CBI Changed Its Word In The Final Charge Sheet In Viveka Murder Case - Sakshi
Sakshi News home page

Viveka Case: గూగుల్‌ టేక్‌ అవుట్‌ తప్పు.. మాటమార్చిన సీబీఐ!

Published Fri, Jul 21 2023 4:51 AM | Last Updated on Fri, Jul 21 2023 11:28 AM

CBI changed its word in the final charge sheet in Viveka murder case - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్‌ టేక్‌ అవుట్‌ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్‌షీట్లో పేర్కొన్న నిందితుడు సునీల్‌ యాదవ్‌ మొబైల్‌ ఫోన్‌ గూగుల్‌ టేక్‌ అవుట్‌ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం.

కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, ఏ–7 వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్‌కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్‌ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. 

తూచ్‌.. అంతా ఉత్తిదే
కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్‌ యాదవ్‌ మొబైల్‌ ఫోన్‌ గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో మాట మార్చింది.

‘సునీల్‌ యాదవ్‌ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్‌ నంబర్‌ గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. 

‘సునీల్‌ యాదవ్‌ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా తెలుసుకున్నది గ్రీన్‌విచ్‌ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. 

గూగుల్‌ టేక్‌ అవుట్‌ పేరిట బురిడీకి యత్నం!
కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు.

స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్‌ యాదవ్‌ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్‌ యాదవ్‌ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్‌ టేక్‌ అవుట్‌ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. 

ఒక్క ఆధారం లేదే..
గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్‌షీట్‌లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్‌ యాదవ్‌ వైఎస్‌ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్‌షీట్లో పేర్కొంది. అసలు సునీల్‌ యాదవ్‌ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్‌ యాదవ్‌.. ఆ రోజు రాత్రి భాస్కర్‌రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్‌రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా ఆధారంగానే వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది.

అదే గూగుల్‌ టేక్‌ అవుట్‌ ఆధారంగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్‌ కుమార్‌ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్‌ కుమార్‌రెడ్డే చెప్పారు.

మరి దాన్ని ఏదో గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్‌షీట్‌లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. 

మిగిలిన నిందితుల గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా లేదా?
సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటా శాస్త్రీయమైనదని  సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి మొబైల్‌ ఫోన్ల గూగుల్‌ టేక్‌ అవుట్‌ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.

నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్‌ ఫోన్ల గూగుల్‌ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

చిన్నాన్న కడప ఎంపీ టికెట్‌ ఆశించనే లేదు
‘మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్‌ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్‌ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది.

వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్‌కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్‌ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్‌ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు.

ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్‌ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement