ప్రశ్నించటాన్ని నేర్పేదే ప్రశ్నోపనిషత్
ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నిష్ఠ, శ్రద్ధలతో యోగులై ఉత్తరాయణ మార్గంలో సూర్యుణ్ణి చేరుకుంటున్నారు. ఉత్తరాయణమే ప్రాణకేంద్రం. అమరం, అభయం. ఈ మార్గంలో వెళ్లినవాళ్లు మళ్లీ పుట్టరు.
యువతరం జిజ్ఞాసతో, శ్రద్ధగా జ్ఞానసముపార్జన ఎలా చెయ్యాలో, ఎటువంటి గురువును ఆశ్రయించాలో, క్రమశిక్షణ ఎలా పాటించాలో అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. వేదం ప్రశ్నించమనే చెబుతోంది. అయితే తెలుసుకోవటానికే (జిజ్ఞాస) ప్రశ్నించాలి. గెలవటానికి (జిగీష) అహంకారంతో వేదాంత విషయాలు ప్రశ్నిస్తే సత్యదర్శనం కాకపోగా కాలం వృథా అవుతుంది. ఋక్, యజుర్ సామవేదాల తర్వాత ఏర్పడిన నాలుగోవేదం అధర్వ(ణ) వేదం. భౌతికంగా పనికి వచ్చే శాస్త్ర సాంకేతిక, ఆధునిక విషయాలు దీనిలో ఉన్నాయి. అలాగే వేదాంతాలైన ఉపనిషత్తులు కూడా అధర్వవేదంలో శాస్త్రీయ దృక్పథంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ప్రధానమైన ఉపనిషత్తులలో మూడు అధర్వవేదంలో నుంచే తీసుకున్నారు. వాటిల్లో ప్రశ్నోపనిషత్తు మరింత ముఖ్యం. ఆరుగురు యువ మునీశ్వరులు పిప్పలాద మహర్షిని ఆరు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలను, సమాధానాలను తెలుసుకుందాం.
ప్రథమప్రశ్న
భరద్వాజ కుమారుడు సుకేశి. శిబికుమారుడు సత్యకాముడు. అశ్వల కుమారుడు కౌసల్యుడు. కత్యకుమారుడు కబంధి. విధర్భ దేశీయుడు భార్గవుడు, సూర్యపుత్రుడు గార్గ్యుడు. అనే ఆరుగురు ఋషులు శ్రద్ధతో తపస్సు చేశారు. బ్రహ్మనిష్ఠాపరులైన ఆ ఆరుగురికి పరబ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవాలనిపించింది. దానిని సమగ్రంగా చెప్పగలిగిన గురువు పిప్పలాద మహర్షి అని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లారు. బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు.
‘‘ఋషులారా! మీరు ఇప్పటివరకు ఎంత తపస్సు చేసినా మా దగ్గర ఒక సంవత్సరం పాటు శ్రద్ధతో, బ్రహ్మచర్యంతో తపస్సు చేయండి. తరువాత ఎన్ని ప్రశ్నలైనా అడగండి. మాకు తెలసింది మొత్తం మీకు చెబుతాం అన్నాడు పిప్పలాద మహర్షి. ఇక్కడ మాకు అనే బహువచనం గురుపీఠగౌరవాన్ని తెలియజేస్తుంది. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు కాత్యాయనుడైన కబంధి గురువు గారి దగ్గరకు వెళ్లాడు. ‘‘భగవాన్! ఈ జీవులందరూ ఎక్కడినుంచి వస్తున్నారు’’? అని మొదటి ప్రశ్న అడిగాడు. పిప్పలాద మహర్షి ‘‘కబంధీ! ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి తీవ్రంగా తపస్సు చేశాడు.
ఆకాశాన్నీ, ప్రాణాలన్నీ ఒక జంటగా సృష్టించాడు. ఈ జంట ద్వారా అన్ని జీవులు ఏర్పడాలని ఆయన సంకల్పం. సూర్యుడు ప్రాణం. చంద్రుడు జడపదార్థం. ఈ సృష్టిలో కపడేవి, కనపడనివీ అన్నీ జడపదార్థాలే. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించి తన కాంతితో ఆ దిక్కుకు ప్రాణం ఇస్తున్నాడు. అలాగే దక్షిణం, పడమర, ఉత్తరం, భూమి, ఆకాశం, ఆగ్నేయం, నైరృతి, వాయవ్యం, ఈశాన్యం అన్నివైపులా తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. ప్రాణులన్నింటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. వైశ్వానరుడు, విశ్వరూపుడు, ప్రాణస్వరూపుడు అయిన సూర్యుడు అగ్నిగోళంలా ఉదయిస్తాడు. ఋగ్వేదం ఇలా చెబుతోంది. సర్వజ్ఞుడు, జ్యోతిస్వరూపుడు, సకల ప్రాణులకూ ప్రాణమైన సూర్యుడు వెయ్యికిరణాలతో ఉదయిస్తూ వందవిధాలుగా జీవులను కాపాడుతున్నాడు.
సృష్టికర్త సంవత్సర స్వరూపుడు. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు దారులు ఉన్నాయి. కోరికతో యాగాలు, సత్కర్మలు, సత్కార్యాలు చేసినవారు చంద్రలోకానికి చేరుకుని మళ్లీ భూమి మీద పుడతారు. సంతానాన్ని కోరే ఋషులు దక్షిణాయనంలో చంద్రలోకానికి వెళుతున్నారు. ఇది చాలా కష్టం. సూర్యుడు అయిదు పాదాలతో, పన్నెండు రూపాలలో ఉంటాడు. ఆయనే సర్వజ్ఞుడు. వర్షప్రదాత. ఆరు ఆకులున్న ఏడుచక్రాల రథం మీద సంచరిస్తూ ఉంటాడు.
సంవత్సరంలో ఒక భాగం మాసం (నెల) మాసమే సృష్టికర్త. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం ప్రాణస్వరూపం. ఋషులు యజ్ఞయాగాలు ఈ పక్షంలోనే చేస్తారు. కృష్ణపక్షం జడపదార్థం. ఒకరోజులో పగలు, రాత్రి ప్రజాపతి స్వరూపమే. పగలు ప్రాణం రాత్రి జడం. ప్రాణస్వరూపమైన పగటివేళ సంభోగించిన వారి ఆయుర్దాయం క్షీణిస్తుంది. నాయనా! కబంధీ! అన్నం కూడా ప్రజాపతి రూపమే. అన్నం నుంచే రేతస్సు ఏర్పడుతుంది. రేతస్సు నుంచే అన్ని జీవులు పుడుతున్నాయి.
ఈవిధంగా ప్రజాపతి ఏర్పరచిన ఈ వ్రతాన్ని ఎవరు శ్రద్ధగా పాటిస్తారో వారు జంటలను సృష్టిస్తారు. ఎవరియందు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ ప్రతిష్ఠితమై ఉన్నాయో వారు మాత్రమే బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతారు. నియమబద్ధంగా జీవించేవారికే సత్త్వగుణ ప్రధానమైన బ్రహ్మలోకం చేరే అర్హత లభిస్తుంది. వక్రత, అసత్యం, మాయ, మోసం ఉన్నవారు ఎప్పటికీ బ్రహ్మలోకాన్ని చేరుకోలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు.
పిప్పలాద మహర్షి ఈ విధంగా కబంధి అడిగిన ప్రశ్నకు కళ్లకు కట్టినట్టు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ప్రాణులు ప్రాణవంతం కావడంలో సూర్యుని పాత్ర, కాలస్వరూపం అయనాలు, ఋతువులు, మాసాలు, రోజులు, పగలు, రాత్రి ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమే. మానవులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ శ్రద్ధాభక్తులతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు’’ అంటూ మానవ జన్మ పరమార్థాన్ని, మానవ జీవిత విధానాన్ని వివరించారు. కబంధుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు చెప్పిన సమాధానాన్ని ఆరుగురూ అర్థం చేసుకున్నారు.
రెండోప్రశ్నను, సమాధానాన్ని వచ్చేవారం తెలుసుకుందాం.
- డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్