testimony
-
ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు
కడప అర్బన్: తాము చెప్పినట్టు వినకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించారని సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయాన్ని రవీంద్రారెడ్డి తరఫు న్యాయవాదులు నాగిరెడ్డి, ఓబులరెడ్డి మీడియాకు మంగళవారం తెలిపారు. న్యాయవాదులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్రా రవీంద్రారెడ్డిని ఈ నెల 4న రాత్రి పోలీసులు కడప తాలూకా పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చారు. తరువాత తనతో వచి్చన న్యాయవాది హరినాథరెడ్డి, స్నేహితుడు మహేశ్వర్‌రెడ్డిని పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఈ నేపథ్యంలోనే వర్రా రవీంద్రారెడ్డి హైదరాబాద్ వెళ్లారు.కాగా.. ఈ కేసు విషయమై జిల్లా ఎస్పీని బదిలీ చేయడంతో పాటు, సీఐని సస్పెండ్ చేశారని తెలిసి అతడు స్వచ్ఛందంగా లొంగిపోయేందుకు స్నేహితులైన వెంకటసుబ్బారెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డితో కలిసి కారులో కడప వస్తుండగా.. ఈ నెల 8న కర్నూలు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓ ఇంట్లోకి రవీంద్రారెడ్డిని తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఆ సమయంలో ఎన్కౌంటర్ చేసేందుకు వెనుకాడబోమని పోలీసులు అతడిని బెదిరించారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వకపోతే భార్యను, కుమార్తెను అథోగతి పాల్జేస్తామని రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, అతడి పీఏ రాఘవరెడ్డి ప్రోద్బలంతోనే వైఎస్ విజయమ్మ, వైఎస్ షరి్మల, వైఎస్ సునీతపై పోస్టింగ్‌లు చేశానని ఒప్పుకోవాలంటూ బలవంత పెట్టారు. తాము చెప్పినట్టు వినకపోతే ఎక్కువగా కేసులను పెట్టి జీవితాంతం జైలులో ఉండేలా చూస్తామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ కారణంగా తన శరీరంపై అయిన గాయాలను మెజిస్ట్రేట్‌కు రవీంద్రారెడ్డి చూపించారు. ఆలస్యంగా వైద్య పరీక్షలు కాగా.. వర్రా రవీంద్రారెడ్డితో పాటు అరెస్టు చేసిన గుర్రంపాటి వెంకట సుబ్బారెడ్డి, గురజాల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు సోమవారం రాత్రి 11 గంటల సమయంలో రిమ్స్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు. అనంతరం అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో కడపలోని పులివెందుల కోర్టు ఇన్చార్జ్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ వర్రా రవీంద్రారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు.మిగిలిన ఇద్దరు నిందితులకు 41ఏ నోటీసులు అందజేసి బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్రా రవీంద్రారెడ్డిని రిమాండ్ నిమిత్తం కడప కేంద్ర కారాగారంలోకి తీసుకెళ్లిన తరువాత రిమ్స్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో కడప కేంద్ర కారాగారానికి వర్రాను తరలించారు. కాగా అధికారులు మంగళవారం సాయంత్రం వరకు అతడిని వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లకపోవడం గమనార్హం. వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను అరెస్ట్ చేశాంసాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ కుమార్‌రెడ్డిలను అరెస్ట్ చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచామని పోలీసులు మంగళవారం హైకోర్టుకు నివేదించారు. ఈ ముగ్గురిలో రవీంద్రారెడ్డికి కోర్టు ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిందని తెలిపారు. మిగిలిన ఇద్దరి రిమాండ్‌ను కోర్టు తిరస్కరించిందన్నారు. ఈ వివరాలను హైకోర్టు రికార్డ్ చేసింది. ఇదిలావుంటే.. వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు విచారణ సందర్భంగా గాయపరిచిన విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై రాతపూర్వకంగా అఫిడవిట్ వేయాలని, దానిని పరిశీలించి తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే రవీంద్రారెడ్డి నిర్బంధానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. వర్రా రవీంద్రారెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి, సుబ్బారెడ్డి, ఉదయభాస్కర్‌రెడ్డి నిర్బంధంపై వారి సంబంధీకులు హైకోర్టులో వేర్వేరుగా హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వాళ్లలా నేనూ రేపిస్ట్‌నే
అవిగ్నోన్(ఫ్రాన్స్): అత్యంత జుగుప్సాకరమైన, అమానవీయ ఘటనకు వేదికగా నిలిచిన ఫ్రాన్స్‌లోని అత్యాచారాల పర్వంలో ప్రధాన నిందితుడు, బాధితురాలి మాజీ భర్త ఎట్టకేలకు తన తప్పును ఒప్పుకున్నాడు. తనను క్షమించాలని మాజీ భార్య, తన ముగ్గురు పిల్లలను వేడుకున్నాడు. అవిగ్నోన్ పట్టణంలోని కోర్టులో సెప్టెంబర్ రెండో తేదీన కేసులో వాదోపవాదనలు మొదలెట్టాక తొలిసారిగా నిందితుడు మంగళవారం తన తప్పును ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇచ్చారు. మిగతా రేపిస్టుల్లాగే తాను కూడా భార్యను రేప్చేశానని ఏడుస్తూ చెప్పాడు. వాంగ్మూలం ఇచ్చిన సమయంలో ప్రధాన నిందితుడితోపాటు దాదాపు 50 మంది ఇతర రేపిస్ట్ నిందితులూ కోర్టు హాలులోనే ఉన్నారు. గతంలో ప్రభుత్వరంగ సంస్థలో పనిచేసిన 71 ఏళ్ల డొమినిక్ పెలికోట్ తన భార్య గిసెలీకి భోజనంలో మత్తు మందు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ముక్కూముఖం తెలియని, దారిన పోయే వాళ్లను పిలిచి మరీ రేప్ చేయించాడు. ఇలా 72 మంది గిసెలీని 92 సార్లు రేప్‌చేశారు. ఈ అత్యాచారపర్వం పదేళ్లపాటు అంటే 2011 నుంచి 2020దాకా కొనసాగింది. అయితే 2020లో ఒక సూపర్మార్కెట్లో అమ్మాయిలను స్కర్టుల కింది నుంచి వీడియోలు తీస్తూ పెలికోట్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో ఇంటికొచ్చి అతని వస్తువులకు పోలీసులు తనిఖీచేశారు. దీంతో ఫోన్, కంప్యూటర్లో వెలుగుచూసిన అంశాలు చూసి పోలీసులే విస్తుపోయారు. భార్యను అపరిచితులు రేప్ చేస్తున్న డజన్ల కొద్దీ వీడియోలు, ఫొటోలు అందులో ఉన్నాయి. మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పెలికోట్ మంగళవారం కోర్టులో మాట్లాడాడు. ‘‘ ఎవరూ తప్పుడు నడవడికతో పుట్టరు. పరిస్థితులు అలా మారుస్తాయి’’ అని అన్నారు. నేరం రుజువైతే పెలికోట్కు కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. పెలికోట్ భార్యను రేప్ చేసిన వారిలో 26 ఏళ్ల యువకుల నుంచి 74 ఏళ్ల వృద్దుల వరకు ఉన్నారు. మత్తులోకి జారకముందే ఆమె తన సమ్మతి తెలిపిందని, భర్త తమతో ఇలా చేయిస్తున్నట్లు తమకు నిజంగా తెలియదని వారిలో చాలా మంది చెప్పడం గమనార్హం. -
US: ట్రంప్ కేసులో శృంగార తార స్టార్మీ సంచలన ప్రకటన
న్యూయార్క్: ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ఘన విజయం సాధించారు. దీంతో వివేక్ రామస్వామి లాంటి ప్రత్యర్థి ఏకంగా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వ పోటీ నుంచే తప్పుకున్నారు. ఇదిలాఉంటే ట్రంప్‌కు తాజాగా మరో న్యాయపరమైన తలనొప్పి వచ్చి పడింది. శృంగార స్టార్మీ డేనియల్స్ హుష్ మనీ కేసులో ట్రంప్‌కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబుతానని ప్రకటించి పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసులో మార్చిలో మన్‌హట్టన్ కోర్టు ముందు హాజరవుతానని చెప్పింది. 2016 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తనకు ట్రంప్ అక్రమ పద్ధతిలో పేమెంట్ ఇచ్చారని, ఇందు కోసం ఆయన తన బిజినెస్ రికార్డులను తారుమారు చేశారని స్టార్మీ ఆరోపిస్తోంది. తనకు ట్రంప్‌కు మధ్య అక్రమ సంబంధం ఉందని గతంలోనే ఆరోపణలు చేసి స్టార్మీ సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆమె కోర్టుకు వచ్చి ట్రంప్‌కు వ్యతిరేకంగా ఏం చెబుతుంది దాని పరిణామాలేంటన్నదానిపై ట్రంప్ వర్గంలో ఉత్కంఠ నెలకొంది. మరోపక్క ఇదే కేసులో ట్రంప్ తరపున వాదిస్తున్న అగ్రశ్రేణి న్యాయవాది జో టాకోపినా తాను ఇక ఆయన తరపున వాదించనని సోమవారం కోర్టుకు తెలిపారు. ఒక పక్క అధ్యక్ష ఎన్నికల రేసులో దూసుకుపోతున్న ట్రంప్‌కు కేసుల తలనొప్పి మాత్రం తగ్గడం లేదు. ఇదీచదవండి.. బ్యాంకులతో ఉక్రెయిన్ అధ్యక్షుడి చర్చలు -
Viveka Case: నా వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేశారు
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ.. హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన చార్జిషీట్లో తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నా వాంగ్మూలంపై సిబిఐ తప్పుడు వైఖరి "ఏప్రిల్ 29న నేను వాంగ్మూలం ఇస్తుండగా.. అధికారి మరొకరిని లోపలికి పిలిచారు. ఆయన లాప్‌ట్యాప్‌తో వచ్చి ఏదో రికార్డు చేసుకున్నాడు. ఆయన ఏం రికార్డు చేసింది నాకు చూపించలేదు. కనీసం చదివి వినిపించలేదు. నాకు తెలిసినంతవరకు నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు కూడా చేయలేదు. సీబీఐ నా స్టేట్మెంట్ను తప్పుడు రికార్డు చేసినట్లు మే 17న ఓ పత్రికలో ప్రచురితమైన వార్త ద్వారా తెలుసుకున్నా". విచారించింది ఒకరయితే, సంతకం చేసింది మరొకరా? "నా స్టేట్మెంట్పై సంతకం చేసిన అధికారి, నన్ను విచారించిన అధికారి ఒకరు కాదు. దర్యాప్తు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని రాజ్యాంగ ధర్మాసనాలు పదేపదే చెబుతున్నా.. కొందరు మాత్రం వాటిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు చేయడం అంటే అస్పష్టమైన సత్యాన్ని బయటికి తీసుకురావడం. కానీ, ఇక్కడ అధికారులు అలా వ్యవహరించలేదు." నా వాంగ్మూలం పత్రికకు సిబిఐ ఎలా లీక్ చేస్తుంది? "నా వాంగ్మూలం గురించి నేను ఎవరి వద్దా ప్రస్తావించలేదు. కానీ, ఆ పత్రికలో ఎలా వచ్చిందో నాకు అర్థంకాలేదు. ఆశ్చర్యం వేసింది. ఆ పత్రికలో పేర్కొన్నదంతా అసత్యపూరితం. పత్రికలో వచ్చిన దానిపై ఎలక్ట్రానిక్ మీడియా చర్చా కార్యక్రమాలు పెట్టడంతో నేను విలేకరుల సమావేశం పెట్టి.. ఆ పత్రికది కట్టుకథ అని చెప్పాల్సి వచ్చింది. సీబీఐ నమోదు చేసింది కూడా నేను చెప్పింది కాదని తెలిసింది. అయితే సీఆర్పీసీ 161 కింద రికార్డు చేసిన కాపీ నావద్ద లేనందున నా వాంగ్మూలం తప్పుగా పేర్కొన్న విషయాన్ని తెలుసుకోలేకపోయా" నేను చెప్పింది ఒకటయితే సిబిఐ మరోలా స్టేట్ మెంట్ తయారు చేస్తుందా? "ఏప్రిల్ 29, 2023న సీబీఐ నా నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. నేను చెప్పింది ఒకటయితే CBI దాన్ని మార్చి ఛార్జిషీటులో మరోలా పేర్కొంది. మార్చి 15, 2019న జగన్ గారి నివాసంలో సుమారు ఉదయం 5 గంటల సమయంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన సుమారు గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. OSD కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్‌గారు షాక్‌కు గురైయ్యారు. చిన్నాన్న చనిపోయారని తమతో అన్నారు" ఇంతకుమించి తానేమీ సీబీఐకి చెప్పలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. నేను చెప్పని విషయాలు మీరేలా స్టేట్ మెంట్ లో చేర్చుతారు? తాను CBIకి స్టేట్మెంట్లో కేవలం పైన పేర్కొన్న విషయాన్ని మాత్రమే చెప్పానని, కాని సీబీఐ ఛార్జిషీటులో వీటిని మార్చివేసిందని అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి భార్య ప్రస్తావన కాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదని అజేయ కల్లం తెలిపారు. అయితే సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో తనకు ఆపాదించి, తాను చెప్పినట్టుగా అబద్ధాలను చేర్చారని అజేయకల్లం పిటిషన్ లో పేర్కొన్నారు. CBI దాన్ని తొలగించాల్సిందే "దురదృష్టవశాత్తు నేను చెప్పింది CBI సరిగ్గా రికార్డు చేయలేదు. చార్జిషీట్లో సీబీఐ పేర్కొంది పూర్తిగా అసంబద్ధం. దర్యాప్తును తప్పుదారి పట్టించి.. ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ ఇలా తప్పుగా పేర్కొంది. నేను చెప్పకున్నా చెప్పినట్లు సీబీఐ తప్పుడు వాంగ్మూలాన్ని సమర్పించడం ఎంతమాత్రం సరికాదు. ఇతర వ్యక్తులను చిక్కుల్లో పడేసేందుకే సీబీఐ తప్పుడు సమాచారం చేర్చింది. ఈ అంశాలను పరిశీలించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో సమర్పించిన చార్జిషీట్ నుంచి తప్పుడు వాంగ్మూలాన్ని తొలగించాలి". తెలంగాణ హైకోర్టు ఆ ఛార్జ్ షీట్ నుంచి తన వాంగ్మూలం తొలగించేలా ఆదేశాలివ్వాలని అజేయ కల్లం విజ్ఞప్తి చేశారు. వివక్ష లేకుండా విచారణ జరగాలి సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా రికార్డు చేయడం చట్టవిరుద్ధమని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని అజేయకల్లం విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ లో సీబీఐ డైరెక్టర్ని, వివేకా కేసు విచారణాధికారి (ఏఎస్పీ)ని ప్రతివాదులుగా చేర్చారు. -
‘మీడియా దాడితో ఈ క్షణం దాకా బాధపడుతున్నా!’
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో వందేళ్ల తర్వాత ఓ కీలక పరిణామం జరిగింది. సుమారు 130 ఏళ్ల తర్వాత.. తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అతనే ప్రిన్స్ హ్యారీ(38). కింగ్ ఛార్లెస్ రెండో తనయుడు. ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా మంగళవారం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు హ్యారీ. మీడియా దాడితో నేను జీవితాంతం బాధపడుతున్నా. కొన్ని టాబ్లాయిడ్లు, ఛానెల్స్, వెబ్సైట్లు.. తమ చేతులకు రక్తపు మరకలు అంటించుకుని తిరుగుతున్నాయి. వాళ్ల నిరంతర టీఆర్పీ రేటింగ్.. రీడర్‌షిప్‌ల దాహార్తికి నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అది నేటి వరకు.. ఈ క్షణం దాకా కూడా.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. తనను చెడ్డొడిగా చూపిస్తూ బ్రిటన్ మీడియా లాభపడుతోందంటూ ఆరోపించారాయన. ప్రత్యక్ష సాక్షి హోదాలో కోర్టు బోనెక్కిన ప్రిన్స్ ఛార్లెస్.. ఎవరైనా ఈ మీడియా పిచ్చికి అడ్డుకట్ట వేయకముందే వాళ్ల టైపింగ్ వేళ్లను ఎంత రక్తం ముంచేస్తుందో అంటూ తనపై వస్తున్న కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్లేబాయ్ ప్రిన్స్, ఫెయిల్యూర్, డ్రాప్‌అవుట్, మోసగాడు, తాగుబోతు, ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి.. ఇలా ఆ మీడియా తనపై అల్లిన కథనాల జాబితా పెద్దదేనంటూ కోర్టుకు తెలిపారాయన. టీనేజర్‌గా ఉన్నప్పుడు, ట్వంటీస్‌లో ఉన్నప్పుడు.. మీడియా నీచమైన రాతలను తాను చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ రాజకుటుంబం సహా అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఫోన్ హ్యాకింగ్ కేసు. ప్రిన్స్ హ్యారీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై సదరు మీడియా హౌజ్‌ను కోర్టుకు లాగారు. ఇక రాజకుటుంబానికి దూరంగా.. తన భార్య మేఘన్ మర్కెల్, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు ప్రిన్స్ హ్యారీ. సోమవారమే లండన్ చేరుకున్నప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం న్యాయస్థానంలో హాజరు అయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో హ్యారీ.. న్యాయమూర్తికి వివరించారు. చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించారని, ఒకానొక టైంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను సైతం ఉపయోగించారని హ్యారీ కోర్టుకు వివరించారు. 130 ఏళ్ల కిందట ఆయన.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఆయన రాజు కాకమునుపే ఈ రెండూ జరిగాయి. -
నా వాంగ్మూలం పేరుతో అసత్యాలు ప్రచురించారు: వైఎస్ అభిషేక్ రెడ్డి
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలం పేరిట మీడియాలో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని వైఎస్ కుటుంబీకుడైన వైఎస్ అభిషేక్‌రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు తనను అడగని అంశాలు, తాను చెప్పని విషయాలను తన వాంగ్మూలంగా మీడియా ప్రచురించడాన్ని ఖండించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు తనకు ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా దురుద్దేశపూరితంగా వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. ఈ మేరకు అభిషేక్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ.. సీబీఐకి నేను చెప్పిన విషయాలు ఇవీ...: గత ఏడాది ఆగస్టు 11న సీబీఐ అధికారులు పిలిస్తే వెళ్లి కలిశా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని తెలిసిన రోజు వివరాలు అడిగితే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పా. 2019 మార్చి 15న ఉదయం డి.శివశంకర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి వివేకా ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లేసరికే అక్కడ కొంతమంది గుమిగూడి ఉన్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న శివశంకర్‌రెడ్డి నన్ను చూడగానే లోపలికి వెళ్లి చూడు అని చెప్పాడు. నన్ను ఎంతో అభిమానించేవారు..: నేను ఇంటిలోపలికి వెళ్లా. బెడ్రూమ్లో ఎవరూ లేరు. బాత్రూమ్లో కొందరు ఉన్నారు. కమోడ్ పక్కన వివేకానందరెడ్డి పడి ఉన్నారు. ఆయన చనిపోయారని అర్థమైంది. నిశ్చేష్టుడినైపోయా. వివేకానందరెడ్డి నన్ను ఎంతో అభిమానించేవారు. షాక్‌కి గురయ్యా..: వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్‌గా ఉంటూ ప్రజాజీవితంలోకి వచ్చారు. నేనూ అలానే ఉండాలని చెప్పేవారు. నా బాగు కోసం అంత శ్రద్ధ చూపించే ఆయన చనిపోవడం షాక్‌కు గురిచేసింది. ఆ తరువాత మా ఇంటికి వచ్చేశా. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలియడంతో అక్కడకు వెళ్లా. అదే విషయాలను సీబీఐ అధికారులకు చెప్పా. శత్రువులు లేరు..: వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసి ఉండొచ్చని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు ఎవరూ శత్రువులు లేరు...ఎవరు హత్య చేసి ఉంటారో అర్థం కావడం లేదని చెప్పా. వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం: నేను సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం అంటూ కొన్ని పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసి విభ్రాంతికి గురయ్యా. సీబీఐ అధికారులు నన్ను అడగని అంశాలు, నేను చెప్పని విషయాలు నా వాంగ్మూలం పేరిట పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివేకా గుండెపోటుతో చనిపోయారని డి.శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లుగా ఉంది. నాకు ఆయన అలా చెప్పలేదు. నేను వెళ్లిన సమయంలో అక్కడ క్రైమ్ సీన్ గురించి గానీ పోలీసులు ఎవరు ఉన్నారా? అనిగానీ సీబీఐ అధికారులు నన్ను అడగలేదు. ఆ విషయాలు చెప్పినట్లుగా నా పేరుతో వాంగ్మూలం అంటూ మీడియాలో రావడం షాక్‌కు గురి చేసింది. ఎన్నో ఏళ్లుగా దుష్ప్రచారం..: టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు ఓ వర్గం మీడియా వైఎస్సార్ కుటుంబంపై ఎన్నో ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తోంది. అదే మీడియా నేను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా ప్రముఖంగా ప్రచురించి మా కుటుంబంపై బురద జల్లుతోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. వీటిని న్యాయబద్ధంగా ఎదుర్కొని తిప్పికొడతాం. -
అమ్మకాలకే అవకాశం.. మార్కెట్‌పై ఉక్రెయిన్–రష్యా అనిశ్చితి
ముంబై: ఉక్రెయిన్–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ టెస్టిమోనీపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్ మార్కెట్‌పై ట్రేడింగ్ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి. ప్రభావితం చేసే అంశాలు.. ► ఉక్రెయిన్ రష్యా సంక్షోభం ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు. ► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఎస్బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. ► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్ ఎఫెక్ట్ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్, జజాజ్ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్ మోటార్స్, ఎంఅండ్ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ కావచ్చు. ► బుధవారం పావెల్ టెస్టిమోనీ ప్రసంగం ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అమెరికా కాంగ్రెస్ ఎదుట బుధవారం యూఎస్ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్ రిజర్వ్ వైఖరి వెల్లడించనున్నారు. ► తయారీ, సేవల రంగ గణాంకాలు ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్ వైరస్ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు. ► వరుసగా ఐదోనెల అమ్మకాలే... దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా తెలిపారు. ట్రేడింగ్ నాలుగు రోజులే... మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్ వర్గాలకు ఊరటనిచ్చింది. -
‘దిశ’ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్‌ను ఎందుకు నియమించారో తనకు తెలియదని మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్ఓటీ) సబ్ ఇన్స్పెక్టర్ షేక్ లాల్ మదార్ అన్నారు. పోలీసులు చట్టబద్దంగా వ్యవహరిస్తే సిర్పుర్కర్ కమిషన్ నియమించాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని కమిషన్ అడగ్గా, ఏమో తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి, న్యాయపరంగా శిక్షిస్తే పోలీసులకు కీర్తి వచ్చేది కదా అని ప్రశ్నించగా.. తనకు తెలియదని పేర్కొన్నారు. ముద్దాయిల అరెస్టును ప్రజలు హర్షించారా అని అడగగా.. తనకు తెలియదని చెప్పారు. సిర్పుర్కర్ కమిషన్‌కు గురువారం లాల్మదార్ ఇచ్చిన వాంగ్మూలాలలో కీలకమైన అంశాలివీ.. లాంగ్ రేంజ్ వెపన్ ఎక్కడిది? ‘దిశ’సంఘటన సమయంలో మీరు సబ్ ఇన్స్పెక్టర్ కదా మరి లాంగ్ రేంజ్ (షోల్డర్) వెపన్ ఎలా ఉందని కమిషన్ ప్రశ్నించగా.. ‘‘దిశ సంఘటన కంటే రెండు రోజుల ముందు (2019 డిసెంబర్ 4) నేను నార్సింగి ఎస్ఓటీలో రిపోర్ట్ చేశాను. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌రెడ్డి.. ‘షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ నన్ను లాంగ్ వెపన్ తీసుకురమ్మన్నారు’అని నాతో చెప్పాడు. నాతో పాటు వచ్చిన ఐదుగురు పోలీసులు ఆయుధాలు తీసుకోగా.. అక్కడ మిగిలింది ఏకే–47 ఒక్కటే. అందుకు అదే తీసుకున్నాను’’అని వివరించారు. ఎవరెవరు ఏ తుపాకులు తీసుకున్నారని ప్రశ్నించగా.. నాతో పాటు ఎస్ఐ బాలరాజు ఏకే–47 తీసుకోగా.. ఎస్.సుమన్, రవి, హెడ్ కానిస్టేబుల్ బండయ్య, సిరాజుద్దీన్ నలుగురు ఎస్ఎల్ఆర్లు తీసుకున్నారని తెలిపారు. విధి నిర్వహణలో తాను ఇప్పటివరకు ఎప్పుడూ ఏకే–47 వినియోగించలేదని పేర్కొన్నారు. ఎన్హెచ్ఆర్సీ వాళ్లు ఒత్తిడి చేశారు.. దిశ ఎన్‌కౌంటర్‌పై విచారించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) బృందం ఆమన్‌గల్ ఎస్‌హెచ్‌వో కొండా నరసింహారెడ్డి లాగే తనను కూడా ఒత్తిడి చేసిందని త్రిసభ్య కమిటీకి వాంగ్మూలం ఇచ్చారు. నిందితులు ఎక్కడున్నారు? ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఎస్కార్ట్ పోలీసులు ఏ పొజిషన్లో ఉన్నారు? పంచ్ విట్నెస్లు ఎక్కడున్నారు.. ఇలా ఘటనకు సంబంధించిన అన్ని స్కెచ్లను ఎన్హెచ్ఆర్సీ సభ్యులే గీశారని, పైగా వాళ్లు చెప్పిన చోటే మార్కింగ్, సంతకాలు చేయాలని బలవంతం చేశారని వివరించారు. తాను నిరాకరించడంతో 9 గంటల పాటు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. దీని గురించి ఏసీపీ సురేందర్‌కు మాత్రం మౌఖికంగా తెలిపానని చెప్పారు. ఎన్కౌంటర్ మీ ఉద్దేశం కాకపోతే.. నిందితులను ఎన్కౌంటర్ చేయడం పోలీసులు ఉద్దేశం కాకపోతే ముద్దాయిల నడుము కింది భాగంలో కాల్పులు జరపాలి కదా అని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ముందుగా నిందితులే ఫైరింగ్ ప్రారంభించారని, దీంతో వాళ్ల మైండ్ డైవర్ట్ చేయడానికి శబ్దం వచ్చిన వైపు ఎదురు కాల్పులు జరిపానని తెలిపారు. నిందితులు పోలీసుల తుపాకులు లాక్కొని ఎందుకు పరిగెత్తారని అడగగా.. తనకి తెలియదని చెప్పారు. ఆరీఫ్ ముందుగా ఫైరింగ్ చేయగానే అక్కడు న్న పోలీసులందరూ అక్కడున్న రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న గట్టు కింది భాగం లో రక్షిత ప్రదేశంలోనే పడుకున్నారు కదా.. మరి మీరెందుకు నిందితుల నడుము పైభాగంలో కాల్పులు జరిపారని త్రిసభ్య కమిటీ ప్రశ్నిం చింది. నలుగురు నిందితులు పారిపోతున్న ప్రాంతం తమ కంటే ఎత్తులో ఉందని, దీంతో కాల్పులు మాకు తగిలే అవకాశం ఉండటంతో ఎదురు కాల్పులు చేశామని వివరించారు. నా కళ్లల్లో కూడా మట్టి పడింది.. పారిపోయేందుకు ప్రయత్నించిన మహ్మద్ ఆరీఫ్‌ను.. అతడి వెనకాలే ఉన్న షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ పట్టుకోవటానికి ప్రయత్నించలేదా? అని ప్రశ్నించగా.. హెడ్ కానిస్టేబుల్ జానకీరాం, ఎస్‌హెచ్‌వో నరసింహారెడ్డి కళ్లలో ఆరీఫ్ మట్టి విసరడంతో.. ఆ మట్టి తన కళ్లల్లోనూ పడిందని, దీంతో చూడలేకపోయానని సమాధానం ఇచ్చాడు. నిందితులు పారిపోతుండగా ఏసీపీ కాల్పులు జరపమని ఆదేశించగా.. 8–10 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపానని చెప్పారు. కాల్పులు జరిపిన పోలీసుల సెల్ఫోన్లు తీసుకున్నారు.. 2019 డిసెంబర్ 6న ఉదయం 7:59 నుంచి 8:02 గంటల వరకు చటాన్‌పల్లిలో ఉన్న మీ సెల్‌ఫోన్ నంబర్ టవర్ లొకేషన్ ఆ తర్వాత ఉదయం 9:49 నుంచి 11:55 గంటల మధ్య మహరాజ్‌పేట, సాయంత్రం 6:09 గంటలకు నార్సింగి, సాయంత్రం 6:11 గంటలకు గ్రేహౌండ్స్, 6:19 గంటలకు కొత్వాల్‌గూడలో ఆ తర్వాత శంషాబాద్‌లో ఎందుకు చూపించిందని త్రిసభ్య కమిటీ ప్రశ్నించగా.. ఎన్కౌంటర్ జరిగిన తర్వాత తాము ఫోన్లో మాట్లాడుతున్నామని చెప్పి తనతో పాటు సిరాజుద్దీన్, రవి, నరసింహారెడ్డిల సెల్ఫోన్లను షాద్‌నగర్ ఎస్హెచ్ఓ తీసుకున్నారని వివరించారు. తన ఫోన్‌కు లాక్ లేకపోవటంతో ఎవరైనా వినియోగించుకునే అవకాశముందని తెలిపారు. నేర నిరూపణలో సెల్‌ఫోన్ కీలకమని మీకు తెలియదా అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
అక్కడ అసలేం జరిగింది?
సాక్షి, రాజేంద్రనగర్ : చటాన్‌పల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) ప్రతినిధుల బృందం దిశ కుటుంబ సభ్యులు, ఎన్కౌంటర్లో మృతిచెందిన నిందితుల కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవడంతో పాటు వివరాలు సేకరించింది. ‘తప్పు చేసిన మా బిడ్డలను శిక్షించమనే చెప్పాం. మా బిడ్డలను అన్యాయంగా కాల్చి చంపారు..’ అంటూ ఎన్కౌంటర్ మృతుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు హత్యాచార ఘటన గురించి దిశ తండ్రితో పాటు సోదరిని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు అడిగి తెలుసున్నారు. ఆదివారం హిమాయత్‌సాగర్‌లోని రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో వీరందరి నుంచి ఎన్హెచ్ఆర్సీ బృందం స్టేట్మెంట్ రికార్డు చేసింది. సాయంత్రం 5.40 గంటల సమయం ప్రత్యేక వాహనంలో పోలీసులు దిశ తండ్రితో పాటు సోదరిని పోలీస్ అకాడమీకి తీసుకొచ్చారు. అంతకుముందు ఉదయం మూడు వాహనాల్లో ఎన్కౌంటర్లో మృతి చెందిన నిందితుల కుటుంబ సభ్యులను తీసుకొచ్చి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ఎన్కౌంటర్ గురించి ఏమీ అడగలేదు : దిశ కుటుంబీకులు దిశ హత్యాచారం ఘటన రోజు వివరాలను మాత్రమే ఎన్హెచ్ఆర్సీ బృందం అడిగి తెలుసుకుందని ఆమె తండ్రి, సోదరి వెల్లడించారు. విచారణ అనంతరం పోలీస్ అకాడమీ నుంచి బయటకు వచ్చిన వారిని మీడియా ప్రశ్నించగా.. కేవలం సంఘటన జరిగిన రోజు తమకు ఎలా తెలిసిందో వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి ప్రశ్నలు అడగలేదని స్పష్టం చేశారు. మాకు న్యాయం చేయండి.. మక్తల్ : ‘కోర్టు తీర్పు రాకముందే మా బిడ్డలను అన్యాయంగా ఎన్కౌంటర్ చేశారు. మాకు న్యాయం చేయండి’ అంటూ ఎన్కౌంటర్లో మృతి చెందిన నలుగురి కుటుంబీకులు ఎన్హెచ్ఆర్సీ బృందం ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా పోలీసు ప్రత్యేక బృందం మహ్మద్ పాషా తండ్రి ఆరిఫ్ హుస్సేన్, నవీన్ తల్లి లక్ష్మి, శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కుర్మన్నలను ప్రత్యేక వాహనంలో బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యుల వద్దకు తీసుకెళ్లారు. తిరిగి రాత్రి 8 గంటలకు వారి ఇళ్ల వద్ద వదిలేశారు. అయితే నిందితుల తల్లిదండ్రులతో ఒకరి తర్వాత ఒకరితో ఎన్హెచ్ఆర్సీ బృందం సభ్యులు 2 గంటల పాటు మాట్లాడిన ట్లు తెలుస్తోంది. మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉండేది.. ఎందుకిలా ప్రవర్తించారు.. ఇంటి నుంచి ఎప్పుడెళ్లారు.. సంఘటనలో పోలీసులు వారిని ఎప్పుడు తీసుకెళ్లారు.. ఆ తర్వాతేం జరిగింది.. పోలీసుల ఎన్కౌంటర్లో చనిపోయిన మీ బిడ్డలపై మీరు ఏమనుకుంటున్నారు..?’ అని ఎన్హెచ్ఆర్సీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. అదే చివరి చూపైంది.. ‘పోయిన శుక్రవారం ఉదయం 3.30 గంటలకు మా బిడ్డలను లారీ ఓనర్ శ్రీనివాస్‌రెడ్డితో వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్తున్నారని మా బిడ్డలను అడిగితే ఓ అమ్మాయి బైక్ అడ్డు రావడంతో యాక్సిడెంట్లో చనిపోయిందని.. అందుకే తీసుకెళ్తున్నాం అని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఓ ఆడపిల్లను పెట్రోల్ పోసి అంటించి చంపింది మీ పిల్లలనే అని పక్కన వారు వచ్చి చెబితేనే తెలిసింది. ఆ తర్వాత రోజు పోలీసులు షాద్‌నగర్‌కు పిలిపించి సంతకాలు పెట్టించుకున్నారు. అంతే అదే చివరిగా మా పిల్లలను చూడడం.. మాట్లాడటం. ఆ తర్వాత టోల్గేట్ వద్ద వచ్చి విడిచిపెట్టిపోయారు. సరిగ్గా వారం తర్వాత శుక్రవారం రోజు ఉదయం 7 గంటలకు మా బిడ్డలను పోలీసులు ఎన్కౌంటర్ చేశారని తెలిసింది. తప్పు చేస్తే శిక్షించమనే చెప్పాం. కానీ ఇలా చేస్తారని అనుకోలేదు’ అని మృతుల తల్లిదండ్రులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు చెప్పినట్లు తెలిసింది. చెన్నకేశవులు భార్య గర్భిణిగా ఉందని, ఆమెకు న్యాయం చేయాలంటూ చెన్నకేశవులు తండ్రి కుర్మన్న వారిని వేడుకున్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను ఎప్పుడిస్తారు సారూ? తమ పిల్లల మృతదేహాలను ఎప్పుడిస్తారంటూ ఎన్హెచ్ఆర్సీ సభ్యులను తల్లిదండ్రులు అడిగినట్లు తెలుస్తోంది. ‘సోమవారం హైకోర్టు తీర్పు ఉంది.. ఆ తర్వాత మేము మీకు సమాచారమిస్తాం.. మీ పిల్లల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. ఎప్పుడిస్తామనేది సోమవారం తెలుస్తుంది’.. అని సముదాయించినట్లు సమాచారం. ఆ పోలీసులను విచారించినఎన్హెచ్ఆర్సీ బృందం.. మరో రెండ్రోజులు ఎన్హెచ్ఆర్సీ బృంద సభ్యులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇప్పటికే ఘటనపై నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులను ఎన్హెచ్ఆర్సీ బృందం ఆదేశించిన నేపథ్యంలో వారు ఫోరెన్సిక్, రెవెన్యూ రిపోర్టులతో కలిపి ఓ నివేదికను తయారుచేస్తున్నారు. నవంబర్ 27 దిశ కిడ్నాప్, లైంగికదాడి, హత్య, దహనం నుంచి డిసెంబర్ 6న ఎన్కౌంటర్ వరకు జరిగిన అన్ని విషయాలపై పక్కాగా నివేదిక రూపొందిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఎన్హెచ్ఆర్సీ బృందానికి నివేదిక ఇచ్చే పనిలో తలమునకలయ్యారు. ఆదివారం ఎన్హెచ్ఆర్సీ బృందం ఎన్కౌంటర్లో గాయపడి గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను విచారించింది. ఇక నేడు లేదా రేపు మిగిలిన పోలీసులనూ విచారిస్తారని సమాచారం. గుంతల పూడ్చివేత.. ఎన్కౌంటర్ మృతుల అంత్యక్రియల కోసం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో తవ్విన గుంతల్లో ఆదివారం టెంకాయలు వేసి పూడ్చేశారు. మృతదేహాలు వచ్చిన తర్వాత వాటిలో ఉన్న మట్టిని తొలగించి అంత్యక్రియలు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా!
థానె: గత ఐదారేళ్లుగా క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు బాలీవుడ్ నటుడు, నిర్మాత అర్బాజ్ ఖాన్ అంగీకరించారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్–11వ సీజన్లో మాత్రం దాని జోలికిపోలేదని అన్నారు. ఈమధ్యే గుట్టురట్టయిన ఐపీఎల్ బెట్టింగ్ ముఠా కేసులో ఆయన శనివారం థానె పోలీసుల ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఐపీఎల్లో బెట్టింగ్‌కు పాల్పడిన దావూద్ అనుచరుడు, బుకీ సోనూ జలన్ అరెస్టయిన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని శుక్రవారం పోలీసులు అర్బాజ్‌కు సమన్లు పంపిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ వ్యవహారంలో మే 15న జలన్ సహా నలుగురు అరెస్టయ్యారు. సోనూను విచారిస్తుండగా జలన్‌తో అర్బాజ్ ఖాన్కున్న సంబంధం, బెట్టింగ్ వివరాలు వెల్లడయ్యాయి. బెట్టింగ్‌లో జలన్కు రూ.2.80 కోట్లు కోల్పోయిన అర్బాజ్, ఆ మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతుండటంతో జలన్ నుంచి బెదిరింపులు కూడా వచ్చినట్లు విచారణలో తేలింది. అటు, బెట్టింగ్‌లో ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు భాగస్వామ్యముందని పోలీసులకు జలన్ వెల్లడించారు. ఆయన కూడా విచారణకు హాజరుకావాలని త్వరలోనే సమన్లు జారీచేస్తామని పోలీసులు తెలిపారు. ఆ నిర్మాత ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సినీ నిర్మాణ, పంపిణీ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ వల్లే మలైకాతో విడాకులు! బెట్టింగ్ వ్యసనమే అర్బాజ్ వైవాహిక జీవితాన్ని నాశనం చేసినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లో పాల్గొనవద్దని భార్య మలైకా అరోరా ఎంత నచ్చజెప్పినా అర్బాజ్ పెడచెవిన పెట్టినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పటికే దెబ్బతిన్న వారి సంబంధాలు బెట్టింగ్ వల్ల మరింత క్షీణించాయని వెల్లడించాయి. సోదరులు సల్మాన్‌ఖాన్, సొహైల్ ఖాన్లు కూడా అర్బాజ్ అలవాటును మాన్పించేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు తెలిసింది. విడిపోతున్నామని 2016లోనే ప్రకటించిన అర్బాజ్–మలైకా దంపతులకు గతేడాది నవంబర్‌లో విడాకులు మంజూరయ్యాయి. తమ విడాకులపై వచ్చిన పలు కట్టుకథలను వారు ఖండించారు. విడిపోయిన తరువాత కూడా వారిద్దరు 15 ఏళ్ల కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్నేహపూర్వకంగానే మెలుగుతున్నారు. -
కోరిక తీర్చనందుకే హత్య చేశా!
చెన్నై : తన కోరిక తీర్చనందున మరదల్ని హత్య చేసినట్లు హంతకుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బుధవారం వెల్లడించాడు. తిరువారూరు జిల్లా, నీడామంగళం సమీపం మేలానవందసేరికి చెందిన జోసెఫ్ రాజశేకరన్ భార్య ఎస్తర్ (25)ను ఆమె భర్త అన్న నెల్సన్ హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా నరికి హార్బర్ సముద్రంలో పడేశాడు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈకేసుపై విచారణ జరిపిన పోలీసులు, హంతకుడు నెల్సన్‌ను మంగళవారం అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. మరదలుపై పుట్టిన దుర్భుద్దితో నెల్సన్ పధకం ప్రకారం ఈనెల ఐదున భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. ఆరవ తేదీన తల్లి నక్షత్రమేరిని పొలం పనికి పంపించాడు. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న మరదలు ఎస్తర్‌ను తన కోరిక తీర్చమని అడగడంతో ఆమె నిరాకరించింది. అంతేకాకుండా సింగపూర్‌లో ఉన్న తన భర్తకు ఫోన్ చేసి విషయం చెబుతానని, హెచ్చరించింది. దీంతో ఆగ్రహించిన నెల్సన్ తన స్నేహితుడు సహాయరాజ్తో కలిసి ఆమెను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో వేసి సముద్రంలో పారేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఇలావుండగా ఎస్తర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు గురువారం బంధువులకు అప్పగించారు. -
ఆ ఇద్దరు ఎవరు?
నిప్పు ఉంటేనే నీడలుంటాయి... నిజానికి నిప్పు మండుతుంటేనే నీడలు కూడా ఎగసి పడుతుంటాయి. ఈ కథలో ఆ నిప్పుకు కారణమే రెండు నీడలు. ఆ నీడలు ఏమిటి? నిప్పు ఎందుకు పెట్టాయి? చనిపోయే ముందు ఇచ్చే వాంగ్మూలం ఏ కేసులో అయినా కీలకమైనది.ఆ అక్కాచెల్లెళ్లు రోజూ సాయంత్రం పూట గార్డెన్‌కు వస్తారు వాకింగ్‌కు. అక్క పేరు అశ్విని. చెల్లి పేరు ఉష. అక్కకు వయసు 27 ఉంటాయి. చెల్లెలికి 22. ఇద్దరూ çకబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ ఉంటారు.కాని చాలాసార్లు అక్క పూర్తిగా నడవదు. సిమెంటు బెంచీ మీద కూలబడుతూ ఉంటుంది.‘రా.. అక్కా... నడూ’ అని పిలుస్తుంటుంది చెల్లెలు.అక్క సమాధానం చెప్పదు. ఏదో చిరాగ్గా అయిపోతుంది.‘ఎంత నడిచినా ఏం ప్రయోజనం నువ్వెళ్లు’ అంటుంది.‘నడవాలక్కా... నడిస్తేనే తగ్గుతావ్ నువ్వు’ చెల్లెలు బతిమాలుతుంది.అక్క మళ్లీ లేచి నిలబడుతుంది.వాకింగ్ చేస్తున్న ఒక ముసలావిడ రోజూ చెల్లెలితో ఒకే మాట అంటుంటుంది– ‘ఏయ్ పిల్లా.. నా కొడుకును చేసుకోవే. మంచి అందగాడు’....చెల్లెలికి ఆమెను చూస్తే భయం. అక్క వైపు భయం భయంగా చూస్తుంది.‘అదీ... అక్క పెళ్లయ్యాక’ నసుగుతుంది. ఆమె అక్కను ఎగాదిగా చూసి ‘మీ అక్క పెళ్లా... ఎప్పటికి జరిగేను’ అని వెళ్లిపోతుంది.అక్క కళ్లల్లో ఆ క్షణంలో నీళ్లు చిమ్ముతాయి. చెల్లెలు ఊరడింపుగా అంటుంది–‘అక్కా... అలా బాధ పడకు. ఏదో ఒక అబ్బాయికి నువ్వు నచ్చుతావు. అలాంటివాడు వస్తాడు. అసలు నువ్వు పట్టించుకోవుగాని వాకింగ్‌లో నిన్ను గమనించేవాళ్లు ఎంతమంది ఉంటారో తెలుసా?’‘నీ ముఖం నన్నెవరు చూస్తారే?’‘అయ్యో... నీకేం తక్కువక్కా... సూపర్‌గా ఉంటావు’చెల్లెలు నవ్వించే ప్రయత్నం చేసింది.అక్క ఆ నవ్వులో నవ్వు కలుపుతూ నిస్పృహగా నవ్వింది.2017 డిసెంబర్ నెల 6:30. విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోన్ అదే పనిగా రింగ్ అవుతోంది. ఎస్.ఐ ఫోన్ ఎత్తాడు.‘సార్... గార్డెన్లో అమ్మాయి చావుబ తుకుల్లో ఉంది. ఎవరో తగులబెట్టారు’.. వాచ్మెన్ వగరుస్తూ చెబుతున్నాడు.వెంటనే పోలీసులు హడావిడిగా సంఘటనా స్థలానికి బయల్దేరారు. పోలీసు జీప్తో పాటు 108 వెహికల్ కూడా క్షణం తేడాతో వచ్చి ఆగాయి. చుట్టూ జనం. మంటల్లో కాలి, కొనఊపిరితో పడి ఉన్న యువతి. ఒకమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలు బాదుకుంది.‘అక్కా.. అక్కా’ క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.బర్నింగ్ వార్డ్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం కష్టంగా ఉంటుంది. అదో రకమైన కమురు వాసన నిండి ఉంటుంది. చావుబతుకుల్లో ఉన్న వారి హాహాకారులు వినడం చాలా కష్టం. జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డు చేయడానికి ముక్కులకు కర్చీఫ్ కట్టుకుని కూర్చున్నారు.‘దాహం.. దాహం’ అందా అమ్మాయి.‘నీళ్లు తర్వాత ఇస్తారు... ముందు ఏం జరిగిందో చెప్పమ్మా’అతి కష్టం మీద చెప్పడం మొదలుపెట్టింది.‘నా పేరు అశ్విని. సాయం త్రం ఐదు గంటల సమయంలో ఊరి చివరన ఉన్న గార్డెన్‌కి రోజులాగే వాకింగ్‌కి వెళ్లాను. చెల్లెలు పనిఉండి రాలేదు. సాయంత్రం ఆరున్నర వరకు అక్కడే ఉన్నాను. అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు నా ముందుకొచ్చారు. వాళ్లను చూసి భయపడ్డాను. పారిపోవడానికి ప్రయత్నించాను. కానీ, వారిద్దరిలో ఒకరు నన్ను పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ నా మీద పోసి, నిప్పంటించి పరారయ్యారు...’ చెబుతూనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది అశ్వని. పోలీస్ యంత్రాంగం ఆలోచనలో పడిపోయింది.సంఘటనా స్ధలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి ఆధారాలు దొరకలేదు.అశ్వని రాత్రి 12 గంటలకు చనిపోయింది.పోలీసులకు తెల్లవార్లూ నిద్రల్లేవు. ఆమె బతికి ఉంటే ఇంకొన్ని వివరాలు తెలిసేవి. ఇప్పుడు ఆమె ఇచ్చిన వాంగ్మూలమే ముఖ్యమైన క్లూగా మిగిలింది. చనిపోయే వ్యక్తి ఇచ్చే వాంగ్మూలం చాలా ముఖ్యమైనది. దాని ఆధారంగా చూస్తే ఆమె మీద దాడి చేసిన వారు ఎవరు? అశ్వని తల్లీ, తండ్రి, చెల్లెలు ఉషతో మాట్లాడారు పోలీసులు.‘రోజులాగే గార్డెన్‌కి వాకింగ్‌కని వెళ్లింది సార్. ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు’ అంది దుఃఖాన్ని దిగమింగుకుంటూ తల్లి. గార్డెన్ పరిసర ప్రాంతాలను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. వాకబు చేస్తే ఇద్దరు యువకులు ఆ సమయంలో గార్డెన్ నుంచి బయటకు వెళ్లారని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడంతో వాళ్లెవరో గుర్తించలేకపోయారు. కాని ఒక రిటైర్డ్ టీచర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.‘సార్... వాళ్లు నాకు తెలుసు. ఇక్కడకు దగ్గరలోనే ఉంటారు’ అని చెప్పాడు.పోలీసులు నిమిషం ఆలస్యం చేయలేదు. రవి, శ్రీకాంత్ అనే ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.‘సార్.. మాకేమీ తెలియదు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాం. బోరు కొడుతుందని రోజూ సాయంత్రం వాకింగ్‌కి వస్తూ ఉంటాం’ అన్నారు వాళ్లు.వయసులో ఉన్న కుర్రవాళ్లు. వీళ్లు చేస్తే అత్యాచార యత్నం చేయాలి. హత్య ఎందుకు చేశారు. వాళ్లను గట్టిగా మళ్లీ విచారించారు.‘ఎన్నిసార్లు విచారించినా అదే సమాధానం చెప్తున్నారంటే వీళ్లు ట్రైన్డ్ నేరస్తుల్లా ఉన్నారు’ అనుకున్నారు పోలీసులు. వాళ్ల నోరు విప్పించే ఆధారాల కోసం మళ్లీ అన్వేషణ సాగించారు. ఈసారి రెండు మూడు బృందాలు రంగంలోకి దిగాయి. పగలూ రాత్రీ గార్డెన్‌ని జల్లెడపట్టాయి. దొరికిన ఆధారాలు ఇలా ఉన్నాయి.∙సంఘటన జరిగిన ప్రాంతంలో నేలంతా పచ్చగా ఉంది. ఒక్క మొక్క కూడా కాలలేదు. ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలింది కనుక దుండగులతో పెనుగులాట జరిగి ఉంటే మొక్కలు కాలడమో గడ్డి డిస్ట్రబ్ కావడమో జరగాలి. అలాంటి దాఖలాలు లేవు. ∙సంఘటన జరిగిన స్ధలం వద్ద రెగ్యులర్‌గా చాలా మంది వస్తుంటారు. దాడి జరిగి అరిచి ఉంటే ఎవరికో ఒకరికి వినిపించి ఉండాలి.∙ఎవరైనా పెట్రోల్ పోస్తే రెండువైపులా కాలిపోవాలి. కానీ ఇక్కడ ఒకవైపే కాలింది.∙అక్కడి తుప్పల్లో ఓ పెట్రోల్ బాటిల్ దొరికింది. అక్కడ కొన్ని మొక్కలు కాలినట్టుగా ఉన్నాయి. విడిచిన జత చెప్పులు దొరికాయి. అవి ఆ అమ్మాయివే. పెనుగులాట జరిగి ఉంటే చెప్పులు విడిగా అలా విడిచి పెట్టినట్టుగా ఉండవు.ఈ క్లూస్‌తో పోలీసులు ఈసారి ఆ యువతి ఇంటి నుంచి గార్డెన్ వరకూ గల ఆరు సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. 5 గంటల ప్రాంతంలో ఓ యువతి ఆ ప్రాంతం గుండా వెళ్లి, పెట్రోల్ బంక్ వద్ద ఆగి, బాటిల్లో పెట్రోల్ పోయించుకున్నట్టు కనిపించింది. గార్డెన్లో దొరికిన బాటిల్, యువతి చేతిలో ఉన్న బాటిల్ మ్యాచ్ అయ్యాయి. బాటిల్‌పై ఉన్న వేలిముద్రలను సరిచూడగా అశ్వని వేలిముద్రలతో మ్యాచ్ అయ్యాయి. ఆ బాటిల్ ఇంట్లోదే అని తల్లి నిర్థారించింది. అంటే?ఇది హత్య కాదు. ఆత్మహత్య అన్నమాట. సాధారణంగా మరణ వాంగ్మూలంలో ఎవరూ అబద్ధం చెప్పరు. ఈ అమ్మాయి చెప్పింది. ఎందుకు? పోలీసులు ఆమె సెల్‌ఫోన్ గమనించారు. షాక్ అయ్యారు. అందులో కేవలం రెండు నంబర్లే ఉన్నాయి. తల్లిదీ తండ్రిది. ఇలా రెండు నంబర్లు మాత్రమే పెట్టుకుందంటే స్నేహితులు ఎవరూ లేనంత ఒంటరిగా ఉందన్న మాట. తల్లిదండ్రులను పిలిపించారు.‘సార్! అశ్వని లావుగా ఉండేది. పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. తను ఇంట్లో పెద్ద కూతురు. తన పెళ్లి అయితేనే చెల్లెలి పెళ్లి అవుతుంది. పెళ్లి అవడం లేదని కొన్నాళ్లుగా బాధపడుతోంది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడదు. స్నేహితులు కూడా తనకెవరూ లేరు. తనకిక పెళ్లికాదనే ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకుందంటే మా కుటుంబానికి ఏ ఇబ్బందులు వస్తాయో అనుకుని ఉంటుంది. అందుకే అలా అబద్ధం చెప్పి ఉంటుంది’ అని తండ్రి కన్నీళ్లతో అసలు సంగతి చెప్పారు.అశ్విని హంతకులు ఎవరో తెలిసింది. ఆత్మన్యూనత. డిప్రెషన్.కాని అప్రమత్తంగా లేకుంటే నిర్దోషులైన ఇద్దరు అమాయకులు ఆ వాంగ్మూలానికి బలయ్యేవారు.గౌరవం మరణాన్ని కూడా ఎంతలా శాసించిందీ! – గౌరీశంకర్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. -
హిల్లరీ క్లింటన్‌కు చిక్కులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలపడుతున్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు అధికార విధులకోసం ప్రైవేటు ఈ-మెయిల్‌ను ఎందుకు వాడారో చెప్పాలంటూ ఓ వాచ్డాగ్ సంధించిన ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానం తెలపాలని హిల్లరీ క్లింటన్‌ను అమెరికా ఫెడరల్ జడ్జి ఆదేశించారు. హిల్లరీకి వ్యతిరేకంగా జ్యుడీషియల్ వాచ్ అనే గ్రూపు దాఖలు చేసిన ఓ దావా నేపథ్యంలో యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎమ్మెట్ జి సులివాన్ ఈ ఆదేశాలను జారీ చేశారు. ఈ వ్యవహారంలో హిల్లరీని అధికార ప్రమాణాల కింద, వ్యక్తిగతంగా ప్రశ్నించేందుకు అనుమతివ్వాలన్న జ్యుడీషియల్ వాచ్ వినతిని కోర్టు తోసిపుచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన మిగిలిన పత్రాలన్నింటినీ సెప్టెంబర్ 30లోగా జ్యుడీషియల్ వాచ్‌కు అందజేయాలని విదేశాంగశాఖను ఆదేశించింది. కాగా రాతపూర్వకంగా ప్రశ్నలను అక్టోబర్ 14లోగా హిల్లరీకి జ్యుడీషియల్ వాచ్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిపై సమాధానమిచ్చేందుకు హిల్లరీ క్లింటన్‌కు కోర్టు 30 రోజుల గడువిచ్చింది. కోర్టు ఆదేశాల పట్ల జ్యుడీషియల్ వాచ్ సంస్థ అధ్యక్షుడు టామ్ ఫిట్టొన్ హర్షం వెలిబుచ్చారు. చట్టానికి హిల్లరీ క్లింటన్ అతీతులు కాదని ఇది నిరూపించిందన్నారు. -
‘సల్మాన్ డ్రైవర్ వాంగ్మూలం అబద్ధం’
ముంబై: కోర్టు ముందు తప్పుడు సాక్ష్యం ఇచ్చిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్సింగ్పై తగిన చర్యలు తీసుకోవాలని కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన కేసులో ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. 2002 సెప్టెంబర్‌లో ఒక రాత్రి బేకరీ షాప్‌లోకి దూసుకెళ్లినప్పుడు కారును నడుపుతోంది సల్మాన్ కాదని, తానే నడుపుతున్నానని అశోక్‌సింగ్ వాంగ్మూలమివ్వడం తెలిసిందే. అయితే, అశోక్‌సింగ్ ఇచ్చింది అబద్ధపు సాక్ష్యమనేందుకు ఆధారాలున్నాయని సోమవారం ప్రాసిక్యూషన్ పేర్కొంది. ప్రమాదం జరగడానికి ముందు హోటల్లో తాను ఒక గ్లాస్ మంచినీరు మాత్రమే తాగానని సల్మాన్ చెప్పడం కూడా అబద్ధమేనని వాదించింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ కోర్టు హాళ్లోనే ఉన్నారు. -
అమ్మను చంపింది.. నాన్నే !
ఫిర్యాదు చేసి, సాక్ష్యం చెప్పిన కుమారులు నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధించిన కోర్టు నాలుగేళ్ల క్రితం పందికుంటలో జరిగిన ఘటన వరంగల్ లీగల్ : కళ్లెదురుగా.. కోర్టు బోనులో కన్నతండ్రి. మరో బోనులో అతడి కుమారులు. వారు ఇచ్చే వాంగ్మూలమే న్యాయమూర్తి తీర్పునకు కీలకం. తమ తల్లిని అతికిరాతకంగా చంపిన తండ్రిని ఆ కుమారులు క్షమించలేదు. అమ్మను నాన్నే చంపాడని చెప్పారు. దీంతో సాక్ష్యాధారాలన్ని పరిశీలించిన ఎనిమిదో అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జ్ జడ్జి ఎన్.సాల్మన్‌రాజు ఆ నేరస్తుడికి యూవజ్జీవ శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ములుగు మండలం పందికుంట గ్రామానికి చెందిన జన్ను సూదయ్య, సరోజన దంపతులకు కుమారులు దేవేందర్(కూలీ), మహేందర్(విద్యార్థి) ఉన్నారు. సూదయ్య ఏటూరునాగారానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయమై భార్య, పిల్లలు నిలదీయడంతో సరోజనకే ఇతరులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని వేధించసాగాడు. ఈ క్రమంలో ఆగస్టు 11, 2010న పెద్ద కుమారుడు కూలీకి వెళ్లగా, చిన్న కుమారుడు కాలేజీకి వెళ్లాడు. ఇంట్లో సూదయ్య, సరోజన దంపతులే ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం పొలం వద్దకు వెళదామని చెప్పి నమ్మించి సూదయ్య భార్యను వెంట తీసుకెళ్లాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని విపరీతంగా కొట్టాడు. మెడ చుట్టూ కమిలిపోయి చెవువెంట రక్తం కారుతూ సృ్పహ లేకుండా సరోజన పడిపోయి ఉంది. చిన్నకుమారుడికి గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో పొలం వద్ద గాయాలతో ఉన్న తల్లిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను(రూ.20వేల విలువ) తమ తండ్రి తీసుకెళ్లాడని నిర్ధారించుకున్న మహేందర్, దేవేందర్‌కు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఇద్దరు కుమారులతోపాటు 12 మంది సాక్షుల వాంగ్మూలాలను విచారించిన కోర్టు నేరస్తుడు ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురి చేసి, హత్య చేశాడని రుజువు కావడంతో సూదయ్యకు ఐపీసీ సెక్షన్ 302 హత్యా నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా, ఐపీసీ సెక్షన్ 498(ఏ), భార్యను వేధింపులకు గురిచేసిన నేరం కింద ఒక ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్‌రాజు తీర్పు వెల్లడించారు. శిక్షలు ఏకకాలంలో అమలు చేయూలని, గతంలో జైలులో ఉన్న కాలాన్ని శిక్షా కాలం నుంచి మినహాయించాలని తీర్పులో పేర్కొన్నారు. కేసు విచారణను లైజన్ ఆఫీసర్ రఘుపతిరెడ్డి పర్యవేక్షించగా, కానిస్టేబుల్ లింగాల రాంబాబు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ పోతరాజు రవి వాదించారు. -
లక్ష్మమ్మ వాంగ్మూలమే కీలకం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కేడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ శ్రీదేవిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే టీడీపీకి డెరైక్టర్ లక్ష్మమ్మే దిక్కైంది. ఆమె మద్దతు కోసం ఆ పార్టీ నేతలు తిప్పలు పడుతున్నట్లు సమాచారం. ఈనెల 22న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షురాలిపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నాటకీయ పరిణామాలతో రెండు పర్యాయాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన లేఖలో సింగిల్ విండో డెరైక్టర్ లక్ష్మమ్మ సంతకం చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే ఆమె మద్దతు ఇస్తుందని తమ్ముళ్లు భావించారు. అయితే ఆమె చివరి క్షణంలో కనిపించకుండా పోయారు. ఆమెను కాంగ్రెస్ నేతలు చెరుకులపాడు నారాయణరెడ్డి, జడ్.శ్రీనివాసులురెడ్డి కిడ్నాప్ చేశారని టీడీపీ నేతలు ఆమె భర్తతో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో కాంగ్రెస్ నేతలపై కేసు నమోదైంది. నాటకీయ పరిణామాలతో సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి.. అవిశ్వాస తీర్మానంపై ఈనెల 30 వరకు స్టే ఇచ్చారు. ఇదిలా ఉండగా పోలీసులు లక్ష్మమ్మ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఆమెను అదుపులోకి తీసుకుని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఈ కేసులో గురువారం ఆమె వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే ఆమె తనను ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదని ఆత్మకూరులో పోలీసుల ఎదుట చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె అదే మాట మీద ఉంటారా? లేదా? అన్నది గురువారం తేలిపోనుంది.