అవిగ్నోన్(ఫ్రాన్స్): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్‌చేశానని ఏడుస్తూ చెప్పాడు.
వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్ పెలికోట్ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్‌మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్ పోలీసులకు పట్టుబడ్డాడు.
దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్‌లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్ మంగళవారం కోర్టులో మాట్లాడాడు. ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్‌కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్ భార్యను రేప్ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment