ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్లి, ‘తండ్రీ! నాకు పితామహ ప్రపితామహులను చూడాలని ఉంది. వెళ్లి రావడానికి అనుమతించు’ అన్నాడు.‘సరే’నన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలుత తన తాత అయిన ఋచీకుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకుని, ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలు దేరాడు.
భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి పిలిచి, ‘నాయనా! లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లి, ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించు. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే, అప్పుడు శత్రువినాశకరాలైన దివ్యాస్త్రాలను కోరుకో. భవిష్యత్తులో నువ్వు ఎన్నో మహత్కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్లిరా’ అని సాగనంపాడు.
ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకుని, అక్కడ ఒక సుందర సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఉంటూ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య నిలబడి, శీతకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శీతోష్ణాలను సహించి తన తపస్సును కొనసాగించాడు. పరశురాముడి తపస్సు సంగతి మునిగణాలకు తెలిసి, వారంతా ఆశ్చర్యం చెందారు.
తమ తపస్సుతో పాపక్షయం చేసుకుని, పరమ తాపసులుగా ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవుడు, మృకండుడు వంటి వారంతా పరశురాముడి తపస్సును చూడటానికి అక్కడకు చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలిచింది. వరాలు ఇచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు.
అనుకున్నదే తడవుగా పరమశివుడు ఒక ఆటవికుడి రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండం పట్టుకుని, దానిని నములుతూ పరశురాముడి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిలుచున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ కనిపించాడు. ఆటవికుడి రూపంలో ఉన్న పరమశివుడు అతడికి ఎదురుగా వెళ్లి నిలిచాడు.
‘స్వామీ! నేను వ్యాధుడను. నా పేరు తోషప్రహర్షుడు. ఈ మహావనంలో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరూ నివసించకూడదు. ఇంతకూ తమరెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. ‘నా పేరు రాముడు. జమదగ్ని మహర్షి కొడుకును. భృగువంశీయుణ్ణి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను.
నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథినవుతాను. పైగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నువ్వే ఎక్కడికైనా వెళ్లడం మంచిది.’ అని బదులిచ్చాడు పరశురాముడు.
‘ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి, నన్నే వెళ్లమంటున్నావే! ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే తింటాను. నీకు అసహ్యంగా ఉంటే వేరే ప్రదేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. లేదా అన్నీ సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు వ్యాధుడు. పరశురాముడు ఉగ్రుడయ్యాడు. ‘నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు.
జంతువులను హింసించి, వాటి మాంసాన్ని తింటూ అధముడిలా ఉన్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు. నువ్వు మర్యాదగా వెళితే సరేసరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది’ అన్నాడు. వ్యాధుడు ఏమీ ఆవేశపడకుండా, ‘స్వామీ నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులను వేటాడటం నా వృత్తి. వాటి మాంసం నాకు భుక్తి. నా అవసరానికి మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది.
అయినా, ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్న నువ్వు నిజంగా ధర్మాత్ముడివేనా? తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చూపే నిన్ను ఆ పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు?’ అని నిలదీశాడు. ఒక మామూలు వ్యాధుడు తన వృత్తాంతమంతటినీ చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహించాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అనుకున్నాడు.
‘మహానుభావా! నువ్వెవరివి? అనవసరంగా నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు. నువ్వు సామాన్య వ్యాధుడవు కాదు. నా అపరాధాన్ని మన్నించి, నీ నిజరూపాన్ని చూపించు’ అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చుని, ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకుని పరశురాముడు కళ్లు తెరిచాడు.
ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరిపరి విధాలుగా శివస్తోత్రం చేశాడు. శివుడు సంతోషించాడు. ‘రామా! నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాలలో స్నానం ఆచరించి, తపస్సు చేస్తే తప్ప నువ్వు నా దివ్యాస్త్రాలను పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా. అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. -సాంఖ్యాయన
Comments
Please login to add a commentAdd a comment