laxmamma
-
‘అవ్వ’ ది గ్రేట్
కుత్బుల్లాపూర్: సరిగా నిలబడ లేక వంగి వంగి నడుస్తున్న ఈ అవ్వ పేరు లక్ష్మి(లక్ష్మమ్మ). కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో అటు ఇటు నడవలేక నడవలేక నడుస్తున్న ఈమె పింఛను కోసమో, ఇతరత్రా పథకాల లబ్ధికోసమో పాట్లు పడటం లేదు. ఈ అవ్వ వచ్చింది తన ఇంటి పన్ను కట్టడానికి. గాజులరామారం డివిజన్ మార్కండేయనగర్లో ఉన్న ఇంటి నంబరు 05–104 (పి.టి.ఐ నంబరు: 1152400681)కు గాను 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చి పన్ను కట్టాల్సిందిగా కోరగా అతనికి డబ్బులు చెల్లించింది. అయినప్పటికీ తన ఇంటి పన్ను ఇంకా పెండింగ్ ఉందని తెలియడంతో ఇలా నేరుగా సర్కిల్ కార్యాలయానికి వచ్చి వాకబు చేసింది. సి.ఎస్.సి సెంటర్లోకి వెళ్లగా అక్కడ సిబ్బంది ఇంటి పన్ను రూ.2614 గా చెప్పడంతో అవాక్కయ్యింది. ఎప్పుడూ తన ఇంటి పన్ను రూ.1200 నుంచి 1300 మధ్యలోనే వస్తుందని, కాని ఇప్పుడు ఇంతలా ఎలా పెరిగిందని వాపోయింది. తన వద్ద ఇప్పుడు రూ 1200 మాత్రమే ఉన్నాయని మిగిలిన డబ్బులు తీసుకువస్తానని కొద్ది సేపు కూర్చుని తిరిగి వెళ్లిపోయింది అవ్వ. అయితే 2019 మార్చి నెలలో రూ.630 రూపాయలు కట్టి పాత బకాయిలు లేకుండా ట్యాక్స్ క్లియర్ చేయించుకుంది లక్ష్మమ్మ. ఆఖరికి ఆస్తి పన్ను మదింపు ఈ అవ్వను కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఓ దశలో తన ఇబ్బంది చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తాము 20 ఏళ్లుగా పన్ను చెల్లిస్తూ వస్తున్నామని, తన భర్త చనిపోయాక 2013 నుంచి తానే స్వయంగా చెల్లిస్తున్నాని చెప్పింది. సరిగా నడవలేని, సహకరించని శరీరం వణుకుతున్నప్పటికీ ఓపిక చేసుకుని ఆస్తిపన్ను కట్టడానికి వచ్చిన ఆ అవ్వను చూసి ఆస్తి పన్ను కట్టకుండా ఉండే మొండి బకాయిదారులు సిగ్గుపడాలని సిబ్బంది వ్యాఖ్యానించారు. -
ఒకరికొకరు...
తల్లికి 102 ఏళ్లు... కూతురికి 72 ఏళ్లు. తల్లీకూతుళ్ల అనుబంధానికి, ఆప్యాయతకు నిర్వచనం వీరు. ఫిలింనగర్ మహాత్మాగాంధీనగర్లోని చిన్ని గుడిసెలో నివసిస్తున్న వీరు... ఒకరికొకరు తోడుగా జీవనం సాగిస్తున్నారు. కూతురు జీహెచ్ఎంసీలో ఒప్పంద కార్మికురాలిగా పనిచేస్తుండగా... కూతురికి ఇంట్లో సాయపడుతోంది తల్లి. వృద్ధాప్యంలోనూ ఎలాంటి వ్యాధులూ వీరి దరిచేరలేదు. ఇప్పటికీ పనులు చేసుకుంటూ... ఒకరికి ఒకరై ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారీ తల్లీకూతుళ్లు. వారే లక్ష్మమ్మ, మంగవేణి. బంజారాహిల్స్: లక్ష్మమ్మ స్వస్థలం కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు. ఈమెకుఐదుగురు కొడుకులు, ఒక కూతురు(మంగవేణి). వీరిలో ఇద్దరు కొడుకులు మరణించగా, మిగతా ముగ్గురు ఎవరి దారి వారు చూసుకున్నారు. ఒంటరి అయిన లక్ష్మమ్మ కూతురు చెంత చేరింది. తల్లిని బరువుగా భావించక.. బాధ్యతగా చూసుకుంటోంది మంగవేణి. తల్లికి తోడుగా తనయ... ‘కంటే కూతుర్నే కనాలి...’ అనే దానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది మంగవేణి. వందేళ్ల వయసు పైబడిన తల్లికి అన్నీ తానైంది. తల్లిని కొడుకులు కాదంటే తానే కొడుకైంది. బతుకుదెరువు నిమిత్తం 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఫిలింనగర్‌లోని మురికివాడల్లో గుడిసె వేసుకున్న మంగవేణి... తల్లికి సొంతూరిలో ఇల్లు కట్టించి కొన్ని రోజులు ఉంచింది. అయితే తల్లికి వృద్ధాప్యం రావడం, తరచూ వెళ్లిరావడం ఇబ్బందవుతుండడంతో తన దగ్గరికే తీసుకొచ్చి సాకుతోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసింది... మంగవేణికి కూడా ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భర్త 25ఏళ్ల క్రితమే చనిపోగా, పిల్లల్ని పెంచి పెద్దచేసింది. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఇప్పుడు తల్లి కోసం కొడుకును కాదని, లక్ష్మమ్మ దగ్గరే ఉంటోంది. భర్త చనిపోవడంతో కుటుంబ భారం మంగవేణి మీద పడింది. 20 ఏళ్ల క్రితం జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని దొరికింది. అప్పటి నుంచి ఆ పని చేస్తూనే జీవితాన్ని నెట్టుకొస్తోంది. ఇప్పటికీ పనిచేస్తూ నెలవారీ ఖర్చులు చూసుకుంటోంది. లక్ష్మమ్మను చూస్తే మనందరికీ ఆశ్చర్యం వేస్తుంది. 102ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకుంటుంది. ఇంటి పనుల్లో కూతురికి సాయం చేస్తుంది. ఇప్పటికీ ఎలాంటి అనారోగ్యానికి గురికాలేదని చెప్పే లక్ష్మమ్మ... నవ్వుతూ.. నవ్విస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉంటే ఎన్నేళ్లయినా బతికేయొచ్చు అంటోంది. టీవీ తెలీదు... కూతురు మంగవేణి స్వీపర్‌గా పనిచేస్తూ పోషిస్తుండగా... ఇంటి పనులు చూసుకుంటూ ఆమె కంటే చురుగ్గా ఉంటోంది లక్ష్మమ్మ. సమయానికి భోజనం.. అదీ మితంగా, ప్రతిరోజు పావుగంట నడక... వీటితోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని చెబుతోందీ బామ్మ. ‘షుగర్, బీపీ, దంత, నేత్ర సమస్యలేవీ నాకు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైంది. రాత్రి 8గంటలకు నిద్రపోయి... తెల్లవారుజామున 4గంటలకు లేవడం అలవాటు. మధ్యాహ్నం కూడా కొంతసేపు కునుకు తీస్తాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. ఇప్పటికీ టీవీ అంటే తెలియద’ని చెప్పింది. అదే ఆరోగ్య రహస్యం.. దేవుడి భక్తి ఎక్కువున్న లక్ష్మమ్మకు భజనలు చేయడమంటే ఇష్టం. ఉదయం సూర్యనమస్కారాలు చేస్తుంది. ‘సంపాదనపై అనాసక్తి, ఇతరులపై ఈర‡్ష్య, ద్వేషాలు లేకపోవడం.. అలాంటి ఆలోచనలు కూడా నాదరి చేరకపోవడం.. జీవితంపై ఎలాంటి ఒత్తిడి లేకపోవడమే నా ఆరోగ్య రహస్యమ’ని చెప్పిందీ బామ్మ. ఇప్పటివరకు జ్వరమంటే తెలీదు. ఒక్కసారీ ఇంజక్షన్ వేయించుకోలేదు. ఏదైనా దెబ్బ తగిలితే, తలనొప్పి వస్తే ఆకు రసం పిండుకొని నెత్తికి రాసుకోవడమే తనకు తెలిసిన వైద్యమని చెప్పింది. తాటిబెల్లం.. జొన్నరొట్టె ‘నేను చాలా రోజులు వ్యవసాయం చేశాను. చిన్నప్పుడు తాటిబెల్లం బాగా తినేదాన్ని. ఈ వయసులోనూ చికెన్, మటన్ తింటాను. కట్టెల పొయ్యిపై జొన్నెరొట్టెలు చేసుకొని తింటాను. అంబలి తాగుతాను. నాకు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే చాలా ఇష్టం. వయసులో ఉన్నప్పుడు సినిమాలు చూసేదాన్ని. ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి సినిమాలంటే ఇష్టం. ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తుంటాన’ని చెప్పిందీ బామ్మ. ఆనందం.. ఆరోగ్యం ఈ తల్లీకూతుళ్లకు వృద్ధాప్యం మీద పడినా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కేవలం శారీరక నొప్పులు తప్పితే తనకేమీ తెలియవని చెప్పుకొచ్చింది మంగవే ణి. చేతకాని తనంలో ఇంటి పట్టున ఉండొచ్చు కదా..? అంటే ‘నాకు ఇంకా సత్తువ ఉంది. ఇంట్లో కూర్చుంటే నాకు, నా తల్లికి బువ్వెట్ల వస్తుంద’ని చెప్పింది. మొత్తానికి వందేళ్లు పైబడిన తల్లికి 70ఏళ్లు పైబడిన బిడ్డ చేస్తున్న సేవ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వయసులోనూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి తల్లికింత వండిపెట్టి, చీపురు పట్టుకొని విధులకు హాజరవుతోంది. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో రోడ్లు ఊడ్చే మంగవేణి.. ఆరోగ్యం బాగోలేదంటూ సెలవు పెట్టింది లేదని అధికారులు పేర్కొన్నారు. ఇంటికివెళ్లగానే తల్లికి స్నానం చేయించి, తినిపిస్తుంది. సాయంత్రానికి తల్లితో ముచ్చట్లు, రాత్రికి మళ్లీ వంట.. ఇదీ మంగవేణి దినచర్య. -
పింఛన్ కోసం వచ్చి వృద్ధురాలి మృతి
కుందుర్పి: పింఛన్ కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు గంటల తరబడి వేచి చూసి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... బెస్తరపల్లికి చెందిన లక్ష్మమ్మ (68) మంగళవారం పింఛన్ తీసుకునేందుకు ఉదయం పది గంటలకే గ్రామ సచివాలయానికి వెళ్లింది. సాయంత్రం మూడుగంటలు దాటినా పింఛన్ అందలేదు. అన్నపానీయాలు లేకుండా వేచి గంటతరబడి వేచి ఉన్న అక్కడే కుప్పకూలిపోయింది. తోటిపింఛన్దారులు పరిశీలించగా ఆమె ప్రాణం విడిచినట్లు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. -
వృద్ధురాలి దారుణ హత్య
కదిరి అర్బన్ : మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గురువారం తెల్లవారుజామున లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాతిని తలపై మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు యాచకవృత్తి చేసుకుని జీవించేంది. రాత్రి పూట రోడ్డుపక్కనున్న షాపుల వద్ద వరండాలో నిద్రిస్తుండేది. ఇంత దారుణంగా వృధ్దురాలిని హత్య చేశారంటే అది ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కునేందుకా..లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు పట్టణ సీఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలో దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తల్లి మృతి చెందడంతో కుమార్తె రమణమ్మ కన్నీరు మున్నీరైంది. రూరల్ మండల ఎస్సై వెంకటప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏడిపింఛెన్.. !
హిందూపురం టౌన్ : పింఛన్ కోసం పాట్లు తన ప్రాణాలమీదకొచ్చాయంటోంది.. హిందూపురానికి చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ. పట్టణంలోని బెంగళూరు రోడ్డులో నివాసముంటున్న లక్ష్మమ్మ కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటోంది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఏడాదిగా ఆమెకు పింఛన్ అందడం లేదు. ఇదే విషయమై మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి దృష్టికి ఏడాది క్రితం తీసుకెళ్లింది. నాటి నుంచి ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో గురువారం మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆమె మున్సిపల్ కౌన్సిల్ హాలులోనే సొమ్మసిల్లి పడిపోయింది. అయినా ఏ ఒక్కరూ వృద్ధురాలిని పలకరించకపోవడం దురదృష్టకరం. -
కొనసాగుతున్న రెండో ఏఎన్ఎంల సమ్మె
ఆత్మకూర్ : పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీఓను విడుదల చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ మండల అధ్యక్షురాలు లక్ష్మమ్మ అన్నారు. ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ చేపట్టిన సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదో పీఆర్సీ ప్రకారం రూ.21వేల వేతనంతోపాటు డీఏ, హెచ్ఆర్ఏలు తదితర డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో బాలేశ్వరీ, చంద్రమ్మ, వరలక్ష్మి, కె.లక్ష్మమ్మ, ఉమామహేశ్వరీ, పద్మావతి, భాగ్యమ్మ, పద్మమ్మ, అలివేలు, జయంతి, పరిమళ, లక్ష్మినర్సమ్మ, శోభారాణి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. -
కుమారుడిని వెతుక్కుంటూ వచ్చి..
బంజారాహిల్స్: కొడుకు కోసం నగరానికి వచ్చిన ఓ వృద్ధురాలు అడ్రస్ ఉన్న కాగితాన్ని పోగొట్టుకొని రోడ్డుపాలై రోదిస్తూ తిరుగుతుండగా స్థానికుల సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు చేరదీశారు. తన పేరు లక్ష్మమ్మ అని వరంగల్ జిల్లా అంటూ మాత్రమే చెబుతున్న ఈ వృద్ధురాలు బోరబండ ప్రాంతంలో రోదిస్తూ తిరుగుతుండగా స్థానికులు గమనించారు. సమాచారం అందించటంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆమె కుమారుడిని వాకబు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకు సంబంధించిన వివరాల కోసం 9490616585 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చని ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. -
లక్ష్మమ్మ వాంగ్మూలమే కీలకం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ శ్రీదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి డెరైక్టర్ లక్ష్మమ్మే దిక్కైంది. ఆమె మద్దతు కోసం ఆ పార్టీ నేతలు తిప్పలు పడుతున్నట్లు సమాచారం. ఈనెల 22న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాటకీయ పరిణామాలతో రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన లేఖలో సింగిల్ విండో డెరైక్టర్ లక్ష్మమ్మ సంతకం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఆమె మద్దతు ఇస్తుందని తమ్ముళ్లు భావించారు. అయితే ఆమె చివరి క్షణంలో కనిపించకుండా పోయారు. ఆమెను కాంగ్రెస్ నేతలు చెరుకులపాడు నారాయణరెడ్డి, జడ్.శ్రీనివాసులురెడ్డి కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆమె భర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. నాటకీయ పరిణామాలతో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి.. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 30 వరకు స్టే ఇచ్చారు. ఇదిలా ఉండగా పోలీసులు లక్ష్మమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసులో గురువారం ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ఆత్మకూరులో పోలీసుల ఎదుట చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె అదే మాట మీద ఉంటారా? లేదా? అన్నది గురువారం తేలిపోనుంది.