సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్‌లో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. వరుసగా ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇటీవలే విడుదలైన మహానటి, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సైరా నరసింహా రెడ్డి, బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు జాబితాలోకి మరో చిత్రం రాబోతోంది. దగ్గుబాటి రానా హీరోగా దక్షిణ భారత మహామల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని దక్షిణాదికి చెందిన ఓ అగ్ర నిర్మాణ సంస్థతో పాటు, అంతర్జాతీయ నిర్మణ సంస్థలు సంయుక్తంగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఈ కథను రైటర్స్ అసోషియేషన్‌లో రిజిష్టర్ చేయించారు.
మల్లయోధుడికి నివాళిగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో నిర్మించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఓ ప్రముఖ దర్శకుడితో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని అనుకున్నట్టు జరిగితే అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక కోడి రామ్మూర్తి నాయుడు విషయానికొస్తే.. సుమారు 5వేలకు పైగా పోటీల్లో ఓటమనేదే ఎరుగని మహా మల్లయోధుడు. అప్పట్లో కింగ్ జార్జ్ స్వయంగా 'ఇండియన్ హెర్క్యూలెస్', 'కలియుగ భీమ' బిరుదులతో రామ్మూర్తి నాయుడుని సత్కరించారు. గోదాలో ఈయన ప్రదర్శించిన పరాక్రమం, భారత దేశ స్వాతంత్ర్యోద్యమానికి స్పూర్తి రగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment