యువత, టీనేజర్లలో వ్యసనంగా మారిన సోషల్ మీడియా
దేశంలో 400 మిలియన్ల మంది సోషల్ మీడియాలో యాక్టివ్
27% మందిలో సోషల్ మీడియా డిపెండెన్సీ లక్షణాలు
శత్రువులు పెరుగుతున్నారని 65% మంది అంగీకారం
డిజిటల్ లిటరసీ లేక 52% మంది సైబర్ మోసాలకు బలి
2025 నాటికి దేశంలో 72% మంది సోషల్ మీడియా వినియోగదారులు
ఐఏఎంఏఐ, నిమ్‌హాన్స్, ఐసీఎస్‌ఎస్‌ఆర్ అధ్యయనాల్లో వెల్లడి
సాక్షి, అమరావతి: ఐటీ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్ అందరితో ఇట్టే కలిసిపోతాడు. స్నేహితులు ఎక్కువ. అతను ఎక్కడుంటే అక్కడ సందడే. ఆఫీసులో బాస్ నుంచి గేటు వద్ద గార్డు వరకు ప్రవీణ్‌ను ఇష్టపడని వారు ఉండరు. ఏడాది కాలంగా అతను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారాడు.
సామాజిక, రాజకీయ అంశాలపై అతను పెడుతున్న పోస్టులకు మెచ్చుకొనే వారికంటే విమర్శించే వారే ఎక్కువయ్యారు. తనని తక్కువ చేసి కామెంట్ చేసే వారిలో రోజూ తనతో తిరిగే స్నేహితులు, కొలీగ్స్ సైతం ఉండడం చూసి విస్తుపోయాడు. ప్రస్తుతం దేశంలో 65 శాతం యువత పరిస్థితి ఇదే అని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) తాజా అధ్యయనంలో తేలింది.
రెండు వైపులా పదునున్న సోషల్ మీడియా ఇప్పుడు భారతీయ యువత మెడకు చుట్టుకుంటోంది. ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటివి కోట్లాది విద్యార్థుల రోజువారీ జీవితంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం దేశంలో దాదాపు 400 మిలియన్ల యువత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు సర్వేలో తేలింది. టీనేజర్లు ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్స్‌లో 3 గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
దేశంలో 2025 చివరికి 72% మంది సోషల్ మీడియా వినియోగదారులుగా ఉంటారని అంచనా. ప్రపంచంలోని చాలా దేశాల్లో యువత కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగపడుతున్న ఈ ఫ్లాట్‌ఫారాలు.. భారత్‌లో మాత్రం మానసిక ఆరోగ్యం, విద్యలో వెనుకబాటు, భావోద్వేగాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తూ శత్రువులను పెంచుతున్నట్టు గుర్తించారు.
బహిరంగ చర్చ మేలు చేస్తుంది
పరిస్థితి ఇలాగే కొనసాగితే నేర్చుకునే సామర్థ్యం, శ్రమించే బలం ఉన్న భారతీయ యువత నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల మధ్య బహిరంగ చర్చలు జరగాలని, ఇది సోషల్ మీడియా ప్రతికూల ప్రభావాలను నివారిస్తుందని చెబుతున్నారు.
మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానం అమలు చేయడం ద్వారా సోషల్ మీడియా సపోర్ట్ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్న విద్యార్థుల్లో 25 శాతం మంది ఆ వ్యసనం నుంచి బయటపడినట్టు గుర్తించారు.
52%మంది సైబర్ మోసాలకు బలి
విద్యార్థులందరికీ విద్యలో డిజిటల్ అక్షరాస్యతను తప్పనిసరి చేయడం చాలా అవసరమని, చాలామంది భారతీయ విద్యార్థులకు ఆన్‌లైన్ స్పేస్‌ను సురక్షితంగా నావిగేట్ చేసే నైపుణ్యాలు లేవని అధ్యయనంలో తేల్చారు. దీంతో తప్పుడు సమాచారం, సైబర్ బెదిరింపు, మోసాలకు గురవుతున్నారని గుర్తించారు.
సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ నివేదిక ప్రకారం కేవలం 25 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్‌లైన్ గోప్యత సెట్టింగ్‌లను అర్థం చేసుకుంటారని వెల్లడైంది. చాలామంది వ్యక్తిగత సమాచారాన్ని ఎలాంటి గోప్యతా లేకుండా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని, ఇలాంటి వారిలో 52 శాతం మంది సులభంగా సైబర్ మోసాల బారిన పడుతున్నారని ఐసీఎస్‌ఎస్‌ఆర్ సర్వేలో తేలింది.
2023లో ఒక అధ్యయనం ప్రకారం డిజిటల్ లిటరసీపై శిక్షణ పొందిన విద్యార్థుల్లో 78 శాతం మంది సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్టు గుర్తించారు. పాఠ్యాంశాల్లో డిజిటల్ మీడియా, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన పెంచే అంశాలను చేర్చడం ద్వారా సమస్యను నివారించవచ్చని చెబుతున్నారు.
వ్యసనంలా సోషల్ మీడియా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్‌హాన్స్) ఇటీవలి నివేదిక ప్రకారం..
» దేశంలోని 27 శాతం టీనేజర్లలో సోషల్ మీడియా డిపెండెన్సీ లక్షణాలను గుర్తించారు.
» ఇది ఏకాగ్రత లోపానికి, చెడు వ్యసనాలకు, చదువులో వెనుకబాటుతో పాటు మానసిక అనారోగ్య పరిస్థితులకు దారితీస్తోంది.
» ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం, 30 నిమిషాలకోసారి పోస్టులు, నోటిఫికేషన్లను తనిఖీ చేయడం పరిపాటిగా మారింది. వాటికి అప్‌డేట్స్‌ను పోస్ట్ చేయడం, స్క్రోలింగ్ ఫీడ్స్ చూడడంలో బిజీ అయిపోయి పరిసరాలను సైతం మరిచిపోతున్నారని గుర్తించారు.
» తమ పోస్టులకు తెలిసిన వారు రిప్లై ఇవ్వకపోయినా కోపం తెచ్చుకుంటున్నారు. ఇది శత్రుత్వానికి దారితీస్తోంది.
»అతిగా స్క్రీన్‌కు అతుక్కుపోవడంతో నిద్ర లేమి రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని 40 శాతం కంటే ఎక్కువ మంది విద్యార్థులు సోషల్ మీడియాను లేట్ నైట్ వరకు ఉపయోగించడంతో తమకు మంచి నిద్ర, సరైన విశ్రాంతి లభించడంలేదని చెప్పారు.
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) సర్వే ప్రకారం భారతీయ యువకుల్లో 65 శాతం మంది స్నేహితులకు వ్యతిరేకంగా మారినట్టు అంగీకరించారు. ఫోన్ చూడవద్దన్నందుకు 10 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రులను శత్రువులుగా భావిస్తున్నారని గుర్తించారు. పిల్లల స్క్రీన్ టైమ్‌పై కఠినమైన పరిమితులు ఉంటే సోషల్ మీడియాపై ఆధారపడటం 30 శాతం తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment