Cbi Investigation On Ys Viveka Assassination Case, Why CBI Did Not Investigating Shocking Truths - Sakshi
Sakshi News home page

వివేకా లేఖను పట్టించుకోరా? కీలక అంశాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది!

Published Sat, Aug 5 2023 11:46 AM | Last Updated on Sat, Aug 5 2023 1:18 PM

Cbi Investigation On Ys Viveka Assassination Case Shocking Truths - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వివేకా లేఖపై CBI నిశితంగా దృష్టి సారించక పోవడం విస్మయపరుస్తోందని ప్రముఖ జాతీయ వార్త వెబ్‌సైట్‌ ‘ద వైర్‌’ The Wire పేర్కొంది.

CBI ఛార్జ్ షీట్లో ఏముంది? 

‘డ్రైవర్‌ ప్రసాద్‌ తనపై తీవ్రంగా దాడి చేసినట్టు వివేకా పేర్కొన్నట్టుగా ఆ లేఖలో ఉంది. ఆ లేఖను వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్‌ చూసి పీఏ కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఆయన వెంటనే అంటే ఉదయం 6.29 గంటలకు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్‌ చేసి ఆ లేఖలో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. తాము వచ్చే వరకు ఆ లేఖను గోప్యంగా ఉంచమని, ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పారు. దాంతో కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్యకు కూడా కృష్ణా రెడ్డి ఆ లేఖ విషయం చెప్పలేదు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి తదితరులు పులివెందులకు చేరుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆ లేఖను వైఎస్సార్‌ జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మకు అప్పగించారు’ అనే విషయాన్ని చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిబిఐ.

ఈ విషయాన్ని ప్రస్తావించడం మినహా ఇంత కీలకమైన విషయంపై సీబీఐ ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్‌ సరితా రాణి ‘ద వైర్‌’ వెబ్‌సైట్‌లో రాసిన కథనంలో ఎన్నో కీలక ప్రశ్నలను సంధించారు. 

తీవ్ర గాయాలతో లేఖ రాయగలిగారా? 

వివేకా లేఖపై ఇప్పటికీ సందిగ్ధత తొలగిపోలేదు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించేంత వరకు ఆ లేఖ ఎప్పుడు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. వివేకాపై దాడి తర్వాత ఆయనతో బలవంతంగా ఆ లేఖను తాము ఎలా రాయించామని దస్తగిరి వెల్లడించాకే సందేహాలు మరింతగా పెరిగాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించిన ప్రకారం.. "మొదట సునీల్‌ యాదవ్‌ వివేకానందరెడ్డి ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో వివేకా కింద పడిపోయారు. ఉమాశంకర్‌ రెడ్డి గొడ్డలితో వివేకా నుదుటి మీద నరికాడు. వివేకా నుదుటి మీద 3.5 ఇంచ్‌ల వెడల్పు, 6 ఇంచ్‌ల లోతుగా పక్క పక్కనే రెండు గాయాలున్నాయని పోస్టువర్టం నివేదిక వెల్లడించింది."

భూమి పత్రాల కోసం గాలింపు

"సునీల్‌యాదవ్‌ వివేకా గుండెపై 15–16 సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఉవశంకర్‌ రెడ్డి తన చేతిలో ఉన్న గొడ్డలిని దస్తగిరికి ఇచ్చి వివేకా లేవకుండా చూడమని చెప్పారు. తాము భూమి పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని చెప్పాడు. వివేకా అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించాడు.  నా ఇంట్లో ఏం వెతుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో దస్తగిరి గొడ్డలితో వివేకా కుడి చేతి మీద దాడి చేశాడు. వివేకా కుడి అరచేతిలో 2 ఇంచ్‌ల వెడల్పు, ఒక ఇంచి లోతున గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుడి చేతి మీద గొడ్డలితో గాయపరిచిన తర్వాత వివేకాతో నిందితులు లేఖ రాయించారు. కుడి చేతివాటం వ్యక్తి అయిన వివేకా ఆ లేఖ రాశారని" సీబీఐ పేర్కొంది.

తీవ్రంగా గాయపడ్డ తర్వాత లేఖ రాయగలిగారా? 

గాయం వల్ల వివేకా మెదడు బయటకు వచ్చిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం. అంత తీవ్ర గాయమైన తర్వాత లేఖ రాసే స్థితిలో వివేకా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం. ఆ లేఖ వివేకానే రాసినట్టు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (CFSL) నిర్ధారించింది. కాగా తీవ్రమైన ఒత్తిడి, అత్యంత సంక్లిష్ట ప్రక్రియ నడుమ ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఢిల్లీలోని CFSL నివేదిక వెల్లడింంది. కానీ అంతటి తీవ్ర గాయాలు అయ్యాక.. మెదడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ వ్యక్తి అలా లేఖ రాయడం సాధ్యమా? అని సీబీఐ వైద్య నిపుణులను సంప్రదించకపోవడం విడ్డూరం.

ఆ వేలి ముద్రలు ఎవరివో?

హత్య కేసు దర్యాప్తులో వేలి ముద్రలు అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వివేకా హత్యకు గురైన స్థలంలో గుర్తించిన మూడు గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివనే విషయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం విస్మయపరుస్తోంది. వివేకా నివాసంలోని బాత్‌రూం గోడల టైల్స్‌ మీద రెండు వేలి ముద్రలు, తలుపు వెనుక ఒక వేలి ముద్రను క్లూస్‌ టీమ్‌ గుర్తించింది. గోడల టైల్స్‌ మీద ఉన్న వేలి ముద్రలు రక్తంతో ఉండటం గమనార్హం. కాగా ఆ మూడు వేలి ముద్రలు నిందితులు నలుగురితోపాటు వివేకా నివాసానికి వచ్చిన బంధువులు, ఇతరుల వేలి ముద్రలతో సరిపోలలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి వివేకా నివాసంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఆ వేలి ముద్రలు ఎవరివనే దిశగా దర్యాప్తు చేయనే లేదు. 

IPDR డేటా అహేతుకం

ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్‌రెడ్డి మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ జరిగినట్టు ‘ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ డీటైల్‌ రికార్డ్స్‌(IPDR) నివేదిక ఆధారంగా గుర్తించినట్టు సీబీఐ పేర్కొంది. కానీ ఐపీడీఆర్‌ డేటా అన్నది శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారం కాదు. ఆ సమయంలో మొబైల్‌ ఫోన్లు ఆన్‌లో ఉన్నాయని మాత్రమే ఐపీడీఆర్‌ చెబుతుంది. సాధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మొబైల్‌ నెట్‌వర్క్‌లు తమ డేటా బ్యాకప్‌ తీసుకుంటూ ఉంటాయి. దాంతో మొబైల్‌ డేటా ఆన్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత మాత్రాన ఆ మొబైల్‌ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నట్టుగానీ, మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగానీ నిర్ధారింనట్టు కాదు. ఇక ఆ ఫోన్ల నుం ఇతర ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయా.. లేదా అన్నది కూడా ఐపీడీఆర్‌ డేటా ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్‌ రెడ్డి మధ్య ఆ రోజు రాత్రి వాట్సాప్‌ చాటింగ్‌ జరిగినట్టు ఐపీడీఆర్‌ డేటా ద్వారా నిర్ధారించలేం. ఈ విషయంలో సీబీఐ వాదన పూర్తిగా అహేతుకమని స్పష్టమవుతోంది. గంగిరెడ్డి మొబైల్‌ ఫోన్‌ నుంచి వెళ్లిన మెసేజ్‌లను గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని సీబీఐ తెలిపింది. కాగా 2019 వర్చి 15నే ఎర్ర గంగిరెడ్డి మొబైల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించినప్పటికీ అందులో అనుమానాస్పదమైన సమాచారం ఏమీ లభించలేదని పోలీసులు ప్రకటించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.

గూగుల్‌ టేక్‌ ఔట్‌పై మాట మారింది!

నిందితులు 2019 మార్చి 14, 15 తేదీల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా నిర్ధారించామన్న సీబీఐ వాదన తప్పని తేలిపోయింది. ఎర్ర గంగిరెడ్డి, ఉవశంకర్‌ రెడ్డి ఫోన్లు వారి ఇళ్లలోనే ఉన్నట్టుగా సెల్‌ టవర్ల లోకేషన్‌ స్పష్టం చేస్తోంది. కాగా సునీల్‌ యాదవ్‌ మొబైల్‌ ఫోన్‌ గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటాపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి 2.42 గంటలకు సునీల్‌యాదవ్‌ వివేకా నివాసంలో ఉన్నట్టు.. 2.34 గంటలకు వివేకా నివాసానికి 15 మీటర్ల దూరంలో, 2.35 గంటలకు వివేకా నివాసానికి 10 మీటర్ల దూరంలో ఉన్నట్టు.. 2.42 గంటలకు వివేకా నివాసంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా సునీల్‌ యాదవ్‌ నివాసం వివేకా నివాసానికి 160 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఎంతో ముఖ్యమైన అంశం.

ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గూగుల్‌ టేక్‌ ఔట్‌ డేటాకు, వాస్తవ లొకేషన్‌కు 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల వరకు వ్యత్యాసం ఉంటుందని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రశ్నించారు. గూగుల్‌ టేక్‌ ఔట్‌ డేటాను బట్టి ఎలా నిర్ధారించగలుగుతారని అడిగారు. దాంతో CBI తన మూడో అనుబంధ చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. యూనివర్సల్‌ కాలమానానికి (UTC), భారత కాలమానానికి (IST) మధ్య వ్యత్యాసాన్ని తాము గమనించక పొరపాటు చేశామని వెల్లడించడం గమనార్హం. గూగుల్‌ టేక్‌ ఔట్‌ డేటాను విశ్లేషిస్తే ఢిల్లీలోని CFSL పేర్కొన్న సమయం UTC కాలమానం ప్రకారం అని వెల్లడించింది.

వాస్తవానికి యూటీసీ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందుంటుంది. అంటే సునీల్‌ యాదవ్‌ వివేకా నివాసంలో 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.42 గంటలకు ఉన్నట్టు తాము మొదటి చార్జ్‌షీట్‌లో పేర్కొంది వాస్తవం కాదని సీబీఐ అంగీకరింంది. సునీల్‌ యాదవ్‌ వివేకా నివాసంలో 2019 మార్చి 15న ఉదయం 8.12 గంటలకు ఉన్నారని తెలిపింది. అంటే వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ గుమిగూడిన తర్వాత సునీల్‌ యాదవ్‌ చేరుకున్నారని చెప్పింది.

ఆస్తి వివాదాన్ని ఎందుకు పట్టించుకోలేదు?

రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కానీ దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలను పరిశీ­లిస్తే ఆస్తి కోసం ఈ హత్య చేసి ఉండొచ్చ­న్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే వివేకాను హత్య చేసిన తర్వాత నిందితులు ఆస్తి పత్రాల కోసం ఆయన నివాసంలో వెతికారన్నది స్పష్టమవుతోంది. ఆ నివాసంలో అల్మారా (బీరువా) తలుపు బద్దలు గొట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు కూడా. అంటే హత్యకు ఆస్తి వివాదం ప్రధాన కారణం కావచ్చు. నిందితులు ఏ పత్రాల కోసం వెతికారన్నది సీబీఐ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దొంగతనం, ఆస్తి వివాదం అనే కోణంలో సీబీఐ ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం సాధ్యమా?

సునీల్‌ యాదవ్‌ ఎక్కడ ఉన్నారనే దానిపై సీబీఐ వాదనలు మరింత అసంబద్ధంగా ఉన్నాయి. దస్తగిరిని అప్రూవర్‌గా వర్చి ఇప్పింన వాంగ్మూలం, రంగన్న వాంగ్మూలం ప్రకారం ఆ రోజు రాత్రి 1.30 గంటల నుంచి 3 గంటల వరకు సునీల్‌ యాదవ్‌ వివేకానందరెడ్డి నివాసం లోపల ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి 1.58 గంటలకు సునీల్‌ యాదవ్‌.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా చూపిస్తోందని కూడా సీబీఐ పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఎలా ఉండగలరు? సునీల్‌ యాదవ్‌ ఆ సమయంలో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి నివాసంలో ఉంటే.. అదే సమయంలో అక్కడికి కిలోమీటర్‌ దరంలో ఉన్న వివేకా నివాసంలో కూడా ఉండి ఆయన్ను ఎలా హత్య చేయగలడు? మరి సీబీఐ ఇంత చిన్న అంశాన్ని విస్మరిస్తూ కేసు దర్యాప్తు చేస్తుండటం ఏమిటి?

రూ.40 కోట్ల డీల్‌ కథ తేల్చలేదెందుకు?

అసలు వివేకానందరెడ్డిని నిందితులు ఎందుకు హత్య చేశారనే అంశంపై సీబీఐ వాదన అసంబద్ధంగా ఉంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. వివేకాను హత్య చేస్తే శివశంకర్‌ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సునీల్‌ యాదవ్‌ ద్వారా దస్తగిరికి అడ్వాన్స్‌గా కోటి రూపాయలు పంపించారు. అందులో 25 లక్షలు సునీల్‌ యాదవ్‌ అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో పులివెందులలో విల్లా కొను­గోలు చేయాలని భావించినట్టు దస్తగిరి చెప్పాడన్నది సిబిఐ పేర్కొన్న విషయం. కాగా ఇక్కడ ప్రశ్నార్థకం ఏమి­టంటే.. వివేకా హత్య కోసం కుదిరినట్టు చెబుతున్న డీల్‌ డబ్బును సీబీఐ ఇప్పటికీ రికవరీ చేయలేకపోయింది.

కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయ­మూర్తి కూడా సీబీఐని ఇదే విషయంపై ప్రశ్నించారు. నిందితుల మధ్య చేతులు మారినట్టు చెబుతున్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారంటే సీబీఐ సరైన సవధానం చెప్పలేకపోయింది. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న మున్నా బ్యాంక్‌ లాకర్‌ నుంచి రికవరీ చేసిన 46.70 లక్షల రూపాయలకు సంబంధించి సీబీఐ చెబుతున్న వాదన నమ్మదగ్గదిగా లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. 2020 సెప్టెంబర్‌ 9న మున్నా బ్యాంకు లాకర్లో ఉన్న 46.70 లక్షల రూపాయలను సీబీఐ జప్తు చేసింది. ఈ జప్తు వ్యవహారం భారత సాక్ష్యాధారాల చట్టం సెక్షన్‌ 27 ప్రకారం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement