రీల్స్ ఎడిక్షన్
15 సెకన్ల రీల్స్ కోసం నూరేళ్ల జీవితాన్ని పణంగా పెడుతోంది నేటి యువత. రీల్స్‌ను ప్రవేశపెట్టిన ఇన్ స్టాగ్రామ్‌కు నేడు మన దేశంలో 24 కోట్ల మంది ఖాతాదార్లు ఉన్నారు. వీరిలో యువతీ యువకులే ఎక్కువ. ఆన్ లైన్ ఫేమ్ కోసం చిత్ర విచిత్రమైన రీల్స్ చేయడానికి ప్రాణాలతో రిస్క్ చేస్తున్నారు. గొడవలు, మర్డర్లు జరుగుతున్నాయి. మంచి ఫోన్ల కోసం దొంగలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు, సమాజం ఈ వ్యసనాన్ని ఇలాగే వదిలేయాలా?
పూణెలో పోలీసులు వెంటనే స్పందించారు. మిహిర్ గాంధీ (27), మీనాక్షి సలూంఖే (23)లను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐ.పి.సి 336 సెక్షన్ కింద కేసు పెట్టారు. దీని ప్రకారం ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ ఉంటాయి. ఎందుకు వీరిని అరెస్ట్ చేశారు. ప్రాణాంతకమైన రీల్ చేశారు కనుక.
ఏం జరిగింది?
పూణెకు చెందిన మిహిర్ గాంధీ, మీనాక్షి వారం క్రితం ఒక రీల్ విడుదల చేశారు. అందులో ఎత్తయిన భవంతి మీద మిహిర్ ఉంటే అతని చేయి ఆధారంగా మీనాక్షి గాల్లో వేలాడింది. అతను వదిలేసినా ఆమె చేయి జారినా మీనాక్షి కచ్చితంగా చనిపోయి ఉండేది. ఈ రీల్ బయటకు రాగానే అందరూ మండి పడ్డారు. ఈ రీల్స్ పిచ్చికి శిక్ష పడాలని డిమాండ్ చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు.
వాటర్ ట్యాంక్ ఎక్కి...
ఇటీవల లక్నోలోని వాటర్ ట్యాంక్ ఎక్కి రీల్ చేయబోయిన శివాంశ్ అనే కుర్రాడు కాలు జారి పడి మరణించాడు. దాంతో లక్నోలో పెద్ద ఎత్తున రీల్స్ అడిక్షన్ మీద చర్చ జరిగింది. ఇలా రీల్స్ చేస్తున్న వారికి గౌరవ మర్యాదలు ఇవ్వడం మానేయాలని తల్లిదండ్రులు, సమాజం అందరూ కోరారు. ఇలాగే రాజస్థాన్‌లోని పాలిలో ఒక యువకుడు తన తల్లిదండ్రులతో కలిసి ఒక రీల్ చేయాలనుకున్నాడు.
తల్లిదండ్రులు వారించేసరికి కోపమొచ్చి వారిని చంపేశాడు. టీనేజ్ యువతీ యువకులు ఇలా మతిలేని పనులు చేస్తున్నారనుకున్నా వైవాహిక జీవితంలో ఉన్న స్త్రీలు, పురుషులు కూడా రీల్స్‌కు బలవుతున్నారు. చత్తిస్‌గఢ్‌లోని భిలాయ్‌కి చెందిన ఒక మహిళ రీల్స్ చేయడానికి అడిక్ట్ అయ్యి భర్త వారించాడని ఆత్మహత్య చేసుకుంది. కర్నాటకలో ఒక భార్య రీల్ కోసం కన్నడ గీతానికి గంతులేసిందని మనసు నొచ్చుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
బిహార్‌లో రీల్స్ వద్దన్నందుకు భర్తనే చంపేసింది మరో మహిళ. రీల్స్ కోసం యువతీ యువకులు రకరకాల డ్రస్సులు వేసుకోవడం, ప్రాంక్‌లు చేయడం, ట్రాఫిక్‌లో ప్రమాదకరమైన ఫీట్లు చేయడం చివాట్లు తినడం ఆనవాయితీగా ఉంది. సమర్థమైన మంచి కంటెంట్‌తో కొందరు గుర్తింపు పొంది లాభపడుతున్నా మరెందరో ఈ రీల్స్ అనే వధ్యశిలపై తలలు తెగిపడుతున్నారు.
గుర్తింపు కోసం పోరాటం...
గతంలో డార్విన్ మనుగడ కోసం పోరాటం అన్నాడు. ఇవాళ ప్రభుత్వ పథకాల వల్ల మనుగడకు ఢోకా లేదు. ఇక మిగిలింది గుర్తింపు. టీనేజ్‌లో ఉన్న యువతీ యువకులకు గుర్తింప బడాలన్న కోరిక విపరీతంగా ఉంటుంది. గతంలో బాగా చదివి, ర్యాంక్ తెచ్చుకుని, మంచి ఉద్యోగం తెచ్చుకుంటే గుర్తింపు వచ్చేది.
ఇప్పుడు ఒక్క రీల్‌తో గుర్తింపు వస్తోంది. ఫాలోయెర్ల వల్ల ఇదంతా ‘తమ కుటుంబం’ అనే భావన వారిలో కలుగుతుంది. ఎప్పుడూ కల్పిత ప్రపంచంలో ముక్కూ మొహం ఎరగని వారి కామెంట్ల ద్వారా వారు సంతృప్తి ΄÷ందుతుంటారు. మరిన్ని కామెంట్ల కోసం మరిన్ని రీల్స్ చేయాలి. మరిన్ని రీల్స్ కోసం మరిన్ని రిస్క్‌లు తీసుకోవాలి అనే భావన బలపడుతుంది.
253 కోట్ల మంది...
ప్రపంచ వ్యాప్తంగా రోజూ 253 కోట్ల మంది రీల్స్ చూస్తున్నారని ఒక అంచనా. 2020లో టిక్‌టాక్ బ్యాన్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ప్రవేశ పెట్టింది. 15 నుంచి 30 సెకండ్ల వీడియోలు పోస్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. దాంతో ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ల పేరుతో కంటెంట్ క్రియేటర్ల పేరుతో గుర్తింపు కోసం అందరూ రంగంలో దిగారు.
మన దేశంలో 8 కోట్ల మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారంటే (కంటెంట్ ద్వారా ఆదాయం పొందాలని చూస్తున్నారంటే) అంతమందికి మంచి కంటెంట్ దొరికే అవకాశం లేదు. అందుకే పిచ్చి స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఒకప్పుడు సెల్ఫీ పిచ్చితో చాలామంది ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
సిసలు ప్రపంచంలో...
యువతీ యువకులు సిసలైన ప్రపంచంలో ఉండేలా చేస్తే వారిని ఈ రీల్స్ నుంచి బయటకు తేవచ్చు. ‘సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఆత్మహత్య ఆలోచనలతో ఉన్న వారు పెరుగుతున్నారు’ అని సైకియాట్రిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులతో దూరం, నిరుద్యోగం, ఈజీ మనీ కోసం వెంపర్లాట, క్షణిక గుర్తింపుతో వస్తున్న మానసికానందం, విలువల శూన్యత ఇవన్నీ యువతను రీల్స్ వైపు నెడుతున్నాయి. స్నేహితులతో ఆటలు, మాటలు కూడా లేనంతగా (అవతలివారు కూడా ఫోన్లతో బిజీగా ఉండటం వల్ల) ఒంటరితనానికి విరుగుడును సోషల్ మీడియాలో వెతుక్కుంటూ మరింత ఒంటరి ఔతున్నారు. తల్లిదండ్రులు.
ఏం చేయాలి?
→ కుటుంబం కూచుని సోషల్ మీడియా అడిక్షన్ గురించి మాట్లాడుకోవాలి.
→ మనం చేసే రీల్స్ వల్ల కుటుంబానికి మంచిదా చెడ్డదా చర్చించుకోవాలి.
→ ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో నిజాయితీగా చెప్పే మిత్రుల సలహా అడగాలి.
→ పిల్లలు చేసే ప్రతి పనికీ అంగీకారం ఉండదని తల్లిదండ్రులు వారిని ఒప్పించేలా చె΄్పాలి.
→ సైకియాట్రీ సాయం పొందాలి.
→ విలువలతో కూడిన గుర్తింపు, గౌరవం మాత్రమే శాశ్వతమని తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment