కడప ఎంపీ అవినాష్‌రెడ్డి విషయంలో పచ్చమీడియా పడుతున్న ఆత్రుత, ఆరాటం తీవ్ర విమర్శల పాలవుతోంది. జర్నలిజం ముసుగులో వ్యక్తుల ప్రైవసీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరు పరిధులు దాటుతోంది. అవినాష్‌రెడ్డి లోక్‌సభ సభ్యుడు. రెండు సార్లు కడప లోక్‌సభ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. 2014లో లక్షా 90వేల మెజార్టీ వస్తే, 2019లో 3లక్షల 80వేల మెజార్టీ వచ్చింది. అవినాష్‌రెడ్డి.. పూర్తిగా ప్రజా జీవితం గడుపుతున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు.
వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయనకు సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. ఇప్పటివరకు నోటీసులు ఇచ్చిన ప్రతీసారి ఆయన సీబీఐ ముందు దర్యాప్తుకు హాజరవుతున్నారు. మౌఖికంగా, లిఖితపూర్వకంగా సమాధానాలు ఇస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా తనకున్న ఆప్షన్లను వినియోగించుకుంటున్నారు. అది ఆయనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. తనకు న్యాయం కావాలంటూ ఏ వ్యక్తి అయినా ఏ కోర్టునయినా ఆశ్రయించవచ్చు. తన వాదన వినిపించవచ్చు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 సార్లు దర్యాప్తుకు హాజరైన అవినాష్.. తాజాగా తన తల్లి అస్వస్థత కారణంగా హైదరాబాద్ నుంచి తిరిగి కడపకు, అక్కడినుంచి కర్నూలుకు వచ్చారు. ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా సీబీఐకి విన్నవించారు. తల్లికి గుండెపోటు వచ్చిందని, ఆస్పత్రిలో ICU ట్రీట్‌మెంట్ జరుగుతోందని, 7 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు. ఏ నిర్ణయమైనా తీసుకుంటారు.
చదవండి: ఆసుపత్రిలో చేరటంపైనా రోగిష్టి రాతలేనా ?
ఇక్కడ బయటికొచ్చిన కీలకమైన అంశం ఏంటంటే, ఎల్లోమీడియా తీరు. సీబీఐ వాళ్లు ఏ చర్య తీసుకుంటారా అన్నది పక్కన పెడితే.. ఇంకా అరెస్ట్ చేయలేదంటూ పచ్చమీడియా తెగ ఆందోళన చెందుతోంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకెందుకు నాన్చుతున్నారు, అసలు అరెస్ట్ చేస్తారా? చేయరా? ఇవీ ఎల్లోమీడియాలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న చర్చలు.
ఆపరేషన్ అవినాష్ అంటూ ఇష్టానుసారంగా మీడియా ట్రయల్స్ చేస్తోన్న ఎల్లోమీడియాకు, కనీస ఇంగీత జ్ఞానం లేకుండా విశ్లేషణలు ఇస్తోన్న ఛానల్ పెద్దలు, వారి వెనకే తనా అంటే తందానా అన్నట్టుగా పచ్చపార్టీ నేతలు.. వీరి తాపత్రయం చూస్తేంటే.. సిబిఐలోకి పరకాయ ప్రవేశం చేసి తామే అరెస్ట్ చేయాలన్నట్టుగా ఉంది. వృద్దురాలు అయిన అవినాష్ తల్లి గుండె నొప్పితో అస్పత్రిలో జాయిన్ అయితే తప్పేంటి? కొడుకు ఆసుపత్రిలో ఉండి చూసుకోవడం తప్పా? అని ప్రశ్నిస్తున్నారు.
చదవండి: అమ్మ పరిస్థితి సీరియస్, 7 రోజులు గడువివ్వండి : సీబీఐకి అవినాష్ విజ్ఞప్తి
ఎల్లో మీడియాకు పది ప్రశ్నలు
1. అవినాష్ రెడ్డి విషయంలో అంత అత్యుత్సాహం ఎందుకు?
2. వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తోంది సీబీఐనా? ఎల్లో మీడియానా?
3. సీబీఐ దర్యాప్తులో చర్చకు వచ్చే వేర్వేరు అంశాలకు తమ పైత్యాన్ని ఎల్లో మీడియా ఎందుకు కలుపుతోంది?
4. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో కూడా ఎల్లో మీడియానే వార్తల రూపంలో ఎలా ఇస్తోంది?
5. సీబీఐని ప్రభావితం చేయాలన్న తాపత్రయం ఎందుకు?
6. ఒక ఎంపీకి కనీస ప్రైవసీ ఉండదా? ఆయన వెంట ఎందుకు పడుతున్నట్టు?
7. ఆయన తల్లి చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోకి ఎందుకు చొరబడుతున్నట్టు?
8. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా బయట ఇష్టానుసారంగా వార్తలు ఎందుకు రాస్తున్నారు?
9. మీడియా ట్రయల్ పేరిట ఎంతకైనా తెగిస్తారా?
10. మీ ఉద్దేశ్యాలను దర్యాప్తు సంస్థలకు ఎలా అంటగడతారు?
కొన్ని ఛానళ్లు దురుద్దేశపూర్వకంగా అవినాష్‌ను లక్ష్యంగా చేసుకుని వార్తలు ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబుకు స్టే వచ్చినప్పుడు ఏమయ్యాయి ఈ వార్తలు? విచారణ తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించినప్పుడు ఎందుకు చేయలేదు మీడియా దర్యాప్తు?
-దేవులపల్లి అమర్, సీనియర్ జర్నలిస్టు, ఏపీ ప్రభుత్వ సలహాదారు
ఎల్లో మీడియాను ప్రజలంతా ఛీ కొడుతున్నారు, జర్నలిజం విలువలకు ఎల్లో మీడియా పాతరేస్తుంది, అలజడి సృష్టించడానికే ఎల్లో మీడియా అభూత కల్పన సృష్టిస్తోంది, అసత్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి, తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో అవినాష్ దగ్గర ఉండాల్సి ఉంది, కొన్ని మీడియా సంస్థలు దిగజారి వ్యవహరిస్తున్నాయి.
- బీవై రామయ్య, కర్నూలు మేయర్
తల్లి ఆరోగ్యం బాగవగానే అవినాష్‌రెడ్డి సహకరిస్తారు, సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నాం.
-ఎస్వీ మోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment