సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలం పేరిట మీడియాలో ప్రచురితమైన విషయాలు పూర్తిగా అవాస్తవమని వైఎస్ కుటుంబీకుడైన వైఎస్ అభిషేక్‌రెడ్డి స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు తనను అడగని అంశాలు, తాను చెప్పని విషయాలను తన వాంగ్మూలంగా మీడియా ప్రచురించడాన్ని ఖండించారు. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు తనకు ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. ఓ వర్గం మీడియా దురుద్దేశపూరితంగా వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తోందని చెప్పారు. ఈ మేరకు అభిషేక్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలివీ..
సీబీఐకి నేను చెప్పిన విషయాలు ఇవీ...: గత ఏడాది ఆగస్టు 11న సీబీఐ అధికారులు పిలిస్తే వెళ్లి కలిశా. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని తెలిసిన రోజు వివరాలు అడిగితే నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పా. 2019 మార్చి 15న ఉదయం డి.శివశంకర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి వివేకా ఇంటికి రమ్మన్నారు. నేను వెళ్లేసరికే అక్కడ కొంతమంది గుమిగూడి ఉన్నారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న శివశంకర్‌రెడ్డి నన్ను చూడగానే లోపలికి వెళ్లి చూడు అని చెప్పాడు.
నన్ను ఎంతో అభిమానించేవారు..: నేను ఇంటిలోపలికి వెళ్లా. బెడ్‌రూమ్‌లో ఎవరూ లేరు. బాత్‌రూమ్‌లో కొందరు ఉన్నారు. కమోడ్ పక్కన వివేకానందరెడ్డి పడి ఉన్నారు. ఆయన చనిపోయారని అర్థమైంది. నిశ్చేష్టుడినైపోయా. వివేకానందరెడ్డి నన్ను ఎంతో అభిమానించేవారు.
షాక్‌కి గురయ్యా..: వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్‌గా ఉంటూ ప్రజాజీవితంలోకి వచ్చారు. నేనూ అలానే ఉండాలని చెప్పేవారు. నా బాగు కోసం అంత శ్రద్ధ చూపించే ఆయన చనిపోవడం షాక్‌కు గురిచేసింది. ఆ తరువాత మా ఇంటికి వచ్చేశా. వివేకానందరెడ్డి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారని తెలియడంతో అక్కడకు వెళ్లా. అదే విషయాలను సీబీఐ అధికారులకు చెప్పా.
శత్రువులు లేరు..: వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేసి ఉండొచ్చని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయనకు ఎవరూ శత్రువులు లేరు...ఎవరు హత్య చేసి ఉంటారో అర్థం కావడం లేదని చెప్పా.
వైఎస్సార్ కుటుంబంపై దుష్ప్రచారం: నేను సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం అంటూ కొన్ని పత్రికలు, టీవీల్లో వచ్చిన వార్తలు చూసి విభ్రాంతికి గురయ్యా. సీబీఐ అధికారులు నన్ను అడగని అంశాలు, నేను చెప్పని విషయాలు నా వాంగ్మూలం పేరిట పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివేకా గుండెపోటుతో చనిపోయారని డి.శివశంకర్‌రెడ్డి నాతో చెప్పినట్లుగా ఉంది. నాకు ఆయన అలా చెప్పలేదు. నేను వెళ్లిన సమయంలో అక్కడ క్రైమ్ సీన్ గురించి గానీ పోలీసులు ఎవరు ఉన్నారా? అనిగానీ సీబీఐ అధికారులు నన్ను అడగలేదు. ఆ విషయాలు చెప్పినట్లుగా నా పేరుతో వాంగ్మూలం అంటూ మీడియాలో రావడం షాక్‌కు గురి చేసింది.
ఎన్నో ఏళ్లుగా దుష్ప్రచారం..: టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలిగించేందుకు ఓ వర్గం మీడియా వైఎస్సార్ కుటుంబంపై ఎన్నో ఏళ్లుగా దుష్ప్రచారం చేస్తోంది. అదే మీడియా నేను ఇవ్వని వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా ప్రముఖంగా ప్రచురించి మా కుటుంబంపై బురద జల్లుతోంది. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు, కేసును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది. వీటిని న్యాయబద్ధంగా ఎదుర్కొని తిప్పికొడతాం.
Comments
Please login to add a commentAdd a comment