వివేకాను హత్య చేయించింది అల్లుడు, పెద్ద బావమరిదే | Tulasamma Testimony Pulivendula Magistrate Court YS Viveka Case | Sakshi
Sakshi News home page

వివేకాను హత్య చేయించింది అల్లుడు, పెద్ద బావమరిదే

Published Sun, Nov 27 2022 3:27 AM | Last Updated on Sat, Dec 3 2022 3:52 PM

Tulasamma Testimony Pulivendula Magistrate Court YS Viveka Case - Sakshi

కడపలో శనివారం తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలు వెల్లడిస్తున్న న్యాయవాదులు

సాక్షి, అమరావతి/కడప అర్బన్‌:  మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న కోణాలు తొలిసారిగా న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. షమీమ్‌ అనే మహిళను వైఎస్‌ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్‌ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్‌ రవి, ఆర్థిక, రాజకీయ విభేదాలతో కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని తెలిపారు. వారిని విచారిస్తే ఈ హత్య కేసును ఛేదించవచ్చన్నారు. సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే వాస్తవాలను విస్మరిస్తూ నిరపరాధులను అరెస్టులతో వేధిస్తోందని ఆమె వివరించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్ర కోణాన్ని వివరించడంతోపాటు.. సాగాల్సిన రీతిలో సీబీఐ దర్యాప్తు సాగడం లేదని తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసింది. దాంతో ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కీలక వాస్తవాలు న్యాయస్థానంతోపాటు యావత్‌ ప్రజల దృష్టికి వచ్చాయి.

పులివెందుల న్యాయస్థానం నమోదు చేసిన తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలను ఆమె న్యాయవాదులు రవీంద్రారెడ్డి, కోదండరామిరెడ్డిలు కడపలో మీడియాకు వెల్లడించారు. తదుపరి విచారణను డిసెంబర్‌ 24కు వాయిదా వేశారని తెలిపారు. న్యాయవాదులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. 

హత్య చేయించింది వారిద్దరే..
► వైఎస్‌ వివేకానందరెడ్డి షమీమ్‌ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్‌మెంట్‌ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. 

► వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉంది. 

► వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్‌ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్‌ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్‌ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా.

► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్‌ఫోన్లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్‌ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్‌ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోంది. 

ఆధిపత్యం కోసం బీటెక్‌ రవి కుట్ర 
► టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. వివేకా ఉన్నంత కాలం తాను ఆధిపత్యం సాధించలేనని ఆయనకు తెలుసు. అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేకా హత్యకు సహకరించారు. 

► వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్‌ రవికి సన్నిహితుడిగా మారారు. వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్‌రైజ్‌ ఆస్పత్రి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో హరిత హోటల్‌లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్‌ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. 

కక్షగట్టిన వైజీఆర్‌.. సహకరించిన నీరుగట్టు 
► వైఎస్సార్‌ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్‌సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడు. వైఎస్‌ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. 

► మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో టచ్‌లో ఉంటూ వచ్చారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్‌ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారు. దీంతో హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేశారు. 

దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న సీబీఐ 
► సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్‌ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ ఇప్పటి వరకు విచారించనే లేదు. విచారణ, అరెస్టుల పేరిట నిరపరాధులను వేధిస్తోంది. 

► వివేకా హత్య కేసులో పలువురి కాల్‌ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్‌ బృందాలు సేకరించాయి. కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్‌ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయట పడుతుందనే ఆమె సిట్‌ దర్యాప్తును అడ్డుకున్నారు. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్‌ బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, కీలక అంశాలను సీబీఐ అధికారులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది. 

► సిట్‌ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్‌ డైరీలు రెండింటినీ న్యాయస్థానం తెప్పించుకుని పరిశీలించాలి.  నిజాయితీగా దర్యాప్తు చేయాలి. ఆ ఆరుగురినీ విచారించాలి. అప్పుడే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కుట్రను ఛేదించవచ్చు. దోషులను గుర్తించి శిక్షించవచ్చు.

ఈ ప్రశ్నలకు బదులేదీ?
► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను ఎందుకు వెంటనే పోలీసులకు అప్పగించలేదు?
► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చాక సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్‌ చేయడం నిజం కాదా?
► ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇచ్చి ఉంటే అది హత్యేనని అప్పుడే తెలిసుండేది కదా?
► రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫొటోలు చూసి కూడా అది హత్య అని శివప్రకాష్‌రెడ్డికి తెలియలేదా?
► అయినా గుండెపోటుతో మృతి చెందాడని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పినట్లు?
► వివేకా రెండవ భార్య షమీమ్, వివేకా కూతురు సునీతల మధ్య వాట్సాప్‌ చాటింగ్‌లు సాగలేదా?
► వారి మధ్య జరిగిన చాటింగ్‌ వివరాలు ఎందుకు బయటకు వెల్లడించలేదు?
► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డిలు షమీమ్‌తో గొడవ పడలేదా?
► వివేకా.. షమీమ్‌కు ఇవ్వాలనుకున్న ఇంటిని వీరు లాక్కోవడం నిజం కాదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement