Psychiatric experts
-
పొద్దస్తమానం సోషల్ మీడియాలోనే!
డాక్టరు గారూ! నా కూతురు వయస్సు 16 సంవత్సరాలు. తను ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతోంది. అక్కడ ఎక్కువగా అబ్బాయిలతో చాట్ చేయడం, తన ఫోటోలు పెట్టడం చేస్తోంది. మేము ఆంక్షలు పెట్టినప్పుడు విపరీతమైన కోపాన్ని, భావోద్వేగాలను ప్రదర్శించడం, మందలిస్తేనేమో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం సాధారణం అయ్యాయి. ఈ మధ్య చదువు మీద శ్రద్ధ పూర్తిగా తగ్గిపోయింది. మీ సలహా కోసం ఎదురు చూస్తుంటాం. –స్రవంతి, మహబూబ్నగర్మీరు పడుతున్న వేదన అర్థమవుతోంది. ఈ మధ్య ఇలాంటి సమస్యలను తరచూ గమనిస్తున్నాం. మీ అమ్మాయికి ఉన్న కండిషన్ని ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ అంటారు. ఇందులోని ప్రధానమైన లక్షణాలు అస్థిరమైన సంబంధాలు, విపరీతమైన భావోద్వేగాలు ఆత్మహత్య బెదిరింపులు, ఆత్మహత్యా ప్రయత్నాలు. వీటికి తోడు మీరు చెప్పినట్టు స్నేహితులను మార్చడం, సంబంధాల స్వభావం కూడా ఈ సమస్యకి సంబంధించినవే! మీ అమ్మాయిని ఒక మంచి సైకియాట్రిస్టుకి చూపించి ఈ సమస్య కోసం వైద్య చికిత్స (మందులు) మానసిక చికిత్స (థెరపీ) ఇప్పించాలి. ‘డయలెక్టికల్ బిహేవియర్ థెరపీ’ ఆత్మ నియంత్రణను, మానవ సంబంధాలను మెరుగుపరుస్తుంది. సోషల్ మీడియా వినియోగంపై నిర్దిష్ట నిబంధనలు పెట్టడం మంచి ఆలోచన. నిర్ణీతగంటల్లో మాత్రమే ఉపయోగించడం, ఖచ్చిత సమయానికి పరిమితం చేయడం వంటివి, స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవలకు స్వచ్ఛందంగా సహాయం చేయడం తన పరిస్థితిని మెరుగు పరుస్తాయి.ఆమెతో మాట్లాడేటపుడు తన భావనలను గౌరవిస్తూనే, తనకు సరైన గైడెన్స్ ఇవ్వండి. తన పరిస్థితి మెరుగుపడడానికి సమయం, సహనం అవసరం. అన్నింటికీ మించి మీ కుటుంబ సభ్యుల ప్రేమ ఎంతో అవసరం. మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. ఆశాజనకంగా ఉండండి. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆల్ ది బెస్ట్. డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com(చదవండి: లైఫ్ అంటే... పెళ్లి మాత్రమేనా?!) -
ఒక్క క్షణం ఆలోచించండి
నిండు జీవితాన్ని చేతులారా చిదిమేసుకుని కన్నవారికి, నమ్ముకున్న వారికి తీరని వేదన, ఖేదం మిగిలుస్తున్న బలవన్మరణాలు ఆందోళన కలిగించే రీతిలో నానాటికీ పెరిగిపోతున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తే పండంటి బతుకును పదిలంగా కాపాడుకోవచ్చునని మానసికవైద్య నిపుణులు అంటున్నారు. పాలకొండ: జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపాటి సమస్యలకే క్షణికావేశంతో తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. గత ఏడాదిలో జిల్లావ్యాప్తంగా 147 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఆరు నెలల్లోనే వంద వరకూ కేసులు నమోదయిన విషయం కలవరం కలిగిస్తోంది. ఇవి కేవలం అధికారికంగా బయటకు వచ్చినవి మాత్రమే. ఈ లెక్క రెట్టింపు ఉంటుందని అంచనా. కొత్తూరు మండలంలోని దిమిలి గ్రామంలో భర్తతో జరిగిన చిన్నపాటి గొడవకు ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తను నిప్పుపెట్టుకుని చనిపోయింది ఓ గృహిణి. ఇదే మండలంలో వారం క్రితం ఒక మహిళ తన కుమార్తెతో సహా చెట్టుకు ఉరివేసుకుని చనిపోయింది. ఈ రెండు ఘటనల్లోనూ తల్లిదండ్రుల మధ్య మనస్పర్థలకు ఏ పాపం తెలియని చిన్నారులు బలికావడం స్థానికులను కలచి వేసింది. ఇటీవల పాలకొండలో ఓ యువతి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇంట్లో చిన్నపాటి మందలింపునకు ఆత్మహత్య చేసుకుంది. ఇలా చిన్నచిన్న కారణాలతో జీవితాన్ని మధ్యలో చాలించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వీధిన పడుతున్న కుటుంబాలు ఆత్మహత్యల చేసుకున్నవారి కుటుంబాలు అర్ధంతరంగా వీధిన పడుతున్నాయి. ఎన్నో ఆశలతో పిల్లలను పెంచిన తల్లిదండ్రులు కొన్ని సంఘటనల్లో బాధితులుగా మిగిలితే..కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు తనువు చాలిస్తే పిల్లలు అనాథలుగా మారుతున్నారు. మరికొన్ని ఘటనల్లో కుటుంబాలే ఛిద్రమవుతున్నాయి. స్నేహపూర్వవాతావరణం అవసరం ఆత్మహత్య చేసుకోవడం క్షణికావేశంలో జరిగే చర్య. విపరీతమైన భావోద్వేగాలకు లోనైప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలుగుతుంది. ప్రధానంగా ఈ సమస్య యుక్తవయసులో హర్మోన్లు సామతౌల్యం కోల్పోయినప్పుడు ఆత్మహత్యకు ప్రేరేపణ కలుగుతుంది. కేవలం ఇది క్షణం పాటు మాత్రమే ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక నుంచి బయటకు వస్తారు. ప్రధానంగా విద్యార్థుల్లో అయితే గెలుపు ఓటములు తెలుసుకొనేలా వారిని తీర్చిదిద్దాలి. విద్యారంగంలోనూ మహోన్నత వ్యక్తుల జీవిత కథలు పాఠ్యాంశాలుగా తీసుకురావాలి. కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తమ భావాలను పంచుకుంటూ ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరణంతోనే ఆత్మహత్యల ప్రేరేపణ తగ్గుతుంది. ఒంటరితనంతో నిరంతరం కనిపించే వారిని (డిప్రెషన్లో ఉన్నవారిని) కుటుంబ సభ్యులు గమనించి సమస్యను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. -మాకెన సతీష్, మానసిక నిపుణులు, విశాఖపట్నం అదో మానసిక వ్యాధి ఆత్మహత్యల చేసుకోవాలని బలమైన కోరిక కొంతమందిలో ఉంటుంది. ఇది మానసిక వ్యాధి. ప్రతిచిన్న విషయాన్నీ వీరు అభద్రతా భావంతో చూస్తారు. వీరిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలాంటి వారికి తగిన సమయంలో కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక నుంచి బయటకు వచ్చేందుకు ప్రస్తుతం మందులు ఉన్నాయి. అయితే వినియోగించడంలో అత్యంత జాగ్రత్తలు పాటించాలి. ఇటీవల కాలంలో ఇలాంటి కేసులే ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. -జె.రవీంద్రకుమార్, వైద్యనిపుణులు, పాలకొండ సహాయం తీసుకోవాలి కుటుంబాల్లో కలహాలు సహజంగా ఉంటాయి. అయితే వీటిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం నేరం. తమతోపాటు పిల్లలను బలి చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. సమస్య ఉంటే అందుబాటులో ఉన్న పెద్దల వద్ద కాని, సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ను సంప్రదిస్తే కేసులు లేకుండా కౌన్సెలింగ్ ఇస్తారు. ఇటీవల చిన్నపాటి మనస్పర్థలతో పిల్లలను చంపేసిన సంఘటనలు తీవ్రం కలచివేశాయి. ఈ సమస్య ఏ ఒక్కరికీ తెలియజేసినా పరిష్కార మార్గాలు దొరికేవి. -సీహెచ్ ఆదినారాయణ, డీఎస్పీ, పాలకొండ అన్యోన్యత పెరగాలి.. ప్రస్తుతం సమాజంలో ఉమ్మడి కుటుంబ సభ్యులు సంఖ్య తగ్గింది. బరువు బాధ్యతలతో తీవ్ర ఒత్తిడితో జీవనం సాగిస్తున్న వారి సంఖ్యా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇంట్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు మధ్య అన్యోన్యత ఉండేలా వ్యవహరించాలి. ప్రతి సమస్యకు ఆత్మహత్య మార్గం కాదు. సమస్యలతో పోరాటం చేయడం నేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగాలాంటి దైవచింతన కార్యక్రమాల వైపు దృష్టి సారించాలి కె.సాల్మన్రాజ్, ఆర్డీవో, పాలకొండ అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. అదొక్కటీ ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నిటిని తిరిగి దక్కించుకోవచ్చు. సమస్య వెనుక సమాధానం దు:ఖం వెనుక సుఖం ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ ఉంటుంది.