స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది. అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు.గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీని అనుసరించటమే కాదు.. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం కోసం కట్టుకున్న భర్తనే త్యాగం చేసిందో మహిళ. స్వయంగా తనే భర్తకు మళ్లీ పెళ్లి చేసింది ఆ స్త్రీమూర్తి. అంతేకాదు ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించింది. స్వతంత్ర భారతావనిలోనూ గాంధీ మార్గం నుంచి ఇసుమంతైనా పక్కకు రాలేదు. ప్రభుత్వమిచ్చే పింఛను, రాయితీలనే కాదు, ఏ అయాచిత సాయాన్నీ ఆమె స్వీకరించలేదు. చివరి వరకు ఖద్దరునే నమ్ముకుని జీవించారు. కన్నుమూసేవరకు గాంధీజీ సిద్ధాంతాలను హృదయంలో ప్రతిష్టించుకున్న ఆ ధీరవనిత కల్లూరి తులశమ్మ.
భర్తకు మారుమనువు!
తెనాలి సమీపంలోని పెదరావూరు తులశమ్మ స్వగ్రామం. మధ్యతరగతి రైతు కుటుంబంలో 1910 డిసెంబరు 25న జన్మించారు. తల్లిదండ్రులు కొడాలి కృష్ణయ్య, సీతమ్మ. ప్రాధమిక విద్య తర్వాత 14 ఏళ్ల వయసులో, సమీపంలోని మోపర్రుకు చెందిన కల్లూరి రంగయ్యతో తులశమ్మకు వివాహమైంది. అయిదారేళ్లకు కలిగిన మగబిడ్డ, నాలుగేళ్ల వయసులోనే కన్నుమూయటం.. ఆమె మాతృ హృదయాన్ని కలచి వేసింది. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది.
అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా భర్తతో చెప్పేశారు. నిర్ఘాంతపోయిన భర్తను ఒప్పించి, ఆయనకు తానే స్వయంగా మారుమనువు చేశారు. ‘వారికి పెళ్లిచేసి నా ఇంటి దగ్గరనుంచి కన్నబిడ్డను పంపినట్టు పంపాను... ఆ మనసు నాకు గాంధీజీ ఇచ్చారు’ అనేవారట! వైవాహిక బంధనాల నుంచి విముక్తురాలై, రాట్నంతో నూలువడుకుతూ అనంతర జీవితంలోకి ఆమె అడుగువేశారు.
గాంధీజీతో పరిచయం
ఆ క్రమంలోనే బాపూ పిలుపుతో 1941లో వినోబా భావే ‘వ్యక్తి సత్యాగ్రహం’లో ముమ్మర ప్రచారంలో పాల్గొన్నారు. 1942 ఆగస్టు 8న కోర్టుల వద్ద పికెటింగ్‌లో అరెస్టయ్యారు. కోర్టు హాలులో విదేశీ పాలనకు వ్యతిరేకంగా నినదించటంతో 16 నెలల కఠిన కారాగారశిక్ష విధించారు. జైలులో గాంధీజీకి మద్దతుగా తోటి ఖైదీలతో కలిసి ఒకరోజు దీక్ష చేసిన ఫలితంగా మరో నెలరోజులు శిక్షను పొడిగించారు. జైలునుంచి విడుదలయ్యాక 1944లో ఖాదీ విద్యాలయంలో చేరారు. సేవాగ్రాం ఖాదీ విద్యాలయంలోనూ శిక్షణ పొందారు. వార్ధా ఆశ్రమంలో ఏడాదికాలం ఉన్నారు. అప్పట్లోనే గాంధీజీతో పరిచయమైంది. తిరిగొచ్చాక ఖద్దరు ప్రచారం ఆరంభించారు.
పింఛను కూడా తీసుకోలేదు!
తలశమ్మ పెదరావూరులోని తనకున్న ఇంటిని గుంటూరు జిల్లా ఖాదీ గ్రామోద్యోగ సంస్థకు రాసిచ్చారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించినా తాను మాత్రం గాంధీ సిద్ధాంతాల్నుంచి అంగుళం కూడా ఇవతలకు రాలేదు. సర్వోదయ సిద్ధాంతమే ఊపిరిగా బతికారు. స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛను, రాయితీలను తిరస్కరించారు. అదేమని అడిగితే, ‘భగవద్గీత చదువుకున్నాం. నిష్కామకర్మ గురించి చెప్పింది. దేశమాత సేవకు వెలగడతామా? అని ఎదురు ప్రశ్నించేవారట! ఖాదీబండారు ఖద్దరు వస్త్రాలను విక్రయిస్తూ, వచ్చే కమీషనుతోనే జీవనం సాగించారు.
వృద్ధాప్యంలో సైతం దేనినీ ఉచితంగా స్వీకరించకపోవటం తులశమ్మ దృఢచిత్తానికి నిదర్శనం. పొరుగింటి నుంచి కాసిన్ని మజ్జిగ తీసుకున్నా, వారందుకు తగిన డబ్బు తీసుకోవాల్సిందే! ఖద్దరు వ్యాప్తికి చేసిన కృషికి ఆమెకు ఉద్యోగం ఇవ్వజూపినా నిరాకరించారు. గాంధీ రచనలు ‘బ్రహ్మచర్యం’, ‘ఆత్మకథ’ గ్రంథాలే ఆమెకు నిత్యపారాయణం. జంతువుల చర్మంతో చేస్తారని చెప్పులు కూడా ధరించేవారు కాదు. అమానవీయమని సైకిల్ రిక్షా ఎక్కేవారు కాదు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లేవారు. తపోమయ, సేవామయ జీవితానికి అనేక నియమాలను స్వయంగా నిర్ణయించుకుని చివరివరకు పాటించిన తులశమ్మ 91 ఏళ్ల వయసులో 2001 అక్టోబరు 5న తన జీవితయాత్రను చాలించారు.
– బి.ఎల్.నారాయణ
Comments
Please login to add a commentAdd a comment