![Youth are wasting their time in social media and internet and smartphone](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/1.jpg.webp?itok=Svn6Wq7t)
యువత మానసికంగా దృఢంగా ఉంటేనే ఆర్థిక వ్యవస్థ పురోగమనం సాధ్యం
దురదృష్టవశాత్తు విష ‘వల’యంలో చిక్కుకున్న భారత యువశక్తి
ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా కబుర్లతో కాలం వెళ్లదీత
అన్ని స్థాయిల్లో సరిదిద్దాల్సిన సమయమిదే..
2024–25 ఆర్థిక సర్వే విశ్లేషణ..
‘‘మిమ్మల్ని శారీరకంగా, మేధోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపరిచే ఏ విషయమైనా విషపూరితంగా భావించి తిరస్కరించండి’’. – స్వామి వివేకానంద
నూరు శాతం ఆచరించి, అనుసరించి తీరాల్సిన వ్యాఖ్యలివి. మనల్ని క్రిందికి లాగి, ప్రతికూలతను వ్యాప్తి చేసే ఈ విషయంపైనైనా లోతైన ఆత్మపరిశీలన అవసరం. ఇక్కడ, ఇప్పుడు వివేకానందుని పిలుపును యువత తమ మానసిక ఆరోగ్యానికి కూడా వర్తింపజేయాల్సిన సమయమిది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంశం అయినందునే 2024–25 ఆర్థిక సర్వేలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్
యువ భారత్ దారి ఎటు..?
భారత్ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్ పురోగతి గురించి చర్చించేటప్పుడు దేశంలో అధికంగా ఉన్న యువశక్తి గురించి ప్రస్తావనకు వస్తుంది. అయితే ఈ యువత మెజారిటీ ఎటువైపు అడుగులు వేస్తోందన్నది ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. సోషల్ మీడియాలో ఖాళీ సమయాన్ని గడపడం లేదా అరుదుగా వ్యాయామం చేయడం లేదా కుటుంబాలతో తగినంత సమయం గడపకపోవడం, గంటల కొద్దీ కూర్చున్నచోటు నుంచి లేవకుండా కంప్యూటర్ల ముందు పనిచేయడం యువత మానసిక ఆరోగ్యాన్ని దిగజార్చుతోంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న మన పెద్దల అనుభవ సారానికి తూట్లు పొడుస్తోంది. మన మూలాలవైపు ఇప్పుడు యువత తిరిగి చూడాల్సిన అవసరం ఉంది. ఇది యువతను అత్యున్నత స్థానానికి చేర్చడానికి వీలుకల్పిస్తుంది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి యువత మానసిక ఆరోగ్యం కీలకమైనదంటూ తాజా ఆర్థిక సర్వే విశ్లేషణను నిజం చేస్తుంది.
జంక్ ఫుడ్.. ‘పాయిజన్’
అల్ట్రా–ప్రాసెస్డ్ లేదా ప్యాక్డ్ జంక్ ఫుడ్‌ను చాలా అరుదుగా తినే వ్యక్తులు రెగ్యులర్‌గా తీసుకునే వారి కంటే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. సంపాదించిన డబ్బు.. వైద్యానికి సరిపోని పరిస్థితికి ఆహారపు అలవాట్లు కారణంగా మారుతుండడం గమనార్హం. మన సమాజంలో సంపాదన పెరుగుతున్నా, ఆరోగ్య సమస్యలతో చికిత్స ఖర్చులు పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా, ఆహారపు అలవాట్లు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నిత్యం ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్న ఆహార పదార్థాల వినియోగం పెరుగుతోంది.
ఇవి ఊబకాయాన్ని, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఆరోగ్య సమస్యలు పెరగడంతో వైద్య ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. ఫలితంగా, సంపాదించిన డబ్బు చాలాచోట్ల వైద్య ఖర్చులకే వెళ్లిపోతోంది. దీని వల్ల కుటుంబ ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటోంది. సమతులమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం తప్పనిసరి. సంపాదనను వైద్య ఖర్చులకు కాకుండా, మంచి జీవన విధానానికి ఉపయోగించుకోవడం మంచిది. మానసిక ఆరోగ్య
పరిరక్షణలో ఇది కీలక అంశం.
కింకర్తవ్యం..
పిల్లలను, యుక్తవయసు్కలను ఇంటర్నెట్‌కు దూరంగా ఉంచడం, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాల్సిన తక్షణ తరుణమిది. స్నేహితులతో కలవడం, బయట ఆడుకోవడం, సన్నిహిత కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో సమయాన్ని వెచి్చంచడం వంటి ఆరోగ్యకరమైన కాలక్షేపాలను ప్రోత్సహించడానికి పాఠశాల, కుటుంబ–స్థాయి జోక్యాల తక్షణ అవసరం ఉంది. మానవ సంక్షేమం, మానసిక ఆరోగ్యం ఆర్థిక ఎజెండాలో కేంద్రంగా ఉండాలి. యువ జనాభా అధికంగా ఉండడం వల్ల ఎకానమీకి ఒనగూడే ప్రయోజనాలు ఊరికే ఊడిపడవు. విద్య, శారీరక ఆరోగ్యం, ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యం ఇక్కడ చాలా కీలకం. ఇందుకు ఆచరణీయమైన, ప్రభావవంతమైన వ్యూహాలు, చొరవలపై దృష్టి పెట్టాల్సిన తక్షణ అవసరం ఉంది.
వినియోగం వివేకంతో ఉండాలి...
రెండు దశాబ్ధాల క్రితం సెల్‌ఫోన్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగం చాలా తక్కువ. ఇప్పుడు పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం అన్ని స్థాయిల్లో ఎంతో ప్రయోజనాలను అందిస్తుంది. అయితే సాంకేతికత అతి, విచక్షణా రహిత వినియోగం అనర్థాలకు దారి తీస్తోంది. ఇప్పుడు పసితనం నుంచే పిల్లలకు సెల్‌ఫోన్‌లు, సోషల్ మీడియాను తల్లిదండ్రులు అలవాటు చేస్తున్నారు. పిల్లలు పెద్ద అయ్యే కొద్దీ అలవాటు వ్యసనంగా మారుతోంది. పెద్దలు సైతం సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు.
ఈ వ్యసనం.. చేసే పని మీద ఏకాగ్రతను దెబ్బతీస్తోంది. పిల్లల చదువుల్లో, పెద్దలు చేసే పనుల్లో నాణ్యత, ఉత్పాదకత తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ కంటెంట్ ప్రతికూల ప్రభావం చూసి చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. బలహీన మనస్కులు మరింత బలహీనంగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియా అతిగా వినియోగించడాన్ని ‘బిహేవియరల్ అడిక్షన్’ అనే మానసిక రుగ్మతగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది.
దీనికి చికిత్స అవసరం అని సైతం సూచించింది. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచే పిల్లల ప్రవర్తనను నియంత్రిస్తుండాలి. పిల్లల్లో మానసిక పరిపక్వత వచ్చే వరకూ సెల్‌ఫోన్‌లు ఇవ్వద్దు. 18 ఏళ్ల లోపు పిల్లలకు సెల్‌ఫోన్ ఇవ్వాల్సి వస్తే స్కీన్ర్ సమయంపై నియంత్రణ ఉంచాలి. – డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, జాతీయ మానసిక వైద్యుల సంఘం పూర్వ అధ్యక్షులు
ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం
పిల్లలు, యుక్తవయసు్కలలో మానసిక ఆరోగ్య సమస్యల పెరుగుదల తరచుగా ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా మితిమీరిన వినియోగంతో ముడిపడి ఉందన్నది కాదనలేని విషయం. స్మార్ట్‌ఫోన్‌ల వ్యాప్తి, సోషల్ మీడియా, ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు భావి భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతాయనడంలో సందేహం లేదు. బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో ‘‘అంతా నువ్వే చేశావు’’ అన్న డైలాగ్‌ను ఇక్కడ మనం గుర్తుచేసుకోవాల్సిందే.
‘ది యాంగ్జియస్ జనరేషన్: హౌ ది గ్రేట్ రివైరింగ్ ఆఫ్ చి్రల్డన్ ఎపిడెమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్’ శీర్షికన ప్రఖ్యాత సామాజిక మనస్తత్వ శాస్త్రవేత్త జోనాథన్ హైద్ట్ రాసిన పుస్తకాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేయడం గమనార్హం. ‘‘ఫోన్ ఆధారిత బాల్యం’’ పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది. ఇక చిన్న పిల్లలు ఏడుస్తుంటే చాలు.. వారికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగిస్తున్నాం. ఇది వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలి మెట్టు.
సమాజ పురోగతికి పునాది
జీవితంలోని సవాళ్లను అధిగమించగలిగిన సామర్థ్యాన్ని మానసిక ఆరోగ్యం అందిస్తుంది. ప్రతి రంగంలో ఉత్పాదకత పురోగతికి దోహదపడే అంశం ఇది. ఇంతేకాదు, మానసిక–భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం, విజ్ఞాన సముపార్జన, సమాజ పురోగతికి వినియోగం, శారీరక సామర్థ్యాల సాధన... వంటి ఎన్నో ప్రయోజనాలను ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు. జీవనశైలి ఎంపిక, అరమరికలు లేని స్నేహపూర్వక కార్యాలయ పని సంస్కృతి, కుటుంబ పరిస్థితులు దేశ ఎకానమీ పురోభివృద్ధికి మార్గాలు. ఇంత ప్రాముఖ్యత ఉన్న అంశం కాబట్టే భారత్ ఆర్థిక ఆశయాలు నెరవేరాలంటే బాల్యం, యవ్వనం దశ నుంచే జీవనశైలి ఎంపికలపై తక్షణ శ్రద్ధ ఉంచాలని ఎకనమిక్ సర్వే గుర్తుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment