డాక్టరు గారూ! నా కూతురు వయస్సు 16 సంవత్సరాలు. తను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అక్కడ ఎక్కువగా అబ్బాయిలతో చాట్ చేయడం, తన ఫోటోలు పెట్టడం చేస్తోంది. మేము ఆంక్షలు పెట్టినప్పుడు విపరీతమైన కోపాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం, మందలిస్తేనేమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సాధారణం అయ్యాయి. ఈ మధ్య చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. మీ సలహా కోసం ఎదురు చూస్తుంటాం.
–స్రవంతి, మహబూబ్‌నగర్
మీరు పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలను తరచూ గమనిస్తున్నాం. మీ అమ్మాయికి ఉన్న కండిషన్‌ని ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఇందులోని ప్రధానమైన లక్షణాలు అస్థిరమైన సంబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు ఆత్మహత్య బెదిరింపులు, ఆత్మహత్యా ప్రయత్నాలు.
వీటికి తోడు మీరు చెప్పినట్టు స్నేహితులను మార్చడం, సంబంధాల స్వభావం కూడా ఈ సమస్యకి సంబంధించినవే! మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్టుకి చూపించి ఈ సమస్య కోసం వైద్య చికిత్స (మందులు) మానసిక చికిత్స (థెరపీ) ఇప్పించాలి. ‘డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ’ ఆత్మ నియంత్రణను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది.
సోషల్ మీడియా వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు పెట్టడం మంచి ఆలోచన. నిర్ణీతగంటల్లో మాత్రమే ఉపయోగించడం, ఖచ్చిత సమయానికి పరిమితం చేయడం వంటివి, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు స్వచ్ఛందంగా సహాయం చేయడం తన పరిస్థితిని మెరుగు పరుస్తాయి.
ఆమెతో మాట్లాడేటపుడు తన భావనలను గౌరవిస్తూనే, తనకు సరైన గైడెన్స్ ఇవ్వండి. తన పరిస్థితి మెరుగుపడడానికి సమయం, సహనం అవసరం. అన్నింటికీ మించి మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఎంతో అవసరం. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఆశాజనకంగా ఉండండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్.
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com
(చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!)
Comments
Please login to add a commentAdd a comment