం తండ్రి వెంకన్న వీరఘట్టం నుంచి విజయనగరంలోని పినతండ్రి నారాయణస్వామి ఇంటికి పంపించేశారు. విజయనగరంలో కూడా చదువు కంటే వ్యాయామంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతూ మల్లయుద్ధం పోటీల్లో పాల్గొనేవారు. ఇక రామ్మూర్తికి చదువు అబ్బదని గ్రహించిన పిన తండ్రి రామ్మూర్తిని మద్రాసు పంపించి వ్యాయామ కళాశాలలో చేర్పించారు. తర్వాత వ్యాయామ ఉపాధ్యాయునిగా నాయుడు విజయనగరంలో తాను చదివిన కళాశాల్లోనే పీడీగా చేరారు. కోడి రామ్మూర్తి విగ్రహం వద్ద ఆయన వారసులు బహుముఖ ప్రజ్ఞాశాలి.. రామ్మూర్తి నాయుడు వ్యాయామ విద్యను బోధిస్తూనే వాయు స్తంభన, జలస్తంభన విద్యలను ప్రదర్శించేవారు. ఇలా వ్యాయామ, దేహదారుఢ్యం, యోగా విద్యలను అలవోకగా చేసేవారు. తర్వాతి కాలంలో ఆయన విజయనగరంలో ఓ సర్కస్ కంపెనీ మొదలుపెట్టారు. ఇది ఆయన పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. రామ్మూర్తి తన 20 ఏళ్ల వయసులోనే గుండెల మీద ఒకటిన్నర టన్ను బరువును మోసి చూపించేవారు. సర్కస్‌లో విన్యాసాలు మరింత కఠినమైనవి. ఆయనను ఉక్కు గొలుసులతో బంధించేవారు. ఊపిరితిత్తుల నిండా గాలి పూరించి, ఆ గొలుసులను తెంచేవారు. వీరఘట్టంలో రామ్మూర్తినాయుడు జన్మించిన గృహం ఇదే రెండు కార్లకు గొలుసులు కట్టి, వాటిని తన భుజాలకు తగిలించుకునేవారు. కార్లను వేగంగా నడిపించేవారు. అయినప్పటికీ అవి కదిలేవి కావు. ఏనుగును ఛాతీ మీద ఎక్కించి దాదాపు ఐదు నిమిషాలు నిలిపేవారు. అందుకే ఆయన సర్కస్‌కు విశేషమైన ఆదరణ ఉండేది. ఆసియాలోని జపాన్, చైనా, బర్మా దేశాల్లో కూడా రామ్మూర్తినాయుడు ప్రదర్శనలు ఇచ్చి భారతదేశ కీర్తిని చాటిచెప్పారు. బర్మాలో ఆయనపై హత్యాయత్నం జరగడంతో విదేశీ ప్రదర్శనలను నిలిపివేసి స్వదేశంలోనే స్థిరపడ్డారు. బ్రహ్మచారి.. కండల వీరుడు కోడి రామ్మూర్తినాయుడు బ్రహ్మచారి. శాకాహారి అయిన ఆయన ఆంజనేయ భక్తుడు. చిన్నతనంలో వీరఘట్టం సమీపంలోని రాజ చెరువు వద్ద వ్యాయామం చేస్తున్న సమయంలో ఓ సాధువు ఆయనను చూసి పిలిచి మంత్రోపదేశం చేశారట. అప్పటి నుంచి రామ్మూర్తికి దైవచింతన కలిగిందని స్థానికులు చెబుతారు. కుదిరిన అగ్రిమెంట్.. ఇలాంటి మహాబలుని జీవిత గాథ తెరపై ఎక్కించేందుకు ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు వీరఘట్టం వచ్చి ఇక్కడ రామ్మూర్తినాయుడు సంచరించిన ప్రదేశాలను, నివాస గృహాన్ని పరిశీలించా రు. అలాగే విజయనగరంలో రామ్మూర్తినాయుడు చదువుకున్న కళాశాలను, పనిచేసి నివాసం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి రామ్మూర్తినాయుడి జీవిత చరిత్ర తీసేందుకు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నారు. మా చిన్న తాత.. కోడి రామ్మూర్తి నాయుడు మా చిన్నతాతయ్య. నేను 1947లో పుట్టాను. అప్పటికే ఆయన చనిపో యారు. అప్పటిలో ఆయన గొప్పతనం మాకు తెలియలేదు. నేను పెద్దయ్యా క ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్నాను. టీచర్‌గా రిటైరై ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. ఇటీవల సినిమా వాళ్లు సంప్రదింపులు చేశారు. మా తాతయ్య జీవిత చరిత్ర సినిమా గా తీస్తామంటే పూర్తిగా ఆయన చరిత్ర వివరించాం. – కోడి కైలాసరావు, రామ్మూర్తినాయుడి మనవడు, రిటైర్డ్ టీచర్, హైదరాబాద్ అమెరికాలోనూ.. కోడి రామ్మూర్తి నాయుడంటే అమెరికాలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రవాసాంధ్రులందరికీ ఆయన గురించి తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర వెండితెరపై చూపించేందుకు సినీ ప్రముఖులు మా కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. మరి కొద్ది రోజుల్లో ఆయన జీవిత చరిత్ర సినిమా ద్వారా ప్రపంచ నలుమూలలా తెలియనుండడం ఎంతో ఆనందంగా ఉంది. – కోడి రాజశేఖర్, రామ్మూర్తినాయుడి ముని మనవడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్, అమెరికా సాహసాలు విన్నాం.. రామ్మూర్తినాయుడు మా చిన్న తాతయ్య. మా చిన్నతనంలో ఆయన విన్యాసాలు, సాహసాల గురించి విన్నాం. నేను ఆయనను చూడలేదు. మా నాన్న చెప్పేవారు. ఇటీవల ఓ సినీ సంస్థ వారు వచ్చారు. జీవిత చరిత్ర తీస్తామంటే మా కుటుంబం అంతా అంగీకరించాం. ఎప్పుడు సినిమా మొదలవుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. – కోడి వెంకటరావునాయుడు, రామ్మూర్తినాయుడి మనవడు, వీరఘట్టం -
మల్లయోధునిగా...
ఆరడుగుల ఆజానుబాహుడు, ధైర్యవంతుడు, బలం ఉన్నవాడు పోరాటానికి సిద్ధపడితే శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి ఫిజిక్‌నే మెయింటైన్ చేస్తుంటారు హీరో రానా. కామన్ రోల్స్‌తో పాటు రాజులు, యోధుల పాత్రలకు కూడా రానా కరెక్ట్‌గా సరిపోతారు. ఆయన గత చిత్రాలే అందుకు నిదర్శనం. ‘బాహుబలి’ సినిమాలో రానా పోషించిన ‘భల్లాలదేవ’ పాత్రను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇప్పుడు ప్రముఖ మల్లయోధుడు ‘ఇండియన్ హెర్క్యూలెస్, కలియుగ భీమ’ అనే బిరుదుల గ్రహీత ‘కోడి రామ్మూర్తి నాయుడు’ పాత్రలో రానా నటించనున్నారు. అంటే మల్లయోధునిగా భల్లాలదేవ కనిపించనున్నారన్నమాట. సౌత్‌కి చెందిన ఒక అగ్రనిర్మాణ సంస్థతో పాటు, ఓ ప్రముఖ అంతర్జాతీయ నిర్మాణ సంస్థ కలిసి ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందుకోసం ఒక అగ్ర దర్శకునితో సంప్రదిస్తున్నారట. అన్నీ కుదిరితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని టాక్. -
మల్లయోధుడి బయోపిక్‌లో బాహుబలి స్టార్
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. వరుసగా ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే విడుదలైన మహానటి, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహా రెడ్డి, బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు జాబితాలోకి మరో చిత్రం రాబోతోంది. దగ్గుబాటి రానా హీరోగా దక్షిణ భారత మహామల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థతో పాటు, అంతర్జాతీయ నిర్మణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈ కథను రైటర్స్ అసోషియేషన్‌లో రిజిష్టర్ చేయించారు. మల్లయోధుడికి నివాళిగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక కోడి రామ్మూర్తి నాయుడు విషయానికొస్తే.. సుమారు 5వేలకు పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు. అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా 'ఇండియన్ హెర్క్యూలెస్', 'కలియుగ భీమ' బిరుదులతో రామ్మూర్తి నాయుడుని సత్కరించారు. గోదాలో ఈయన ప్రదర్శించిన పరాక్రమం, భారత దేశ స్వాతంత్ర్యోద్యమానికి స్పూర్తి రగిల్చింది. -
తెలుగు 'సుల్తాన్' రానా..?
హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువనటుడు రానా. హీరో, విలన్ అన్న తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ఆకట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.., ఓ పాత్ర మీద మనసు పారేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లు చేసిన మల్లయోధుల తరహా పాత్రను తాను కూడా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించింది. అదే సమయంలో అమీర్ హీరోగా తెరకెక్కిన దంగల్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు నిజ జీవిత కథలతో తెరకెక్కినవే. రెండు సినిమాల్లోనూ హీరోలు మల్లయోధులుగానే కనిపిస్తున్నారు. దీంతో అదే తరహా పాత్ర చేసేందుకు ఈ టాలీవుడ్ కండల వీరుడు ఆసక్తి కనబరుస్తున్నాడు. కుస్తీ పోటిల్లో కలియుగ భీమగా పేరు తెచ్చుకున్న విజయనగరానికి చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తే అందులో నటించేందుకు తాను సిద్ధమంటూ ప్రకటించాడు రానా. రానానే స్వయంగా చేస్తానంటే దర్శక నిర్మాతలు ఊరుకుంటారా. త్వరలోనే రానా లీడ్ రోల్ లో కలియుగ భీమ పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.