sunil yadav
-
దస్తగిరి చెప్పేవన్ని అబద్ధాలే
పులివెందుల: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి చెప్పేవన్ని పూర్తి అవాస్తవాలని.. హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌యాదవ్ సమీప బంధువు భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ రౌడీయిజం, గూండాయిజం, సెటిల్మెంట్లు ఎలా చేస్తున్నాడని ప్రశ్నించారు. అతను చేసిన దుర్మార్గపు పనిని గొప్పగా చెప్పుకుంటూ సమాజంలో రౌడీయిజంతో హల్చల్ చేస్తున్నాడన్నారు. ఉన్నతమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అబద్ధపు మాటలతో సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. నిజాన్ని కప్పిపుచ్చి దస్తగిరితో వెనుక ఉండి ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసునన్నారు. గతంలో సునీల్‌యాదవ్, దస్తగిరిలు తమ ఆర్థిక లావాదేవీల విషయంలో తనను సంప్రదించేవారని.. అప్పట్లో ఐస్ బండి వ్యాపారం చేస్తూ అప్పులతో ఉన్న దస్తగిరి ఇప్పుడు విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతున్నాడని భరత్‌యాదవ్ ప్రశ్నించారు. తనకు కూడా డబ్బులు బాకీ ఉన్న దస్తగిరి తననూ దూషించాడన్నారు. వివేకా రెండో భార్య అయిన షమీమ్‌కు ఆస్తి పోతుందనే ఈ హత్య జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తంచేశారు. ఈ హత్యలో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కీలకపాత్ర పోషించాడన్నారు. అతను వెనుక ఉండి ఎర్రగంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరిల ద్వారా హత్య చేయించాడన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే అసలు విషయాలు వెల్లడి.. ఈ హత్యలో ఎర్రగంగిరెడ్డి నోరు విప్పితే పూర్తి విషయాలు బయటపడతాయని భరత్‌యాదవ్ చెప్పారు. తనకు సునీల్‌యాదవ్ రూ.16 లక్షలు ఇవ్వాలని, అప్పట్లో తాను డబ్బుల విషయం అడిగితే రాజశేఖర్ సార్ ఇవ్వాలని, డబ్బులు వచ్చిన వెంటనే ఇస్తానని చెప్పేవాడన్నారు. అలాగే, డబ్బుల విషయమై ఒకసారి ఎర్రగంగిరెడ్డి కూడా నీకు రావాల్సిన డబ్బులు ఎక్కడికీ పోవు, త్వరలోనే వస్తాయని తనతో చెప్పేవాడన్నారు. దస్తగిరి, దస్తగిరి భార్య ఎవరితో మాట్లాడుతున్నారో వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని భరత్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. అసలు సునీతమ్మ తన తండ్రిని చంపిన దస్తగిరి కోసం ఎందుకు ఆరాటపడుతోందో ఆమెకే తెలియాలన్నారు. గతంలో తనను సీబీఐ ఎంక్వైరీకి పిలిచినప్పుడు అన్ని విషయాలు వారికి తెలిపానని, అయినా కూడా వారు తాను చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ఎర్రగంగిరెడ్డి నోరువిప్పితే ఈ కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర బయటపడుతుందని భరత్‌యాదవ్ స్పష్టంచేశారు. -
వివేకా హత్యతో లబ్ధి పొందింది సునీత, ఆమె భర్తే
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో లబ్ధి పొందింది ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాత్రమేనని వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. హత్య చేసే కారణం కూడా వారికే ఉందని వివరించారు. వివేకా హత్య వల్ల ఇతరులు పొందే ప్రయోజనం ఏమీ లేదన్నారు. వివేకా ఆస్తులన్నీ సునీత, ఆమె భర్త సొంతమయ్యాయని తెలిపారు. తండ్రి ఆస్తులను దక్కించుకున్న తరువాత సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సునీత వ్యవహరిస్తున్నారని వివరించారు. ప్రతి కోర్టులో, ప్రతి పిటిషన్లో ప్రతివాదిగా చేరుతూ (ఇంప్లీడ్) పిటిషన్ల మీద పిటిషన్లతో, అవాస్తవాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. ఆమె వాదనలను సీబీఐ న్యాయవాదుల ద్వారా చెప్పిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో సునీత బాధితురాలు కాదని... మృతుడు వివేకానందరెడ్డే ఆమె బాధితుడని చెప్పారు. వారి బండారం బయట పడుతుందన్న భయంతోనే ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ సైతం ఆ కోవలోకే వస్తుందన్నారు. అందువల్ల దాన్ని కొట్టేయాలని నయన్ కుమార్ కోర్టును కోరారు. సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సహా మరికొందరిపై కడప కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు పెండింగ్‌లో ఉందన్నారు. 2021 ఆగస్టు 2 నుంచి జైలులో ఉన్నానని, చార్జిషీట్ కూడా దాఖలు చేసినందున, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం విచారణ జరిపారు. నయన్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘వివేకా హత్య కేసులో కీలక నిందితుడు, కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి పిటిషన్‌ను తప్ప ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని సునీత కోర్టులను కోరుతూ వస్తున్నారు. వివేకానందరెడ్డి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వాంగ్మూలం ఇచ్చి, ఆయన్ని హత్య చేసిన వారిలో తానూ ఉన్నానని చెప్పిన దస్తగిరికి ఆమె సహకరిస్తున్నారు. అతనికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని, అప్రూవర్‌గా మారేందుకు అనుమతివ్వడంపై సునీత నోరెత్తలేదు. ఆమె న్యాయం కోసం నిష్పాక్షికంగా వ్యవహరించడంలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సమాంతరంగా కేసులను పర్యవేక్షిస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారు. ఒక రకంగా సీబీఐని శాసిస్తున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తు సైతం పక్కదారి పట్టింది. అంతేకాకుండా కోర్టులకు నిందితులపై తీవ్ర దురభిప్రాయాన్ని కలిగిస్తూ న్యాయ విచారణ ప్రక్రియను దురి్వనియోగం చేస్తున్నారు’ అని నయన్ కుమార్ వివరించారు. ఆస్తి పోతుందన్న భయం సునీత,నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలో పెరిగిపోయింది.. ‘తన తండ్రి షేక్ షమీమ్ అనే మహిళను వివాహం చేసుకున్నారని, వారికి ఒక కొడుకు ఉన్నాడని, వారికి రూ.8 కోట్లు కూడా ఇవ్వాలని తన తండ్రి భావించారని, ఈ కారణంగానే తండ్రితో సత్సంబంధాలు లేవని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో సునీత స్పష్టంగా చెప్పారు. ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఆస్తి పోతుందన్న భయం సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిలలో పెరిగిపోయింది. రాజశేఖర్‌రెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి, మరికొందరు వివేకా హత్యకు కారణమంటూ మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ కడప జిల్లా కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉంది. తులసమ్మ, షేక్ షమీమ్ మరికొందరు సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం వివేకాను హత్య చేసే కారణం సునీతకు, ఆమె భర్తకే ఉంది. సునీల్ యాదవ్‌కు ఈ హత్యతో సంబంధం లేదు. కావాలనే అతన్ని ఇరికించారు.’ అని న్యాయవాది నయన్ కుమార్ నివేదించారు. న్యాయమూర్తిపైనే ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది.. ‘నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో ప్రతి విచారణకు ఆమె హాజరవుతున్నారు. న్యాయమూర్తి ముందు కూర్చొవడమే కాకుండా తన న్యాయవాదితో వెనక నుంచి చర్చిస్తూ, సూచనలిస్తూ, దర్యాప్తు వివరాలను తానే అందిస్తున్నా అనేలా వ్యవహరిస్తున్నారు. ఈ చర్యల వల్ల.. ఓ వర్గం మీడియా ఏకంగా హైకోర్టు న్యాయమూర్తిపైనే తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు చేసే స్థాయికి వెళ్లింది. ఇదే కేసులో మరో నిందితుడి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. సీబీఐ తరఫున వాదించడానికి ఢిల్లీ నుంచి సీనియర్లు వస్తున్నారు. వారికి స్థానిక న్యాయవాదులు, అధికారులు సహకరిస్తున్నారు. సునీత వాదనలు అనవసరం. హత్య జరిగిన రోజున సునీల్ యాదవ్ ఎక్కడెక్కడికి వెళ్లారో చెప్పేందుకు గూగుల్ టేక్ అవుట్, దస్తగిరి వాంగ్మూలంపై సీబీఐ ఆధారపడింది. గూగుల్ టేక్ అవుట్లో పేర్కొన్న సమయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో తప్పు జరిగిందని సీబీఐ కూడా ఒప్పుకుంది.’ అని నయన్‌కుమార్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. కౌంటర్ దాఖలు చేయండి అజేయ కల్లం పిటిషన్‌పై సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన వాంగ్మూలాన్ని వక్రీకరించిందని, తాను చెప్పని విషయాలను చెప్పినట్టు చార్జిషీట్లో పేర్కొందని, వాటిని చార్జిషీట్ నుంచి తొలగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ పిటిషన్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కూనూరు లక్ష్మణ్ శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టు సీబీఐ తన చార్జిïÙట్లో పేర్కొన్నందున వాటిని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ అజేయ కల్లం ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. అజేయ కల్లం తరఫున సీనియర్ న్యాయవాది టి.సూర్యకరణ్‌రెడ్డి, న్యాయవాది పి.వీర్రాజు వాదనలు వినిపించారు. -
‘వివేకా కేసులో సునీత స్వార్థం స్పష్టంగా కనిపిస్తోంది’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులోని నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్‌కు వివేకా హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఉద్ధేశపూర్వకంగా ఇరికించారని ఆయన న్యాయవాది కోర్టుకు తెలిపారు. వివేకా హత్య జరిగిన ప్రాంతంలో.. సునీల్ యాదవ్ ఉన్నాడన్న గూగుల్ టేకౌట్ సమాచారం తప్పని వాదనలు వినిపించారు. టేక్ ఔట్ కథలన్నీ కట్టుకథలే కాగా, ‘2021 ఏప్రిల్ 29 తెల్లవారుజామున 2:30 గంటలకు సునీల్ యాదవ్ సంఘటన స్థలంలో ఉన్నాడని గూగుల్ టేకౌట్ ఆధారంగా సీబీఐ చెప్పిందని.. అయితే అదే సీబీఐ 23 జనవరి 2023 ఛార్జ్‌షీట్‌లో గూగుల్ టేకౌట్ విషయంలో పొరపాటు జరిగిందని అంగీకరించినట్లు తెలిపారు. యూనివర్సల్ టైం ప్రకారం ఉదయం 2:30కాగా భారత కాలమానం ప్రకారం ఐదున్నర గంటలు కలపాలని, అప్పుడు సమయం ఇండియన్ కాలమానం ప్రకారం ఉదయం 8:12అవుతుందని తెలిపారు. ఉదయం 8:12కు సీబీఐ చెప్పినట్టు సునీల్ యాదవ్ అక్కడుంటే హత్యతో సంబందం లేనట్టేనని పేర్కొన్నారు. కావున సునీల్‌కు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సెప్టెంబర్ 8కు వాయిదా వేసింది. చదవండి: ‘లోకేశ్.. హిందుస్తాన్ టైమ్స్పై దావా వేసే దమ్ముందా?’ దస్తగిరి విషయంలో అలా.. సునీల్ విషయంలో ఇలా.! షేక్ దస్తగిరి తానే స్వయంగా హత్య చేశానని అంగీకరించినా.. ఆయన ముందస్తు బెయిల్ విషయంలో సునీత ఎక్కడా అభ్యంతరం తెలుపలేదని, కానీ, సునీల్ యాదవ్ బెయిల్ విషయంలో ఇంప్లీడ్ అయ్యారని తెలిపారు. సునీత స్వార్థ ప్రయోజనాల కోసం పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ఈ కేసులో ఆమె బాధితురాలు కానే కాదు, తనకు తాను బాధితులుగా ప్రచారం చేసుకుంటుందని తెలిపారు. తండ్రి వివేకా హత్యతో ఆమె కుటుంబం మాత్రమే లబ్ధిదారులు అన్న విషయం గమనించాలని, కోర్టు విచారణ ప్రక్రియను పిటిషన్లు, కౌంటర్లతో దుర్వినియోగం చేస్తుందని, సీబీఐ దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌లో ఉద్దేశ పూర్వకంగా జోక్యం చేసుకుంటుందని, అన్ని విషయాల్లో సునీత ప్రమేయం దర్యాప్తును ప్రాసిక్యూషన్ తప్పుపట్టించేలా ఉందని తెలిపారు. బాధితుడు వివేకా మాత్రమే, సునీత కాదు రెండవ భార్య షేక్ షమీంతో పాటు ఆమె కొడుక్కి ఆస్థి దక్కకుండా సునీత నిలువరించారని, ఈ హత్య కేసులో సునీత భర్త రాజశేఖరరెడ్డి మామ శివ ప్రకాష్ రెడ్డిలపై ప్రైవేటు పిటిషన్ పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఒక వర్గం మీడియా ప్రచారం ఏకంగా హైకోర్టు న్యాయమూర్తినే విమర్శించిన తీరు ఇప్పటికే కోర్టు రికార్డుల్లో ఉందని, సీబీఐకి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఢిల్లీ నుంచి వస్తున్నారని, ఈ కేసులో సునీత బాధితురాలు కాదని, తండ్రే ఆమె బాధితుడని సునీల్ యాదవ్ తరపు లాయర్ వాదనలు వినిపించారు. అజేయ కల్లం పిటిషన్ పై సీబీఐకి నోటీసులు వివేకా హత్యకేసులో తన స్టేట్ మెంట్ ను తప్పుదోవ పట్టించారంటూ మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లo వేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. తన పేరుతో కోర్టుకు ఇచ్చిన వాంగ్మూలంలో తాను చెప్పని విషయాలను సీబీఐ పేర్కొందని, పూర్తిగా కేసును పక్కదోవ పట్టించేలా సీబీఐ అధికారి వ్యవహరించారంటూ హైకోర్టును ఆశ్రయించిన అజేయ కల్లం. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 15 కు వాయిదా వేసింది. -
Viveka Case: గూగుల్ టేక్ అవుట్ తప్పు.. మాటమార్చిన సీబీఐ!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారమంటూ గూగుల్ టేక్ అవుట్ పేరిట కొండను తవ్వినంత హడావుడి చేసిన సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో తోక ముడిచింది. ఇన్నాళ్లూ ఎంతో శాస్త్రీయ ఆధారమంటూ చెప్పుకొచ్చిన అంశంపైనే చివరికి చేతులెత్తేసింది. తాను గతంలో చార్జ్‌షీట్‌లో పేర్కొన్న నిందితుడు సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ వివరాలు అంతా పొరపాటని అంగీకరించడం గమనార్హం. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన ఏ–6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏ–7 వైఎస్ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది. కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగా చూపిస్తూ వారిని అరెస్టు చేసిన సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఎలాంటి ఆధారం చూపించకపోవడం గమనార్హం. మరోవైపు షర్మిల తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కడప ఎంపీ టికెట్‌ను ఆశించనే లేదని సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా ఎంపీ టికెట్‌కు అడ్డుగా ఉన్నందునే వివేకాను హత్య చేశారన్న అభియోగాల్లో వాస్తవం లేదన్నది తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు హైదరాబాద్‌లోని సీబీఐ న్యాయస్థానంలో బుధవారం తుది చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అభియోగాలకు సరైన ఆధారమేదీ తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ చూపించలేకపోయింది. వెరసి వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఏనాడో దారి తప్పిందని.. కొందరి ప్రభావానికి గురై సీబీఐ అధికారులు వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమైంది. వైఎస్సార్ కుటుంబంపై రాజకీయ దురుద్దేశంతో ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనన్నది తేలిపోయింది. తూచ్.. అంతా ఉత్తిదే కేసు దర్యాప్తులో కేంద్ర బిందువుగా పేర్కొన్న ప్రధాన సాక్ష్యాధారంపైనే సీబీఐ బొక్కబోర్లా పడింది. వివేకాను హత్య చేసిన నలుగురు నిందితుల్లో ఏ–2 సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాను సేకరించి ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించామని రెండేళ్లుగా చెబుతున్న సీబీఐ.. తుది చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసంలో ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక 2.35 గంటలకు వివేకా నివాసం సమీపంలో, 2.42 గంటలకు నివాసం లోపల ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన మొబైల్ నంబర్ గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించాం’ అని సీబీఐ ఇన్నాళ్లు చెబుతూ వచ్చింది. తాజాగా న్యాయస్థానంలో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో అందుకు విరుద్ధంగా పేర్కొంది. ‘సునీల్ యాదవ్ 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత వివేకానందరెడ్డి నివాసంలో లేరు. 2019 మార్చి 15న ఉదయం 8.05 గంటలకు వివేకా ఇంటి బయట, ఉదయం 8.12 గంటలకు ఇంటి లోపల ఉన్నాడు. గతంలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా తెలుసుకున్నది గ్రీన్విచ్ కాలమానం ప్రకారం. కానీ ఏ దేశంలోనైనా స్థానిక కాలమానం ప్రకారమే చూడాలి. ఈ లెక్కన భారత కాలమానం ప్రకారం అంటే దానికి 5.30 గంటల సమయం కలపాలి. గతంలో పొరబడ్డాం’ అని స్పష్టం చేసింది. గూగుల్ టేక్ అవుట్ పేరిట బురిడీకి యత్నం! కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు గూగుల్ టేక్ అవుట్ డేటా పేరిట సీబీఐ యత్నిస్తోందన్న సందేహాలు బలపడుతున్నాయి. వివేకా మరణించారనే విషయం 2019 మార్చి 15 ఉదయం 6.05 గంటలకే అందరికీ తెలిసింది. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకా గుండెపోటుతో మరణించారని మీడియాకు వెల్లడించారు. సమాచారం తెలుసుకున్న వందలాది మంది ఉదయం 7 గంటలకే పులివెందులలోని వివేకా నివాసానికి చేరుకున్నారు. స్థానికులు ఆ విధంగా రావడం సహజం. ఆ తర్వాత 8 గంటల సమయంలో సునీల్ యాదవ్ అక్కడికి వచ్చారని సీబీఐ ప్రస్తుతం చెప్పడం గమనార్హం. ఆ రోజు వివేకా నివాసానికి చేరుకున్న వారిలో 248 మందిని సాక్షులుగా సీబీఐ అధికారులు విచారించారు. వారిలో ఎవరూ కూడా ఆ రోజు సునీల్ యాదవ్ అక్కడ ఉన్నట్టు చెప్పనే లేదు. గూగుల్ టేక్ అవుట్ పేరిట సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే గందరగోళం సృష్టిస్తోందన్నది స్పష్టమవుతోంది. ఒక్క ఆధారం లేదే.. గూగుల్ టేక్ అవుట్ డేటా అశాస్త్రీయతతతోపాటు ఈ కేసులో సీబీఐ అరెస్టుల వెనుక డొల్లతనం కూడా తుది చార్జ్‌షీట్‌లో బట్టబయలైంది. సీబీఐ హడావుడిగా అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిలకు వ్యతిరేకంగా కొత్తగా ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా హత్యకు ముందు, తర్వాత సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసానికి 30 సార్లు వచ్చినట్టుగా సీబీఐ గత చార్జ్‌షీట్‌లో పేర్కొంది. అసలు సునీల్ యాదవ్ ముందు రోజు రాత్రి వివేకానందరెడ్డి ఇంట్లోనే లేరని తుది చార్జ్‌షీట్‌లో పేర్కొంది. హత్య సమయంలో వివేకా ఇంట్లోలేని సునీల్ యాదవ్.. ఆ రోజు రాత్రి భాస్కర్‌రెడ్డి నివాసం నుంచి వివేకా నివాసానికి వెళ్లినట్టు, హత్య తర్వాత మళ్లీ వివేకా నివాసం నుంచి భాస్కర్‌రెడ్డి నివాసానికి వచ్చినట్టు ఎలా చెబుతుంది? ఈ లెక్కన గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించామన్న ఆ సమాచారం కూడా తప్పే కదా! కేవలం గూగుల్ టేక్ అవుట్ డేటా ఆధారంగానే వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయడం పూర్తిగా అసంబద్ధమన్నది స్పష్టమైంది. అదే గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని అరెస్టు చేసినట్టు సీబీఐ చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజు రాత్రి ఆయన తన ఇంటి నుంచి తొందరగా వెళ్లిపోయారని, మర్నాడు ఉదయం వివేకా ఇంటి వద్దకు వెళ్లారని చెప్పింది. కానీ ఆ రోజు రాత్రి ఉదయ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నారన్నది మాత్రం సీబీఐ చెప్పనే లేదు. మర్నాడు వివేకా మరణించారని సమాచారం తెలిసిన తర్వాత వందలాది మంది ఆయన నివాసానినికి చేరుకున్నారు. తాను ఉదయం 8 గంటల సమయంలో అక్కడికి వెళ్లానని ఉదయ్ కుమార్‌రెడ్డే చెప్పారు. మరి దాన్ని ఏదో గూగుల్ టేక్ అవుట్ ద్వారా గుర్తించినట్టు సీబీఐ చెప్పడం ఏమిటి? ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి మార్చి 15 ఉదయం వివేకా నివాసానికి చేరుకోవడానికి ముందే తాము అక్కడకు వెళ్లామని ప్రత్యక్ష సాక్షి సత్యనారాయణ చెప్పినట్టు తుది చార్జ్‌షీట్‌లో ఉంది. అప్పటికే వివేకా గుండెపోటుతో మరణించినట్టు అక్కడ కొందరు మాట్లాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంటే వివేకా గుండెపోటుతోనే మరణించారని మొదట బయటకు పొక్కిన సమాచారంతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నది స్పష్టమైంది. ఏ విధంగానూ భాస్కర్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. మిగిలిన నిందితుల గూగుల్ టేక్ అవుట్ డేటా లేదా? సీబీఐ ఎంతగా హడావుడి చేస్తున్నప్పటికీ గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయతమై మొదటి నుంచి నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అంతగా గూగుల్ టేక్ అవుట్ డేటా శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే.. ఈ కేసులో మిగిలిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి మొబైల్ ఫోన్ల గూగుల్ టేక్ అవుట్ డేటాను సీబీఐ ఎందుకు సేకరించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. నలుగురు నిందితుల్లో ఒకరి డేటాను మాత్రమే సేకరించడం ఏమిటి.. మిగిలిన ముగ్గురి డేటాను విస్మరించడం ఏమిటన్నది కీలకంగా మారింది. ఆ సమాచారం శాస్త్రీయమైనదని సీబీఐ భావిస్తే హత్యలో పాలుపంచుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్న నలుగురు నిందితుల మొబైల్ ఫోన్ల గూగుల్ డేటాను సేకరించి విశ్లేషించాలి. కానీ సీబీఐ అలా చేయకపోవడం సందేహాస్పదంగా మారింది. దర్యాప్తును పక్కదారి పట్టించేందుకే సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఇలా వ్యవహరిస్తోందని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నాన్న కడప ఎంపీ టికెట్ ఆశించనే లేదు ‘మా చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేయాలని భావించలేదు. ఆయన ఎంపీ టికెట్ ఆశించలేదు’ అని షర్మిల స్పష్టం చేశారు. ‘కడప ఎంపీగా నన్ను పోటీ చేయమని చిన్నాన్న కోరారు. కానీ ఆ సమయంలో కడప జిల్లా రాజకీయాల పట్ల నేను ఆసక్తిగా లేను’ అని తెలిపారు. ఈ మేరకు షర్మిల ఇచ్చిన వాంగ్మూలాన్ని సీబీఐ తుది చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. దాంతో కడప ఎంపీ టికెట్ అంశంపై సీబీఐ ఇన్నాళ్లూ చేస్తున్న అభియోగాలు అవాస్తవం అని పరోక్షంగా తేలిపోయింది. వివేకానందరెడ్డి కడప ఎంపీగా పోటీ చేయాలని భావించారని, దీంతో ఎంపీ టికెట్‌కు అడ్డురాకుండా ఉండేందుకే ఆయన్ని హత్య చేశారన్న సీబీఐ అభియోగాల్లో నిజం లేదని నిగ్గు తేలింది. 2022 అక్టోబర్ 7న ఢిల్లీలోని సీబీఐ కార్యాలాయానికి వెళ్లి షర్మిల వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐ అధికారులు అడిగిన 20 ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు. ఎన్నికలకు దాదాపు మూడు నెలల ముందు బెంగళూరులోని తన నివాసానికి వైఎస్ వివేకానందరెడ్డి వచ్చారని, 2019 ఎన్నికల్లో కడప ఎంపీగా తనను పోటీ చేయమని కోరారని షర్మిల చెప్పారు. ఆ సమయంలో ఆసక్తిగా లేనని చెప్పానన్నారు. వివేకా ఎందుకు పోటీ చేయాలని భావించలేదని సీబీఐ అధికారులు ఆమెను ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో బహుశా ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపలేదని షర్మిల చెప్పారు. 2009లో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో వివేకానందరెడ్డి తన తల్లి విజయమ్మపై పులివెందుల ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. బహుశా అందువల్ల తనకు టికెట్ రాదని ఆయన భావించి ఉండవచ్చని చెప్పారు. -
‘వివేకా కేసులో సునీత మౌనం వహిస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితులకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలున్నాయని, అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సైతం సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగాయి. నిందితుడు దస్తగిరిని అఫ్రూవర్ గా పరిగణించడాన్ని సవాల్ చేస్తూనే.. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ వీళ్లు పిటిషన్లు దాఖలు చేశారు. వివేకా కేసులో భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ సైతం హాజరయ్యారు. ఇక ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపున లాయర్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అలాగే.. భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి ఇవాళ వాదనలు వినిపించారు. ‘‘వివేకా రెండో భార్య కుమారుడిని వారసుడిగా ప్రకటించడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. సునీల్ యాదవ్ కుటుంబ సభ్యులను వేధించారనే వివేకాపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నారు. రాజకీయంగా టీడీపీ సునీతతో కలిసి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కుట్ర పన్నార’’ని నిరంజన్‌రెడ్డి వాదించారు. సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి విచారిస్తోందని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన నిందితుడు దస్తగిరి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సాక్ష్యాధారాలు నిందితులకు వ్యతిరేకంగా.. బలంగా ఉన్నాయి. అయినా దస్తగిరికి బెయిల్ సహా అప్రూవర్‌గా పరిగణించడంపై సునీత మౌనం వహిస్తున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో విచారణను ఎల్లుండి(గురువారానికి) వాయిదా వేసింది కోర్టు. ఇదీ చదవండి: వివేకా కేసులో రంగన్న చెప్పింది సీబీఐ పట్టించుకోదా? -
ఎల్లో మీడియాది అసత్య ప్రచారం
పులివెందుల రూరల్: 2019 మార్చి 14వ తేదీ రాత్రి సునీల్ యాదవ్ వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడండూ ఎల్లో మీడియా చేస్తున్నది అసత్య ప్రచారమని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారించిన స్థానిక విలేకరి భరత్ యాదవ్ చెప్పారు. ఆ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు తాను, సునీల్ యాదవ్ పులివెందులలో కడప రోడ్డు సమీపంలోని నందిక ఆసుపత్రి దగ్గర ఉన్నామని స్పష్టంచేశారు. తనను సీబీఐ అధికారులు విచారించిన సందర్భంలో ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పానని తెలిపారు. సీబీఐ అధికారులు వైఎస్ వివేకా హత్య కేసులో ఎందుకు ఇంతలా అవాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న సునీల్ యాదవ్ తనకు బంధువని చెప్పారు. ఆయన వివాహాన్ని బంధువుల అమ్మాయితో తానే జరిపించానన్నారు. చిన్న స్థలం పంచాయితీ విషయంలో సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి దగ్గర ఉండటంవల్ల తాను కూడా ఆయనకు దగ్గరయ్యానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు తననూ విచారించారని, వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని అన్నారు. సీఐ ర్యాంకు అధికారిణి ఆ విషయాలను అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ధారించారన్నారు. వాస్తవాలు దాచి సీబీఐ అధికారులు ఎవరి కోసమో ఏదో తప్పు చేస్తున్నారని అన్నారు. అసలు తప్పు చేసిన వారిని వదిలేస్తున్నారని చెప్పారు. ఒకే కోణంలో కాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. తాను పేర్లతో సహా సీబీఐ డైరెక్టర్లకు లేఖ రాశానని, అందులో నిజాలు లేవా అని ప్రశ్నించారు. వారికి అవసరం వచ్చినప్పుడు తన దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని కేసును ముందుకు తీసుకెళుతున్నారని, తనను మాత్రం మైనస్ చేసి చూపిస్తున్నారన్నారు. తాను ఎవరికీ అమ్ముడుపోలేదని, తనను ఎవరూ పోషించలేదని చెప్పారు. సీబీఐపై ప్రజలకు గౌరవం ఉందని, దానిని వారు కాపాడుకోవాలన్నారు. -
ఏది నిజం?: పచ్చ పైత్యం ముదిరిపోయింది!
చనిపోయిన మనిషి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానానికి తీసుకువెళ్తూ... ఏమో బతుకుతాడేమోననే దింపుడు కళ్లెం ఆశతో మధ్యలో పాడెను ఓసారి కిందకు దించి మరీ చూస్తారు!!. రాష్ట్రంలో రాజకీయంగా టీడీపీ అంతిమయాత్ర కొనసాగుతున్న తరుణంలో... ఎల్లో మీడియాలో ఇదే దింపుడు కళ్లెం ఆశ మిణుకు మిణుకు మంటోంది. అందుకే ఆ పార్టీని బతికించేందుకు రోజుకో రీతిలో రాజకీయ కుట్రకు తెరతీస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నిత్యం విషం చిమ్ముతోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వార్తలు, కథనాల పేరిట అభూతకల్పనలు, అవాస్తవాలను ప్రతిరోజూ అచ్చేస్తూ... పాత్రికేయ విలవలకు పాతరవేస్తోంది. సీబీఐ న్యాయస్థానంలో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ పేరిట ఈనాడు, దాని తోక మీడియా మరోసారి అదే పచ్చ పైత్యాన్ని ప్రదర్శించాయి. అసలు ఆ అఫిడవిట్లో ఏముందనే దానితో పని లేకుండా.... చంద్రబాబు పోసిన ‘పచ్చ’ సిరాను తమ పెన్నుల్లో నింపేసుకుని విచ్చలవిడి రాతలకు దిగాయి. 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగానే చంద్రబాబు బీజేపీలోకి పంపిన తన కోవర్టుల ద్వారా ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. అందుకే దర్యాప్తు దారితప్పిందన్నది సుస్పష్టం. తమకు అదే కావాలన్న రీతిలో అటు చంద్రబాబు ఇటు పచ్చ మీడియా వైఎస్సార్ కుటుంబంపై నిస్సిగ్గుగా బురద జల్లుతున్నాయి. సునీల్ యాదవ్‌పై విరుద్ధ వాదనలేల? ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కదలికలు అత్యంత కీలకమని సీబీఐ చెబుతోంది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున సునీల్‌యాదవ్ ఎక్కడెక్కడ తిరిగారన్నది దర్యాప్తులో తాము కనుగొన్న అతి ముఖ్యమైన విషయంగా పేర్కొంది. మరి అంత ముఖ్యమైన అంశంపై సీబీఐ 2021లో న్యాయస్థానానికి చెప్పిన మాటకు... ఇప్పుడు సీబీఐ కోర్టుకు చెప్పిన మాటకు పొంతన లేదెందుకు? సునీల్ యాదవ్‌ను 2021, ఆగస్టులో సీబీఐ అరెస్టు చేసింది. 2021, డిసెంబర్లో చార్జ్‌షీట్ వేసింది. అందులో వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున... వివేకా ఇంటి పరిసరాల్లోనే సునీల్ యాదవ్ తిరిగినట్టు సీబీఐ పేర్కొంది. సునీల్ మొబైల్ ఫోన్ లొకేషన్‌ను గూగుల్ టేకౌట్ విధానం ద్వారా నిర్ధారించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు తెలిపింది. కేసులో ఇదే అత్యంత కీలకమైన సాక్ష్యమని కూడా న్యాయస్థానానికి నివేదించింది. మరి సీబీఐ వద్ద అంత పక్కా సమాచారం ఉంటే దాని ఆధారంగా కేసు దర్యాప్తును ఎందుకు వేగవంతం చేయలేదు?. నేరుగా చర్యలు తీసుకోవచ్చు కదా? వెంటనే కేసు దర్యాప్తును కొలిక్కి తేవచ్చు కదా? కానీ అలా చేయలేదు. హత్య జరిగిన నాడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని నాటి చార్జిషీట్లో చెప్పనే లేదు. ఇప్పుడు 14 నెలల తరువాత... హఠాత్తుగా సునీల్ యాదవ్ ఆ రోజు వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టు న్యాయస్థానానికి సీబీఐ చెప్పడం వెనుక మతలబేంటి? బోడిగుండుకు మోకాలికి ముడి పెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తోంది? సునీల్ యాదవ్ కదలికలను గుర్తించి ఉంటే 2021 నాటి చార్జ్షీట్లోనే ఎందుకు చెప్పలేదు...!? ఇప్పుడెందుకు కొత్తగా చెబుతున్నారు? న్యాయస్థానానికి రెండు వేర్వేరు సందర్భాల్లో రెండు వేర్వేరు వాదనలు వినిపించడమేంటి? ఇదంతా యాదృచ్ఛికం కాదని... ఓ స్కెచ్ ప్రకారమే జరుగుతోందని అర్థం కావటం లేదూ? వారు వివేకాకు సన్నిహితులు కాదా!? వివేకా హత్య కేసులో మోకాలికి– బోడి గుండుకు ముడిపెట్టేందుకు పచ్చ మీడియా యత్నిస్తోంది. వివేకానందరెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి మధ్య విభేదాలున్నాయని ఈనాడు పతాక శీర్షికల్లో రాసింది. వారి మధ్య కడప ఎంపీ టికెట్ కోసం విభేదాలున్నాయని సీబీఐ అధికారులు చెబుతున్నట్లు కూడా పేర్కొంది. పోనీ ఆ మాటకే కట్టుబడి ఉన్నారా అంటే... అదీ లేదు. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి వివేకానందరెడ్డికి సన్నిహితులని చెప్పేదీ ఈనాడే. ఆ నలుగురే మళ్లీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిలతో కలసి వివేకా హత్యకు కుట్రపన్నారని రాసేదీ ఈనాడే. సీబీఐ అధికారులు కూడా ఇదే మాటలు వల్లె వేస్తున్నారు. ఇది కుట్ర కాదా రామోజీ? ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు వైఎస్ వివేకానందరెడ్డికి ఎన్నో ఏళ్లుగా సన్నిహితులని సీబీఐ చెబుతోంది. అది నిజం కూడా. వివేకాకు సన్నిహితులు కనక వారికి సహజంగానే వివేకా కుటుంబీకులతో కూడా సన్నిహిత సంబంధాలుంటాయి. అంటే వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు కూడా ఆ నలుగురు సన్నిహితులేనన్నది అందరికీ తెలిసిన విషయమే. నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి హైదరాబాద్‌లో తన మనవరాలి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తూ పులివెందుల నుంచి ఒక్క ఎర్ర గంగిరెడ్డినే ఆహ్వానించారు. అంటే వారంతా సన్నిహితులేనన్నది సుస్పష్టం. ఇక వైఎస్ వివేకానందరెడ్డిని ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు హత్య చేశారని సీబీఐ ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిందేంటంటే... ఎవరైనా చెబితే ఆ హత్య చేశారా? వ్యక్తిగత, ఆర్థిక విభేదాలతోనే హత్యకు పాల్పడ్డారా? అనేది. వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయన్నది రహస్యమేమీ కాదు. తన రెండో భార్యకు ఆస్తిలో వాటా ఇవ్వాలని... ఆమెకు, తనకు పుట్టిన కొడుకును వారసుడిగా ప్రకటించాలని వైఎస్ వివేకా భావించారు. దీన్ని ఆయన కుటుంబం వ్యతిరేకించింది. ఆయన భార్య హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె సునీత వద్దకు వెళ్లిపోయారు. ఇదంతా పులివెందులలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ వ్యవహారంలోనే వివేకా రెండో భార్యను సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డి బెదిరించారన్నది కూడా కాదనలేని నిజం. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డిని సునీల్ యాదవ్, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి హత్య చేస్తే...అందుకు ఎర్రగంగిరెడ్డి దగ్గరుండి సహకరిస్తే... దాని వెనుక నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డిల ప్రమేయం ఉండే అవకాశాలూ ఉంటాయి కదా? పైగా వివేకా మరణించిన విషయం మొదటగా ఆయన కుమార్తె సునీత, భార్య సౌభాగ్యమ్మ, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డిలకే తెలిసింది. ఉదయాన్నే జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన వైఎస్ అవినాశ్ రెడ్డికి... నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెబితేనే ఈ మృతి విషయం తెలిసింది. ఆ ఫోన్‌కాల్‌తోనే ఆయన వెనక్కి తిరిగి పులివెందుల వచ్చారు. ఫోన్లో మెసేజీలు డిలీట్ చేయలేదా? పైపెచ్చు వివేకా రాసిన లేఖను, ఆయన సెల్‌ఫోన్‌ను తామొచ్చే వరకూ ఎవరికీ ఇవ్వొద్దని పీఏ కృష్ణారెడ్డికి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పారు. వారు వచ్చిన తరువాత, ఆ ఫోన్లోని కొన్ని మెసేజీలను డిలీట్ చేశాకే దాన్ని పోలీసులకు ఇచ్చారు. ఈ పరిణామాలన్నీ వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డిల పాత్రపైనా సందేహాలను లేవనెత్తుతున్నాయి కదా? మరి వాళ్లనెందుకు సీబీఐ విచారించటం లేదు? ఆ దిశగా దర్యాప్తు ఎందుకు చేయటం లేదు? అంతేకాదు వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు వేసిన సిట్ దర్యాప్తు నివేదికగానీ...అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నివేదికనుగానీ సీబీఐ ఏమాత్రం పట్టించుకోలేదు. వాటిని పక్కన పడేసి సీబీఐలో కిందిస్థాయి అధికారులు కొందరు... దర్యాప్తును కావాలనుకున్న దిశగా నడిపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పోనీ టీడీపీ, ఈనాడు ఆరోపిస్తున్నట్టుగా వైఎస్ వివేకా, వైఎస్ అవినాశ్ మధ్య విభేదాలు ఉండటమే నిజమైతే... వివేకా సన్నిహితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు సహజంగానే అవినాశ్‌కు దూరంగా ఉంటారు. తమకు ఆప్తుడైన వివేకా అంటే సరిపడని అవినాశ్ రెడ్డితో వారెందుకు సన్నిహితంగా ఉంటారు? మరి ఆ నలుగురే హత్య చేశారు అనుకుంటే దాంతో అవినాశ్‌కి గానీ ఆయన కుటుంబ సభ్యులకుగానీ ఎటువంటి సంబంధం ఉండదు కదా?. ఈ చిన్న లాజిక్‌ను సీబీఐ, టీడీపీ, పచ్చ మీడియా ఎందుకు మిస్ అవుతున్నాయి? కేవలం ముఖ్యమంత్రి కుటుంబంపై బురదజల్లేందుకేనని అర్థం కావటం లేదా? సాక్షులు చెప్పని మాటలు కూడా... సీబీఐ దర్యాప్తు తీరులో విస్మయం కలిగించే అంశమేంటంటే... ఈ కేసులో సాక్షులు చెప్పని విషయాలనూ వారి వాంగ్మూలాలుగా నమోదు చేయడం!!. బహుశా గతంలో ఎప్పుడూ పోలీసుల విచారణలో గానీ, సీబీఐ దర్యాప్తులో గానీ ఇలాంటి ఆరోపణలు రాలేదు. కానీ వివేకా హత్య కేసులో ఎంతోమంది సాక్షులు తాము చెప్పని మాటలను సీబీఐ అధికారులు ఏకపక్షంగా నమోదు చేసేసి... మీడియాకు లీకులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా సీబీఐ అధికారులు పేర్కొన్న శశికళ అనే మహిళ వాంగ్మూలం కూడా అదే రీతిలో ఉంది. వివేకా గుండెపోటుతో మరణించినట్లుగా ఎంపీ అవినాశ్ రెడ్డి తనతో చెప్పారని శశికళ వాంగ్మూలమిచ్చినట్లుగా సీబీఐ పేర్కొంది. కానీ ఈ విషయాన్ని శశికళ ఖండించారు. అవినాశ్ రెడ్డి తనతో ఏమీ చెప్పనే లేదని... తాను అసలు అవినాశ్‌తో ఈ విషయంపై మాట్లడనే లేదని ఆమె స్పష్టం చేశారు. అదే మాటను ఆమె గతంలో సిట్ విచారణలోనూ, ప్రస్తుత సీబీఐ దర్యాప్తులోనూ చెప్పారు. కానీ తాను చెప్పని మాటలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు ఎందుకు వాంగ్మూలంగా రాసుకున్నారో తెలియడం లేదని శశికళ వాపోయారు. ఈ విషయాన్ని తనతో కనీసం నిర్ధారించుకోకుండా ఈనాడు, ఇతర మీడియా ఏకపక్షంగా రాసేసినట్లు ఆమె తెలియజేశారు. రామోజీరావు నీతిమాలిన పాత్రికేయంపై ఆమె మండిపడ్డారు. గతంలోనూ పలువురి విషయంలో ఇలాంటివి జరగటం ఇక్కడ గమనార్హం. వైఎస్సార్ కుటుంబ సభ్యుడు వైఎస్ అభిషేక్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వెల్లపు వర ప్రసాద్, రఘునాథ రెడ్డి, అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్‌రెడ్డిలతోపాటు 71 ఏళ్ల ప్రభావతమ్మ అనే మహిళ కూడా ఇలాగే చెప్పారు.తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేశారని వారు తెలియజేశారు. దీనిపై అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. ఎందుకిలా జరుగుతోంది? ఈ తరహా సీబీఐ వాంగ్మూలాలు ఎల్లో మీడియాకు మాత్రమే ఎలా చేరుతున్నాయి? దీనివెనక ఉన్న అదృశ్య శక్తులేంటి? అన్నివేళ్లూ చూపిస్తున్నది చంద్రబాబు వైపే!!. వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా దొడ్డిదారి పోరాటానికి బాబు దిగారన్నది తేలిగ్గానే అర్థమవుతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీలోకి పంపిన కోవర్టులు చంద్రబాబుకు ఈ వ్యవహారంలో సహకరిస్తున్నారన్నది రహస్యమేమీ కాదు. ఫ్లెక్సీలో ఫొటో ఉంటే ప్రభావితం చేయడమా..!? సీబీఐ పేరు చెబుతూ ‘ఈనాడు’ రాసిన మరో దుర్మార్గపు రాత ఇది. ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు తన ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా వేయించిన ఫ్లెక్సీలో ఎంపీ అవినాశ్ రెడ్డి ఫొటో పెట్టారట. తద్వారా తన వెనుక ఎంతమంది పరపతి గలవారున్నారో అని కేసును, సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించారట!!. అదీ ఈనాడు వెళ్లగక్కిన పైత్యం. ఫ్లెక్సీలో ఓ నాయకుడి ఫొటో పెడితే అది సాక్షులను ప్రభావితం చేయడం అవుతుందా? గతంలో బ్యానర్లు, వాల్ పోస్టర్లు ఉండేవి. కొన్నేళ్లుగా ఫ్లెక్సీలు వచ్చాయి. చిన్న సెలూన్ ప్రారంభోత్సవం నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం సాధారణమైపోయింది. ఆ సందర్భంగా తమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతల ఫొటోలు ఆ ఫ్లెక్సీల్లో వేయటం సహజం. దీన్ని కూడా తప్పుబడతారా? చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు రాష్ట్రమంతటా ఆయన ఫొటోలు ఎందరో ఫ్లెక్సీల్లో వేశారు... ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నాసరే ఆయన ఫొటోలు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీల్లో వేస్తున్నారు. అంత మాత్రాన వారంతా చంద్రబాబు ఫొటో చూపించి అందర్నీ బెదిరిస్తున్నట్టు భావించాలా? మరి ఫ్లెక్సీల్లో చంద్రబాబు ఫొటోలుంటే లేని అభ్యంతరం... ఎంపీ అవినాశ్ రెడ్డి ఉంటే మాత్రం బెదిరించడం.. సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుంది రామోజీ గారూ?. అవినాశ్‌కు టికెట్టు ఖరారు చేశాక కూడా... సీబీఐ కౌంటర్ అఫిడవిట్ అంటూ ఈనాడు, దాని తోకమీడియా వండిన కథనాలన్నీ అవాస్తవాలే. అసలు కడప ఎంపీ టికెట్‌పై విభేదాలు రేగే అవకాశం ఎక్కడుంది? అవినాశ్ రెడ్డి అప్పటికే కడప ఎంపీ. ఆయనకే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అప్పటికే ధ్రువీకరించారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి... ఎంపీగా అవినాశ్‌ను గెలిపించడానికి ప్రచారం కూడా మొదలు పెట్టారు. ముందురోజు రాత్రి జమ్మలమడుగులో ప్రచారం చేసి ఇంటికి వచ్చాక... ఆ రోజు అర్ధరాత్రి ఆయన హత్యకు గురయ్యారు. ఎంపీగా అవినాశ్ విజయం కోసం తన తండ్రి ప్రచారం చేస్తున్నారని వైఎస్ వివేకా హత్య తరువాత ఆయన కుమార్తె సునీత మీడియాతో కూడా చెప్పారు. మరి ఎంపీ టికెట్‌పై వివేకా, అవినాశ్ మధ్య విభేదాలున్నాయని పచ్చ మీడియా పదే పదే రాస్తుండటం రాజకీయ కుట్ర కాక మరేమిటి? ఇక వివేకా హత్యకు రూ.40కోట్లు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారనే మరో నిరాధార ఆరోపణ కూడా పదే పదే చేస్తున్నారు. అందుకోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారని...అందులో తనకు రూ.కోటి కూడా ఇచ్చారని దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. మరి హత్య చేయడానికి 10 రోజులు ముందే చేతిలో కోటి రూపాయలున్న దస్తగిరి.. ఆ తరవాత రూ.5వేలు, రూ.10వేల అప్పు కోసం పులివెందులలో అందరి చుట్టూ ఎందుకు తిరిగాడు? సునీల్ యాదవ్ తనకివ్వాల్సిన రూ.3 లక్షలు ఇప్పించాలంటూ... ఆ మేరకు దస్తావేజులు చూపిస్తూ మరీ దస్తగిరి ప్రాథేయపడటం నిజం కాదా...! ఆ దస్తావేజులను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు కదా!. అంటే దస్తగిరికి రూ.కోటి ఇచ్చారన్నది అబద్ధమని స్పష్టమవుతోంది కదా? దీన్నిబట్టి దస్తగిరి అప్రూవర్‌గా మారుతూ ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలన్నీ కల్పితాలే తప్ప వాస్తవాలు కాదని తెలియటం లేదా? హత్య వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి ఉన్నారని గంగిరెడ్డి తనకు చెప్పినట్లుగా దస్తగిరి వెల్లడించిన విషయం అవాస్తవం కాదా? -
సుపారీ కథ.. సూపర్ కదా!
సాక్షి, అమరావతి: చేతిలో కోటి రూపాయలున్న వ్యక్తి.. ఐదొందల కోసం అడుక్కుంటాడా..? ఏమైనా నమ్మశక్యంగా ఉందా...? కోట్లుంటే.. కాళ్ల బేరమెందుకు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇలానే ఉంది మరి...! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు రూ.40 కోట్లకు సుపారీ కుదిరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కుట్రలో పాలు పంచుకున్న నిందితుడు దస్తగిరికి నెల రోజుల ముందే రూ.కోటి అడ్వాన్స్ అందినట్లు దర్యాప్తులో తేలిందని చార్జ్‌షీట్ నమోదు చేసింది. అయితే రూ.కోటి ముట్టాయని సీబీఐ చెబుతున్న దస్తగిరి హత్యకు ఒక రోజు ముందుదాకా అప్పుల కోసం నానా తిప్పలు పడినట్లు వెలుగులోకి వచ్చింది. 2019 ఫిబ్రవరి 10 నుంచి వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 మధ్య నిందితులు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన కొన్ని వందల వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. రూ.20 వేలు.. కాదు కాదు.. కనీసం రూ.వెయ్యి... అదీ వద్దు... ఖర్చులకు రూ.500 చాలంటూ సునీల్ యాదవ్‌ను పలుమార్లు దస్తగిరి ప్రాథేయపడటం గమనార్హం. దీంతో వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదిరినట్లు సీబీఐ చెబుతుండటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిందితుడినే అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి వాంగ్మూలం కేంద్రంగా సీబీఐ దర్యాప్తు తతంగాన్ని నడిపిస్తోంది. దస్తగిరిని ఢిల్లీ తీసుకెళ్లి తమ ‘అతిథి’గా చాలా రోజులు మర్యాదలు చేసి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించింది. హత్య చేశానని స్వయంగా చెప్పిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, బెయిల్ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించకపోవడంతో సీబీఐ తీరుపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. సీబీఐ చార్జిషీట్, దస్తగిరి వాంగ్మూలంలో అంశాలివీ.. వైఎస్ వివేకా హత్య కోసం 2019 ఫిబ్రవరి 10న రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలతో కలసి హత్యకు పన్నాగం పన్నాడు. వివేకాను హత్య చేస్తే డి.శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగతా ముగ్గురు నిందితులకు చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి ఆ తరువాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చాడు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ కూడా చెరో రూ.కోటి తీసుకున్నారు. దస్తగిరి తనకు అందిన రూ.కోటిలో రూ.46.70 లక్షలను మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచాడు. మున్నా వద్ద దాచిన మొత్తాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. తాపీగా రెండేళ్ల తరువాత... హత్యకు పథకం వేసిన నాలుగు రోజులకే.. అంటే 2019 ఫిబ్రవరి 10 తరువాత దస్తగిరి వద్ద రూ.కోటి ఉన్నాయని సీబీఐ చెబుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురికాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ 2020 జూలై 9న చేపట్టింది. 2021 నవంబరు 13న దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ తరువాత పలువురిని విచారించిన అనంతరం అంటే వివేకా హత్యకు గురైన దాదాపు రెండేళ్ల తరువాత సీబీఐ అధికారులు మున్నా వద్దకు వెళ్లి మరీ ఆ రూ.46.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారట..! ఏమైనా లాజిక్ ఉందా...? వైఎస్ వివేకా హత్య కుట్రలో భాగస్వాములుగా సీబీఐ పేర్కొన్న సునీల్ యాదవ్, దస్తగిరి మధ్య 2019 ఫిబ్రవరి, మార్చిలో కొన్ని వందల సార్లు వాట్సాప్ చాటింగ్ జరిగింది. అప్పు కోసం దస్తగిరి అందులో పలుమార్లు దీనంగా వేడుకున్నాడు. ఎంతగా అంటే కనీసం రూ.500 ఇవ్వాలని ప్రాథేయపడటం గమనార్హం. వివేకా హత్యకు ముందు రోజు కూడా అప్పు ఇవ్వాలని దస్తగిరి కోరాడు. మరి దస్తగిరి చేతిలో రూ.కోటి ఉంటే ఇలా రూ.వెయ్యి... రూ.500 కోసం ఎందుకలా వేడుకుంటాడు? సీబీఐ చెబుతున్నట్లుగా ఇద్దరి వద్దా చెరో రూ.కోటి ఉంటే ఇలా అడగాల్సిన పనేమిటి? దస్తగిరి వద్ద డబ్బులు లేవంటే.. సుపారీ కింద రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందన్న అభియోగాల్లో నిజం ఉందా? సుపారీ కథ సూపర్..! సునీల్ యాదవ్‌తో దస్తగిరి జరిపిన వాట్సాప్ చాటింగ్ చూస్తే సీబీఐ చెప్పిన విషయాలపై పలు అనుమానాలు తలెత్తక మానవు. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీతో ఒప్పందం కుదిరిందని... అది డి.శివశంకర్‌రెడ్డి ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులకు చెప్పినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొనడం కట్టుకథేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దస్తగిరి వాట్సాప్ చాటింగ్ ద్వారా అతడి వద్ద డబ్బులు లేవన్నది స్పష్టమవుతోంది. మరి అతడి వద్ద రూ.కోటి లేవంటే... రూ.40 కోట్ల సుపారీ కథ కట్టుకథేనా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు దోషులను గుర్తించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ హయాంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథ ఉచ్చులో సీబీఐ చిక్కుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సునీల్ యాదవ్‌కు దస్తగిరి పంపిన వాట్సాప్ సందేశాల్లో ముఖ్యమైనవి.. 2019 ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12.07 గంటలకు.. ‘అన్నా... ఒక రూ.వెయ్యి ఇస్తావా. ఖర్చులకు లేవు అన్నా. ప్లీజ్ డబ్బులివ్వు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.32 గంటలకు.. ‘అక్కడ అనంతపురం వాడు ఫోన్ చేస్తున్నాడు. ఏం అన్నా... నువ్వు మనిషినే పట్టించుకోవు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.33 గంటలకు.. ‘ఏంటన్నా... నేను చనిపోయాక డబ్బులిస్తావా... ఏంటి అన్నా...’ 2019 మార్చి 3 ఉదయం 7.22 గంటలకు.. ‘పులివెందుల వచ్చానంటావు... మళ్లీ రాలేదంటావు. ఏందన్నా... రూ.20 వేలు అడిగితే ఈ రోజు.. రేపు అంటూ టైమ్ చెబుతావు. ఏంది అన్నా?’ 2019 మార్చి 3 ఉదయం 10.18 గంటలకు.. ‘అన్నా నేను అప్పుల వాళ్లతో అనిపించుకోలేను. నాకు అవసరం లేదు. నేను అప్పు తెచ్చాను కదా. అప్పు కట్టు అన్నా’ 2019 మార్చి 14 మధ్యాహ్నం 12.24 గంటలకు.. (వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందురోజు) ‘రూ.30 వేలు కూడా అవసరం లేదన్నా... నాకు రూ.19 వేలు ఇచ్చినా సరిపోతుంది. ‘ఇతియోస్’కు రూ.14,500.. స్కార్పియోకు రూ.4,500 ఇవ్వాలి. నాకు రూ.500 మిగులుతుంది. అవి నేను ఖర్చుకు ఉంచుకుంటా’ -
వివేకా హత్యకు ల్యాండ్ సెటిల్మెంటే కారణం!
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగళూరులో జరిగిన ల్యాండ్ సెటిల్మెంటే కారణమని నిందితుల్లో ఒకడైన మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. భూమి సెటిల్మెంట్కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన డబ్బులో వివేకానందరెడ్డి మిగతా వారికి వాటా ఇవ్వనందునే హత్య జరిగినట్లు అందులో పేర్కొన్నాడు. హత్యలో తనతో పాటు వివేకాతో కలిసి సెటిల్మెంట్ చేసిన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గుజ్జల ఉమాశంకర్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపాడు. దస్తగిరి నుంచి ఆగస్టు 30న సెక్షన్ 164 కింద సీబీఐ అధికారులు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకున్నారు. అందులో దస్తగిరి చెప్పిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఓ భూమికి సంబంధించి వివేకానందరెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గుజ్జల మహేశ్వర్‌రెడ్డిలు సెటిల్మెంట్ చేశారు. అందులో రూ.8 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులో వివేకానందరెడ్డి మిగతా ముగ్గురికి వాటా ఇవ్వలేదు. భూమి సెటిల్మెంట్ కోసం తాము అనేక నెలలు తిరిగినప్పటికీ పైసా రాకపోవడంతో మిగతా ముగ్గురూ అసంతృప్తితో రగిలిపోయారు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఓ దశలో గంగిరెడ్డిని వివేకానందరెడ్డి బెంగళూరులోనే వదిలేసి వచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలో వివేకాను హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారు. హత్యలో పాల్గొనేందుకు దస్తగిరికి గంగిరెడ్డి రూ. 5 కోట్లు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా సునీల్‌యాదవ్ చేత రూ. కోటి పంపించాడు. ఆ డబ్బులో సునీల్‌యాదవ్ తనకు అవసరమని రూ. 25 లక్షలు తీసుకున్నాడు. హత్య జరగక ముందు ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌లు కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. హత్య జరిగిన రోజున ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి గోడ దూకి లోపలికి వెళ్లారు. అప్పటికే ఇంటిలో వున్న ఎర్ర గంగిరెడ్డి తలుపుతీయడంతో అందరూ లోపలికి వెళ్లారు. వారిని చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయి, బెడ్రూంలోకి వెళ్లారు. ఆయన వెంటే గంగిరెడ్డి, మిగతా ముగ్గురూ లోపలికి వెళ్లారు. బెడ్రూంలో డబ్బుల విషయమై మళ్లీ వాగ్వాదం జరిగింది. తరువాత సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు దస్తగిరి వివేకానందరెడ్డిపై గొడ్డలితో తీవ్రంగా దాడి చేశారు. హత్య అనంతరం అందరూ అక్కడి నుంచి పరారైనట్లు దస్తగిరి ఇచ్చిన ఆ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. వివేకానందరెడ్డి బెడ్రూం నుంచి తీసుకొచ్చిన కొన్ని దస్తావేజులను గంగిరెడ్డి తీసుకెళ్లడం తాను చూశానని, వాటిపై గుండ్రటి సీల్ కూడా ఉందని దస్తగిరి తెలిపాడు. పలు అనుమానాలకు ఆస్కారం వివేకా హత్య కేసుపై కోర్టు విచారణ ప్రారంభం కానున్న సమయంలో ఈ స్టేట్మెంట్ హైదరాబాద్‌లో లీక్ కావడం, అదీ.. ఈ కేసుపై మొదటి నుంచి పలు ఊహాగానాలు ప్రసారం చేస్తున్న చానెల్‌కు ముందుగా తెలియడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి ఆ ఛానల్ వాదనకు బలం చేకూరే విధంగా దస్తగిరి వాంగ్మూలం వుండటం పలు సందేహాలకు తావిస్తోంది. హత్యకు ఏడాదిన్నర ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను దస్తగిరి ప్రస్తావించడం, ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డితో పాటు మరికొందరి పేర్లను చెప్పినట్లు ప్రచారం జరగడం గమనార్హం. -
మూడో రోజూ ఆయుధాల కోసం గాలింపు
పులివెందుల : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయుధాల కోసం పులివెందులలో సీబీఐ బృందం మూడోరోజు సోమవారం కూడా గాలించింది. ఉదయం పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న వంక బ్రిడ్జి కింద బురదను వెలికితీశారు. అలాగే, హత్య తర్వాత నిందితులు రక్తపు మరకల దుస్తులు వేశారన్న సమాచారంతో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న గరండాల్ బ్రిడ్జి కింద కూడా జేసీబీతో గాలింపు చేపట్టారు. అయితే, సాయంత్రం వరకు రెండుచోట్లా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గాలింపును మంగళవారానికి వాయిదా వేశారు. ఇక సోమవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత కాసేపు సమావేశమయ్యారు. అలాగే, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లెపు వరప్రసాద్, ఎర్రంరెడ్డిపల్లె జగదీశ్వరరెడ్డి, రాజారెడ్డి ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, సీఎస్ఐ చర్చికి సంబంధించిన శిఖామణి, సంపత్, నీలయ్య, సుధాకర్, దినేష్ నర్సింగ్ హోం మెడికల్ స్టోర్ సిబ్బంది ఓబులేసు, రామకృష్ణారెడ్డి, యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాంపౌండర్ ప్రకాష్‌రెడ్డి, మాజీ లెక్చరర్ చంద్రశేఖరరెడ్డిలను సీబీఐ బృందం విచారించింది. వివేకా ఇంటి వద్దకు సునీల్ యాదవ్ వివేకా హత్యకేసులో నిందితుడు సునీల్ యాదవ్‌ను సోమవారం సాయంత్రం సీబీఐ అధికారులు వైఎస్ వివేకా ఇంటి వద్దకు తెచ్చి, అక్కడ ఫొటోలు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఇరువైపులా ఉన్న రోడ్లపై వాహనంలోనే ఉంచి తిప్పారు. -
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కస్టడీకి సునీల్ యాదవ్
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద హత్య కేసులో భాగంగా సునీల్ యాదవ్‌ను సీబీఐ కస్టడీకి తరలించారు. ఈ సందర్భంగా పులివెందుల కోర్టు సునీల్ యాదవ్‌ను 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. కాగా ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. -
మున్సిపల్ స్వీపర్‌కు ఎంఫిల్‌లో ర్యాంక్
నగర మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల సునీల్ యాదవ్ ఇటీవల ప్రతిష్టాకరమైన 'టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్' నుంచి ఎంఫిల్ పట్టా పుచ్చుకున్నారు. ఏకంగా ఇనిస్టిట్యూట్‌లో ఏడో ర్యాంక్ సాధించారు. ప్రపంచీకరణ- కార్మికుడు' అన్న అంశంపై ఎంఫిల్ చేసిన యాదవ్ సమాజంలో స్వీపర్ల స్థితిగతులపై పీహెచ్డీ చేయాలనుకుంటున్నారు. తనకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేయాలనే ఉద్దేశం ఏ మాత్రం లేదని, ఇదే ఉద్యోగంలో చివరివరకు కొనసాగుతానని చెప్పారు. సమాజంలో వివక్షకు గురవుతున్న స్వీపర్ల లాంటి నిమ్నవర్గాల వారికి అండగా నిలబడాలని, వారికి తగిన గుర్తింపు కోసం పోరాడాలని నిర్ణయించుకున్నానని యాదవ్ మీడియాకు తెలిపారు. ఇరుగుపొరుగు వారి ఈసడింపులు, చిన్నచూపును భరిస్తూనే తాను ఎంఫిల్ వరకు చదవగలిగానని ఆయన తెలిపారు. తన తండ్రి మొదట ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్‌గా పనిచేశారని, అనారోగ్య కారణంతో ఆయన మంచం పట్టడంతో పదో తరగతి ఫెయిలైన తాను కారుణ్య నియామకం కింద ఈ ఉద్యోగంలో చేరానని చెప్పారు. సమాజంలో స్వీపర్ ఉద్యోగాన్ని ఎంత చిన్నచూపు చూస్తారో అనుభవ పూర్వకంగా తెలిసి రావడంతో చదువుపై శ్రద్ధ పెట్టానని, ఎస్సెస్సీ, ఇంటర్ పూర్తయ్యాక, బీకాం, జర్నలిజంలో బీఏ చేశానని తెలిపారు. ఆ తర్వాత సోషల్ వర్క్ పీజీ, ఇప్పుడు ఎంఫిల్ పూర్తి చేశానని ఆయన వివరించారు. ఎంఫిల్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని, చదువుకు తగ్గ ఉద్యోగం చేయాలనే ఆలోచన ఏ కోశానా లేదని చెప్పారు. సమాజంలో అన్ని రకాల వివక్షతను ఎదుర్కొంటున్న తన జాతి జనుల పోరాటానికి గళం కావాలన్నదే తన లక్ష్యం, మార్గమని సునీల్ యాదవ్ కృతనిశ్చయంతో చెప్పారు.