‘వివేకా కేసులో సునీత మౌనం వహిస్తున్నారు’ | YS Viveka Case: Telangana High Court hearings Continue | Sakshi
Sakshi News home page

‘వివేకా కేసులో సునీత మౌనం వహిస్తున్నారు.. సునీల్‌ కుటుంబ సభ్యుల్ని వేధించడం వల్లే..’

Published Tue, Apr 11 2023 4:36 PM | Last Updated on Tue, Apr 11 2023 4:41 PM

YS Viveka Case: Telangana High Court hearings Continue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. నిందితులకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలున్నాయని, అలాగే ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని సైతం సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదని భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో భాస్కర్ రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం వాదనలు జరిగాయి. నిందితుడు దస్తగిరిని అఫ్రూవర్ గా పరిగణించడాన్ని సవాల్‌ చేస్తూనే.. అతని బెయిల్‌ను రద్దు చేయాలంటూ వీళ్లు పిటిషన్లు దాఖలు చేశారు.

వివేకా కేసులో భాస్కర్‌రెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డి పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విచారణకు సీబీఐ ఎస్పీ వికాస్ కుమార్ సైతం హాజరయ్యారు. ఇక ఈ కేసులో వివేకా పీఏ కృష్ణారెడ్డి తరపున లాయర్‌ దేశాయ్ ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అలాగే.. భాస్కర్‌రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్‌రెడ్డి ఇవాళ వాదనలు వినిపించారు.

‘‘వివేకా రెండో భార్య కుమారుడిని వారసుడిగా ప్రకటించడంతో.. వారి కుటుంబంలో తీవ్ర విభేదాలు వచ్చాయి. సునీల్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులను వేధించారనే వివేకాపై కక్ష పెంచుకుని హత్యకు కుట్ర పన్నారు. రాజకీయంగా టీడీపీ సునీతతో కలిసి.. అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై కుట్ర పన్నార’’ని నిరంజన్‌రెడ్డి వాదించారు. 

సీబీఐ కూడా దస్తగిరి వాంగ్మూలంపైనే ఆధారపడి విచారిస్తోందని నిరంజన్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  ప్రధాన నిందితుడు దస్తగిరి తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. సాక్ష్యాధారాలు నిందితులకు వ్యతిరేకంగా.. బలంగా ఉన్నాయి. అయినా దస్తగిరికి బెయిల్‌ సహా అప్రూవర్‌గా పరిగణించడంపై సునీత మౌనం వహిస్తున్నారని నిరంజన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో విచారణను ఎల్లుండి(గురువారానికి) వాయిదా వేసింది కోర్టు.

ఇదీ చదవండి: వివేకా కేసులో రంగన్న చెప్పింది సీబీఐ పట్టించుకోదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement