ఫైల్ ఫోటో
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బెంగళూరులో జరిగిన ల్యాండ్ సెటిల్‌మెంటే కారణమని నిందితుల్లో ఒకడైన మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. భూమి సెటిల్‌మెంట్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన డబ్బులో వివేకానందరెడ్డి మిగతా వారికి వాటా ఇవ్వనందునే హత్య జరిగినట్లు అందులో పేర్కొన్నాడు. హత్యలో తనతో పాటు వివేకాతో కలిసి సెటిల్‌మెంట్ చేసిన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గుజ్జల ఉమాశంకర్‌రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు తెలిపాడు. దస్తగిరి నుంచి ఆగస్టు 30న సెక్షన్ 164 కింద సీబీఐ అధికారులు కన్ఫెషన్ స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అందులో దస్తగిరి చెప్పిన వివరాల ప్రకారం.. బెంగళూరులో ఓ భూమికి సంబంధించి వివేకానందరెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌యాదవ్, గుజ్జల మహేశ్వర్‌రెడ్డిలు సెటిల్‌మెంట్ చేశారు. అందులో రూ.8 కోట్లు వచ్చాయి. ఆ డబ్బులో వివేకానందరెడ్డి మిగతా ముగ్గురికి వాటా ఇవ్వలేదు.
భూమి సెటిల్‌మెంట్ కోసం తాము అనేక నెలలు తిరిగినప్పటికీ పైసా రాకపోవడంతో మిగతా ముగ్గురూ అసంతృప్తితో రగిలిపోయారు. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య వాగ్వాదాలు జరిగాయి. ఓ దశలో గంగిరెడ్డిని వివేకానందరెడ్డి బెంగళూరులోనే వదిలేసి వచ్చారు. ఈ విభేదాల నేపథ్యంలో వివేకాను హత్య చేయడానికి ప్రణాళిక రూపొందించారు. హత్యలో పాల్గొనేందుకు దస్తగిరికి గంగిరెడ్డి రూ. 5 కోట్లు ఇస్తానని చెప్పాడు. అడ్వాన్స్‌గా సునీల్‌యాదవ్ చేత రూ. కోటి పంపించాడు. ఆ డబ్బులో సునీల్‌యాదవ్ తనకు అవసరమని రూ. 25 లక్షలు తీసుకున్నాడు. హత్య జరగక ముందు ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌లు కుక్కను కారుతో తొక్కించి చంపేశారు. హత్య జరిగిన రోజున ఉమాశంకర్‌రెడ్డి, సునీల్‌యాదవ్, దస్తగిరి గోడ దూకి లోపలికి వెళ్లారు.
అప్పటికే ఇంటిలో వున్న ఎర్ర గంగిరెడ్డి తలుపుతీయడంతో అందరూ లోపలికి వెళ్లారు. వారిని చూసిన వివేకా ఈ సమయంలో వీళ్లెందుకు వచ్చారని నిర్ఘాంతపోయి, బెడ్‌రూంలోకి వెళ్లారు. ఆయన వెంటే గంగిరెడ్డి, మిగతా ముగ్గురూ లోపలికి వెళ్లారు. బెడ్‌రూంలో డబ్బుల విషయమై మళ్లీ వాగ్వాదం జరిగింది. తరువాత సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిలతో పాటు దస్తగిరి వివేకానందరెడ్డిపై గొడ్డలితో తీవ్రంగా దాడి చేశారు. హత్య అనంతరం అందరూ అక్కడి నుంచి పరారైనట్లు దస్తగిరి ఇచ్చిన ఆ స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. వివేకానందరెడ్డి బెడ్రూం నుంచి తీసుకొచ్చిన కొన్ని దస్తావేజులను గంగిరెడ్డి తీసుకెళ్లడం తాను చూశానని, వాటిపై గుండ్రటి సీల్ కూడా ఉందని దస్తగిరి తెలిపాడు.
పలు అనుమానాలకు ఆస్కారం
వివేకా హత్య కేసుపై కోర్టు విచారణ ప్రారంభం కానున్న సమయంలో ఈ స్టేట్‌మెంట్ హైదరాబాద్‌లో లీక్ కావడం, అదీ.. ఈ కేసుపై మొదటి నుంచి పలు ఊహాగానాలు ప్రసారం చేస్తున్న చానెల్‌కు ముందుగా తెలియడం అనేక అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి ఆ ఛానల్ వాదనకు బలం చేకూరే విధంగా దస్తగిరి వాంగ్మూలం వుండటం పలు సందేహాలకు తావిస్తోంది. హత్యకు ఏడాదిన్నర ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను దస్తగిరి ప్రస్తావించడం, ఆ సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డితో పాటు మరికొందరి పేర్లను చెప్పినట్లు ప్రచారం జరగడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment