
అభిప్రాయం
ఇటీవలి కాలంలో కౌమార దశ (టీనేజ్)లో ఉన్న పిల్లల ఆత్మహత్యలు పెరిగిపోతుండటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 8, 9వ తరగతుల వరకు చదువే లోకంగా ఉన్న పిల్లలు... టెన్త్, ఇంటర్‌లలో చేరిన తర్వాత ఈ స్వీయ హన నానికి పాల్పడుతుండటాన్ని తేలికగా తీసుకోరాదు. సెలవులు, వారాంతాల్లో సోషల్ మీడియాలో గంటల తరబడి రీల్స్ చూస్తూ గడిపిన నవ యువత మళ్లీ స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని వారి మనస్తత్వాన్ని లోతుగా పరిశీలించినవారి మాట.
చదువుల ఒత్తిడి కొత్తదేమీ కాకున్నా... ‘రీల్స్’ భూతం వారి మెదడుపై దుష్ప్రభావాలను చూపు తున్నట్టు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అధ్యయనాలు వెల్లడి స్తున్నాయి. ఇంటి వద్ద రోజూ పదిగంటలకు పైగా స్క్రీన్ చూడటానికి బానిసలైన తర్వాత నియంత్రిత వ్యవస్థలో కళాశాల, పాఠశాల వాతావరణాలకు సర్దుకోలేక చిన్న మనసులు తీవ్ర క్షోభకు గురవుతున్నాయి. ఈ వయసు వారి మెదడు సహజంగా భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి కలిగి ఉన్నా... స్మార్ట్‌ఫోన్ అధిక వాడకం ఈ సంతులనాన్ని దెబ్బ తీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
కౌమార వయసులో మెదడు అభివృద్ధి చెందే దశలోనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌లో రసాయన మార్పులు జరుగుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకోవడం, ఉద్వేగాల నియంత్రణ ఈ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ద్వారానే జరు గుతూ ఉంటాయి. ఇదే సమయంలో మన భావోద్వేగాల వ్యక్తీకరణకు ఉపకరించే లింబిక్ వ్యవస్థ చాలా చురుకుగా ఉంటుంది. మెదడు లోపలి ఈ వ్యవస్థలో అమిగ్దలా అనే భాగం... భయం, కోపం, ఆనందం వంటి అనుభూతులకు కారణమైతే; ఆకలి, దప్పిక, శరీర ఉష్ణోగ్రత, ఉద్వేగాలకు, స్పందన లకు హైపోథాలమస్ కారణం అవుతుంది.
ఇవి మాత్రమే కాకుండా... లింబిక్ వ్యవస్థలో హిప్పోకాంపస్, థాలమస్, హైపోథాలమస్, సింగులేట్ గైరస్, బేసల్ గాంగ్లియా వంటి అనేక మెదడు భాగాలు ఉంటాయి. ఫ్రంటల్ కార్టెక్స్, లింబిక్ వ్యవస్థల మధ్య అసమతౌల్యం ఏర్పడినప్పుడు యువతీ యువకుల్లో భావోద్వేగాలస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో మానసిక క్షోభను, కుంగుబాటును నియంత్రించుకోవడం అంతగా సాధ్యపడదు.
అయితే సాధారణంగా ఈ లోటుపాట్లు ఉన్నా కౌమార వయస్కులు మానసిక క్షోభను సమర్థంగానే తట్టుకోగలరు. ప్రకృతిసిద్ధంగా ఉండే న్యూరో కెమికల్స్ వల్ల ఇది సాధ్య మవుతుంది. ఉల్లాసానికి కారణమయ్యే డోపమైన్ వంటి న్యూరో రసాయనాల కారణంగా వీరు ఆనందం, సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు. అలాగే అభివృద్ధి చెందుతూ ఉండే హెచ్‌పీఏ (హైపోథాలమిక్–పిట్యూటరీ–ఎడ్రినల్యాక్సిస్) కూడా ఎక్కువ కాలం నిరాశ, నిçస్పృహలో ఉండకుండా చూస్తుంది.
అంటే ఎంతో ప్రేమించే కుటుంబ సభ్యులు అకాల మరణం పాలైనా, తల్లితండ్రుల్లో ఎవరైనా రోజూ తీవ్రంగా హింసిస్తున్నా ఆ వయసు పిల్లల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనే రాదు. పిల్లల్లో సహజంగా ఉండే ఈ రక్షణ వ్యవస్థ సుదీర్ఘ స్మార్ట్‌ఫోన్‌ల వినియోగంతో ముక్కచెక్కలవుతుంది. ఫలితంగా ఆందోళన, మానసిక ఉద్వేగాలతో అస్థిరతలు ఏర్పడతాయి.
మృత్యుకుహరం ఈ డిజిటల్ వల
విద్యార్థులు సెలవు రోజుల్లో రోజుకు పది గంటల కంటే ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్‌లను వాడుతున్నట్లు అంచనా. సామాజిక మాధ్యమాలను వాడినంత సేపూ మెదడులో ఆనందం కలిగించే డోపమైన్ (హ్యాపీ హార్మోన్) అధికంగా ఉత్పత్తి అవుతుంది. ఇది కాస్తా కంపల్సివ్ బిహేవియర్ (వద్దని అనుకున్నా కొన్ని పనులు పదే పదే చేయాలనుకోవడం)కు దారి తీస్తుంది. విద్యార్థులు సెలవులు ముగించుకుని కాలేజీలు, పాఠ శాలల్లో అడుగుపెట్టగానే డోపమైన్ ఉపసంహరణ కారణంగా అసహనం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం, అకారణ దిగులు ఆవహిస్తాయి. ఈ స్థితిలో ఆత్మహత్య వైపు వారి ఆలోచన మళ్లుతుంది.
కాపాడుకోవడం మన చేతుల్లోనే...
తల్లితండ్రులు, చదువు చెప్పేవారు, విధాన రూపకర్తలు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం సాధించడం కష్టమేమీ కాదు. డిజిటల్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి విద్యార్థులకు కొన్ని హద్దులు నిర్ధారించాలి. ఒక క్రమ పద్ధతిలో వారి స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్‌లెట్‌ల వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. అర్థవంతమైన కంటెంట్‌ను పరిచయం చేయాలి.
సెలవుల తర్వాత స్కూళ్లు, కాలేజీలు తెరిచిన వెంటనే సీరియస్‌గా పాఠాల జోలికి పోకుండా మొదటి రెండు రోజులు ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించాలి. పిల్లలు ఒక రోజు ఆగి కాలేజీకి వెళ్తామంటే వారిని నిందించడం, బెదిరించడం చేయకుండా తల్లిదండ్రులు తమ కాఠిన్యాన్ని తగ్గించు కోవాలి. పాఠశాలల్లో పరిమిత స్థాయిలో డిజిటల్ టెక్నాలజీలను వాడేలా చేయడం ద్వారా వారు సామాజిక మాధ్యమాల వల నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం ఏర్పడుతుంది. విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ ఏర్పాట్లు ఉండాలి.
ఆరోగ్యకరమైన హద్దులను నిర్ణయించడం, విద్యాపరంగా, సామాజికంగా అనుకూల వాతావరణాన్ని సృష్టించడం వంటి చర్యల ద్వారా కౌమార వయస్కులు... డిజిటల్ – వాస్తవ ప్రపంచాల మధ్య తేడా తెలుసుకుని సమతుల్యతను సాధించడానికి వీలు కలుగుతుంది. ఇది కేవలం తల్లితండ్రులు, విద్యావేత్తల బాధ్యత కాదు. సమాజం మొత్తానిది. అప్పుడు మాత్రమే యువత భావోద్వేగ సంక్షోభాన్ని నివారించగలం. యువతకు అందమైన భవిష్యత్తును కల్పించగలం!
బి.టి. గోవిందరెడ్డి
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
మొబైల్: 90524 72424
Comments
Please login to add a commentAdd a comment