తల్లికి తల దువ్వుతున్న మంగవేణి
తల్లికి 102 ఏళ్లు... కూతురికి 72 ఏళ్లు. తల్లీకూతుళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు నిర్వచనం వీరు. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్‌లోని చిన్ని గుడిసెలో నివసిస్తున్న వీరు... ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. కూతురు జీహెచ్‌ఎంసీలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తుండగా... కూతురికి ఇంట్లో సాయపడుతోంది తల్లి. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులూ వీరి దరిచేరలేదు. ఇప్పటికీ పనులు చేసుకుంటూ... ఒకరికి ఒకరై ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ తల్లీకూతుళ్లు. వారే లక్ష్మమ్మ, మంగవేణి.
బంజారాహిల్స్: లక్ష్మమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు. ఈమెకుఐదుగురు కొడుకులు, ఒక కూతురు(మంగవేణి). వీరిలో ఇద్దరు కొడుకులు మరణించగా, మిగతా ముగ్గురు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఒంటరి అయిన లక్ష్మమ్మ కూతురు చెంత చేరింది. తల్లిని బరువుగా భావించక.. బాధ్యతగా చూసుకుంటోంది మంగవేణి.
తల్లికి తోడుగా తనయ...
‘కంటే కూతుర్నే కనాలి...’ అనే దానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది మంగవేణి. వందేళ్ల వయసు పైబడిన తల్లికి అన్నీ తానైంది. తల్లిని కొడుకులు కాదంటే తానే కొడుకైంది. బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని మురికివాడల్లో గుడిసె వేసుకున్న మంగవేణి... తల్లికి సొంతూరిలో ఇల్లు కట్టించి కొన్ని రోజులు ఉంచింది. అయితే తల్లికి వృద్ధాప్యం రావడం, తరచూ వెళ్లిరావడం ఇబ్బందవుతుండడంతో తన దగ్గరికే తీసుకొచ్చి సాకుతోంది.
పిల్లలకు పెళ్లిళ్లు చేసింది...
మంగవేణికి కూడా ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త 25ఏళ్ల క్రితమే చనిపోగా, పిల్లల్ని పెంచి పెద్దచేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు తల్లి కోసం కొడుకును కాదని, లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మంగవేణి మీద పడింది. 20 ఏళ్ల క్రితం జీహెచ్‌ఎంసీలో స్వీపర్‌గా పని దొరికింది. అప్పటి నుంచి ఆ పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికీ పనిచేస్తూ నెలవారీ ఖర్చులు చూసుకుంటోంది.
లక్ష్మమ్మను చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 102ఏళ్ల
వయసులోనూ తన పనులు తానే చేసుకుంటుంది. ఇంటి పనుల్లో కూతురికి సాయం చేస్తుంది. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పే లక్ష్మమ్మ...
నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఎన్నేళ్లయినా బతికేయొచ్చు అంటోంది.
టీవీ తెలీదు...
కూతురు మంగవేణి స్వీపర్‌గా పనిచేస్తూ పోషిస్తుండగా... ఇంటి పనులు చూసుకుంటూ ఆమె కంటే చురుగ్గా ఉంటోంది లక్ష్మమ్మ. సమయానికి
భోజనం.. అదీ మితంగా, ప్రతిరోజు పావుగంట నడక... వీటితోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోందీ బామ్మ. ‘షుగర్, బీపీ, దంత, నేత్ర సమస్యలేవీ నాకు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 8గంటలకు నిద్రపోయి... తెల్లవారుజామున 4గంటలకు లేవడం అలవాటు. మధ్యాహ్నం కూడా కొంతసేపు కునుకు తీస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పటికీ టీవీ అంటే తెలియద’ని చెప్పింది.
అదే ఆరోగ్య రహస్యం..
దేవుడి భక్తి ఎక్కువున్న లక్ష్మమ్మకు భజనలు చేయడమంటే ఇష్టం. ఉదయం సూర్యనమస్కారాలు చేస్తుంది. ‘సంపాదనపై అనాసక్తి, ఇతరులపై ఈర‡్ష్య, ద్వేషాలు లేకపోవడం.. అలాంటి ఆలోచనలు కూడా నాదరి చేరకపోవడం.. జీవితంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే నా ఆరోగ్య రహస్యమ’ని చెప్పిందీ బామ్మ. ఇప్పటివరకు జ్వరమంటే తెలీదు. ఒక్కసారీ ఇంజక్షన్ వేయించుకోలేదు. ఏదైనా దెబ్బ తగిలితే, తలనొప్పి వస్తే ఆకు రసం పిండుకొని నెత్తికి రాసుకోవడమే తనకు
తెలిసిన వైద్యమని చెప్పింది.
తాటిబెల్లం.. జొన్నరొట్టె
‘నేను చాలా రోజులు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు తాటిబెల్లం బాగా తినేదాన్ని. ఈ వయసులోనూ చికెన్, మటన్ తింటాను. కట్టెల పొయ్యిపై జొన్నెరొట్టెలు చేసుకొని తింటాను. అంబలి తాగుతాను. నాకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి సినిమాలంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తుంటాన’ని చెప్పిందీ బామ్మ.
ఆనందం.. ఆరోగ్యం
ఈ తల్లీకూతుళ్లకు వృద్ధాప్యం మీద పడినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం శారీరక నొప్పులు తప్పితే తనకేమీ తెలియవని చెప్పుకొచ్చింది మంగవే ణి. చేతకాని తనంలో ఇంటి పట్టున ఉండొచ్చు కదా..? అంటే ‘నాకు ఇంకా సత్తువ ఉంది. ఇంట్లో కూర్చుంటే నాకు, నా తల్లికి బువ్వెట్ల వస్తుంద’ని చెప్పింది. మొత్తానికి వందేళ్లు పైబడిన తల్లికి 70ఏళ్లు పైబడిన బిడ్డ చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వయసులోనూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి తల్లికింత వండిపెట్టి, చీపురు పట్టుకొని విధులకు హాజరవుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రోడ్లు ఊడ్చే మంగవేణి.. ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు పెట్టింది లేదని అధికారులు పేర్కొన్నారు. ఇంటికివెళ్లగానే తల్లికి స్నానం చేయించి, తినిపిస్తుంది. సాయంత్రానికి తల్లితో ముచ్చట్లు, రాత్రికి మళ్లీ వంట.. ఇదీ మంగవేణి దినచర్య.
Comments
Please login to add a commentAdd a comment