వెలుగు నీడల దారుల్లో.... | Social Media Addiction | Sakshi
Sakshi News home page

వెలుగు నీడల దారుల్లో....

Published Wed, Jun 12 2024 8:07 AM | Last Updated on Wed, Jun 12 2024 9:43 AM

Social Media Addiction

సోషల్‌ మీడియాతో యువతరాన్ని విడదీసి చూడలేని కాలం ఇది. ‘డిజిటల్‌ నెటిజన్స్‌’గా పేరున్న యువతరానికి సోషల్‌ మీడియాకు సంబంధించి ఎలాంటి ఆసక్తులు ఉన్నాయి? కంటెంట్‌ క్రియేషన్‌ను ఇష్టపడుతున్నారా? ‘వ్యూయర్‌’గా ఉండడానికి ఇష్టపడుతున్నారా? బలం తెచ్చుకుంటున్నారా? బలహీనపడుతున్నారా?

సోషల్‌ మీడియా అనేది యువత దైనందిన జీవితంలో విడదీయరాని భాగం అయింది. ‘మా పిల్లలు సోషల్‌ మీడియాకు ఎడిక్ట్‌ అవుతున్నారు’ అంటున్న తల్లిదండ్రుల సంఖ్య తక్కువేమీ లేదు.‘సోషల్‌ మీడియాలో ఎంత టైమ్‌ గడుపుతున్నారు?’ అనేది ఒక కోణం అయితే అసలు అక్కడ ఏం చేస్తున్నారు? అనేది మరో కోణం. ఈ అంశంపై కొన్ని డిజిటల్‌ మార్కెటింగ్‌ పాట్‌ఫామ్స్‌ సర్వే నిర్వహించాయి.తమ సొంత కంటెంట్‌ను పోస్ట్‌ చేయడం కంటే యువతలో ఎక్కువమంది ఇతరుల పోస్టులను చదవడం, కామెంట్‌ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. 21 శాతం మాత్రమే కంటెంట్‌ క్రియేటర్‌లుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. 79 శాతం మంది ‘వ్యూయర్స్‌’గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కంటెంట్‌ను పోస్టు చేస్తున్న వారిలో రోజూ పోస్ట్‌ చేస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉంటోంది.

పర్సనల్‌ గ్రోత్, కెరీర్‌ ఎంపిక... మొదలైన వాటి విషయంలో సోషల్‌ మీడియాలోని కంటెంట్‌ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు కొందరు. రకరకాల డొమైన్స్‌లో కొత్తగా వస్తున్న ట్రెండ్స్‌ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్‌ మీడియాకు సంబంధించి మిగిలిన దేశాలతో పోల్చితే మన దేశంలో యువ ‘స్పోర్ట్స్‌ సూపర్‌ ఫ్యాన్స్‌’ ఎక్కువ. ఈ సూపర్‌ ఫ్యాన్స్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావడం లేదు. ప్రపంచంలోని ఎన్నో ఆటల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.‘సోషల్‌ మీడియాను యూత్‌ ఎలా ఉపయోగించుకుంటుంది?’ అనేదాన్ని పక్కన పెడితే... సోషల్‌ మీడియా ఎడిక్షన్‌ విషయంలో ‘ఎవరో చెప్పేవరకు ఎందుకు... మన గురించి మనం తెలుసుకుందాం’ అనే ధోరణి యువతలో పెరుగుతుండడం శుభసూచకం.
‘సోషల్‌ మీడియాలో ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత అప్‌డేట్‌ అవుతాం’ అనే భ్రమకు దూరంగా జరుగుతున్నారు.

‘ప్రతి అంశానికి మంచి, చెడులు ఉంటాయి. మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేదానిపైనే మంచి, చెడు ఆధారపడి ఉంటాయి’ అంటుంది ఎంబీఏ స్టూడెంట్‌ తాన్వీ అగర్వాల్‌.ముంబైకి చెందిన తాన్వీ ఒకప్పుడు సోషల్‌ మీడియానే ప్రపంచంగా ఉండేది. తాను సోషల్‌ మీడియాకు ఎడిక్ట్‌ అవుతున్న విషయం గ్రహించాక ‘ఒకరోజులో ఇంత సమయం మాత్రమే’ అని టైమ్‌ సెట్‌ చేసుకుంది.‘సోషల్‌ మీడియాకు ఎడిక్ట్‌ కావడం వల్ల నా చదువు దెబ్బతింది. చదివే సమయంలో సోషల్‌ మీడియాలో చదివిన పోస్టులు, చూసిన వీడియోలు గుర్తుకు వస్తుంటాయి. ఆలోచనలు అటువైపు మళ్లుతుంటాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది’ అంటుంది తాన్వీ అగర్వాల్‌.సోషల్‌ మీడియాను ఎంతసేపు, ఎలా వాడుకోవాలి అనేది ఒక కోణం అయితే ‘నైతికత’ అనేది మరో కోణం.లక్నోకు చెందిన వైశాలి ఒకప్పుడు మీమ్స్‌ను తెగ ఎంజాయ్‌ చేసేది. అయితే ‘బ్యాడ్‌ టేస్ట్‌ ఇన్‌ మీమ్స్‌’ అనే పోస్ట్‌ చదివిన తరువాత ఆమెలో మార్పు వచ్చింది.

ఇప్పుడు ఆమె రిలేటబుల్‌ కంటెంట్, గుడ్‌ మీమ్స్‌ను మాత్రమే ఇష్టపడుతుంది.‘మీమ్స్‌ ద్వారా క్రూరత్వాన్ని ప్రదర్శించవద్దు. మీమ్స్‌ అనేవి హాయిగా నవ్వుకునేలా ఉండాలి’ అంటుంది వైశాలి.బ్రాండ్ల ఎంపికకు సంబంధించి సోషల్‌ మీడియాపై ఎక్కువ ఆధారపడుతుంది యువతరం. కాస్తో కూస్తో వచ్చిన మార్పు ఏమిటంటే ఇప్పుడు బ్రాండ్‌ల నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నారు. ఫలానా బ్రాండ్‌ పర్యావరణం హితం అంటే ఆ బ్రాండ్‌ వైపు మొగ్గుచూపుతున్నారు.స్థూలంగా చేప్పాలంటే... ‘సోషల్‌ మీడియాతో బలం తెచ్చుకుంటున్నామా? బలహీనపడుతున్నామా?’ అనేది పూర్తిగా మన అవగాహన, ఆలోచన ధోరణి మీదే ఆధారపడుతుంది. ఉదాహరణకు... ఫోర్బ్స్‌ హెల్త్‌ అండ్‌ వన్‌పోల్‌ సర్వే ప్రకారం సోషల్‌ మీడియాలో 53 శాతం మంది తమ నవ్వును ఇతరులతో ΄ోల్చి చూసుకుంటున్నారు.

‘అయ్యో! అలా అందంగా నవ్వలేక పోతున్నానే’ అని అవతలి వ్యక్తితో పోల్చుకొని బాధ పడుతున్న వారే ఎక్కువ.పలువరుస అందంగా కనిపించడానికి సోషల్‌ మీడియాలోని తమ ఫొటోలను ఎడిట్‌ చేస్తున్నవారు, పలువరుస బాగోలేదని ఫొటోను హైడ్‌ చేస్తున్నవారూ ఉన్నారు. ‘నవ్వు విషయంలో నా ఆత్మవిశ్వాసాన్ని సోషల్‌ మీడియా దెబ్బతిస్తోంది’ అంటున్నారు 45 శాతం మంది.సోషల్‌ మీడియా అనే ప్రపంచంలో ...చిన్న నవ్వు విషయంలోనూ ఆత్మవిశ్వాసం లోపించిన వారు ఉన్నారు. ప్రయోజనకర కంటెంట్‌తో తిరుగులేని ఆత్మవిశ్వాసంతో తమను తాము నిరూపించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు ఉన్నారు. ఏ దారిలో వెళుతున్నామనేది పూర్తిగా మన ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. మార్పు గురించి చెప్పుకోవాల్సి వస్తే... ‘నేను ఏ దారిలో వెళుతున్నాను. ఇది సరిౖయెనదేనా?’ అనే స్వీయ విశ్లేషణ ధోరణి యువతరంలో పెరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement