tulasamma
-
వివేకాను హత్య చేయించింది అల్లుడు, పెద్ద బావమరిదే
సాక్షి, అమరావతి/కడప అర్బన్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న కోణాలు తొలిసారిగా న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. షమీమ్ అనే మహిళను వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్ రవి, ఆర్థిక, రాజకీయ విభేదాలతో కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని తెలిపారు. వారిని విచారిస్తే ఈ హత్య కేసును ఛేదించవచ్చన్నారు. సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే వాస్తవాలను విస్మరిస్తూ నిరపరాధులను అరెస్టులతో వేధిస్తోందని ఆమె వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్ర కోణాన్ని వివరించడంతోపాటు.. సాగాల్సిన రీతిలో సీబీఐ దర్యాప్తు సాగడం లేదని తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసింది. దాంతో ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కీలక వాస్తవాలు న్యాయస్థానంతోపాటు యావత్ ప్రజల దృష్టికి వచ్చాయి. పులివెందుల న్యాయస్థానం నమోదు చేసిన తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలను ఆమె న్యాయవాదులు రవీంద్రారెడ్డి, కోదండరామిరెడ్డిలు కడపలో మీడియాకు వెల్లడించారు. తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేశారని తెలిపారు. న్యాయవాదులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్య చేయించింది వారిద్దరే.. ► వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ► వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉంది. ► వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోంది. ఆధిపత్యం కోసం బీటెక్ రవి కుట్ర ► టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. వివేకా ఉన్నంత కాలం తాను ఆధిపత్యం సాధించలేనని ఆయనకు తెలుసు. అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేకా హత్యకు సహకరించారు. ► వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. కక్షగట్టిన వైజీఆర్.. సహకరించిన నీరుగట్టు ► వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడు. వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ► మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో టచ్‌లో ఉంటూ వచ్చారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారు. దీంతో హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేశారు. దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న సీబీఐ ► సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ ఇప్పటి వరకు విచారించనే లేదు. విచారణ, అరెస్టుల పేరిట నిరపరాధులను వేధిస్తోంది. ► వివేకా హత్య కేసులో పలువురి కాల్ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్ బృందాలు సేకరించాయి. కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయట పడుతుందనే ఆమె సిట్ దర్యాప్తును అడ్డుకున్నారు. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, కీలక అంశాలను సీబీఐ అధికారులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది. ► సిట్ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్ డైరీలు రెండింటినీ న్యాయస్థానం తెప్పించుకుని పరిశీలించాలి. నిజాయితీగా దర్యాప్తు చేయాలి. ఆ ఆరుగురినీ విచారించాలి. అప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్రను ఛేదించవచ్చు. దోషులను గుర్తించి శిక్షించవచ్చు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను ఎందుకు వెంటనే పోలీసులకు అప్పగించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చాక సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయడం నిజం కాదా? ► ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇచ్చి ఉంటే అది హత్యేనని అప్పుడే తెలిసుండేది కదా? ► రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫొటోలు చూసి కూడా అది హత్య అని శివప్రకాష్‌రెడ్డికి తెలియలేదా? ► అయినా గుండెపోటుతో మృతి చెందాడని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పినట్లు? ► వివేకా రెండవ భార్య షమీమ్, వివేకా కూతురు సునీతల మధ్య వాట్సాప్ చాటింగ్‌లు సాగలేదా? ► వారి మధ్య జరిగిన చాటింగ్ వివరాలు ఎందుకు బయటకు వెల్లడించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డిలు షమీమ్‌తో గొడవ పడలేదా? ► వివేకా.. షమీమ్‌కు ఇవ్వాలనుకున్న ఇంటిని వీరు లాక్కోవడం నిజం కాదా? -
వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం
సాక్షి, వైఎస్సార్‌కడప: వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ ముందు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించారు. మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని సీబీఐని తులసమ్మ కోరారు. వివేకా హత్యలో ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలను పరిగణనలోకి తీసులేదని తులసమ్మ ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్ రవి, రాజశేఖర్ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని తులసమ్మ కోరారు. ఇక, తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు. -
నగలను త్యజించి చరఖా చేతబట్టి
స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది. అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు.గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీని అనుసరించటమే కాదు.. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం కోసం కట్టుకున్న భర్తనే త్యాగం చేసిందో మహిళ. స్వయంగా తనే భర్తకు మళ్లీ పెళ్లి చేసింది ఆ స్త్రీమూర్తి. అంతేకాదు ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించింది. స్వతంత్ర భారతావనిలోనూ గాంధీ మార్గం నుంచి ఇసుమంతైనా పక్కకు రాలేదు. ప్రభుత్వమిచ్చే పింఛను, రాయితీలనే కాదు, ఏ అయాచిత సాయాన్నీ ఆమె స్వీకరించలేదు. చివరి వరకు ఖద్దరునే నమ్ముకుని జీవించారు. కన్నుమూసేవరకు గాంధీజీ సిద్ధాంతాలను హృదయంలో ప్రతిష్టించుకున్న ఆ ధీరవనిత కల్లూరి తులశమ్మ. భర్తకు మారుమనువు! తెనాలి సమీపంలోని పెదరావూరు తులశమ్మ స్వగ్రామం. మధ్యతరగతి రైతు కుటుంబంలో 1910 డిసెంబరు 25న జన్మించారు. తల్లిదండ్రులు కొడాలి కృష్ణయ్య, సీతమ్మ. ప్రాధమిక విద్య తర్వాత 14 ఏళ్ల వయసులో, సమీపంలోని మోపర్రుకు చెందిన కల్లూరి రంగయ్యతో తులశమ్మకు వివాహమైంది. అయిదారేళ్లకు కలిగిన మగబిడ్డ, నాలుగేళ్ల వయసులోనే కన్నుమూయటం.. ఆమె మాతృ హృదయాన్ని కలచి వేసింది. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది. అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా భర్తతో చెప్పేశారు. నిర్ఘాంతపోయిన భర్తను ఒప్పించి, ఆయనకు తానే స్వయంగా మారుమనువు చేశారు. ‘వారికి పెళ్లిచేసి నా ఇంటి దగ్గరనుంచి కన్నబిడ్డను పంపినట్టు పంపాను... ఆ మనసు నాకు గాంధీజీ ఇచ్చారు’ అనేవారట! వైవాహిక బంధనాల నుంచి విముక్తురాలై, రాట్నంతో నూలువడుకుతూ అనంతర జీవితంలోకి ఆమె అడుగువేశారు. గాంధీజీతో పరిచయం ఆ క్రమంలోనే బాపూ పిలుపుతో 1941లో వినోబా భావే ‘వ్యక్తి సత్యాగ్రహం’లో ముమ్మర ప్రచారంలో పాల్గొన్నారు. 1942 ఆగస్టు 8న కోర్టుల వద్ద పికెటింగ్‌లో అరెస్టయ్యారు. కోర్టు హాలులో విదేశీ పాలనకు వ్యతిరేకంగా నినదించటంతో 16 నెలల కఠిన కారాగారశిక్ష విధించారు. జైలులో గాంధీజీకి మద్దతుగా తోటి ఖైదీలతో కలిసి ఒకరోజు దీక్ష చేసిన ఫలితంగా మరో నెలరోజులు శిక్షను పొడిగించారు. జైలునుంచి విడుదలయ్యాక 1944లో ఖాదీ విద్యాలయంలో చేరారు. సేవాగ్రాం ఖాదీ విద్యాలయంలోనూ శిక్షణ పొందారు. వార్ధా ఆశ్రమంలో ఏడాదికాలం ఉన్నారు. అప్పట్లోనే గాంధీజీతో పరిచయమైంది. తిరిగొచ్చాక ఖద్దరు ప్రచారం ఆరంభించారు. పింఛను కూడా తీసుకోలేదు! తలశమ్మ పెదరావూరులోని తనకున్న ఇంటిని గుంటూరు జిల్లా ఖాదీ గ్రామోద్యోగ సంస్థకు రాసిచ్చారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించినా తాను మాత్రం గాంధీ సిద్ధాంతాల్నుంచి అంగుళం కూడా ఇవతలకు రాలేదు. సర్వోదయ సిద్ధాంతమే ఊపిరిగా బతికారు. స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛను, రాయితీలను తిరస్కరించారు. అదేమని అడిగితే, ‘భగవద్గీత చదువుకున్నాం. నిష్కామకర్మ గురించి చెప్పింది. దేశమాత సేవకు వెలగడతామా? అని ఎదురు ప్రశ్నించేవారట! ఖాదీబండారు ఖద్దరు వస్త్రాలను విక్రయిస్తూ, వచ్చే కమీషనుతోనే జీవనం సాగించారు. వృద్ధాప్యంలో సైతం దేనినీ ఉచితంగా స్వీకరించకపోవటం తులశమ్మ దృఢచిత్తానికి నిదర్శనం. పొరుగింటి నుంచి కాసిన్ని మజ్జిగ తీసుకున్నా, వారందుకు తగిన డబ్బు తీసుకోవాల్సిందే! ఖద్దరు వ్యాప్తికి చేసిన కృషికి ఆమెకు ఉద్యోగం ఇవ్వజూపినా నిరాకరించారు. గాంధీ రచనలు ‘బ్రహ్మచర్యం’, ‘ఆత్మకథ’ గ్రంథాలే ఆమెకు నిత్యపారాయణం. జంతువుల చర్మంతో చేస్తారని చెప్పులు కూడా ధరించేవారు కాదు. అమానవీయమని సైకిల్ రిక్షా ఎక్కేవారు కాదు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లేవారు. తపోమయ, సేవామయ జీవితానికి అనేక నియమాలను స్వయంగా నిర్ణయించుకుని చివరివరకు పాటించిన తులశమ్మ 91 ఏళ్ల వయసులో 2001 అక్టోబరు 5న తన జీవితయాత్రను చాలించారు. – బి.ఎల్.నారాయణ (చదవండి: బ్రేకింగ్ న్యూస్..డయ్యర్‌కు బులెట్ దిగింది!) -
కారు ఢీకొని మహిళ మృతి
పులివెందుల: కారు ఢీకొన్న సంఘటనలో మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్ల గ్రామానికి చెందిన తులశమ్మ (40) అనే మహిళ గురువారం మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉలిమెల్ల గ్రామానికి చెందిన తులశమ్మ ఆమె భర్త గంగన్న కూలి పనులకు వెళ్లి జీవనం కొనసాగించేవారు. ఈ క్రమంలో గురువారం కూలి పనుల కోసం తులశమ్మ ఉల్లిమెల్ల గ్రామం నుంచి పొలాల వైపునకు వెళ్లే రోడ్డు దాటుతుండగా.. వీరపునాయునిపల్లె నుంచి పులివెందులకు వస్తున్న కారు ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య చేతిలో భర్త హతం
పెద్దపంజాణి: భార్య చేతిలో భర్త హత్యకు గురైన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలా ఉన్నాయి. మండంలోని చెదళ్లవాళ్లపల్లెకు చెందిన అమావాస్య అనే వ్యక్తి కుమారుడు గోపీ (30)కి అదే గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె తులసమ్మ (30)తో పదేళ్ల క్రితం వివాహమైంది. గోపీ కంకర సరఫరా చేసే ఫ్యాక్టరీలో డ్రయివర్. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్లు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తరువాత తరచూ గొడవలు పడేవారు. కాగా తులసమ్మపై అనుమానంతో తరచూ గొడవలు పడేవారు. ఈ నేపథ్యలో కొన్నాళ్ల క్రితం తులసమ్మ పనుల కోసం బెంగళూరుకు వెళ్లి, అక్కడే ఉండేది. ఈ సమయంలో గోపి మదనపల్లెకు చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తులసమ్మ రెండు నెలల క్రితం గ్రామానికి చేరుకుని, ఇకపై ఇద్దరం కలిసి ఉందామని నచ్చచెప్పి గోపి రెండో భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఆ తర్వాత కూడా తులసమ్మ కోసం ఓ వ్యక్తి చెదళ్లవారిపల్లెకు వచ్చి వెళ్లేవాడు. దీంతో గోపి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడ్డారు. తీవ్ర ఆవేశానికి లోనైన తులసమ్మ భర్త గోపిని మచ్చు కత్తితో మెడపై నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగవరం సీఐ రవికుమార్, స్థానిక ఎస్ఐ సురేష్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలు పరారీలో ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. -
లాటరీలో వైఎస్ఆర్ సీపీని వరించిన అదృష్టం
-
లాటరీలో వైఎస్ఆర్ సీపీని వరించిన అదృష్టం
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ పదవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్‌గా తులశమ్మ ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన ముల్లా జానీ ఎన్నికయ్యారు. జమ్మలమడుగు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా నిర్వహించిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీలకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను ఉన్నతాధికారులు లాటరీ ద్వారా నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఛైర్మన్ పీఠాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించింది. వైస్ ఛైర్మన్ పీఠాన్ని మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది.