GHMC worker
-
మొక్కలకు నీరు పడుతుండగా దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి, బంజారాహిల్స్: కారు ఢీకొన్న ప్రమాదంలో జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని పార్క్‌హయత్ హోటల్ ఎదురుగా రోడ్డు మధ్యలో చెట్లకు జీహెచ్ఎంసీ వాటర్ ట్యాంకర్‌తో చిన్నబోయిన కిరణ్ (23) నీరు పడుతున్నాడు. అదే సమయంలో సాగర్ సొసైటీ వైపు నుంచి క్యాబ్ డ్రైవర్ జానయ్య అతివేగం, నిర్లక్ష్యంతో దూసుకొచ్చాడు. మొక్కలకు నీరు పడుతున్న కిరణ్‌ను ఢీకొట్టాడు. వాటర్ ట్యాంకర్, క్యాబ్ మధ్యన నలిగి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ఇంటి నుంచి బయటకెళ్లి.. ఇద్దరు వివాహితల అదృశ్యం -
సెప్టిక్ ట్యాంకులో పడి జీహెచ్ఎంసీ కార్మికుడి మృతి
హైదరాబాద్: వాడకంలో లేని పాత సెప్టిక్ ట్యాంకుపై మట్టి డంపింగ్ చేస్తున్న క్రమంలో స్లాబ్ కూలి ట్రాక్టర్ ట్రాలీతో సహా ఓ వ్యక్తి అందులో పడి దుర్మరణం చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా, రామన్నపేటకు చెందిన వెంకటేష్ (40) మియాపూర్ న్యూ కాలనీలో గత కొన్నేళ్లుగా ఉంటూ జీహెచ్ఎంసీలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ పై లేబర్‌గా ఉన్న అతను ఇతరులతో కలసి హాఫీజ్పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో వ్యర్థాలు, మట్టిని తొలగించే పని శుక్రవారం చేపట్టాడు. ట్రాక్టర్ డ్రైవర్ కుమారస్వామి, మరో కార్మికుడు సారయ్య, వెంకటేష్‌లు వ్యర్థాలను తొలగించి అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న సెప్టిక్ ట్యాంకుపై వేస్తున్నారు. మ«ధ్యాహ్నం వారు సెప్టిక్ ట్యాంకుపై ట్రాక్టర్‌ను నిలిపి మట్టిని తొలగిస్తుండగా అది కింద పడలేదు. దీంతో వెంకటేష్ వెళ్లి ట్రాక్టర్ వెనుక భాగంలోని ట్రాలీకి ఉన్న తలుపును తొలగించడంతో అది ఒక్కసారిగా సెప్టిక్ ట్యాంకుపై భాగంపై కూలింది. దీంతో వెంకటేష్ ప్రమాదవశాత్తూ ట్రాలీతో సహా సెప్టిక్‌ట్యాంకులో పడి కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం 6.30 గంటలకు వివిధ పంపింగ్ యంత్రాల ద్వారా ట్యాంకులోని వ్యర్థాలను సహాయక సిబ్బంది తొలగించి వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు భార్య ఉమతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఒకరికొకరు...
తల్లికి 102 ఏళ్లు... కూతురికి 72 ఏళ్లు. తల్లీకూతుళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు నిర్వచనం వీరు. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్లోని చిన్ని గుడిసెలో నివసిస్తున్న వీరు... ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. కూతురు జీహెచ్ఎంసీలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తుండగా... కూతురికి ఇంట్లో సాయపడుతోంది తల్లి. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులూ వీరి దరిచేరలేదు. ఇప్పటికీ పనులు చేసుకుంటూ... ఒకరికి ఒకరై ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ తల్లీకూతుళ్లు. వారే లక్ష్మమ్మ, మంగవేణి. బంజారాహిల్స్: లక్ష్మమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు. ఈమెకుఐదుగురు కొడుకులు, ఒక కూతురు(మంగవేణి). వీరిలో ఇద్దరు కొడుకులు మరణించగా, మిగతా ముగ్గురు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఒంటరి అయిన లక్ష్మమ్మ కూతురు చెంత చేరింది. తల్లిని బరువుగా భావించక.. బాధ్యతగా చూసుకుంటోంది మంగవేణి. తల్లికి తోడుగా తనయ... ‘కంటే కూతుర్నే కనాలి...’ అనే దానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది మంగవేణి. వందేళ్ల వయసు పైబడిన తల్లికి అన్నీ తానైంది. తల్లిని కొడుకులు కాదంటే తానే కొడుకైంది. బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని మురికివాడల్లో గుడిసె వేసుకున్న మంగవేణి... తల్లికి సొంతూరిలో ఇల్లు కట్టించి కొన్ని రోజులు ఉంచింది. అయితే తల్లికి వృద్ధాప్యం రావడం, తరచూ వెళ్లిరావడం ఇబ్బందవుతుండడంతో తన దగ్గరికే తీసుకొచ్చి సాకుతోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసింది... మంగవేణికి కూడా ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త 25ఏళ్ల క్రితమే చనిపోగా, పిల్లల్ని పెంచి పెద్దచేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు తల్లి కోసం కొడుకును కాదని, లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మంగవేణి మీద పడింది. 20 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని దొరికింది. అప్పటి నుంచి ఆ పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికీ పనిచేస్తూ నెలవారీ ఖర్చులు చూసుకుంటోంది. లక్ష్మమ్మను చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 102ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకుంటుంది. ఇంటి పనుల్లో కూతురికి సాయం చేస్తుంది. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పే లక్ష్మమ్మ... నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఎన్నేళ్లయినా బతికేయొచ్చు అంటోంది. టీవీ తెలీదు... కూతురు మంగవేణి స్వీపర్‌గా పనిచేస్తూ పోషిస్తుండగా... ఇంటి పనులు చూసుకుంటూ ఆమె కంటే చురుగ్గా ఉంటోంది లక్ష్మమ్మ. సమయానికి భోజనం.. అదీ మితంగా, ప్రతిరోజు పావుగంట నడక... వీటితోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోందీ బామ్మ. ‘షుగర్, బీపీ, దంత, నేత్ర సమస్యలేవీ నాకు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 8గంటలకు నిద్రపోయి... తెల్లవారుజామున 4గంటలకు లేవడం అలవాటు. మధ్యాహ్నం కూడా కొంతసేపు కునుకు తీస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పటికీ టీవీ అంటే తెలియద’ని చెప్పింది. అదే ఆరోగ్య రహస్యం.. దేవుడి భక్తి ఎక్కువున్న లక్ష్మమ్మకు భజనలు చేయడమంటే ఇష్టం. ఉదయం సూర్యనమస్కారాలు చేస్తుంది. ‘సంపాదనపై అనాసక్తి, ఇతరులపై ఈర‡్ష్య, ద్వేషాలు లేకపోవడం.. అలాంటి ఆలోచనలు కూడా నాదరి చేరకపోవడం.. జీవితంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే నా ఆరోగ్య రహస్యమ’ని చెప్పిందీ బామ్మ. ఇప్పటివరకు జ్వరమంటే తెలీదు. ఒక్కసారీ ఇంజక్షన్ వేయించుకోలేదు. ఏదైనా దెబ్బ తగిలితే, తలనొప్పి వస్తే ఆకు రసం పిండుకొని నెత్తికి రాసుకోవడమే తనకు తెలిసిన వైద్యమని చెప్పింది. తాటిబెల్లం.. జొన్నరొట్టె ‘నేను చాలా రోజులు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు తాటిబెల్లం బాగా తినేదాన్ని. ఈ వయసులోనూ చికెన్, మటన్ తింటాను. కట్టెల పొయ్యిపై జొన్నెరొట్టెలు చేసుకొని తింటాను. అంబలి తాగుతాను. నాకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి సినిమాలంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తుంటాన’ని చెప్పిందీ బామ్మ. ఆనందం.. ఆరోగ్యం ఈ తల్లీకూతుళ్లకు వృద్ధాప్యం మీద పడినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం శారీరక నొప్పులు తప్పితే తనకేమీ తెలియవని చెప్పుకొచ్చింది మంగవే ణి. చేతకాని తనంలో ఇంటి పట్టున ఉండొచ్చు కదా..? అంటే ‘నాకు ఇంకా సత్తువ ఉంది. ఇంట్లో కూర్చుంటే నాకు, నా తల్లికి బువ్వెట్ల వస్తుంద’ని చెప్పింది. మొత్తానికి వందేళ్లు పైబడిన తల్లికి 70ఏళ్లు పైబడిన బిడ్డ చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వయసులోనూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి తల్లికింత వండిపెట్టి, చీపురు పట్టుకొని విధులకు హాజరవుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రోడ్లు ఊడ్చే మంగవేణి.. ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు పెట్టింది లేదని అధికారులు పేర్కొన్నారు. ఇంటికివెళ్లగానే తల్లికి స్నానం చేయించి, తినిపిస్తుంది. సాయంత్రానికి తల్లితో ముచ్చట్లు, రాత్రికి మళ్లీ వంట.. ఇదీ మంగవేణి దినచర్య. -
పారిశుధ్య కార్మికుడిపై దాడి..
పారిశుద్ధ్య కార్మికుడిపై నలుగురు వ్యక్తులు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడీలో ఈ ఘటన చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికుడు ప్రవీణ్‌ను సోమవారం ఉదయం నలుగురు వ్యక్తులు తీవ్రంగా కొట్టారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుదాఘాతంతో జీహెచ్ఎంసీ కార్మికుడి మృతి
విద్యుత్ స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలో గురువారం వెలుగుచూసింది. వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన రాజు(28) గత పది సంవత్సరాల నుంచి జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఈ రోజు స్తంభం పై మరమ్మత్తులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా జరగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చెరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
గల్లంతైన జీహెచ్ఎంసీ కార్మికుడి ఆచూకీ లభ్యం
హైదరాబాద్: డ్రైనేజీ శుభ్రం చేస్తూ గల్లంతైన జీహెచ్ఎంసీ కార్మికుడు రాములును అధికారులు గుర్తించారు. డ్రైనేజీలో విషవాయువుల ప్రభావంతో రాములు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం నల్లకుంట వద్ద డ్రైనేజీని చేస్తూ రాములు గల్లంతైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మరో కార్మికుడు శ్రీనివాస్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందున్నాడు. -
ఉప్పల్‌లో కార్మికుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఉప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉప్పలయ్య(36) అనే మున్సిపల్ కార్మికుడు గురువారం ఉదయం ఆత్మహత్యయత్నం చేశాడు. జీహెచ్ఎంసీ విధుల నుంచి తొలగించారనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఉప్పలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.