హైదరాబాద్: వాడకంలో లేని పాత సెప్టిక్ ట్యాంకుపై మట్టి డంపింగ్ చేస్తున్న క్రమంలో స్లాబ్ కూలి ట్రాక్టర్ ట్రాలీతో సహా ఓ వ్యక్తి అందులో పడి దుర్మరణం చెందాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది. వరంగల్ జిల్లా, రామన్నపేటకు చెందిన వెంకటేష్ (40) మియాపూర్ న్యూ కాలనీలో గత కొన్నేళ్లుగా ఉంటూ జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు లేబర్‌గా పనిచేస్తున్నాడు. జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ పై లేబర్‌గా ఉన్న అతను ఇతరులతో కలసి హాఫీజ్‌పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో వ్యర్థాలు, మట్టిని తొలగించే పని శుక్రవారం చేపట్టాడు.
ట్రాక్టర్ డ్రైవర్ కుమారస్వామి, మరో కార్మికుడు సారయ్య, వెంకటేష్‌లు వ్యర్థాలను తొలగించి అపార్ట్‌మెంట్స్ మధ్యలో ఉన్న సెప్టిక్ ట్యాంకుపై వేస్తున్నారు. మ«ధ్యాహ్నం వారు సెప్టిక్ ట్యాంకుపై ట్రాక్టర్‌ను నిలిపి మట్టిని తొలగిస్తుండగా అది కింద పడలేదు. దీంతో వెంకటేష్ వెళ్లి ట్రాక్టర్ వెనుక భాగంలోని ట్రాలీకి ఉన్న తలుపును తొలగించడంతో అది ఒక్కసారిగా సెప్టిక్ ట్యాంకుపై భాగంపై కూలింది.
దీంతో వెంకటేష్ ప్రమాదవశాత్తూ ట్రాలీతో సహా సెప్టిక్‌ట్యాంకులో పడి కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం 6.30 గంటలకు వివిధ పంపింగ్ యంత్రాల ద్వారా ట్యాంకులోని వ్యర్థాలను సహాయక సిబ్బంది తొలగించి వెంకటేష్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు. వెంకటేష్‌కు భార్య ఉమతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment