సాక్షి, భువనేశ్వర్ : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు, బీజేడీ నేత అరిందమ్ రాయ్ బీజేపీలో చేరారు.
‘బీజేడీలో ఉన్నప్పుడు నేను సీఎం నవీన్ పట్నాయక్‌ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే, పార్టీ రాజకీయాల కారణంగా నేను సీఎంను కలిసే అవకాశం పొందలేకపోయాను. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ పార్టీ మారడానికి గల కారణాల్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం చుబా అవో ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ తన పరిపాలనలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రవేశ పెట్టినట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం అన్న ఆయన..ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో
ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో
రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 9, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1, స్వతంత్ర అభ్యర్థి మరో సీటుతో రెండో స్థానంలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment