హైదరాబాద్: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ లక్ష్మణ్ ముందు ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి.
హంతకులకు, వివేకాకు వ్యక్తిగత విభేదాలున్నాయి
వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని ఇరికించేలా కుట్ర జరుగుతోందని ఆయన తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న A1 గంగిరెడ్డికి వివేకాతో భూవివాదాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అలాగే నిందితుల్లో మరో ఇద్దరు సునీల్ యాదవ్, ఉమాశంకర్ లతో వివేకాకు విభేదాలు తలెత్తాయని, వజ్రాల వ్యాపారం చేస్తామంటూ వాళ్లిద్దరూ వివేకాను మోసగించడంతో సంబంధాలు చెడిపోయాయని తెలిపారు. అలాగే తమ కుటుంబ మహిళల విషయంలోనూ వివేకానందరెడ్డి తలదూర్చడంతో వారిద్దరికి వివేకాపై కోపం ఉందని తెలిపారు.
ఇప్పటివరకు నిందితుడని ఎక్కడా చెప్పలేదు
వివేకా హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డిని సిబిఐ ఇప్పటివరకు ఎక్కడా నిందితుడని చెప్పలేదని లాయర్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. అవినాష్ రెడ్డి గుండెపోటు అన్నారని చెబుతున్నారు, కానీ అవినాష్ రెడ్డి డాక్టరో, పోలీసు అధికారో కాదు కదా. CBI వేసిన రెండు ఛార్జ్ షీట్లలో అవినాష్ రెడ్డిని నిందితుడని పేర్కొనలేదు. రెండు ఛార్జ్ షీట్లు వేసేవరకు కనీసం విచారణ కూడా జరపలేదు. అనుబంధ ఛార్జ్ షీట్ వేసిన ఏడాది తర్వాత 160 కింద నోటీసులు ఇచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగానే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. విచారణకు పిలిచిన ఏడు సార్లు హాజరయ్యారు. విచారణకు సహకరించడం అంటే CBI వాళ్లు రాసిచ్చింది చెప్పడమా? అసలు ఇప్పటివరకు జరిగిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియోలను హైకోర్టు ముందుంచాలని ఉమా మహేశ్వరరావు కోరారు.
తల్లి అస్వస్థత వల్లే విచారణకు రాలేకపోయారు
అవినాష్ రెడ్డి విచారణ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన తల్లి లక్ష్మమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తల్లి బాగోగులు చూసుకునేందుకు అవినాష్ హుటాహుటిన వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి లిఖితపూర్వకంగా CBI అధికారులకు సమాచారం అందించారు. చికిత్స కోసం కర్నూలు తరలించి బాగయ్యేవరకు అక్కడే ఉన్నారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని AIG ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ విషయం కూడా ఎప్పటికప్పుడు CBI డైరెక్టర్ కు లేఖ ద్వారా సమాచారం అందించారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడెందుకు CBI అరెస్ట్ అంటూ ఒత్తిడి తెస్తోంది? అంటూ ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు.
రాజకీయ కారణాలు.. కుట్రకు అస్త్రాలు
తన వద్ద డ్రైవర్ గా ఉన్న దస్తగిరిని తొలగించి వివేకా.. కొత్త డ్రైవర్ గా ప్రసాద్ ను పెట్టుకున్నాడని తెలిపారు. వివేకా హత్యకు రాజకీయ కారణాలేమీ లేవని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక నేతలు సహకరించకే ఓడిపోయారని సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపారు. నిందితుడు దస్తగిరి తీసుకున్న రూ.కోటిలో రూ.46.70 లక్షలే రికవరీ అయ్యాయని, మిగతా సొమ్ము ఏమైందో సీబీఐ చెప్పడం లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం ఎంపీ టికెట్ కు పోటీ ఉన్నాడంటూ అవినాష్ రెడ్డిని అనుమానించడం సరికాదన్నారు అవినాష్ లాయర్ ఉమా మహేశ్వరరావు.
FIR సెక్షన్లలో ఇంత తేడాలెందుకు?
సీబీఐ నమోదు చేసిన FIRలో 201 సెక్షన్ లేదని, మొదట లోకల్ పోలీసులు 174 కింద FIR చేశారన్నారు అవినాష్ తరఫు న్యాయవాది. సీబీఐ ఒక కేసు నమోదు చేసే ముందు పాత FIR రిజస్టర్ చేయాలని, కానీ సీబీఐ FIRలో ఎక్కడా 174 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు. ఎఫ్ఐఆర్ లో IPC 302 మాత్రమే నమోదు చేశారని, 201 సెక్షన్ లేదని కోర్టుకు తెలిపారు అవినాష్ తరపు న్యాయవాది.
దస్తగిరి విషయంలో లోపాయికారి ఒప్పందాలెందుకు?
హత్య చేసిన దస్తగిరిని సీబీఐ వెనకేసుకొస్తోందని, దస్తగిరి ముందస్తు బెయిల్ ను కూడా సీబీఐ వ్యతిరేకించలేదని కోర్టుకు తెలిపారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది. గంగిరెడ్డి ఢీఫాల్ట్ బెయిల్ పై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన సునీత.. A1గా ఉన్న దస్తగిరి బయట తిరుగుతుంటే మాత్రం స్పందించట్లేదని తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు?
ప్రత్యక్ష సాక్షి రంగన్న స్టేట్ మెంట్ రికార్డు అంశంపై 15 నిమిషాలకు పైగా జరిగిన వాద ప్రతివాదనలు జరిగాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను విచారించిందని, రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని తెలిపారు. రంగన్న తన స్టేట్‌మెంట్ లో స్పష్టంగా నలుగురి వివరాలు చెప్పాడని, అయినా సీబీఐ మాత్రం నెల రోజుల పాటు దస్తగిరిని కనీసం విచారణకు పిలువలేదని, ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని తెలిపారు.
ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన హైకోర్టు.. సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది.
హైకోర్టు ప్రశ్న: వివేకా హత్య సాక్ష్యాలను చెరిపేస్తున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారని చెబుతున్నారు, వారిపై సీబీఐ ఏమైనా చర్యలు తీసుకుందా?
సీబీఐ జవాబు : ఇంకా దర్యాప్తు చేస్తున్నాం
హైకోర్టు ప్రశ్న: కీలక సాక్షి వాచ్‌మెన్ రంగన్న స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారా? : హైకోర్టు
సీబీఐ జవాబు : లోకల్ పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు...మేం చేయలేదు
హైకోర్టు : రంగన్న స్టేట్‌మెంట్ కాపీని కోర్టుకు సమర్పించండి
హైకోర్టు ప్రశ్న: మున్నా వద్ద డబ్బు ఎప్పుడు రికవరీ చేశారు?....మున్నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారా?
సీబీఐ జవాబు : మున్నా లాకర్ నుంచి రూ.46 లక్షల డబ్బు రికవరీ చేశాం, మున్నా స్టేట్‌మెంట్ రికార్డ్ చేయలేదు
హైకోర్టు ప్రశ్న: దస్తగిరికి ఎప్పుడు బెయిల్ వచ్చింది?
అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి స్టేట్‌మెంట్లను సీబీఐ రికార్డ్ చేస్తూనే ఉంది, నెలన్నర రోజులు దస్తగిరి సీబీఐ కస్టడీలో ఉన్న తర్వాత అప్రూవర్ అంటూ ప్రకటించారు. అప్రూవర్ గా మారిన తర్వాత దస్తగిరికి ముందస్తు బెయిల్ కు సీబీఐ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు, దస్తగిరికి బెయిల్ వచ్చిన 4 రోజులకే సీబీఐ ఛార్జ్‌షీట్ వేసింది.
హైకోర్టు ప్రశ్న: దస్తగిరి స్టేట్‌మెంట్ లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా?
అవినాష్ రెడ్డి తరపు లాయర్ : దస్తగిరి దగ్గర 3 సార్లు 161 కింద సీబీఐ స్టేట్‌మెంట్ తీసుకుంది. మొదటి స్టేట్‌మెంట్ లో ఎక్కడా అవినాష్ గురించి చెప్పలేదు. చివరి స్టేట్‌మెంట్ లో మాత్రం అవినాష్ పేరును చేర్చారు. అది కూడా అవినాష్ మన వెనకాల ఉన్నాడని గంగిరెడ్డి తనతో చెప్పాడని దస్తగరి స్టేట్ మెంట్ ఇచ్చినట్టు CBI చెబుతోంది.
హైకోర్టు : వివేకా హత్య కేసుకు సంబంధించి ఈరోజు సునీత తరపు లాయర్ వాదనలు వింటాం, రేపు సిబిఐ వాదనలు వింటాం
సునీత తరపు లాయర్ : అవినాష్ న్యాయవాది కి ఎంత సమయం ఇచ్చారో మాకు అంతే సమయం ఇవ్వాలి
(మధ్యలో కలుగజేసుకున్న సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ పై హైకోర్టు బెంచ్ అసహనం)
హైకోర్టు : ఎవరి లిమిట్స్ లో వారుండాలి
సునీతా రెడ్డి తరపు లాయర్ రవి చంద్ వాదనలకు అనుమతిచ్చింది హైకోర్టు. CBI వాదనలు శనివారం వింటామని తెలిపింది.
సునీత తరపు లాయర్ రవి చంద్ :
అవినాష్ రెడ్డి నోటీసులు ఇచినప్పుడల్లా ఏదో ఒకటి చెబుతున్నారు, మొదట పార్లమెంటు సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనన్నారు. రెండో నోటీసుకు హైకోర్టులో పిటిషన్ వేశారు, ఇప్పుడు మిగతా నిందితులను అరెస్టు చేసినప్పుడు తననెందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు తల్లి అనారోగ్యం అంటున్నారు. విశ్వ భారతి హాస్పిటల్ లోకి ఎవరినీ వెళ్లనివ్వకుండ హాస్పిటల్ ముందు అవినాష్ అనుచరులు అడ్డుకున్నారు.
సునీత తరపు లాయర్ వాదనలు ముగియడంతో విచారణను ముగించారు. శనివారం CBI తరపు వాదనలు విననుంది హైకోర్టు.
Comments
Please login to add a commentAdd a comment