సాక్షి, అమరావతి: ఊహించినట్లుగానే మాజీ మంత్రి వైఎస్ వివేకాందనందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ చేతులెత్తేసింది! ముందుగానే ‘అప్రూవర్’ గంతలు కట్టుకుని దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ చివరికి సాధించింది శూన్యం!! నిందితుడు దస్తగిరితో చెప్పించిన తప్పుడు కథనం.. కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు వండివార్చిన వాంగ్మూలాలు మినహా రెండున్నరేళ్ల దర్యాప్తు తరువాత సీబీఐ సాధించింది ఏమీ లేదు! శాస్త్రీయ ఆధారం అంటూ తెరపైకి తెచ్చిన ‘గూగుల్ టేక్’ అవుట్ చివరకు వట్టిదేనని చేతులెత్తేసింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట పరస్పర విరుద్ధమైన, అహేతుకమైన వాదనలు బెడిసికొట్టాయి. గతంలో దాఖలు చేసిన చార్‌్జషీట్లలో పేర్కొన్న అభూత కల్పనలు, ఊహాజనితాలకు కొనసాగింపుగానే సీబీఐ తుది చార్‌్జషీట్‌ను దాఖలు చేసి చేతులు దులిపేసుకున్నట్లు స్పష్టమవుతోంది.
సాధించింది శూన్యం
ఎలాంటి ఆధారాలు లేకుండా వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి పేర్లను చార్‌్జషీట్లలో సీబీఐ ఏకపక్షంగా చేర్చింది. వారికి వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. గూగుల్ టేక్ అవుట్ పూర్తిగా అహేతుకమని నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.
యూటీసీ కాలమానానికి, భారత కాలమానానికి తేడా కూడా గుర్తించకుండా గతంలోని చార్జిషీట్లోఅభియోగాలను మోపడం సీబీఐ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తమ అభియోగాలు అవాస్తవమని న్యాయ విచారణలో వెల్లడవుతుందని గుర్తించిన సీబీఐ తుది చార్జిషీట్లోనాలుక కరుచుకుంది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి సునీల్ యాదవ్ అక్కడ లేరని పేర్కొంది. గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం పూర్తిగా తొందరపాటేనని స్పష్టమైంది.
వాంగ్మూలాల కట్టుకథలు
సాక్షులు చెప్పని విషయాలను కూడా 164 స్టేట్‌మెంట్ పేరిట నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇవ్వడం సీబీఐ దురుద్దేశాన్ని వెల్లడిస్తోంది. 2019 మార్చి 15న ఉదయం తాము హైదరాబాద్‌లో సమావేశంలో ఉండగా వైఎస్ జగన్ తమకు వివేకా మరణించారనే విషయాన్ని తెలియచేసినట్లు అజేయ కల్లం చెప్పారు. కానీ ఆయన ఫలానా సమయం అని ఏమీ చెప్పలేదు.
కానీ ఉదయం 5.30 గంటలకే వైఎస్ జగన్ తమకు చెప్పారని అజేయ కల్లం వెల్లడించినట్లు సీబీఐ ఏకపక్షంగా వాంగ్మూలం నమోదు చేసుకుని మీడియాకు లీకులు ఇచ్చింది. దీన్ని అజేయ కల్లం వెంటనే ఖండించారు. అజేయ కల్లంను కలసిన అధికారి ఒకరు కాగా ఆయన పేరిట వాంగ్మూలం నమోదు చేసిన అధికారి మరొకరు కావడం గమనార్హం.
ఇక అదే రోజు ఆ సమావేశంలో ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఏస్ కృష్ణమోహన్‌రెడ్డి ఉదయం 6.30 గంటలకు తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ చేసి వివేకా మరణించిన విషయాన్ని తెలిపారని సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ జగన్ నివాసంలో సహాయకుడు నవీన్ కూడా అదే చెప్పారు. ఆ ఇద్దరి వాంగ్మూలాలను సీబీఐ అదే విధంగా నమోదు చేసింది. మరి వారిద్దరు ఉదయం 6.30 గంటలకు తెలిసింది అన్నప్పుడు అదే సమావేశంలో పాల్గొన్న అజేయ కల్లం మాత్రం ఉదయం 5.30 గంటలకు తెలిసింది అని ఎలా చెప్పగలరు?
ఎంపీ టికెట్ నిర్ధారించేది వైఎస్ జగన్
కడప ఎంపీ టికెట్ అంశంపై లేని సందిగ్దత ఉన్నట్టుగా చూపించేందుకు సీబీఐ విఫల యత్నాలు చేస్తోంది. తాజాగా షర్మిల వాంగ్మూలం పేరిట అదే ప్రచారాన్ని తెరపైకి తేవడం విడ్డూరంగా ఉంది. 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని వివేకా ఒత్తిడి చేశారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
కానీ ఎంపీ టికెట్‌ను నిర్ణయించేది వివేకానో షర్మిలనో కాదు. నిర్ణయించేది పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన అప్పటికే అవినాశ్‌రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నిర్ణయించేశారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనే 2019 ఎన్నికల్లోనూ అభ్యర్థి అని మొదటి నుంచి చెబుతూ వచ్చారు. వివేకా కూడా అవినాశ్‌రెడ్డి తరపున ప్రచారం చేశారు.
బెడిసికొట్టిన దస్తగిరి అప్రూవర్ కుట్ర
వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మొదట్లోనే పక్కదారి పట్టింది. హత్య చేశానని స్వయంగా అంగీకరించిన నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. వివేకాను హత్య చేస్తే తాము చూసుకుంటామని వైఎస్ భాస్కర్‌రెడ్డి భరోసా ఇచ్చారని ఎర్రగంగిరెడ్డి తనతో చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అయితే తాను అలా చెప్పనే లేదని ఎర్ర గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఇక వివేకా హత్యకు రూ.40 కోట్లతో డీల్ కుదిరినట్లు దస్తగిరి మరో కట్టుకథ చెప్పాడు. అందుకు సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించ లేదు. బెంగళూరులో ఓ భూ వివాదంలో రూ.8 కోట్లు వస్తాయని ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్టుగా దస్తగిరి చెప్పాడు. అసలు ఆ వివాదమే లేదని స్పష్టమైంది.
తనకు అడ్వాన్స్‌గా రూ.కోటి ఇచ్చారని చెప్పుకొచ్చిన దస్తగిరి రూ.2 వేల కోసం చివరికి రూ.500 కోసం సునీల్ యాదవ్‌తోపాటు ఇతరులను ప్రాథేయపడుతూ పెట్టిన వాట్సాప్ మెస్సేజ్‌లు వెలుగు చూశాయి. రూ.కోటి ఉన్న వ్యక్తి రూ.500 కోసం దేబిరించడం ఏమిటన్నది సీబీఐనే చెప్పాలి. దస్తగిరిని అప్రూవర్‌గా మార్చిన సీబీఐ హత్య ఆయుధాన్ని కూడా రికవరీ చేయలేకపోయింది.
తండ్రి శత్రువులతో సునీత కుమ్మక్కు
పులివెందులలో తన తల్లి విజయమ్మపై పోటీ చేసినప్పటికీ వైఎస్ వివేకా పార్టీలోకి వస్తానంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. సముచిత గౌరవం ఇచ్చారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను అభ్యర్థిగా నిలిపారు. చంద్రబాబు పన్నాగంతో నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి వైఎస్సార్‌సీపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి కుట్రతో వివేకానందరెడ్డిని ఓడించారు.
వివేకా మరణించిన తరువాత ఆయన కుమార్తె సునీత టీడీపీ నేతలతో కుమ్మక్కు కావడం విస్మయపరిచింది. వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి కారణమంటూ సీబీఐకి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో పూర్తిగా విఫలమైన సీబీఐ తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథలతో దర్యాప్తును పక్కదారి పట్టిస్తోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment