koraput
-
లోయలు.. సొరంగాల్లోంచి ప్రయాణం.. సూపర్ లొకేషన్స్.. ఎక్కడంటే!
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అద్భుతమైన ప్రకృతి అందాలు, ఎత్తయిన, పచ్చని కొండలు, వీటిని మించి మరపురాని సొరంగ మార్గాల ద్వారా ప్రయాణాన్ని ఆస్వాదించాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం.. మన పక్కనే ఉన్న ఒడిశాలోని కోరాపుట్‌కు వెళ్తే చాలు.. ఈ అనుభూతులన్నీ మీ సొంతమతాయి. అవేమిటో.. ఈ రూట్ విశేషాలను పర్యాటక ప్రేమికుల కోసం ప్రత్యేకం.. కే–ఆర్ (కోరాపుట్–రాయగడ) రైల్వే లైన్ వాల్తేర్ డివిజన్‌కు ప్రధానంగా ఆదాయాన్నిచ్చే కిరండూల్, బచేలిలో ఉన్న ఐరన్ ఓర్ రవాణా మార్గానికి ప్రత్యామ్నాయంగా వేరే లైన్‌ను ఏర్పాటుచేసి ఈ సరకు రవాణాను మరింతగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశ్యంతో 1980లలో కోరాపుట్ – రాయగడ (కే–ఆర్) లైన్‌ను ప్రారంభించగా.. 1993–92మధ్య ఈ లైన్ పూర్తయింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు 1995 అక్టోబర్ 31న ప్రారంభించారు. కోరాపుట్ నుంచి రాయగడకు మొత్తం 167 కిలోమిటర్ల మేర ఈ లైన్ ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో మొత్తం 36 సొరంగాలు, 76 ప్రధాన వంతెనలు, 180 అందమైన మలుపులు ఉన్నాయి. అప్పట్లో ప్రధానంగా ఈ మార్గం వైజాగ్ స్టీల్‌ప్లాంట్, వైజాగ్ పోర్ట్ ట్రస్ట్‌లకు అసవరమైన ఐరన్‌ఓర్‌ను రవాణాను పెంచేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా వినియోగించేవారు. పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి ఈ మార్గంలో అల్యూమినా పౌడర్ సరఫరా చేసే నాల్కో, ఉత్కళ్ అల్యూమినా, వేదాంత, జేకే పేపర్, ఇంఫా (ఇండియా మెటల్ అండ్ ఫెర్రో అల్లాయ్), హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ వంటి పరిశ్రమలకు ఎంతో అనుకూలంగా ఈ మార్గం ఉండేది. ప్రస్తుతం ఈ మార్గంలో రెండో లైన్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం 2015–16లో రూ.2500 కోట్లు బడ్జెట్ మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026నాటికి రెండోలైన్ పూర్తి చేయనున్నారు. పర్యాటక, పుణ్యక్షేత్రాల సమాహారం... ఆంధ్రా, ఒడిశా సదరన్ డివిజన్లో ప్రసిద్ధిచెందిన మజ్జిగైరమ్మ ఆలయం రాయగడ ప్రాంతంలోనే ఉంది రాయగడకు కేవలం 50కి.మీల దూరంలో చిత్రకోన వాటర్ ఫాల్స్ తెరుబలిలో గల ఇంఫా ప్యాక్టరీ వద్ద ప్రసిద్ధి చెందిన లక్ష్మీనారాయణ ఆలయం కోరాపుట్‌లో రాణి డుడుమ వాటర్‌ఫాల్స్, జగన్నాథస్వామి ఆలయం గుప్తేశ్వర గుహలు డియోమలి హిల్స్ కూడా కోరాపుట్ ప్రాంతంలోనే ఉన్నాయి. కోరాపుట్లోనే కోలాబ్ రిజర్వాయర్ కూడా ఉంది. గుహల్లో, వంతెనలపై మరపురాని ప్రయాణం ఈ మార్గంలో సొరంగాలలో నుండి రైలు దూసుకుపోతుంటే ఆ అనుభూతులే వేరు. సుమారు 36 చిన్న, పెద్ద సొరంగాలు. ఈ మార్గంలోనే రౌలీ స్టేషన్‌కు సమీపంలో తూర్పుప్రాంతంలోనే అత్యంత పొడవైన సొరంగమార్గం ఉంది. దీని పొడవు 1,599 మీటర్లు (1.59 కిలోమిటర్లు). ప్రకృతి సోయగాలు, లోతైన, ఎత్తైన కొండలపై ప్రయాణం. సముద్రమట్టానికి ఆరువేల అడుగుల ఎత్తులో కోరాపుట్ రైల్వే స్టేషన్. అందమైన వంతెనలు ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ మార్గంలో ఉన్నాయి. సాధారణంగా అరకు, బొర్రాగుహలుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వెళ్తుంటారు, కానీ ఒకసారి ఈ ప్రాంతాలను సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. వెలుగులోకి తీసుకువచ్చిన వాల్తేర్ డివిజన్ కోరాపుట్–రాయగడ రైల్వే మార్గం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. వాల్తేర్ డివిజన్‌కు డివిజనల్ రైల్వే మేనేజర్ గా వచ్చిన అనూప్‌కుమార్ సత్పతి అతి తక్కువ సమయంలో ఈ మార్గంలో పర్యటించి, తనిఖీలు చేసి దీనిని పర్యాటకులకు పరిచయం చేశారు. ఈ మార్గంలో పర్యాటకుల కోసం తొలిసారిగా విస్టాడోమ్ కోచ్‌ను జతచేశారు. వారానికి మూడుసార్లు నడిచే విశాఖపట్నం–కోరాపుట్ స్పెషల్ ప్యాసింజర్ రైలుకు ఈ విస్టాడోమ్ కోచ్ జతచేస్తున్నారు. (క్లిక్ చేయండి: అడవుల్లోనూ ఆహార పంటలు) 20 ఏళ్ల తరువాత ప్రెస్‌టూర్... దాదాపు 20 ఏళ్ల తరువాత వాల్తేర్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ మార్గంలో శనివారం ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో గల ప్రముఖ పాత్రికేయులకు ప్రెస్టూర్ను ఏర్పాటుచేశాం. బహుశా కొద్ది డివిజన్లు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తాయి. ఈ టూర్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెందిన పర్యాటకరంగ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రత్యేక ప్యాకేజీలు పరిచయం చేస్తే బాగుంటుంది. – అనూప్ కుమార్ సత్పతి, డీఆర్ఎం అద్భుతంగా ఉంది మొదటిసారిగా ఈ ప్రాంతాలను సందర్శించా. విస్టాడోమ్కోచ్లో ప్రయాణించడం కూడా మరచిపోలేని అను భూతి. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తనతో పాటు మార్కెటింగ్ డివిజన్ నుంచి కృష్ణమోహన్, రాజేంద్రరావు, లోకనాథరావు కూడా ఈ టూర్లో పాల్గొన్నారు. – కె హరిత, డివిజనల్ మేనేజర్, ఏపీ టూరిజం -
కొబ్బరికాయల లోడు ట్రక్కులో గంజాయి.. రూ.81 లక్షల విలువైన సరుకు
సాక్షి,, భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలో గంజాయి రవాణా ముఠా రోజుకో కొత్త మార్గాలు వెతుకుతున్నారు. అధికారుల కళ్లు గప్పి, పెద్ద ఎత్తున సరుకు ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొబ్బరికాయల లోడు మధ్య ట్రక్కులో తీసుకు వెళ్తున్న సుమారు 16క్వింటాళ్ల గంజాయిని జయపురం ఎక్సైజ్ పోలీసులు శనివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఎక్సైజ్ ఎస్పీ మనోజ్‌కుమార్ సెఠి ఆదివారం వెల్లడించారు. గంజాయి రవాణా అవుతుందనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బంటువ, ఎస్ఐ దిలీప్‌కుమార్ రథ్‌తో కూడిన ప్రత్యేక బృందం జయపురం వైపు వెళ్తున్న ట్రక్కును గమనించారు. వారిచ్చిన ఆనవాళ్ల ఆధారంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దుర్భదల్ బిశ్వాల్, ఆఫీస్ ఇన్చార్జి సంజయ్‌కుమార్ కండి, ఏఎస్ఐ ఎం.లక్ష్మణరావు, మాధవేశ్ మహంతి, సిబ్బంది జయపురం ఘాట్ రోడ్డులో మాటు వేశారు. అతి వేగంగా వస్తున్న ట్రక్కుని నిలువరించి, సోదా చేయగా.. అందులో 100 బస్తాల కొబ్బరి కాయలతో పాటు 150 గంజాయి బస్తాలు బయటపడ్డాయి. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ.81 లక్షలు ఉంటుందని వెల్డించారు. ఘటనకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన డ్రైవర్ ప్రభు యాదవ్(35)ను అరెస్ట్ చేసినట్లు వివరించారు. మల్కన్‌గిరి: గంజాయితో పోలీసుల అదుపులో నిందితులు పద్మపూర్‌లో 3 క్వింటాళ్లు.. రాయగడ: జిల్లాలోని పద్మపూర్ పోలీసులు రూ.15 లక్షల విలువైన 3క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన యష్‌బీర్ సింగ్(60), పన్నాలాల్ బాస్‌దేవ్(57)ను అరెస్ట్ చేశారు. పద్మపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరిడిగుడ వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు రాయగడ వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేశారు. క్రిమిసంహారక మందు సరఫరా చేసే డ్రమ్ముల్లో 300 కిలోల గంజాయిని గుర్తించారు. దీంతో లారీతో పాటు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్ట్ చేసి, కోర్టుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. నలుగురి అరెస్ట్.. మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి మంత్రిపూట్ గ్రామం వద్ద చిత్రకొండ పోలీసులు శనివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా, 253 కిలోల గంజాయిని గుర్తించారు. దీనిని బీహార్‌కు తరలిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి జిల్లాలోని ఎంవీ–38 గ్రామానికి చెందిన ప్రకాష్ సర్దార్, బీహర్‌కు చెందిన సునీల్‌కుమార్, హరేంద్రకుమార్, విజేంద్రకుమార్ లను అరెస్ట్ చేశారు. నిందితులకు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, కోర్టులో హాజరు పరుస్తామని ఎస్డీపీఓ అన్షుమాన్ ద్వివేది తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని వివరించారు. -
కోరాపుట్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు విస్టాడోమ్ కోచ్
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ప్రయాణికుల, పర్యాటకుల డిమాండ్ దృష్ట్యా మరిన్ని రైళ్లకు విస్టాడోమ్ కోచ్‌లను జత చేసే దిశగా వాల్తేర్ డివిజన్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విశాఖపట్నం–కోరాపుట్–విశాఖపట్నం మధ్య నడిచే స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మూడునెలల పాటు ఐసీఎఫ్ విస్టాడోమ్ కోచ్‌ను జత చేయాలని ఈస్ట్‌కోస్ట్ రైల్వే నిర్ణయించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె. త్రిపాఠి ప్రకటనలో తెలిపారు. ∙ప్రతీ సోమ, బుధ, శని వారాలలో విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం–కోరాపుట్ (08546)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 9వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు, తిరుగు ప్రయాణంలో కోరాపుట్‌లో ప్రతీ మంగళ, గురు,ఆది వారాలలో బయల్దేరే కోరాపుట్–విశాఖపట్నం(08545)స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌కు మే 10వ తేదీ నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు ఈ కోచ్‌ను జత చేయనున్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అద్దాల పెట్టెల్లో నుంచి కొండల మీదుగా సాగే ప్రయాణ అనుభూతిని పొందాలని డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి కోరారు. (క్లిక్: సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి') -
విశాఖ – కోరాపుట్ ప్యాసింజర్ పునఃప్రారంభం
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి అశ్వినివైష్టవ్ శుక్రవారం కోరాపుట్ స్టేషన్లో జెండా ఊపి పునః ప్రారంభించారు. అనంతరం ఇదే రైలులో ఈ మార్గంలో స్పెషల్ బోగీలో విండో ఇన్స్పెక్షన్ చేశారు. గతంలో విశాఖపట్నం – కోరాపుట్ – విశాఖపట్నం మధ్య నడిచే డైలీ ప్యాసింజర్ రైలును కరోనా కారణంగా నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజల విజ్ఞప్తి మేరకు పునః ప్రారంభించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించిందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. శనివారం నుంచి విశాఖపట్నం–కోరాపుట్(08538), ఆదివారం నుంచి కోరాపుట్–విశాఖపట్నం (08537) రైళ్లు పాత టైమింగ్స్ ప్రకారమే నడువనున్నాయి. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విశాఖపట్నం–నిజాముద్దీన్–విశాఖపట్నం సమతా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం –నిజాముద్దీన్–విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లు త్వరలో పూర్తిస్థాయిలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుస్తాయని తెలిపారు. సమ్మలేశ్వరి ఎక్స్‌ప్రెస్, హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్, జగదల్పూర్–రూర్కెలా–జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్‌లకు లఖింపూర్ రోడ్‌ను అదనపు హాల్ట్‌గా అంగీకరించామన్నారు. ఇదే విధంగా విశాఖపట్నం – కిరండూల్ –విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌కు బచేలిలో అదనపు హాల్ట్ కేటాయించనున్నట్లు తెలిపారు. (క్లిక్: సికింద్రాబాద్– కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు) -
విధులకు వెళ్తూ మృత్యు ఒడిలోకి..
సాక్షి, ఒడిశా(కొరాపుట్): జిల్లాలోని సిమిలిగుడ పట్టణ ప్రధాన రహదారి ఆనుకుని ఉన్న 26వ నంబరు జాతీయ రహదారిలో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సిమిలిగుడకు చెందిన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ పండా(40) మృతి చెందారు. ఉప్పర మనియా గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె ఉదయం విధుల నిమిత్తం స్కూటీపై పాఠశాలకు వెళ్తుండగా, దుర్ఘటనకు గురైంది. రోడ్డుకు అడ్డంగా కొన్ని ఆవులు రావడంతో వాటి నుంచి తప్పించుకునే క్రమంలో అదుపుతప్పి ఆమె కిందపడిపోయారు. అదే సమయంలో విశాఖపట్నం నుంచి రాయ్‌పూర్‌కు వెళ్తున్న ఓ కంటైనర్ ఆమెపై నుంచి దూసుకుపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కంటైనర్ డ్రైవర్ని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వహ్వా రాజేశ్.. ముంజేతిపై ఆపకుండా..
కొరాపుట్/ ఒడిశా: పుష్ అప్స్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకునేందుకు కొరాపుట్‌కు చెందిన యువకుడు పట్టుదలతో సాధన చేస్తున్నాడు. స్థానిక నవభారత్ కాలనీకి చెందిన దేబేంద్రనాథ్ పరిఛ కుమారుడు రాజేష్‌కుమార్ పరిఛ 30 సెకన్లలో ముంజేతిపై ఒకేసారి ఆగకుండా 79 పుష్–అప్స్ తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక ఇప్పటి వరకు ముంజేతిపై ఆపకుండా 135 పుష్–అప్స్ తీసిన వ్యక్తి పేరుతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఉండగా.. రాజేష్ పరిఛ 150 పుష్–అప్స్ తీసుకున్నాడని అతని కోచ్ సిమాంచల్ మిశ్రో తెలిపారు.అదే విధంగా, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసినట్లు చెప్పారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రాజేష్‌కుమార్ పరిఛ ఆదివారం తన క్రీడా విన్యాసాలు ప్రదర్శించి ఔరా అనిపించాడు. ముంజేతిపై ఒకే పర్యాయంలో 170 పుష్–అప్స్ తీసేలా సాధన చేస్తున్నానని, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవడమే తన ధ్యేయమని రాజేష్ మీడియా ప్రతినిధులతో అన్నారు. చదవండి: రహదారుల నిర్మాణంలో ప్రపంచ రికార్డు రూబిక్ క్యూబ్‌తో ప్రపంచ రికార్డు! -
తిరస్కరించిందనే కోపంతో క్రూరంగా..
భువనేశ్వర్ : తన క్రూరవాంఛను తిరస్కరించిందనే కోపంతో టీనేజర్‌ను హతమార్చాడో కసాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తన క్లాస్‌మేట్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కోరాపూట్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు... బాధితురాలు(17) సెమిలిగూడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో డిప్లొమా చదువుతోంది. ఈ క్రమంలో గోపీనాథ్ ఖరా(18) కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. తన కోరిక తీర్చాలంటూ మానసిక వేదనకు గురిచేసేవాడు. ఇందుకు బాధితురాలు తిరస్కరించడంతో కక్షగట్టిన.. గోపీనాథ్ ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా గత నెల 31న ఎవరూలేని సమయంలో బాధితురాలి ఇంట్లో చొరబడిన గోపీనాథ్.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో గత పదిరోజులుగా కటక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం మృతిచెందింది. దీంతో గోపీనాథ్‌ను అదుపులోకి తీసుకుని.. విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఒడిశాలో ఎదురుకాల్పులు
కొరాపుట్/చర్ల: ఒడిశాలోని కొరాపుట్ జిల్లా పాడువ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల బడెల్ అటవీ ప్రాంతంలో బుధవారం మావోయిస్టులు, జవాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొరాపుట్ ఎస్పీ డాక్టర్ కన్వర్ విశాల్ సింగ్ బుధవారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బుధవారం మ«ధ్యాహ్నం 2.45 గంటలకు కిటుబ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్ఓజీ, డీవీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా బడెల్ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారని, దీంతో ఉభయపక్షాల మధ్య సుమారు గంటసేపు ఎదురుకాల్పులు జరిగాయని తెలిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు సహా ఐదుగురు హతమైనట్లు వెల్లడించారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన మొత్తం 4 రైఫిల్స్ ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల్లో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య కేసులో నిందితురాలైన ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన స్వరూప ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు మృతి ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఆర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఒకరి మృతదేహాన్ని మావోయిస్టులు తీసుకెళ్లగా, మహిళా మావో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏవోబీలో భారీ ఎన్కౌంటర్
సాక్షి, భువనేశ్వర్: ఆంధ్రా-ఒడిశా (ఏవోబీ) సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో హతమైన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ఘటనలో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటువాకంటి గ్రామం వద్ద బుధవారం జరిగింది. దీంతో ఏజెన్సీలో గ్రామాలు ఉల్లిక్కిపడ్డాయి. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జరిపినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఘటనా స్థలం నుంచి విప్లవ సాహిత్యంతో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, రెండు ఇన్సాస్ ఆయుధాలు, పెద్దమొత్తం వస్తువులులో స్వాధీనం చేసుకున్నారు. -
ప్రత్యక్ష రాజకీయాల్లోకి.. ఇందిరా నందో ప్రవేశం..?
ఒడిశా, జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి రవినారాయణ నందో సతీమణి డాక్టర్ ఇందిరా నందో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై సాగుతున్న చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె బీజేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వందలాదిమంది మహిళలతో ర్యాలీలో పాల్గొనడంతో ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో మహిళలు రాజకీయాలపైపు మొగ్గు చూపుతున్నారు. జయపురం మహిళలకు రిజర్వ్ చేస్తే..? అవిభక్త కొరాపుట్‌లో గల 14 అసెంబ్లీ స్థానాలలో కేవలం జయపురం ఒక్కటే జనరల్ స్థానం. అందుచేత జయపురం స్థానాన్ని మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇందిరా నందో రాజకీయ నేత రవినందోను వివాహమాడినా ఎన్నడూ రాజకీయాలలోకి అడగిడ లేదు. ఎనిమిదేళ్ల కిందట ఆమె కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా రాజకీయాల జోలికి వెళ్లిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. అయితే ఆమె బుధవారం రాష్ట్ర అధికార పార్టీ బీజేడీ వ్యవస్థాపక దినోత్సవాల్లో వందలాది మంది మహిళలకు నేతృత్వం వహించి భారీ ర్యాలీలోపాల్గొన్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన బీజేడీ మహిళా సమారోహంలో ఒక సారి పాల్గొన్నారు. అయితే ఆమె బుధవారం వందలాది మంది మహిళలకు సారథ్యం వహించి పాల్గొనడం వెనుక ఉన్న రాజకీయం ఏమిటా? అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తు యోచనతోనే..! ఒకవేళ జయపురం విధానసభ నియోజక వర్గాన్ని మహిళలకు కేటాయిస్తే అప్పుడు చక్రం తిప్పేందుకే ఆమె నేడు పార్టీ జెండాతో మహిళలకు నేతృత్వం వహించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో జయపురం నియోజక వర్గం మహిళలకు కేటాయిస్తారన్న అభిప్రాయాలు వినిపించినా అది జరగలేదు. నేడు జయపురం నియోజక వర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్థానం మహిళలకు రిజర్వ్ చేయవచ్చన్న అభిప్రాయలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగవచ్చని, అందుచేతనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారని రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా నేడు ఇందిరా నందో ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై రాజకీయ చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి. -
‘నైతిక హక్కు కోల్పోయా.. అందుకే రాజీనామా’
భువనేశ్వర్ : అత్యాచార బాధితురాలికి న్యాయం చేయలేకపోతున్నాననే ఆవేదనతో తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కోరాపుట్ ఎమ్మెల్యే కృష్ణ చంద్ర సాగరియా ప్రకటించారు. బాధితురాలికి న్యాయం చేయలేని తనకు ఎమ్మెల్యేగా కొనసాగే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘నిరుపేద దళిత అమ్మాయికి అన్యాయం జరిగింది. ఓ నిండు ప్రాణం బలైంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా నేనేమీ చేయలేకపోయాను. అంటే ప్రజాప్రతినిధిగా ఉండే నైతిక హక్కు కోల్పోయాను అందుకే ఈ రాజీనామా’ అంటూ ఈ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు. కాగా గతేడాది అక్టోబరు 10న కోరాపుట్‌లోని కుండలి గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పొట్టంగి పోలీసు స్టేషను పరిధిలో నలుగురు వ్యక్తులు ఆమెపై అకృత్యానికి పాల్పడ్డారు. తనకు న్యాయం చేయాలని, నిందితులను అరెస్టు చేయాలంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవపోవడంతో.. జనవరి 22న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. రెడ్ ఫ్లాగ్ కేసుగా ప్రాచుర్యం పొందిన కేసులో ఇంతవరకు ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయకపోవడం గమనార్హం. -
తుపాకితో కాల్చుకొని.. హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
కోరాపుత్(ఒడిశా): విధి నిర్వాహణలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ తన తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశాలోని కోరాపుత్లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కోబ్రా 202 బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న శంకర్ ప్రసాద్ తన ఎస్ ఎల్ ఆర్ రైఫిల్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హెడ్ కానిస్టేబుల్ మృతి పై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు. ఆత్మహత్యకు దాపరించిన కారణాలు తెలియాల్సి ఉంది. -
కొత్తవలస- కోరాపుట్ డబ్లింగ్ పనులకు ఓకే
న్యూఢిల్లీః విజయనగరం జిల్లా కొత్తవలస - ఒడిశాలోని కోరాపుట్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొత్తవలస-కోరాపుట్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 189.278 కి.మీ. పొడవైన ఈ మార్గంలో రూ. 2977.64 కోట్ల అంచనా వ్యయంతో డబ్లింగ్ పనులు చేపడతారు. ఈ డబ్లింగ్ పనుల వల్ల ఆయా ప్రాంతాల మధ్య సరుకు రవాణా సులభతరం కావడమే కాకుండా రైల్వే ఆదాయం పెరుగుతుంది. ఈ పనులు వచ్చే ఏడేళ్లలో పూర్తవుతాయని అంచనావేసింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఈ జిల్లాల మధ్య వివిధ రకాల ఖనిజాలు, ముడిసరుకు, ఇతర వస్తు రవాణా అవసరాలు పెరుగుతున్నందున కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
కోరాపుట్‌లో 12 మంది మావోల లొంగుబాటు
కోరాపుట్ (ఒడిశా): జనజీవన స్రవంతిలో కలవాలనే ఆకాంక్షతో ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పోలీసుల ఎదుట ఆదివారం 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరంతా ఆంధ్రా-ఒడిశా బోర్డర్ ప్రత్యేక జోనల్ కమిటీ ఆధ్వర్యంలోని శ్రీకాకుళం-కోరాపుట్ డివిజన్ కమిటీకి చెందిన వారని పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారు కోరాపుట్ జిల్లా నారాయణపట్న నివాసులని వెల్లడించారు. వీరు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించడమే కాకుండా మావోలకు సమాచార వ్యవస్థను రూపొందించేవారని చెప్పారు. ఈ 12మందితో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో మొత్తం 33 మంది మావోలు లొంగిపోయారని పోలీసులు తెలిపారు. మావోయిస్టులందరూ హింసను విడనాడి జనజీవనస్రవంతిలో కలవాలని పోలీసులు పిలుపునిచ్చారు.