Celibacy
-
నగలను త్యజించి చరఖా చేతబట్టి
స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది. అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు.గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీని అనుసరించటమే కాదు.. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం కోసం కట్టుకున్న భర్తనే త్యాగం చేసిందో మహిళ. స్వయంగా తనే భర్తకు మళ్లీ పెళ్లి చేసింది ఆ స్త్రీమూర్తి. అంతేకాదు ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని అనుభవించింది. స్వతంత్ర భారతావనిలోనూ గాంధీ మార్గం నుంచి ఇసుమంతైనా పక్కకు రాలేదు. ప్రభుత్వమిచ్చే పింఛను, రాయితీలనే కాదు, ఏ అయాచిత సాయాన్నీ ఆమె స్వీకరించలేదు. చివరి వరకు ఖద్దరునే నమ్ముకుని జీవించారు. కన్నుమూసేవరకు గాంధీజీ సిద్ధాంతాలను హృదయంలో ప్రతిష్టించుకున్న ఆ ధీరవనిత కల్లూరి తులశమ్మ. భర్తకు మారుమనువు! తెనాలి సమీపంలోని పెదరావూరు తులశమ్మ స్వగ్రామం. మధ్యతరగతి రైతు కుటుంబంలో 1910 డిసెంబరు 25న జన్మించారు. తల్లిదండ్రులు కొడాలి కృష్ణయ్య, సీతమ్మ. ప్రాధమిక విద్య తర్వాత 14 ఏళ్ల వయసులో, సమీపంలోని మోపర్రుకు చెందిన కల్లూరి రంగయ్యతో తులశమ్మకు వివాహమైంది. అయిదారేళ్లకు కలిగిన మగబిడ్డ, నాలుగేళ్ల వయసులోనే కన్నుమూయటం.. ఆమె మాతృ హృదయాన్ని కలచి వేసింది. అదే సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో నారీమణులు కూడా భాగస్వాములు కావాలని గాంధీజీ ఇచ్చిన పిలుపు తులశమ్మను ఆకర్షించింది. అలంకరణకు, ఆడంబరానికి చిహ్నమైన నగలను త్యజించి, చరఖాను చేపట్టారు. గాంధీజీ సూత్రాల్లో ఒకటైన బ్రహ్మచర్యం పాటించాలన్న కఠోరనిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా భర్తతో చెప్పేశారు. నిర్ఘాంతపోయిన భర్తను ఒప్పించి, ఆయనకు తానే స్వయంగా మారుమనువు చేశారు. ‘వారికి పెళ్లిచేసి నా ఇంటి దగ్గరనుంచి కన్నబిడ్డను పంపినట్టు పంపాను... ఆ మనసు నాకు గాంధీజీ ఇచ్చారు’ అనేవారట! వైవాహిక బంధనాల నుంచి విముక్తురాలై, రాట్నంతో నూలువడుకుతూ అనంతర జీవితంలోకి ఆమె అడుగువేశారు. గాంధీజీతో పరిచయం ఆ క్రమంలోనే బాపూ పిలుపుతో 1941లో వినోబా భావే ‘వ్యక్తి సత్యాగ్రహం’లో ముమ్మర ప్రచారంలో పాల్గొన్నారు. 1942 ఆగస్టు 8న కోర్టుల వద్ద పికెటింగ్‌లో అరెస్టయ్యారు. కోర్టు హాలులో విదేశీ పాలనకు వ్యతిరేకంగా నినదించటంతో 16 నెలల కఠిన కారాగారశిక్ష విధించారు. జైలులో గాంధీజీకి మద్దతుగా తోటి ఖైదీలతో కలిసి ఒకరోజు దీక్ష చేసిన ఫలితంగా మరో నెలరోజులు శిక్షను పొడిగించారు. జైలునుంచి విడుదలయ్యాక 1944లో ఖాదీ విద్యాలయంలో చేరారు. సేవాగ్రాం ఖాదీ విద్యాలయంలోనూ శిక్షణ పొందారు. వార్ధా ఆశ్రమంలో ఏడాదికాలం ఉన్నారు. అప్పట్లోనే గాంధీజీతో పరిచయమైంది. తిరిగొచ్చాక ఖద్దరు ప్రచారం ఆరంభించారు. పింఛను కూడా తీసుకోలేదు! తలశమ్మ పెదరావూరులోని తనకున్న ఇంటిని గుంటూరు జిల్లా ఖాదీ గ్రామోద్యోగ సంస్థకు రాసిచ్చారు. దేశానికి స్వరాజ్యం సిద్ధించినా తాను మాత్రం గాంధీ సిద్ధాంతాల్నుంచి అంగుళం కూడా ఇవతలకు రాలేదు. సర్వోదయ సిద్ధాంతమే ఊపిరిగా బతికారు. స్వాతంత్య్ర సమరయోధులకిచ్చే పింఛను, రాయితీలను తిరస్కరించారు. అదేమని అడిగితే, ‘భగవద్గీత చదువుకున్నాం. నిష్కామకర్మ గురించి చెప్పింది. దేశమాత సేవకు వెలగడతామా? అని ఎదురు ప్రశ్నించేవారట! ఖాదీబండారు ఖద్దరు వస్త్రాలను విక్రయిస్తూ, వచ్చే కమీషనుతోనే జీవనం సాగించారు. వృద్ధాప్యంలో సైతం దేనినీ ఉచితంగా స్వీకరించకపోవటం తులశమ్మ దృఢచిత్తానికి నిదర్శనం. పొరుగింటి నుంచి కాసిన్ని మజ్జిగ తీసుకున్నా, వారందుకు తగిన డబ్బు తీసుకోవాల్సిందే! ఖద్దరు వ్యాప్తికి చేసిన కృషికి ఆమెకు ఉద్యోగం ఇవ్వజూపినా నిరాకరించారు. గాంధీ రచనలు ‘బ్రహ్మచర్యం’, ‘ఆత్మకథ’ గ్రంథాలే ఆమెకు నిత్యపారాయణం. జంతువుల చర్మంతో చేస్తారని చెప్పులు కూడా ధరించేవారు కాదు. అమానవీయమని సైకిల్ రిక్షా ఎక్కేవారు కాదు. ఎక్కడికి వెళ్లినా కాలినడకనే వెళ్లేవారు. తపోమయ, సేవామయ జీవితానికి అనేక నియమాలను స్వయంగా నిర్ణయించుకుని చివరివరకు పాటించిన తులశమ్మ 91 ఏళ్ల వయసులో 2001 అక్టోబరు 5న తన జీవితయాత్రను చాలించారు. – బి.ఎల్.నారాయణ (చదవండి: బ్రేకింగ్ న్యూస్..డయ్యర్‌కు బులెట్ దిగింది!) -
పెళ్లయ్యాక మూడు రాత్రులు బ్రహ్మచర్యం పాటించాలి
వివాహమైన పిదప, వధూవరులు మూడు రాత్రులు బ్రహ్మచర్యం పాటించాలి. ఆ తర్వాత, పెద్దలను ఆహ్వానించి, అక్కడ గణపతి పూజ, అష్టదిక్పాలక పూజ, ఇంటి ఇలవేల్పుల పూజలు చేసి, సభలోని పెద్దలను కూడా పూజించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. దీనినే సదస్యం అంటారు. ఆ తర్వాత, అగ్ని, ప్రజాపతి మొదలగు దేవతలకు శేష హోమం చెయ్యాలి. తర్వాత, నాకబలి ఆచరించాలి. ఈ నాకబలే లోకవాడుకలో నాగవల్లి అయింది. ఇందులో సకలదేవతలకు బలులు అర్పిస్తారు. తర్వాత శేష హోమం చేయగా మిగిలిన ఆజ్యాన్ని వధూవరుల శిరస్సుపై కొద్దిగా ఉంచి ఆశీర్వదించాలి. తదుపరి, కొద్దిగా ఆజ్యాన్ని వరుడు తన చేతితో తీసుకుని, వధూవరుల హృదయాలను స్పృశించాలి. దీనినే హృదయ సంసర్గం అంటారు. ఇందులో వధూవరుల హృదయాలు రెండూ ఒక అనుబంధంగా పెనవేసుకుని ఒకరికొకరుగా జీవించాలని దేవతలను ఈ విధంగా కోరుకుంటారు. ‘విశ్వేదేవతలు మన హృదయాలను స్నేహంతో పెనవేయుదురుగాక, జలం, వాయువు, ధాత మన హృదయాలను కలిపి ఉంచుదురుగాక. సరస్వతి మనకు అనుకూల సంభాషణ చేయించునుగాక. పుత్ర, సంతాన కారకుడగు త్వష్ట ప్రజాపతి నా శరీరమునందు ప్రవేశించి, మనం బహు పుత్రవంతులమగునట్లు మమ్ములను సంతానవంతులను చేయునుగాక. అర్యముడు మమ్ములను స్నేహితులుగానే వుండునట్లు చేయును గాక. ఓ వధూ..! నీవు సౌభాగ్యవతివై, నా గృహమందు నివసించు. మా రెండు పాదాలు గల, నాలుగు పాదాలుగల జంతువులు సుఖంగా వుండునుగాక’. తర్వాత, వివాహమైన నాల్గవరోజు రాత్రి వధూవరుల కంకణాలను విప్పుతారు. తదుపరి, అక్కడవున్నవారిలో పెద్ద దంపతులకు, నూతన వధూవరులు తాంబూలమిచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత కన్యాదాత, తన కుమార్తెను, మెట్టినింటివారి వావి వరుసలతో వారిని తనకు పరిచయం చేస్తూ, వధువు చేతిని పాలలో ముంచి ఆ చేతిని వరుని చేతిలో పెట్టి మెట్టినింటివారికి అప్పగిస్తాడు. దీనినే అప్పగింతలు అంటారు. ఇంతటితో వివాహ క్రతువు ముగిసి, వరుడు సర్వధర్మాలకు ఆలంబనమైన గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వర రావు చదవండి: షూట్ చేస్తే..రంగు పడుద్ది! కాస్త శ్రద్ధ పెడితే కేంద్ర కొలువు మీ సొంతం! -
అయ్యప్ప బ్రహ్మచర్యానికి రాజ్యాంగ రక్షణ
న్యూఢిల్లీ: శబరిమల ఆలయ ప్రధాన దైవం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యాన్ని పరిరక్షించడానికి రాజ్యాంగంలో నిబంధనలున్నాయని నాయర్ సర్వీస్ సొసైటీ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆలయంలోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఈ సొసైటీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ సంస్థ తరఫు లాయర్ కె.పరాశరన్ బుధవారం వాదనలు వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో పరిశీలించదగ్గ అంశం అయ్యప్పస్వామి బ్రహ్మచర్యమే అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘ ఆలయంలోకి వచ్చే వారు యువతులు, మహిళలను వెంట తీసుకురావొద్దు. పిల్లలు, తల్లి, సోదరికి మినహాయింపు ఉంటుంది. సందర్శకులు తప్పనిసరిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలని దీనర్థం కాదు. కానీ వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లు కనిపించాలి. దేవాలయాల్లోకి అన్ని వర్గాలను అనుమతించాలన్న రాజ్యాంగ నిబంధన 25(2) సామాజిక సంస్కరణలకే పరిమితం. 26(బి) నిబంధన కింద చేర్చిన మత వ్యవహారాలకు వర్తించదు’ అని పరాశరన్ అన్నారు. మహిళలను ఆలయాల్లోకి అనుమతిస్తూ ప్రభుత్వం చట్టం చేస్తే పరిస్థితి ఏంటని బెంచ్ ప్రశ్నించగా..చాలా ఏళ్ల నాటి ఇలాంటి సంప్రదాయాల రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తున్న సమయంలో అక్కడి ప్రధాన దైవం ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకోవాలని బదులిచ్చారు. వాదనలు నేడు కూడా కొనసాగనున్నాయి. దివ్యాంగుల సౌకర్యం పట్టదా? రవాణా సౌకర్యాలు, బహిరంగ ప్రదేశాల్లో దివ్యాంగులకు అనుకూలంగా మార్పులు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి గత డిసెంబర్లో తాము జారీచేసిన ఉత్తర్వులను అమలుచేయడంలో విఫలమైన కేంద్రానికి చీవాట్లు పెట్టింది. ఇప్పటి దాకా తీసుకున్న చర్యలు వివరిస్తూ ప్రమాణపత్రం దాఖలుచేయాలని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. తమ ఆదేశాలను పట్టించుకోని రాష్ట్రాల తీరుపై కూడా బెంచ్ అసహనం వ్యక్తం చేసింది. -
ప్రశ్నించటాన్ని నేర్పేదే ప్రశ్నోపనిషత్
ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నిష్ఠ, శ్రద్ధలతో యోగులై ఉత్తరాయణ మార్గంలో సూర్యుణ్ణి చేరుకుంటున్నారు. ఉత్తరాయణమే ప్రాణకేంద్రం. అమరం, అభయం. ఈ మార్గంలో వెళ్లినవాళ్లు మళ్లీ పుట్టరు. యువతరం జిజ్ఞాసతో, శ్రద్ధగా జ్ఞానసముపార్జన ఎలా చెయ్యాలో, ఎటువంటి గురువును ఆశ్రయించాలో, క్రమశిక్షణ ఎలా పాటించాలో అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. వేదం ప్రశ్నించమనే చెబుతోంది. అయితే తెలుసుకోవటానికే (జిజ్ఞాస) ప్రశ్నించాలి. గెలవటానికి (జిగీష) అహంకారంతో వేదాంత విషయాలు ప్రశ్నిస్తే సత్యదర్శనం కాకపోగా కాలం వృథా అవుతుంది. ఋక్, యజుర్ సామవేదాల తర్వాత ఏర్పడిన నాలుగోవేదం అధర్వ(ణ) వేదం. భౌతికంగా పనికి వచ్చే శాస్త్ర సాంకేతిక, ఆధునిక విషయాలు దీనిలో ఉన్నాయి. అలాగే వేదాంతాలైన ఉపనిషత్తులు కూడా అధర్వవేదంలో శాస్త్రీయ దృక్పథంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ప్రధానమైన ఉపనిషత్తులలో మూడు అధర్వవేదంలో నుంచే తీసుకున్నారు. వాటిల్లో ప్రశ్నోపనిషత్తు మరింత ముఖ్యం. ఆరుగురు యువ మునీశ్వరులు పిప్పలాద మహర్షిని ఆరు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలను, సమాధానాలను తెలుసుకుందాం. ప్రథమప్రశ్న భరద్వాజ కుమారుడు సుకేశి. శిబికుమారుడు సత్యకాముడు. అశ్వల కుమారుడు కౌసల్యుడు. కత్యకుమారుడు కబంధి. విధర్భ దేశీయుడు భార్గవుడు, సూర్యపుత్రుడు గార్గ్యుడు. అనే ఆరుగురు ఋషులు శ్రద్ధతో తపస్సు చేశారు. బ్రహ్మనిష్ఠాపరులైన ఆ ఆరుగురికి పరబ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవాలనిపించింది. దానిని సమగ్రంగా చెప్పగలిగిన గురువు పిప్పలాద మహర్షి అని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లారు. బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు. ‘‘ఋషులారా! మీరు ఇప్పటివరకు ఎంత తపస్సు చేసినా మా దగ్గర ఒక సంవత్సరం పాటు శ్రద్ధతో, బ్రహ్మచర్యంతో తపస్సు చేయండి. తరువాత ఎన్ని ప్రశ్నలైనా అడగండి. మాకు తెలసింది మొత్తం మీకు చెబుతాం అన్నాడు పిప్పలాద మహర్షి. ఇక్కడ మాకు అనే బహువచనం గురుపీఠగౌరవాన్ని తెలియజేస్తుంది. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు కాత్యాయనుడైన కబంధి గురువు గారి దగ్గరకు వెళ్లాడు. ‘‘భగవాన్! ఈ జీవులందరూ ఎక్కడినుంచి వస్తున్నారు’’? అని మొదటి ప్రశ్న అడిగాడు. పిప్పలాద మహర్షి ‘‘కబంధీ! ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆకాశాన్నీ, ప్రాణాలన్నీ ఒక జంటగా సృష్టించాడు. ఈ జంట ద్వారా అన్ని జీవులు ఏర్పడాలని ఆయన సంకల్పం. సూర్యుడు ప్రాణం. చంద్రుడు జడపదార్థం. ఈ సృష్టిలో కపడేవి, కనపడనివీ అన్నీ జడపదార్థాలే. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించి తన కాంతితో ఆ దిక్కుకు ప్రాణం ఇస్తున్నాడు. అలాగే దక్షిణం, పడమర, ఉత్తరం, భూమి, ఆకాశం, ఆగ్నేయం, నైరృతి, వాయవ్యం, ఈశాన్యం అన్నివైపులా తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. ప్రాణులన్నింటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. వైశ్వానరుడు, విశ్వరూపుడు, ప్రాణస్వరూపుడు అయిన సూర్యుడు అగ్నిగోళంలా ఉదయిస్తాడు. ఋగ్వేదం ఇలా చెబుతోంది. సర్వజ్ఞుడు, జ్యోతిస్వరూపుడు, సకల ప్రాణులకూ ప్రాణమైన సూర్యుడు వెయ్యికిరణాలతో ఉదయిస్తూ వందవిధాలుగా జీవులను కాపాడుతున్నాడు. సృష్టికర్త సంవత్సర స్వరూపుడు. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు దారులు ఉన్నాయి. కోరికతో యాగాలు, సత్కర్మలు, సత్కార్యాలు చేసినవారు చంద్రలోకానికి చేరుకుని మళ్లీ భూమి మీద పుడతారు. సంతానాన్ని కోరే ఋషులు దక్షిణాయనంలో చంద్రలోకానికి వెళుతున్నారు. ఇది చాలా కష్టం. సూర్యుడు అయిదు పాదాలతో, పన్నెండు రూపాలలో ఉంటాడు. ఆయనే సర్వజ్ఞుడు. వర్షప్రదాత. ఆరు ఆకులున్న ఏడుచక్రాల రథం మీద సంచరిస్తూ ఉంటాడు. సంవత్సరంలో ఒక భాగం మాసం (నెల) మాసమే సృష్టికర్త. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం ప్రాణస్వరూపం. ఋషులు యజ్ఞయాగాలు ఈ పక్షంలోనే చేస్తారు. కృష్ణపక్షం జడపదార్థం. ఒకరోజులో పగలు, రాత్రి ప్రజాపతి స్వరూపమే. పగలు ప్రాణం రాత్రి జడం. ప్రాణస్వరూపమైన పగటివేళ సంభోగించిన వారి ఆయుర్దాయం క్షీణిస్తుంది. నాయనా! కబంధీ! అన్నం కూడా ప్రజాపతి రూపమే. అన్నం నుంచే రేతస్సు ఏర్పడుతుంది. రేతస్సు నుంచే అన్ని జీవులు పుడుతున్నాయి. ఈవిధంగా ప్రజాపతి ఏర్పరచిన ఈ వ్రతాన్ని ఎవరు శ్రద్ధగా పాటిస్తారో వారు జంటలను సృష్టిస్తారు. ఎవరియందు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ ప్రతిష్ఠితమై ఉన్నాయో వారు మాత్రమే బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతారు. నియమబద్ధంగా జీవించేవారికే సత్త్వగుణ ప్రధానమైన బ్రహ్మలోకం చేరే అర్హత లభిస్తుంది. వక్రత, అసత్యం, మాయ, మోసం ఉన్నవారు ఎప్పటికీ బ్రహ్మలోకాన్ని చేరుకోలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. పిప్పలాద మహర్షి ఈ విధంగా కబంధి అడిగిన ప్రశ్నకు కళ్లకు కట్టినట్టు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ప్రాణులు ప్రాణవంతం కావడంలో సూర్యుని పాత్ర, కాలస్వరూపం అయనాలు, ఋతువులు, మాసాలు, రోజులు, పగలు, రాత్రి ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమే. మానవులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ శ్రద్ధాభక్తులతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు’’ అంటూ మానవ జన్మ పరమార్థాన్ని, మానవ జీవిత విధానాన్ని వివరించారు. కబంధుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు చెప్పిన సమాధానాన్ని ఆరుగురూ అర్థం చేసుకున్నారు. రెండోప్రశ్నను, సమాధానాన్ని వచ్చేవారం తెలుసుకుందాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
బ్రహ్మచారుల దేశం!
నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... బ్రహ్మచర్యం! గత దశాబ్ద కాలంగా జపాన్ జనాభా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా. జపాన్ అంతరించిపోనున్నాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేసినది సాక్షాత్తూ జపాన్ ఫామిలీ ప్లానింగ్ అసోసియేషన్ (జేఎఫ్పీఏ) అధిపతి కునియో కిటమొర. నేడు జపాన్‌లో అతి వేగంగా విస్తరిస్తున్న అంటువ్యాధి... ఘోటక బ్రహ్మచర్యం! ప్రకృతి ధర్మానికి అపవాదంలాగా ఆడామగా తేడా లేకుండా అంతా ప్రేమంటే ఆమడ దూరం పారిపోతున్నారు. పెళ్లీ, శృంగారం, పిల్లలు అంటే గుండెపోటు తెచ్చేసుకుంటున్నారు. పోనీ ప్రేమ, పెళ్లీ బాదరబంది లేని శృంగారమో? మహా పాతకం! 40 ఏళ్ల లోపు వయస్కులను పట్టిపీడిస్తున్న ఈ వ్యాధికి ‘సెలిబసీ సిండ్రోమ్’ అని పేరు పెట్టారు. నవ యువతలో... స్త్రీలల్లో 40 శాతం, పురుషుల్లో 35 శాతం శృంగార జీవితమంటే విముఖత చూపుతున్నారు. ఉద్వేగభరితమైన ప్రేమానురాగ బంధమంటే భయంతో వణుకుతున్నారు. యువతీ యువకులు ఏ పార్కుల్లోనో కలిసినా... మాట కలపలేక క్షణమొక నరకంగా గడపాల్సి వస్తోంది. వెంటనే ఈ స్నేహానికి సైతం గుడ్‌బై చెప్పేసి. ప్రాణహాని తప్పినట్లు నిట్టూరుస్తున్నారు. ప్రేమిద్దామనుకున్నా... చేయి తాకితే షాక్ కొట్టినట్లయి ఒకరికొకరు దూరంగా పారిపోతున్నారు. స్త్రీపురుషుల మధ్య మానసిక, శారీరక సాన్నిహిత్యమే ఊహింపశక్యం కాని దిగా మారిపోతోంది. నలభైకి చేరువైనా తల్లిదండ్రులతో బతకడమే సుఖమని భావిస్తున్నారు. జననాల రేటు అతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన జపాన్ జనాభా గత దశాబ్ద కాలంగా క్షీణించిపోతోంది. నేడు 12.6 కోట్లుగా ఉన్న జనాభాలో కనీసం 5 కోట్ల మంది 2050 నాటికి గల్లంతవుతారని అంచనా. జపాన్ అంతరించిపోతుందేమోనని కిటమొర ఊరికే ఆందోళన చెందడం లేదు. ఈ ‘సెలిబసీ సిండ్రోమ్’కు మూల కారణాలు ఆర్థికమైనవి, సామాజికమైనవి కావడమే విశేషం. టోక్యోలో మానవ వనరుల అధికారిణిగా ఉన్న ఎరి టొమిటా (32) ప్రేమాయణం ఈ రోగాన్ని అర్థం చేసుకోడానికి తోడ్పడుతుంది: ‘ఒక బాయ్ ఫ్రెండ్ ప్రేమిస్తున్నానంటూ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పెళ్లి కోసం మంచి ఉద్యోగాన్ని వదులుకోలేకపోయాను. ప్రేమ, పెళ్లి భ్రమలు తొలగిపోయాయి.’ కార్పొరేట్ సంస్థలు పెళ్లి మాట ఎత్తితే చాలు ఉద్యోగినులకు ఉద్వాసన చెబుతాయి. ఇతర చోట్ల ఉద్యోగాలు ఊడకున్నా పెళ్లితో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు నిలిచిపోతాయి. వివాహిత ఉద్యోగినులను ‘దయ్యం పెళ్లాలు’గా పరిగణిస్తారు. ‘వరల్డ్ ఎకనామిక్ పోరం’ ఏటా మహిళల పట్ల లైంగిక వివక్షలో జపాన్‌కు అగ్రతాంబూలం ఇస్తోంది. పెళ్లికాని యువతులకు మంచి ఉద్యోగాల తాపత్రయం. ఉద్యోగినులకు ఉద్యోగాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇక ప్రేమ, పెళ్లి, శృంగారం ఎవరికి కావాలి? భర్త కుటుంబాన్ని పోషించడం, భార్య గృహిణిగా ఇల్లు చక్కదిద్దుకోవడం సంప్రదాయం. జపాన్‌లో సంప్రదాయక కుటుంబ విలువలు మారలేదు. ఇక స్థిరమైన కొలువులు అంతరించిపోయి చాలా కాలమైంది. ఆడైనా, మగైనా అనుక్షణం పోటీపడాల్సిందే. లేకపోతే ఉద్యోగమూ ఉండదు, పైకి ఎగబాకడమూ ఉండదు. రెండు దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో వెనుకబడిపోయిన జపాన్‌లో ఒక ఉద్యోగంతో కుటుంబం గడవని స్థితి నెలకొంది. 40 ఏళ్లకు చేరుతున్నా పురుషలు ‘వివాహ అర్హత’ను సంపాదించలేపోతున్నారు. ‘ప్రేమకు, పెళ్లికి కావాల్సినంత భారీ ఆదాయం కాదు నాది. ఉద్వేగభరిమైన ప్రేమ, శృంగారం లేకండా బతకడం అలవాటైపోయింది’ అని సతోరు కిషినో (31) లాంటివాళ్లు తేల్చేస్తున్నారు. ఈ ‘అలవాటు’ సామూ హిక మానసిక రుగ్మత గా ముదిరిపోయింది. ప్రభుత్వాలు కమిటీల మీద కమిటీలను వేస్తూనే ఉనాయి. కానీ ఆర్థిక, సామాజిక మూలాల జోలికిగానీ, సంప్రదాయక కుటుంబ విలువల్లో మార్పును తేవడానికి గానీ కృషి చేయడం లేదు. మరి బ్రహ్మచర్యం మహమ్మారి చెలరేగిపోదా? - పి.గౌతమ్