
ఒడిశాలో ల్యాండ్ అయ్యారు మహేశ్‌బాబు. ఎందుకంటే సినిమా షూటింగ్ కోసం. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫారెస్ట్ అడ్వెంచరస్ ఫిల్మ్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైంది. నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చిత్రయూనిట్ ఒడిశాలోని కోరాపుట్ ప్రాంతానికి వెళ్లిందని తెలిసింది. దాదాపు ఇరవై రోజుల వరకు ఈ సినిమా చిత్రీకరణ అక్కడే జరుగుతుందని సమాచారం.
గత ఏడాది డిసెంబరు నెల చివర్లో ఒడిశా వెళ్లి, అక్కడి ఫారెస్ట్ లొకేషన్స్‌ని రాజమౌళి పరిశీలించారు. బుధవారం ఒడిశా వెళ్లారు. దీంతో ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌ల చిత్రీకరణ కూడా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ప్రముఖ నటి–నిర్మాత ప్రియాంకా చోప్రా మలయాళ దర్శక–నిర్మాత–నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని, తొలి భాగం 2027లో విడుదలయ్యే అవకాశం ఉందని భోగట్టా.
Comments
Please login to add a commentAdd a comment