Penance
-
మూడో రోజుకు చేరిన సుఖ్బీర్ ప్రాయశ్చిత్త దీక్ష
చండీగఢ్: అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో జరిగిన హత్యాయత్నం నుంచి తృటిలో బయటపడిన పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ నేత సుఖ్బీర్సింగ్ బాదల్ ప్రాయశ్చిత్త దీక్షను వరుసగా మూడో రోజు యథాతథంగా కొనసాగించారు. ఆయన గురువారం రూప్‌నగర్ జిల్లాలోని తఖ్త్ శ్రీకేస్‌గఢ్ సాహిబ్ గురుద్వారా బయట కాపలాదారుడిగా(సేవాదార్) విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్ ప్లస్ భద్రత కలిగిన సుఖ్బీర్సింగ్ ఉదయం 9 గంటలకు చక్రాల కురీ్చలో గురుద్వారాకు చేరుకున్నారు. కాపలాదారుడి దుస్తులు ధరించి, చేతిలో ఈటెతో విధుల్లో చేరారు. తర్వాత కొంతసేపు సిక్కు కీర్తనలు విన్నారు. ఇక్కడి వంటశాలలో పాత్రలు శుభ్రంచేశారు. సుఖ్బీర్ సింగ్‌తో ఆయన భార్య, ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, కుమారుడు అనంత్బీర్ సింగ్ బాదల్, కుమార్తెలు హర్కీరత్కౌర్ బాదల్, గుర్లీన్ కౌర్ బాదల్ సైతం వంటశాలలో సేవలందించారు. 2007 నుంచి 2017 దాకా పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా సిక్కు అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ సుఖ్బీర్ సింగ్‌కు మతపరమైన శిక్ష విధించిన సంగతి తెలిసిందే. స్వర్ణ దేవాలయంలోపాటు మొత్తం ఐదు గురుద్వారాల్లో రెండు రోజుల చొప్పున పది రోజులపాటు సేవాదారుడిగా పనిచేయాలని అకల్ తఖ్త్ ఆదేశించింది. స్వర్ణ దేవాలయంలో రెండో రోజు బుధవారం ప్రాయశ్చిత్త దీక్షల ఉండగా సుఖ్బీర్ సింగ్‌పై హత్యాయత్నం జరిగింది. మాజీ ఉగ్రవాది నారాయన్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. -
భక్త విజయం.. పరశురాముడి తపస్సు..!
ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్లి, ‘తండ్రీ! నాకు పితామహ ప్రపితామహులను చూడాలని ఉంది. వెళ్లి రావడానికి అనుమతించు’ అన్నాడు.‘సరే’నన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలుత తన తాత అయిన ఋచీకుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకుని, ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలు దేరాడు. భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి పిలిచి, ‘నాయనా! లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లి, ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించు. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే, అప్పుడు శత్రువినాశకరాలైన దివ్యాస్త్రాలను కోరుకో. భవిష్యత్తులో నువ్వు ఎన్నో మహత్కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్లిరా’ అని సాగనంపాడు. ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకుని, అక్కడ ఒక సుందర సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఉంటూ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య నిలబడి, శీతకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శీతోష్ణాలను సహించి తన తపస్సును కొనసాగించాడు. పరశురాముడి తపస్సు సంగతి మునిగణాలకు తెలిసి, వారంతా ఆశ్చర్యం చెందారు. తమ తపస్సుతో పాపక్షయం చేసుకుని, పరమ తాపసులుగా ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవుడు, మృకండుడు వంటి వారంతా పరశురాముడి తపస్సును చూడటానికి అక్కడకు చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలిచింది. వరాలు ఇచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పరమశివుడు ఒక ఆటవికుడి రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండం పట్టుకుని, దానిని నములుతూ పరశురాముడి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిలుచున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ కనిపించాడు. ఆటవికుడి రూపంలో ఉన్న పరమశివుడు అతడికి ఎదురుగా వెళ్లి నిలిచాడు. ‘స్వామీ! నేను వ్యాధుడను. నా పేరు తోషప్రహర్షుడు. ఈ మహావనంలో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరూ నివసించకూడదు. ఇంతకూ తమరెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. ‘నా పేరు రాముడు. జమదగ్ని మహర్షి కొడుకును. భృగువంశీయుణ్ణి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథినవుతాను. పైగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నువ్వే ఎక్కడికైనా వెళ్లడం మంచిది.’ అని బదులిచ్చాడు పరశురాముడు. ‘ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి, నన్నే వెళ్లమంటున్నావే! ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే తింటాను. నీకు అసహ్యంగా ఉంటే వేరే ప్రదేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. లేదా అన్నీ సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు వ్యాధుడు. పరశురాముడు ఉగ్రుడయ్యాడు. ‘నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు. జంతువులను హింసించి, వాటి మాంసాన్ని తింటూ అధముడిలా ఉన్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు. నువ్వు మర్యాదగా వెళితే సరేసరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది’ అన్నాడు. వ్యాధుడు ఏమీ ఆవేశపడకుండా, ‘స్వామీ నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులను వేటాడటం నా వృత్తి. వాటి మాంసం నాకు భుక్తి. నా అవసరానికి మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది. అయినా, ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్న నువ్వు నిజంగా ధర్మాత్ముడివేనా? తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చూపే నిన్ను ఆ పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు?’ అని నిలదీశాడు. ఒక మామూలు వ్యాధుడు తన వృత్తాంతమంతటినీ చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహించాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అనుకున్నాడు. ‘మహానుభావా! నువ్వెవరివి? అనవసరంగా నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు. నువ్వు సామాన్య వ్యాధుడవు కాదు. నా అపరాధాన్ని మన్నించి, నీ నిజరూపాన్ని చూపించు’ అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చుని, ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకుని పరశురాముడు కళ్లు తెరిచాడు. ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరిపరి విధాలుగా శివస్తోత్రం చేశాడు. శివుడు సంతోషించాడు. ‘రామా! నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాలలో స్నానం ఆచరించి, తపస్సు చేస్తే తప్ప నువ్వు నా దివ్యాస్త్రాలను పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా. అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. -సాంఖ్యాయన -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. -
జ్ఞానమే ఉపనిషత్సారం
వారుణీవిద్యనే బ్రహ్మవిద్య అని కూడా అంటారు. ఇది హృదయాకాశంలో నెలకొని ఉంటుంది. ఇన్ని తపస్సులతో బ్రహ్మాన్వేషం చేసి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఆ ఆనందాన్ని పొందుతాడు. అతడికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. మంచి సంతానం, గో సంపద, బ్రహ్మవర్ఛస్సు, గొప్పకీర్తి లభిస్తాయి. ఆనందమే బ్రహ్మం అని తెలిసింది కదా అని అన్నాన్ని నిందించకూడదు. అన్నం నుంచే అన్వేషణ మొదలౌతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. నీరే అన్నం. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. అన్నం అన్నంలోనే ఉంటుందని తెలుసుకున్నవాడికి అన్నం, సంతానం, పశుసంపద, బ్రహ్మవర్ఛస్సు, కీర్తి అన్నీ వచ్చేస్తాయి. అన్నం బహుకుర్వీత. ఆహారాన్ని బాగా పండించండి. ఈ భూమి అంతా అన్నమే. ఈ అన్నాన్ని ఆహారం భుజిస్తుంది. ఆకాశం భూమిలో ఉంది. భూమి ఆకాశంలో ఉంది. అన్నం అన్నంలో ఉంది. అన్నంకోసం వచ్చినవారిని పెట్టకుండా పంపకండి. ఇది మానవులందరి వ్రతం. అందరికీ అన్నం పెట్టడానికి ఆహారాన్ని బాగా ఉత్పత్తి చేయండి. దానికోసం ఎంతైనా కష్టపడండి. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆహారం ఇవ్వగలిగి ఉండండి. ఎక్కువ ఆహారాన్ని పండించడానికి ఎక్కువగా, తక్కువగా పండించినవాడికి తక్కువగా అన్నం దొరుకుతుంది. బాగా పండించి అన్నదానం చేయండి. ఇది తెలుసుకున్నవాడికి అన్నానికి, సంపదకు లోటు ఉండదు. అతని వాక్కులో క్షేమంగా, ప్రాణాపానాల్లో యోగక్షేమాలుగా, చేతుల్లో పనిగా, కాళ్లల్లో నడకగా, విసర్జకావయవంగా పరమాత్మ ఉంటాడు. వర్షంలో తృప్తిగా, విద్యుత్తులో శక్తిగా, పశువుల్లో కీర్తిగా, నక్షత్రాల్లో వెలుగుగా, జననేంద్రియాల్లో ఉత్పత్తికి అవసరమైన ఆనందంగా, ఆకాశంలో సర్వం తానుగా పరమాత్మ ఉంటాడు. ఇది తెలుసుకున్నవాడు ఆ వెలుగును ఉపాసించి తనలోని పరమాత్మను దర్శించగలుగుతాడు. అన్నిటికీ అతీతుడు అవుతాడు. అన్నాన్ని నేనే; స్వీకర్తనూ నేనే. ఈ సత్యాన్ని తెలుసుకున్నదీ నేనే. ఈ విశ్వభువనమంతా వ్యాపించి ఉన్నదీ నేనే. కాంతిమయ జ్యోతిని నేనే అనే విజ్ఞానంతో ఆనందమయుడు అవుతాడు. ఇదే భృగువల్లిలో తైత్తిరీయోపనిషత్తు సందేశం. ఐతరేయం: వేదాలలో మొదటిదైన ఋగ్వేద ఉపనిషత్తులలో మొదటిది ఐతరేయం. ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా.. (వాక్కు నా మనసుల్లో ప్రతిష్ఠితం) అనేది శాంతిమంత్రం. ఈ ఉపనిషత్తు పరమాత్మ సృష్టిని ప్రారంభించడం ఎలా జరిగిందో వర్ణిస్తుంది. ప్రాణుల అవయవాలు, మానవ సృష్టి, ఆకలి దప్పులు, ఆహార సృష్టి, ఆహారం వెంట మానవుడు పరుగెత్తడం, అపానవాయువు ద్వారా ఆహారాన్ని పట్టుకోవడం, మానవులకు తోడుగా ఉండటానికి పరమాత్మ మానవుడి నడినెత్తిని చీల్చుకొని, కన్ను, హృదయం, కంఠస్థానాల్లో నివాసం ఏర్పరచుకోవడం, అతణ్ణి ఇంద్రుడుగా పిలవడం మొదటి అధ్యాయం. వీర్యోత్పత్తి, స్త్రీ గర్భంలో శిశువుగా మారటం, సంతానోత్పత్తి, గర్భకోశంలో జరిగే మార్పులు, నిరాకార పరమాత్మ సాకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మారిన వైనం అంతా రెండో అధ్యాయంలో చెప్పిన ఐతరేయ ఉపనిషత్తు సుప్రసిద్ధం. ఛాందోగ్యోపనిషత్తు: ఎనిమిది ప్రపాఠకాలతో నూట ఏభై ఆరు ఖండాలుగా ఉన్న ఈ ఉపనిషత్తు ‘ఓంకారం, ఉద్గీథోపాసన, దానివిధానం, దానితో ముక్తిని వివరిస్తుంది. మానవదేహంలోని అవయవాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఓంకారమయమే. ప్రాణులన్నీ తమకు తెలియకుండానే ప్రాణాయామం, ఉద్గీథోపాసన చేస్తున్నాయి. పంచవిధ సామగానం, సప్తవిధ సామగానం, అగ్నిలో ఉద్భవించే రధంతర సామ, హింకార ఉద్గీథ సమ్మేళనం. వైరూప, వైరాజ, శక్వరీ, వేవంతీ, యజ్ఞయజ్ఞీయ, రాజస సామగానాలు, పశుసంపదకోసం, యజ్ఞంకోసం చేయవలసిన సామగానాలు, సూర్యకిరణాల్లో ఉండే మధునాడులు, సూర్యగమన విశేషాలు, పరబ్రహ్మస్వరూపం, విశ్వానికున్న దిక్కులు (జుహూ, సహమాన, రాజ్ఞీ, సుభూత) ఇవి మనకు తూర్పు, దక్షిణ, పడమర ఉత్తరాలయ్యాయి. యజ్ఞపురుష స్వరూపం మొదలైన ఎన్నో విషయాలను అందించే ఈ మహోపనిషత్తులో చాలా కథలు ఉన్నాయి. చాలామంది రుషులు, గురుశిష్యుల సంభాషణలు, సంవాదాలు ఉన్నాయి. సత్యకామ జాబాలి కథ పరమాద్భుతం. ఉపకోసలుని యజ్ఞవిద్య, శ్వేతకేతు ప్రవాహణ సంవాదం, పంచాగ్ని విద్య, గౌతముడు, ఉపమన్యువు, ఋషుల కుమారుల ఆత్మాన్వేషణ, అశ్వపతి మహారాజు ప్రవచనం, నారద సనత్కుమార సంవాదం, బ్రహ్మ ప్రజాపతికి, ప్రజాపతి మనువుకు చెప్పిన ఆత్మజ్ఞానం అన్నీ సంభాషణలుగా దీనిలో చూడవచ్చు. ఈ భూమి అంతా అన్నమే. అన్నం నుంచే అన్వేషణ మొదలవుతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. బృహదారణ్యకోపనిషత్తు: ఇది అయిదు అధ్యాయాల్లో నలభై ఆరు బ్రాహ్మణాలుగా విస్తరించింది. ఇది శుక్ల యజుర్వేదానికి చెందినది. శతపథ బ్రాహ్మణంలోని చివరి ఆరు అధ్యాయాలే ఈ ఉపనిషత్తు. ఇందులో ఆరణ్యకం, ఉపనిషత్తు కలిసే ఉంటాయి. సృష్టి, పరబ్రహ్మ తత్వం, మరెన్నో విషయాలు, సంవాదాలు, సంభాషణల రూపంలో ఎన్నో లౌకిక, వేదాంత విషయాలు, ప్రకాంతి పరిశీలన, పరిశోధన రూపంలో తెలుస్తాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పాపపుణ్యాల విభాగం, దానివల్ల మానవదేహంలో జరిగిన మార్పులు, మరణానంతర సమాచారం, యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన అనేక విషయాలు తప్పక చదివి తీరాలి. ఎందరో ఋషుల పేర్లు దీనిలో కనిపిస్తాయి. యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఉపదేశించిన మోక్షవిజ్ఞానం, దమం, దానం, దయాగుణాల ఆవశ్యకత, ప్రాణోపాసన, గాయత్రీమంత్ర విశిష్టత, జ్ఞానేంద్రియాల మధ్య ఘర్షణ, ప్రాణం తీర్పు చెప్పటం, దాంపత్యంలో భార్యాభర్తల ఇష్టానిష్టాలు, సంతానోత్పత్తి, జననం, నామకరణం మొదలైనవి ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మొదలైన సూచనలన్నీ దీనిలో ఉన్నాయి. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది) -
అర్ధనగ్నంగా శివుడి కోసం తపస్సు
టీనగర్: శివుడి ప్రత్యక్షం కోసం అరంతాంగి సమీపంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా తపస్సు చేయడం సంచలనం కలిగించింది. పుదుక్కోట్టై జల్లా అరంతాంగి సమీపంలోని వడుకాడు గ్రామంలో మేలపట్టు పంచాయతీ అధ్యక్షుడు కన్నన్ అరటి తోపు ఉంది. దీనికి సమీపంలోని శ్మశానంలో ఓ వృద్ధుడు అర్ధనగ్నంగా 10 అడుగుల లోతు గుంతలో తొమ్మిది రోజులుగా తపస్సు చేస్తున్నట్లు సమాచారం అందింది. అక్కడికి వెళ్లి చూడగా గుంతలో ఓ వృద్ధుడు తూర్పు దిక్కుగా అర్ధనగ్నంగా కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఈ గుంత పైభాగంలో కొబ్బరి ఆకులతో గుడారం నిర్మించబడింది. అరంతాంగి ఇన్స్పెక్టర్ బాలమురుగన్, హెడ్ కానిస్టేబుల్ శరవణన్ అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. విచారణలో తపస్సు చేస్తున్న వ్యక్తి అరంతాంగి చిన్న అన్నానగర్‌కు చెందిన ముత్తుకృష్ణన్(60)అని, గత ఆడి అమావాస్య నుంచి గుంతలో అర్ధనగ్నంగా తపస్సు చేస్తున్నట్లు తెలిసింది. అమావాస్య నుంచి తపస్సు చేసి 12వ రోజున శివుడిని నేరుగా దర్శించేందుకు తపస్సు చేస్తున్నట్లు సమాచారం. తొమ్మిది రోజులుగా ఉదయం, సాయంత్రం ఉడికించిన గుగ్గిళ్లు మాత్రం అతను ఆరగిస్తున్నట్లు తెలిసింది. 12 రోజుల్లో శివుడు ప్రత్యక్షం కాకుంటే దీక్షను 42 రోజులకు కొనసాగించనున్నట్లు తెలిసింది. పోలీసులు అతన్ని చూసి తపోభంగం కలిగించకుండా వెనక్కి వచ్చేశారు. -
ప్రశ్నించటాన్ని నేర్పేదే ప్రశ్నోపనిషత్
ఆత్మను తెలుసుకోవాలనుకునేవారు తపస్సు, బ్రహ్మచర్యం, నిష్ఠ, శ్రద్ధలతో యోగులై ఉత్తరాయణ మార్గంలో సూర్యుణ్ణి చేరుకుంటున్నారు. ఉత్తరాయణమే ప్రాణకేంద్రం. అమరం, అభయం. ఈ మార్గంలో వెళ్లినవాళ్లు మళ్లీ పుట్టరు. యువతరం జిజ్ఞాసతో, శ్రద్ధగా జ్ఞానసముపార్జన ఎలా చెయ్యాలో, ఎటువంటి గురువును ఆశ్రయించాలో, క్రమశిక్షణ ఎలా పాటించాలో అధర్వ వేదాంతర్గతమైన ప్రశ్నోపనిషత్తు చక్కగా తెలియజేస్తుంది. వేదం ప్రశ్నించమనే చెబుతోంది. అయితే తెలుసుకోవటానికే (జిజ్ఞాస) ప్రశ్నించాలి. గెలవటానికి (జిగీష) అహంకారంతో వేదాంత విషయాలు ప్రశ్నిస్తే సత్యదర్శనం కాకపోగా కాలం వృథా అవుతుంది. ఋక్, యజుర్ సామవేదాల తర్వాత ఏర్పడిన నాలుగోవేదం అధర్వ(ణ) వేదం. భౌతికంగా పనికి వచ్చే శాస్త్ర సాంకేతిక, ఆధునిక విషయాలు దీనిలో ఉన్నాయి. అలాగే వేదాంతాలైన ఉపనిషత్తులు కూడా అధర్వవేదంలో శాస్త్రీయ దృక్పథంతో ప్రత్యేకంగా ఉంటాయి. అందుకే ప్రధానమైన ఉపనిషత్తులలో మూడు అధర్వవేదంలో నుంచే తీసుకున్నారు. వాటిల్లో ప్రశ్నోపనిషత్తు మరింత ముఖ్యం. ఆరుగురు యువ మునీశ్వరులు పిప్పలాద మహర్షిని ఆరు ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలను, సమాధానాలను తెలుసుకుందాం. ప్రథమప్రశ్న భరద్వాజ కుమారుడు సుకేశి. శిబికుమారుడు సత్యకాముడు. అశ్వల కుమారుడు కౌసల్యుడు. కత్యకుమారుడు కబంధి. విధర్భ దేశీయుడు భార్గవుడు, సూర్యపుత్రుడు గార్గ్యుడు. అనే ఆరుగురు ఋషులు శ్రద్ధతో తపస్సు చేశారు. బ్రహ్మనిష్ఠాపరులైన ఆ ఆరుగురికి పరబ్రహ్మాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవాలనిపించింది. దానిని సమగ్రంగా చెప్పగలిగిన గురువు పిప్పలాద మహర్షి అని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్లారు. బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించారు. ‘‘ఋషులారా! మీరు ఇప్పటివరకు ఎంత తపస్సు చేసినా మా దగ్గర ఒక సంవత్సరం పాటు శ్రద్ధతో, బ్రహ్మచర్యంతో తపస్సు చేయండి. తరువాత ఎన్ని ప్రశ్నలైనా అడగండి. మాకు తెలసింది మొత్తం మీకు చెబుతాం అన్నాడు పిప్పలాద మహర్షి. ఇక్కడ మాకు అనే బహువచనం గురుపీఠగౌరవాన్ని తెలియజేస్తుంది. ఇలా ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు కాత్యాయనుడైన కబంధి గురువు గారి దగ్గరకు వెళ్లాడు. ‘‘భగవాన్! ఈ జీవులందరూ ఎక్కడినుంచి వస్తున్నారు’’? అని మొదటి ప్రశ్న అడిగాడు. పిప్పలాద మహర్షి ‘‘కబంధీ! ప్రాణులను సృష్టించాలని భావించిన ప్రజాపతి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆకాశాన్నీ, ప్రాణాలన్నీ ఒక జంటగా సృష్టించాడు. ఈ జంట ద్వారా అన్ని జీవులు ఏర్పడాలని ఆయన సంకల్పం. సూర్యుడు ప్రాణం. చంద్రుడు జడపదార్థం. ఈ సృష్టిలో కపడేవి, కనపడనివీ అన్నీ జడపదార్థాలే. సూర్యుడు తూర్పుదిక్కున ఉదయించి తన కాంతితో ఆ దిక్కుకు ప్రాణం ఇస్తున్నాడు. అలాగే దక్షిణం, పడమర, ఉత్తరం, భూమి, ఆకాశం, ఆగ్నేయం, నైరృతి, వాయవ్యం, ఈశాన్యం అన్నివైపులా తన కిరణాలను ప్రసరింపజేస్తున్నాడు. ప్రాణులన్నింటికీ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. వైశ్వానరుడు, విశ్వరూపుడు, ప్రాణస్వరూపుడు అయిన సూర్యుడు అగ్నిగోళంలా ఉదయిస్తాడు. ఋగ్వేదం ఇలా చెబుతోంది. సర్వజ్ఞుడు, జ్యోతిస్వరూపుడు, సకల ప్రాణులకూ ప్రాణమైన సూర్యుడు వెయ్యికిరణాలతో ఉదయిస్తూ వందవిధాలుగా జీవులను కాపాడుతున్నాడు. సృష్టికర్త సంవత్సర స్వరూపుడు. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు దారులు ఉన్నాయి. కోరికతో యాగాలు, సత్కర్మలు, సత్కార్యాలు చేసినవారు చంద్రలోకానికి చేరుకుని మళ్లీ భూమి మీద పుడతారు. సంతానాన్ని కోరే ఋషులు దక్షిణాయనంలో చంద్రలోకానికి వెళుతున్నారు. ఇది చాలా కష్టం. సూర్యుడు అయిదు పాదాలతో, పన్నెండు రూపాలలో ఉంటాడు. ఆయనే సర్వజ్ఞుడు. వర్షప్రదాత. ఆరు ఆకులున్న ఏడుచక్రాల రథం మీద సంచరిస్తూ ఉంటాడు. సంవత్సరంలో ఒక భాగం మాసం (నెల) మాసమే సృష్టికర్త. మాసంలో రెండు పక్షాలు ఉంటాయి. శుక్లపక్షం ప్రాణస్వరూపం. ఋషులు యజ్ఞయాగాలు ఈ పక్షంలోనే చేస్తారు. కృష్ణపక్షం జడపదార్థం. ఒకరోజులో పగలు, రాత్రి ప్రజాపతి స్వరూపమే. పగలు ప్రాణం రాత్రి జడం. ప్రాణస్వరూపమైన పగటివేళ సంభోగించిన వారి ఆయుర్దాయం క్షీణిస్తుంది. నాయనా! కబంధీ! అన్నం కూడా ప్రజాపతి రూపమే. అన్నం నుంచే రేతస్సు ఏర్పడుతుంది. రేతస్సు నుంచే అన్ని జీవులు పుడుతున్నాయి. ఈవిధంగా ప్రజాపతి ఏర్పరచిన ఈ వ్రతాన్ని ఎవరు శ్రద్ధగా పాటిస్తారో వారు జంటలను సృష్టిస్తారు. ఎవరియందు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ ప్రతిష్ఠితమై ఉన్నాయో వారు మాత్రమే బ్రహ్మలోకానికి చేరుకోగలుగుతారు. నియమబద్ధంగా జీవించేవారికే సత్త్వగుణ ప్రధానమైన బ్రహ్మలోకం చేరే అర్హత లభిస్తుంది. వక్రత, అసత్యం, మాయ, మోసం ఉన్నవారు ఎప్పటికీ బ్రహ్మలోకాన్ని చేరుకోలేరు. బ్రహ్మజ్ఞానాన్ని పొందలేరు. పిప్పలాద మహర్షి ఈ విధంగా కబంధి అడిగిన ప్రశ్నకు కళ్లకు కట్టినట్టు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ప్రాణులు ప్రాణవంతం కావడంలో సూర్యుని పాత్ర, కాలస్వరూపం అయనాలు, ఋతువులు, మాసాలు, రోజులు, పగలు, రాత్రి ఇవన్నీ పరబ్రహ్మస్వరూపమే. మానవులు తపస్సు, బ్రహ్మచర్యం, సత్యనిష్ఠ శ్రద్ధాభక్తులతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందగలుగుతారు’’ అంటూ మానవ జన్మ పరమార్థాన్ని, మానవ జీవిత విధానాన్ని వివరించారు. కబంధుడు అడిగిన ప్రశ్నకు గురువుగారు చెప్పిన సమాధానాన్ని ఆరుగురూ అర్థం చేసుకున్నారు. రెండోప్రశ్నను, సమాధానాన్ని వచ్చేవారం తెలుసుకుందాం. - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్