డాక్టర్ ఇందిరా నందో
ఒడిశా, జయపురం: కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలు, మాజీ మంత్రి రవినారాయణ నందో సతీమణి డాక్టర్ ఇందిరా నందో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై సాగుతున్న చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె బీజేడీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వందలాదిమంది మహిళలతో ర్యాలీలో పాల్గొనడంతో ఆమె భవిష్యత్తులో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ప్రకటించడంతో మహిళలు రాజకీయాలపైపు మొగ్గు చూపుతున్నారు.
జయపురం మహిళలకు రిజర్వ్ చేస్తే..?
అవిభక్త కొరాపుట్‌లో గల 14 అసెంబ్లీ స్థానాలలో కేవలం జయపురం ఒక్కటే జనరల్ స్థానం. అందుచేత జయపురం స్థానాన్ని మహిళలకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డాక్టర్ ఇందిరా నందో రాజకీయ నేత రవినందోను వివాహమాడినా ఎన్నడూ రాజకీయాలలోకి అడగిడ లేదు. ఎనిమిదేళ్ల కిందట ఆమె కొరాపుట్ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినా రాజకీయాల జోలికి వెళ్లిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు. అయితే ఆమె బుధవారం రాష్ట్ర అధికార పార్టీ బీజేడీ వ్యవస్థాపక దినోత్సవాల్లో వందలాది మంది మహిళలకు నేతృత్వం వహించి భారీ ర్యాలీలోపాల్గొన్నారు. గత సెప్టెంబర్‌లో జరిగిన బీజేడీ మహిళా సమారోహంలో ఒక సారి పాల్గొన్నారు. అయితే ఆమె బుధవారం వందలాది మంది మహిళలకు సారథ్యం వహించి పాల్గొనడం వెనుక ఉన్న రాజకీయం ఏమిటా? అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
భవిష్యత్తు యోచనతోనే..!
ఒకవేళ జయపురం విధానసభ నియోజక వర్గాన్ని మహిళలకు కేటాయిస్తే అప్పుడు చక్రం తిప్పేందుకే ఆమె నేడు పార్టీ జెండాతో మహిళలకు నేతృత్వం వహించి ఉంటారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. గతంలో జయపురం నియోజక వర్గం మహిళలకు కేటాయిస్తారన్న అభిప్రాయాలు వినిపించినా అది జరగలేదు. నేడు జయపురం నియోజక వర్గంలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్థానం మహిళలకు రిజర్వ్ చేయవచ్చన్న అభిప్రాయలు బలంగా వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆమె అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగవచ్చని, అందుచేతనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారని రాజకీయ పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా నేడు ఇందిరా నందో ప్రత్యక్ష రాజకీయ ప్రవేశంపై రాజకీయ చర్చలు విస్తృతంగా సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment