సాక్షి, అమరావతి: చేతిలో కోటి రూపాయలున్న వ్యక్తి.. ఐదొందల కోసం అడుక్కుంటాడా..? ఏమైనా నమ్మశక్యంగా ఉందా...? కోట్లుంటే.. కాళ్ల బేరమెందుకు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇలానే ఉంది మరి...! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు రూ.40 కోట్లకు సుపారీ కుదిరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కుట్రలో పాలు పంచుకున్న నిందితుడు దస్తగిరికి నెల రోజుల ముందే రూ.కోటి అడ్వాన్స్ అందినట్లు దర్యాప్తులో తేలిందని చార్జ్‌షీట్ నమోదు చేసింది. అయితే రూ.కోటి ముట్టాయని సీబీఐ చెబుతున్న దస్తగిరి హత్యకు ఒక రోజు ముందుదాకా అప్పుల కోసం నానా తిప్పలు పడినట్లు వెలుగులోకి వచ్చింది.
2019 ఫిబ్రవరి 10 నుంచి వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 మధ్య నిందితులు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన కొన్ని వందల వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. రూ.20 వేలు.. కాదు కాదు.. కనీసం రూ.వెయ్యి... అదీ వద్దు... ఖర్చులకు రూ.500 చాలంటూ సునీల్ యాదవ్‌ను పలుమార్లు దస్తగిరి ప్రాథేయపడటం గమనార్హం. దీంతో వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదిరినట్లు సీబీఐ చెబుతుండటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి.
నిందితుడినే అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం..
వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి వాంగ్మూలం కేంద్రంగా సీబీఐ దర్యాప్తు తతంగాన్ని నడిపిస్తోంది. దస్తగిరిని ఢిల్లీ తీసుకెళ్లి తమ ‘అతిథి’గా చాలా రోజులు మర్యాదలు చేసి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించింది. హత్య చేశానని స్వయంగా చెప్పిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, బెయిల్ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించకపోవడంతో సీబీఐ తీరుపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి.
సీబీఐ చార్జిషీట్, దస్తగిరి వాంగ్మూలంలో అంశాలివీ..
వైఎస్ వివేకా హత్య కోసం 2019 ఫిబ్రవరి 10న రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలతో కలసి హత్యకు పన్నాగం పన్నాడు. వివేకాను హత్య చేస్తే డి.శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగతా ముగ్గురు నిందితులకు చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి ఆ తరువాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చాడు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ కూడా చెరో రూ.కోటి తీసుకున్నారు. దస్తగిరి తనకు అందిన రూ.కోటిలో రూ.46.70 లక్షలను మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచాడు. మున్నా వద్ద దాచిన మొత్తాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది.
తాపీగా రెండేళ్ల తరువాత...
హత్యకు పథకం వేసిన నాలుగు రోజులకే.. అంటే 2019 ఫిబ్రవరి 10 తరువాత దస్తగిరి వద్ద రూ.కోటి ఉన్నాయని సీబీఐ చెబుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురికాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ 2020 జూలై 9న చేపట్టింది. 2021 నవంబరు 13న దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ తరువాత పలువురిని విచారించిన అనంతరం అంటే వివేకా హత్యకు గురైన దాదాపు రెండేళ్ల తరువాత సీబీఐ అధికారులు మున్నా వద్దకు వెళ్లి మరీ ఆ రూ.46.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారట..!
ఏమైనా లాజిక్ ఉందా...?
వైఎస్ వివేకా హత్య కుట్రలో భాగస్వాములుగా సీబీఐ పేర్కొన్న సునీల్ యాదవ్, దస్తగిరి మధ్య 2019 ఫిబ్రవరి, మార్చిలో కొన్ని వందల సార్లు వాట్సాప్ చాటింగ్ జరిగింది. అప్పు కోసం దస్తగిరి అందులో పలుమార్లు దీనంగా వేడుకున్నాడు. ఎంతగా అంటే కనీసం రూ.500 ఇవ్వాలని ప్రాథేయపడటం గమనార్హం. వివేకా హత్యకు ముందు రోజు కూడా అప్పు ఇవ్వాలని దస్తగిరి కోరాడు. మరి దస్తగిరి చేతిలో రూ.కోటి ఉంటే ఇలా రూ.వెయ్యి... రూ.500 కోసం ఎందుకలా వేడుకుంటాడు? సీబీఐ చెబుతున్నట్లుగా ఇద్దరి వద్దా చెరో రూ.కోటి ఉంటే ఇలా అడగాల్సిన పనేమిటి? దస్తగిరి వద్ద డబ్బులు లేవంటే.. సుపారీ కింద రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందన్న అభియోగాల్లో నిజం ఉందా?
సుపారీ కథ సూపర్..!
సునీల్ యాదవ్‌తో దస్తగిరి జరిపిన వాట్సాప్ చాటింగ్ చూస్తే సీబీఐ చెప్పిన విషయాలపై పలు అనుమానాలు తలెత్తక మానవు. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీతో ఒప్పందం కుదిరిందని... అది డి.శివశంకర్‌రెడ్డి ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులకు చెప్పినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొనడం కట్టుకథేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దస్తగిరి వాట్సాప్ చాటింగ్ ద్వారా అతడి వద్ద డబ్బులు లేవన్నది స్పష్టమవుతోంది. మరి అతడి వద్ద రూ.కోటి లేవంటే... రూ.40 కోట్ల సుపారీ కథ కట్టుకథేనా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు దోషులను గుర్తించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ హయాంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథ ఉచ్చులో సీబీఐ చిక్కుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
సునీల్ యాదవ్‌కు దస్తగిరి పంపిన వాట్సాప్ సందేశాల్లో ముఖ్యమైనవి..
2019 ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12.07 గంటలకు..
‘అన్నా... ఒక రూ.వెయ్యి ఇస్తావా. ఖర్చులకు లేవు అన్నా. ప్లీజ్ డబ్బులివ్వు అన్నా’
2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.32 గంటలకు..
‘అక్కడ అనంతపురం వాడు ఫోన్ చేస్తున్నాడు. ఏం అన్నా... నువ్వు మనిషినే పట్టించుకోవు అన్నా’
2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.33 గంటలకు..
‘ఏంటన్నా... నేను చనిపోయాక డబ్బులిస్తావా... ఏంటి అన్నా...’
2019 మార్చి 3 ఉదయం 7.22 గంటలకు..
‘పులివెందుల వచ్చానంటావు... మళ్లీ రాలేదంటావు. ఏందన్నా... రూ.20 వేలు అడిగితే ఈ రోజు.. రేపు అంటూ టైమ్ చెబుతావు. ఏంది అన్నా?’
2019 మార్చి 3 ఉదయం 10.18 గంటలకు..
‘అన్నా నేను అప్పుల వాళ్లతో అనిపించుకోలేను. నాకు అవసరం లేదు. నేను అప్పు తెచ్చాను కదా. అప్పు కట్టు అన్నా’
2019 మార్చి 14 మధ్యాహ్నం 12.24 గంటలకు..
(వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందురోజు) ‘రూ.30 వేలు కూడా అవసరం లేదన్నా... నాకు రూ.19 వేలు ఇచ్చినా సరిపోతుంది. ‘ఇతియోస్’కు రూ.14,500.. స్కార్పియోకు రూ.4,500 ఇవ్వాలి. నాకు రూ.500 మిగులుతుంది. అవి నేను ఖర్చుకు ఉంచుకుంటా’
Comments
Please login to add a commentAdd a comment