సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేడీసీసీ బ్యాంక్ చైర్‌పర్సన్ శ్రీదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి డెరైక్టర్ లక్ష్మమ్మే దిక్కైంది. ఆమె మద్దతు కోసం ఆ పార్టీ నేతలు తిప్పలు పడుతున్నట్లు సమాచారం. ఈనెల 22న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాటకీయ పరిణామాలతో రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన లేఖలో సింగిల్ విండో డెరైక్టర్ లక్ష్మమ్మ సంతకం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఆమె మద్దతు ఇస్తుందని తమ్ముళ్లు భావించారు. అయితే ఆమె చివరి క్షణంలో కనిపించకుండా పోయారు. ఆమెను కాంగ్రెస్ నేతలు చెరుకులపాడు నారాయణరెడ్డి, జడ్.శ్రీనివాసులురెడ్డి కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆమె భర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. నాటకీయ పరిణామాలతో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి.. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 30 వరకు స్టే ఇచ్చారు. ఇదిలా ఉండగా పోలీసులు లక్ష్మమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసులో గురువారం ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ఆత్మకూరులో పోలీసుల ఎదుట చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె అదే మాట మీద ఉంటారా? లేదా? అన్నది గురువారం తేలిపోనుంది.
లక్ష్మమ్మ వాంగ్మూలమే కీలకం
Published Wed, Sep 24 2014 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement
Advertisement