థర్డ్‌ డిగ్రీ, సాక్షులను కొట్టడం మీ డ్యూటీనా | Sakshi
Sakshi News home page

థర్డ్‌ డిగ్రీ, సాక్షులను కొట్టడం మీ డ్యూటీనా

Published Wed, May 8 2024 4:31 AM

CBI officer Ramsinghs behavior has been condemned by the High Court

కస్టోడియల్‌ విచారణ విధుల్లో భాగమా?

చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఎలా ఒత్తిడి చేస్తారు?

దర్యాప్తు అధికారి ఇలాగేనా వ్యవహరించాల్సింది?

వివేకా హత్య కేసులో సీబీఐ అధికారి రామ్‌సింగ్‌ తీరును ఎండగట్టిన హైకోర్టు

సునీత, రాజశేఖర్‌రెడ్డి, రామ్‌సింగ్‌ల పిటిషన్లపై ముగిసిన వాదనలు

తీర్పు వాయిదా వేసిన న్యాయస్థానం

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌ తీరును హై­కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. తాను చెప్పిన విధంగానే వాంగ్మూలం ఇవ్వాలని ఫిర్యాదుదారుడిపై రామ్‌సింగ్‌ ఎలా ఒత్తిడి చేస్తారని ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ నిల­దీసింది. సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం వంటివి చేయ­వచ్చా అంటూ సీబీఐ ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ)ని ప్రశ్ని­ంచింది. 

ఇలాంటి కస్టోడియల్‌ విచారణ చేయడం విధి నిర్వహ­ణలో భాగమా అంటూ నిలదీసింది. పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డి, సీబీఐ అధికారి రామ్‌­సింగ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై వాదనలు విన్న హైకోర్టు విచా­ర­ణను ముగించింది. తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు న్యాయ­మూర్తి జస్టిస్‌ కొనకంటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివేకా హత్య విషయంలో తాము చెప్పినట్లు వినకుంటే అంతు చూస్తామంటూ బెదిరించడమే కాకుండా తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టులో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, నర్రెడ్డి సునీత, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌లపై కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టులో చార్జిషీట్‌ కూడా దాఖలు చేశారు. 

ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సునీత, రాజశేఖరరెడ్డి, రామ్‌సింగ్‌ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన శ్రీనివాసరెడ్డి, పులివెందుల కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు వచ్చాయి. 

ఈ సందర్భంగా సునీత, రాజశేఖరరెడ్డి తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ, మేజిస్ట్రేట్‌ యాంత్రికంగా ఉత్తర్వులిచ్చారన్నారు. పోలీసుల నుంచి నివేదిక కోరకుండా నేరుగా కేసు నమోదుకు ఆదేశాలివ్వడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేసు నమోదుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కారణాలను వెల్లడించలేదన్నారు.

సీబీఐ తరఫున ప్రత్యేక పీపీ అనిల్‌ తన్వర్‌ వాదనలు వినిపిస్తూ.. పులి­వెందుల కోర్టు పరిధి దాటి ఉత్తర్వులిచ్చిందని అన్నారు. ఫిర్యాదు­దారుడి నుంచి ప్రమాణపూర్వక వాంగ్మూలాన్ని నమోదు చేయకుండానే కేసు నమోదుకు ఆదేశాలిచ్చారని తెలిపారు. రాంసింగ్‌ ఏం చేసినా విధి నిర్వహణలో భాగంగానే చేశారన్నారు. ఆ విధంగానే తన ముందు హాజరు కావాలని ఫిర్యాదుదారుడిని రామ్‌సింగ్‌ ఆదేశించారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సాక్షులను కొట్టడం, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం వంటివి కూడా విధి నిర్వహణలో భాగమేనా అంటూ నిలదీశారు.

సుప్రీంకోర్టు దర్యాప్తు నుంచి రాంసింగ్‌ను తప్పించింది
అనంతరం ఫిర్యాదుదారు కృష్ణారెడ్డి తరపున సీనియర్‌ న్యాయవాది ప్రద్యుమ్న కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాంసింగ్‌పై తీవ్రమైన ఆరోపణలున్నాయన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆయన్ని వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నుంచి తొలగించిందన్నారు. మేజిస్ట్రేట్‌ ఉత్తర్వులు సరైనవేనని తెలిపారు. కారణాలను తెలియచేయాల్సిన అవసరం లేదన్నారు. ముందస్తు అనుమతి అవసరం లేదని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు తీర్పులను ప్రస్తావించారు.

నిబంధనల మేరకే మేజిస్ట్రేట్‌ వ్యవహరించారు
పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి, స్పెషల్‌ అసిస్టెంట్‌ పీపీ సూరా వెంకట సాయినాథ్‌ వాదనలు వినిపించారు. ప్రైవేటు ఫిర్యాదుపై విచారణకు ఆదేశించే విష­యంలో మేజిస్ట్రేట్‌ ఎలాంటి కారణాలను తెలియచేయా­ల్సిన అవ­సరం లేదన్నారు. నిబంధనలకు అనుగుణంగానే మేజిస్ట్రేట్‌ వ్యవహరించారని వివరించారు. 

మేజిస్ట్రేట్‌ కేసును విచారణకు స్వీకరించలేదని, దర్యాప్తునకు మాత్రమే ఆదేశించి తుది నివేదిక కోరారని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ కూడా దాఖలు చేశార­న్నారు. అయితే కోర్టు ఈ చార్జిషీట్‌ను సాంకేతిక కారణాలతో రిటర్న్‌ చేసిందన్నారు. సీబీఐ అధికారి ప్రాసిక్యూషన్‌కు ముందస్తు అనుమతి అవసరం లేదన్నారు. ఏ దశలోనైనా అనుమతి తీసుకోవచ్చని తెలిపారు. అందుకు సంబంధించి  సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement